పూర్వ విద్యార్థుల సమ్మేళనాలు నిరంతరము జరగాలి

Mar 11, 2024 - 13:31
 0  2

ఆత్మీయత అనుభూతులను పంచుకోవడం - బాధ్యతలను  నిర్ధారించుకోవడానికి వేదిక కావాలి*. పూర్వ ఉపాధ్యాయుల కలయికతో  సామాజిక బాధ్యత ఇరుపక్షాలలో గుర్తించబడాలి***

----వడ్డేపల్లి మల్లేశము

మెరుగైన సమాజ నిర్మాణంలో  నైతిక విలువలను పెంపొందించడం ద్వారా బాధ్యతలను గుర్తింపచేసే ప్రక్రియ  కేవలం విద్య ద్వారానే సాధ్యమని  విద్యావేత్తలు మేధావులు సూచించి  అనేక సిఫారసులు చేసినప్పటికీ

బాధ్యత  లేని ప్రభుత్వాలు ఏనాడు కూడా పట్టించుకోలేదు .  దాని ఫలితంగా  సమాజమూ, విద్యావంతులు, బుద్ధి జీవులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు  విధిగా కొన్ని కార్యక్రమాలను రూపకల్పన చేసుకుని పాఠశాల కేంద్రంగా నిర్వర్తించుకోవడం ద్వారా  కొంత మెరుగైన పరిస్థితులను మనం చూడగలుగుతున్నాం .ముఖ్యంగా ఇటీవల కాలంలో  రెండున్నర దశాబ్దాలకు పైగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  ప్రారంభమైనటువంటి పాఠశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనాలు  రోజురోజుకు ఉత్కృష్టమైన స్థాయిలో  పరస్పరము ప్రభావితం చేస్తున్న కారణంగా అనేక బ్యాచుల విద్యార్థులు  ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్న బాలబాలికలు  గత స్మృతులను నెమరు వేసుకోవడానికి ,అనుభవాలను పంచుకోవడానికి, గత తప్పిదాలను సవరించుకోవడానికి,  ఉపాధ్యాయుల ద్వారా మరింత  ప్రేరణ పొందడానికి  పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాలు  ఏదో ఒక మూలన కొనసాగుతూనే ఉన్నాయి .  ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ పోటీపడి నిర్వహించుకోవడాన్ని నేటికి గమనించవచ్చు.ఈ సంస్కృతి నిరంతరం కొనసాగాలి.ప్రైవేట్ వ్యవస్థ ఉన్నంతకాలం ప్రైవేట్ పాఠశాలకు కూడా విస్తరించి యువత చైతన్యానికి తోడ్పడాలి.   ఇవి విద్యార్థులను, ఉపాధ్యాయులను, సమాజాన్ని ,తల్లిదండ్రులను , బాధ్యతగల  ప్రజా ప్రతినిధులు రాజకీయ నాయకులను కూడా ఆలోచింప చేస్తున్నవి.  అయితే అలాంటి సమావేశాల నిర్వహణ  పరిధిని దాటి రాజకీయ ప్రలోభాలకు,  కొంతమంది  ముఠావర్గాల స్వార్థపరత్వానికి,  గుర్తింపుకు , అధికార పార్టీకి వంత పాడడానికి ఉపయోగపడుతున్నట్లు ఉభయ రాష్ట్రాలలోని  కొన్ని సందర్భాలను గమనించినప్పుడు   నిర్వహణ అనుభవాలను నెమరు వేసుకున్నప్పుడు  తెలుస్తున్నది.  ఆ తప్పిదము నుండి బయటపడి  పూర్వ ఉపాధ్యాయులు పూర్వ విద్యార్థుల వేదికకు మార్గదర్శకులుగా  సమాజము ఇతర  పెద్దలు  రాజకీయ పార్టీల నాయకులు బాధ్యత కలిగినటువంటి  వ్యక్తులు  ప్రోత్సాహకులుగా ఉన్నప్పుడు మాత్రమే ఇలాంటి కార్యక్రమాల యొక్క లక్ష్యం నెరవేరుతుంది. ఆశయం అమలులోకి వస్తుంది.  యువతను పెడదారిన పడకుండా చూడ్డానికి అవకాశం దొరుకుతుంది  .మరింత బాధ్యత గల పౌరులుగా తయారు చేయడానికి ఆస్కారం ఉంటుంది.  కొంటెతనం, తు0 టరితనం,  బాధ్యతారాహిత్యం నుండి  ఆనాటి తరాలను  బయటపడేయడానికి  భవిష్యత్తును నిర్ధారించుకోవడానికి  ఇలాంటి సమావేశాలు తోడ్పడతాయని  ఇటీవలి పరిశీలన ద్వారా  తెలుస్తున్నది.

పూర్వ విద్యార్థుల సమ్మేళనాలు-  ఆత్మీయ కలయికలు-  తాత్వికత  :-                                         

సభలు సమావేశాలు సమ్మేళనాలు  వ్యక్తుల కలయికలు  మాట ముచ్చట  క్షేమ సమాచారాలు  అనుభవాలు జ్ఞాపకాలు  ఆత్మీయతను పంచుకోవడం  స్నేహాన్ని పెంచుకోవడం  గతంలో జరిగిన పొరపాట్లను సమీక్షించుకోవడం  వంటి అవకాశాలు   మనిషి బలహీనత నుండి  తొంగి చూసినవే . పొరపాటు చేయడానికి  తప్పుడు మార్గంలో నడవడానికి  అతీతులు ఎవరూ కారు కానీ  అంతటితోనే ఆగిపోకుండా  జరిగిన నష్టాన్ని భర్తీ చేసుకోవడానికి  మరింత  ముందు చూపుతో  జీవితాన్ని ప్రయోజనకరం బలోపే తం చేసుకోవడానికి  మార్గాలను వెతుక్కునే అవకాశాలు వేదిక ,సభలు, సమావేశాలు.  కొందరు నిక్కచ్చిగా మాట్లాడితే మరికొందరు  మనసులో పెట్టుకొని  మౌనంగా ఉండిపోతారు.  ప్రశ్నించడం , అనుభవాలు పంచుకోవడం,  ఉపాధ్యాయుల అనుభవాలను శ్రద్ధగా అవలోకనం చేసి  తమను తాము  సమాజాన్ని తీర్చిదిద్దే క్రమంలో ముందు వరుసలో నిలబడడం అనేది  ఇవాళ పూర్వ విద్యార్థుల సమ్మేళనాల ద్వారా  సాధ్యమవుతున్నటువంటి  పెద్ద అవకాశం. తరగతిలో  ఉపాధ్యాయుల పట్ల దురుసుగా వ్యవహరించి  కొందరు సమావేశాలలో ఉపాధ్యాయులను  గందరగోళ పరిచినట్లు,  హింస పెట్టినట్లు  నాటి అనుభవాలను సమావేశాలలో చెబుతుంటే  ఇది సమీక్షకు  ప్రవర్తన మార్పుకు  భవిష్యత్తు తరాలకు  ఎంతో ఉపయోగపడుతుందని ఆశించడంలో అతిశయోక్తి ఏమీ లేదు.  అహంకారం, ఆధిపత్యం,  అవకాశవాదం , ఒంటెద్దు పోకడ , ఏహ్య  భావం ,గర్వం  వంటి  తప్పుడు విధానాల నుండి  ఉపాధ్యాయుల పట్ల  ప్రవర్తించిన గత స్మృతుల నుండి  కాలానుగుణంగా  సంస్కారయుతంగా గౌరవంగా  మర్యాదగా  తమను      తాము సంస్కరించుకోవడానికి 

వేదికగా ఆత్మీయ సమ్మేళనాలు పనిచేస్తాయని  సమాజానికి ,ఉపాధ్యాయులకు ,విద్యార్థులకు  పూర్తిస్థాయిలో విశ్వాసము ఉన్నప్పుడు మాత్రమే  అత్యున్నత స్థాయి లక్ష్యాలనైనా చేరుకోగలము .

విద్యార్థులుగా తరగతి గదిలో చదువుకున్న నాటి పరిస్థితులు వేరు  కాలానుగుణంగా మారుతున్న పరిస్థితుల్లో భావి సవాల్ల ను అధిగమించడానికి , సన్నద్ధం కావలసిన నేటి పరిస్థితులకు  సమన్వయం కూర్చడానికి , సవాళ్లను అధిగమించడానికి,  విజ్ఞత వివేకము  సంస్కారం గల యువతను  తీర్చిదిద్దడానికి  ,చిన్ననాటి పొరపాట్లను సవరించుకొని  సక్రమ దారిలో పయనించడానికి ఈ సమావేశాలు  ఉపాధ్యాయుల తోటి విద్యార్థుల అభిప్రాయాలు సందేశాలతో  ఎంతో దోహదపడుతున్నాయి.  పరిశీలనా దృక్పథం , ఆలోచన సరళి,  భవిష్యత్తుపై ఆశావాదం , వివేకవంతమైన సమాజాన్ని కోరుకోవడం,  గురువుల పట్ల గౌరవభావాన్ని పెంపొందించడం ద్వారా  భవిష్యత్తు తరాలలో సంస్కారాన్ని ప్రతిబింబ చేయడానికి  ఈ ఆత్మీయ సమ్మేళనాలు  దోహదకారులవుతున్నాయని,  దోహదం చేయవలసిన అవసరం ఉన్నదని  మనమందరం నిండు మనసుతో ఆశిద్దాం.

 మారిన పూర్వ విద్యార్థుల ఆలోచన సరళి:-

సాధారణంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనాలు  పదవ తరగతి ఉత్తీర్ణులైన తర్వాత ఉన్నత విద్యను అభ్యసించడం  లేక కుటుంబ పరిస్థితుల రీత్యా ఇతర ఉపాధి అవకాశాలను వెదికి   ఒక పనిలో లీనమై  ఆదాయ మార్గాలను సమర్ధించుకున్న తర్వాత  కనీసం 15-- 20 సంవత్సరాల తర్వాత  జరుపుకోవడం  ఆనవాయితీగా మారినది . విద్యార్థులుగా తరగతి గదిలో తమ హావభావాలు  చిలిపి   చేష్టలు  తప్పుడు విధానాలు ఉపాధ్యాయుల పట్ల  ప్రవర్తించిన భిన్న ధోరణులు  జ్ఞప్తికి    తెచ్చుకోవడానికి సవరించుకోవడానికి  పూల దారిని వెతుక్కోవడానికి  ఉపయోగపడుతున్న పూర్వ విద్యార్థుల సమ్మేళనాలపైన  తమ అనుభవాలను వ్యక్తం చేస్తున్న కొందరు ఆనాటి విద్యార్థులు " చిలిపి చేష్టలతో అల్లరి  పనులతో  జీవితం మీద అవగాహన సరిగా లేని కారణంగా  విలువైన సమయాన్ని వృధా చేసుకున్నామని కొందరంటే  మరికొందరు ఆనాటి ఉపాధ్యాయుల యొక్క మార్గ దర్శకత్వంలో  చక్కటి నైపుణ్యాన్ని  సమపాధించినామని" మరికొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు . "గురువు ల పట్ల అతిగా దురుసుగా వ్యవహరించిన తమ పొరపాట్లను సవరించుకోవడానికి ఈ సమ్మేళనాలు ఒక అవకాశం అని  ఆధునిక పరిస్థితుల రీత్యా  మా బాధ్యతలను మరింత సమర్థవంతంగా నిర్వహించడానికి  దారి దీపాలుగా  ఆనాటి ఉపాధ్యాయులను పిలుచుకొని  వారి సందేశాలను  మది నిలుపుకొని  మరింత బాధ్యతాయుతంగా సామాజిక స్ఫూర్తితో  సామాజిక బాధ్యతగా ముందుకు వెళ్లడానికి  ఈ సమ్మేళనాల సంస్కృతిని మేము స్వాగతిస్తున్నామని"  అనేకమంది పూర్వ విద్యార్థుల అనుభవాల ద్వారా  అభిప్రాయాల ద్వారా  మనం  ఒక   అంచనాకు రావాల్సిన అవసరం ఉన్నది.  అంతేకాదు   భార్యా పిల్లలతో  ఇలాంటి సమావేశాలను మళ్లీమళ్లీ జరుపుకోవాలని తద్వారా కూడా  పరస్పరం ప్రేరి తులమై  మూర్ఖత్వాన్ని,  అజ్ఞానాన్ని,  అంధకారాన్ని,  తరిమి కొట్టి  ఉత్తమ పౌరులుగా ఎదగడానికి  సమ్మేళనాలు ఆధునిక కాలంలో చాలా ఉపయోగపడుతున్నట్లు  అందుకే  అనుకరణ ద్వారా విస్తృతస్థాయిలో  ఈ కార్యక్రమాలు కొనసాగుతున్నట్లు  అనేకమంది పూర్వ విద్యార్థుల అభిప్రాయాల ద్వారా  వారిలో వచ్చిన  ప్రవర్తన మార్పును మనం గమనించవచ్చు . "తెలిసి తెలియని వయసులో చేసిన పొరపాట్లను సవరించుకోవడంతోపాటు  పరిపక్వత చెందిన మా మనస్సులలోకి  ఆనాటి మా ఉపాధ్యాయుల యొక్క ప్రోత్సాహక  స్పూర్తివంతమైన ప్రసంగాల కాంతి ప్రసరింప చేయడానికి , బాధ్యతాయుతంగా వెలిగి పోవడానికి  తోడ్పడుతున్న  ఈ సమ్మేళనాలను మేము  నిరంతరం కొనసాగిస్తాము"  అని తమ అభిప్రాయాలను  స్పష్టంగా ప్రకటిస్తున్న పూర్వ విద్యార్థుల నిబద్ధతను మనము గమనించవచ్చు. 

   స్ఫూర్తిదాయకంగా నిర్వహించాలి  :

ఈ సమ్మేళనాలు మొక్కుబడిగా నిర్వహిస్తే ఎవరికి ఒరిగేది ఏమీ లేదు.  ఒక ప్రయోజనము,  ఆశించిన లక్ష్యాన్ని చేరుకోవడం,  ప్రవర్తన మార్పుకై   తపన పడ డo  వంటి   ఆశయాలను చేరుకునే  క్ర మంలో ఈ సమ్మేళనాల నిర్వహణ  రాజకీయం చేయకుండా  ఆయా రంగాలలో ఎదిగి సమాజాన్ని ప్రభావితం చేసిన వారిని , పూర్వ ఉపాధ్యాయులను మాత్రమే  వేదిక పైకి ఆహ్వానించి వారి ప్రసంగాలను  మనసారా వినాలి.  విద్యార్థులు కూడా  తమలో  వచ్చిన మార్పులను పరిపక్వతను వేదికపై   ప0  చుకోవడం ద్వారా  సమ్మేళనానికి నిండుదనాన్ని తీసుకురావచ్చు.  కొన్ని లక్ష్యాలు ,నిర్ధారణలు,  ప్రతిపాదనలు,  ఎదుర్కోవలసిన సవాళ్లను  వేదిక పైన  తీర్మానించుకోవడం  అపురూపమైన ఘట్టం కావాలి . ఉపాధ్యాయులతో బంధాలను నిరంతరం కొనసాగించడానికి  సిద్ధపడుతూనే  తమ పూర్వ విద్యార్థుల్లో  కష్టాలు కన్నీళ్లను  సవరించడానికి  సజీవ మానవ సంబంధాలను నిరంతరము కొనసాగించడానికి  నిర్ణయం జరగాల్సిన  నిప్పులాంటి సమయం అది  .సమాజాన్ని ప్రభావితం చేసిన వ్యక్తుల  ప్రసంగాల ద్వారా  తమ మనోఫలకంపై  కొత్త ఆశలను ముద్రించుకొని  సవాలుగా స్వీకరించి ముందుకు వెళ్లడానికి ప్రతిజ్ఞ చేయవలసినటువంటి  ప్రత్యేక సందర్భం అది.

   ఆ వైపుగా  సమ్మేళనం కొనసాగాలంటే  ముఖ్యంగా పూర్వ ఉపాధ్యాయుల  అనుభవాలు, జ్ఞాపకాలు, సాహిత్య సాంస్కృతిక సామాజిక రాజకీయ ఆర్థిక చారిత్రక దృక్పథాలను  పూర్వ విద్యార్థులలో బలంగా నాటాలి.  ఈ రకమైనటువంటి  చర్చా  కార్యక్రమాలకు మాత్రమే సమ్మేళనాలు వేదిక కావాలి కానీ  విందులు వినోదాలు  ఇతరత్రా విలాసవంతమైన కార్యక్రమాలకు  వేదికైతే ఆ సమ్మేళనాల వల్ల  చేకూరే ప్రయోజనం ఏమిటి ? రాజకీయ నాయకులను ప్రజాప్రతినిధులను  ఆహ్వానించి వారికి పెద్ద పీట వేసి  విద్యార్థులు ఉపాధ్యాయులకు మాట్లాడే అవకాశం లేకుండా చేసే దుర్నీతిని ఎండగట్టాలి.  ప్రజా ప్రతినిధులు రాజకీయ నాయకులు  సమాజంలో ఎదిగిన వారు  ఈ సమ్మేళనం విజయవంతం కావడానికి  ప్రోత్సాహకులుగా మాత్రమే పని చేసినప్పుడు  పూర్తిస్థాయిలో  ఆశించిన లక్ష్యాన్ని  చేరుకోవడానికి,  ఊహించని స్థాయిలో మరింత మెరుగైన సమాజాన్ని  అవలోకనం చేసుకొని  కృషి చేయడానికి అవకాశం ఉంటుంది . మరో రకంగా ఈ సమ్మేళనాలు  పూర్వ ఉపాధ్యాయులను కూడా  సమాజం గురించి ఆలోచించే విధంగా, స్వచ్ఛంద కార్యక్రమాల ద్వారా  నిత్య చైతన్యానికి  కృషి స ల్పే విధంగా, ప్రోత్సహించు  నట్లుగా తీర్చిదిద్దాలి.    అంటే పూర్వ ఉపాధ్యాయులు పూర్వ విద్యార్థులు కూడా  ఈ సమాజం యొక్క  గమనానికి మనుగడకు  ఉన్నతికి బాధ్యులే అని  పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాలు నిరంతరం మనలను హెచ్చరిక చేస్తాయి  చేస్తున్నాయి అని సమాజం గుర్తించేలాగా నిర్వహించడం అనేది ఈ సమ్మేళనాలకు పూర్వ నేపథ్యంగా  అంగీకరించి తీరాలి.

(ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు సీనియర్ ఉపాధ్యాయ ఉద్యమ నేత హుస్నాబాద్ (చౌటపల్లి )జిల్లా సిద్దిపేట తెలంగాణ రాష్ట్రo)

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333