విచారణ నివేదికలతో సరిపెడితే ఎలా?

Oct 14, 2025 - 13:27
 0  2

ఆర్థిక నేరాలు నిజమైతే చర్యలు ఉండాలి కదా! ప్రజాధనాన్ని కొల్లగొట్టిన వారికి కఠిన శిక్షలు పడాల్సిందే.* ప్రభుత్వం రాజీ పడితే భవిష్యత్తు క్షమించదు పైగా రాబోయే ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరిస్తే ఆదుకునే వారుoడరు సుమా!**

*******************************************

---వడ్డేపల్లి మల్లేశం 90142 06412 

---03....10....2025**********************

పరాయి పాలనలో అనేక రకాలుగా బాధలు అనుభవించిన భారతదేశం ఆర్థికంగా కొల్లగొట్టబడి పీల్చిపిప్పి చేయబడినట్లు దోపిడికి గురైనట్లు ఆర్థికవేత్త దాదాబాయి నౌరోజీ ప్రకటించిన విషయం తెలుసు. పరాయి పాలనలో అరాచకత్వం కొనసాగితే ఆ దుష్ట పాలన నుండి బయటపడడానికి శతాబ్దాలే పట్టింది అయితేనేమీ 1947 ఆగస్టు 15వ తేదీ నాడు స్వాతంత్రం సంపాదించినప్పటికీ భారతదేశ వ్యాప్తంగా రాష్ట్రాలలోనూ కేంద్రంలోనూ కొనసాగినటువంటి ప్రభుత్వాలు ఆర్థిక అరాచకత్వానికి పాల్పడినట్లు కుంభకోణ భారతంగా దీనిని కొందరు మేధావులు వర్ణించినట్లు మనకు అనేక దాఖలాలు ఉన్నాయి. ప్రతి రాష్ట్రంలో గత ప్రభుత్వ హయాములో జరిగినటువంటి అవినీతిపైన తర్వాత వచ్చిన ప్రభుత్వాలు పదే పదే ప్రస్తావించడమే కానీ వాటిపై కఠిన చర్యలు తీసుకోవడం విచారణ జరిపించడము నామాత్రంగా కొనసాగుతుండడం వల్ల ప్రజాధనం కొల్లగొట్టబడుతున్నది. కొద్దిమంది దుర్మార్గుల చేతిలో దేశామాత చిక్కిశల్య మ అవుతున్నది. ఈ పరిస్థితికి తెలంగాణ రాష్ట్రం కూడా ఏమాత్రం మినహాయింపు కాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము నుండి 2014 జూన్ రెండవ తేదీన తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించినప్పటికీ తొలి ప్రభుత్వంగా తెలంగాణ రాష్ట్ర సమితి సుమారు 9న్నర సంవత్సరాలు ఏకధాటిగా పరిపాలించిన తర్వాత స్వేచ్ఛ స్వాతంత్రం స్వావలంబన సాధించినామని సంబరపడినామే కానీ ప్రజాధనం ఏ రకంగా దుర్వినియోగం అయింది? అవినీతి ఎలా రాజ్యమేలింది? అనే విషయాల పైన దృష్టి సారిస్తే రాష్ట్ర ప్రజానీకం ఆందోళనకు గురికాక తప్పదు. అంత సంపదను కొల్లగొట్టినటువంటి గత ప్రభుత్వం పైన అనేక రకాల ఆరోపణలు విచారణలు జరిగినప్పటికీ ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోకపోవడం ప్రస్తుత ప్రభుత్వం కూడా అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు కావస్తున్న ప్రజల కోణంలో ఆలోచించకపోవడాన్ని ప్రజలు ప్రజాస్వామిక వాదులు బుద్ధి జీవులు ప్రశ్నిస్తున్నారు. దీని వెనుక పాలక ప్రతిపక్షాల యొక్క దోబూచు లాట ఉండవచ్చునని అనుమాన పడుతున్నారు కూడా. ఆ అనుమానపు తెరలను తొలగించవలసిన బాధ్యత ప్రస్తుత తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఉన్నది.

     ఆరోపించబడి విచారణ జరిగిన కొన్ని రంగాలు:

************************************--------

  9న్నర సంవత్సరాల టిఆర్ఎస్ ప్రభుత్వం 2023 నవంబర్లో జరిగిన ఎన్నికల్లో ఓడిపోవడానికి ప్రధాన కారణం మార్పును కోరుతూ అవినీతిపైన ప్రచారాన్ని కొనసాగించినటువంటి కొద్ది మంది మేధావులు బుజ్జివుల యాత్ర ఒకటైతే, బలమైన వాని వినిపించిన ఆనాటి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రసంగాలు నిక్కచ్చిగా చేసిన ఆరోపణలు కూడా ప్రధాన కారణమే. టిఆర్ఎస్ కాలంలో జరిగినటువంటి అవినీతి పైన విచారణ జరిపించి తగిన శిక్షలు తీసుకుంటామని, ప్రజాధనాన్ని ప్రభుత్వ ఖాతాకు జమ చేస్తామనే ధోరణిలో ప్రసంగించినప్పటికీ ఆ రకమైనటువంటి చర్యలు కార్యాచరణ రెండు సంవత్సరాల తర్వాత కూడా కనిపించడం లేదని ప్రజలు ప్రజాస్వామ్యవాదులు ఎదురుచూస్తు.ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బీసీలకు, మహిళలకు, గిరిజనులకు, ఇతర వెనుకబడిన వర్గాలకు, వ్యవసాయదారులకు ప్రత్యేక డెక్ల రేషన్ల పేరుతో ప్రకటించడం ద్వారా ప్రజల దృష్టిని ఆకర్షించిన విషయం కూడా కాదనలేము. విచారణ జరిపించి దోషులని నిర్ధారించి చర్లపల్లి జైల్లో శిక్ష అమలు చేస్తామని గత ప్రభుత్వ పెద్దలకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి రేవంత్ రెడ్డి గారు సవాలు వేసిన విషయాన్ని కూడా మనం గమనించాలి. సుదీర్ఘ పాలనలో అనేక వర్గాలు అంటే సర్పంచులు, విద్యార్థులు, ప్రజలు, విద్యా వైద్య రంగాలు అన్నీ కూడా నిర్వీర్యమైన విషయాన్ని గమనించినటువంటి ప్రజలు రేవంత్ రెడ్డి గారి మాటల పైన విశ్వాసం ఉంచి ఆ పార్టీ అవినీతికి తగిన శాస్తి జరుగుతుందని ఆశించినారు. కానీ ఆ ఆశ బంగపడిన రీతి ఆందోళన కలిగించే స్థాయిలో ఉన్నదని మేధావులు బుద్ధి జీవులు అభిప్రాయపడుతున్నారు. కాలేశ్వరం ప్రాజెక్టు టిఆర్ఎస్ పార్టీకి ఏటీఎం గా మారిందని స్వయానా బీజేపీ జాతీయ అధ్యక్షుడు ఇతర పెద్దలు ప్రస్తావించిన విషయం కూడా తెలుసు. కాలేశ్వరం ప్రాజెక్టు పైన జరిపిన విచారణ కమిషన్ నివేదిక ప్రభుత్వానికి సమర్పించినప్పటికీ దానిపైన ఎలాంటి చర్యలు లేవు. గత ప్రభుత్వ పాలనలో విద్యుత్ కొనుగోళ్లలో 1300 కోట్ల అక్రమాలు జరిగాయని విద్యుత్ రంగంపై జ్యుడీషియల్ కమిషన్ నివేదిక సమర్పించినప్పటికీ రాష్ట్ర క్యాబినెట్ ఆమోదించింది కానీ తీసుకున్న చర్యలు లేవనేది విజ్ఞల భావన. టీఎస్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహణలో లోపాలు, ఈ కార్ల రేసులో అవినీతి, ఫోన్ టాపింగ్ పైన జరుగుతున్నటువంటి విచారణ, గుట్టలు రాళ్లు రప్పలకు ఇచ్చినటువంటి రైతుబంధు పేరుతో కోళ్లగొట్టబడిన ప్రజాధనం, గ్రామ పంచాయతీలు కళాశాలలు ఆసుపత్రులు, విద్యాసంస్థలకు ప్రభుత్వం రుణపడిన కోట్లాది రూపాయలు, కొంతమంది ఆత్మహత్యలకు పురి కొలిపిన విషయం కూడా తెలుసు. ప్రభుత్వం గత ప్రభుత్వ తప్పిదాల పైన ఏసీబీ విచారణకు ఆదేశించడం, విచారణలు కొనసాగుతూ ఉండడం మాత్రమే గమనించినాము గమనిస్తూ ఉన్నాము కానీ ఒక్క అంశం పైన కూడా ఇప్పటివరకు నిర్ణయం తీసుకోలేదు. ఫోన్ టాపింగ్ లో తీగ లాగితే డొంకంతా కదిలినట్లుగా ఉన్నతాధికారుల హస్తము ఉన్నట్లు తేలినప్పటికీ ఆ విచారణ కూడా నత్తనడక నడుస్తున్నది. అంతేకాదు కొన్ని రకాల విచారణలు ఏ స్థాయిలో ఉన్నాయో తెలియకుండా కనుమరుగు చేస్తున్న పరిస్థితులను కూడా మనం గమనించవచ్చు. ప్రజల దృష్టిని మళ్లించడానికి ప్రతిపక్షం ఇటు ప్రభుత్వం ఈ రకమైనటువంటి చర్యలకు పాల్పడే ప్రమాదం ఉన్నదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అందుకే రాష్ట్ర ప్రజల ఆదాయానికి గండి కొట్టే చర్యలకు పాల్పడినటువంటి గత ప్రభుత్వ విధానాల పైన చర్యలు తీసుకోకపోతే సహించే ప్రసక్తి లేదని, అవినీతిని నిష్కల్మషంగా రుజువు చేయాల్సిన అవసరం ఉందని లేకుంటే ప్రస్తుత ప్రభుత్వం మీద కూడా అనుమానాలు వెళ్ళే ప్రమాదం ఉన్నదని విశ్లేషకులు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. విచారణ సంస్థలు విచారణ జరిపి రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించిన తర్వాత ప్రభుత్వం చర్యలు గైకొనవలసిన అవసరం ఉంది. కానీ నివేదికలన్నీ ప్రభుత్వం దగ్గర భద్రంగా ఉన్నట్లు, దొబూచులాటలో ప్రభుత్వాలు ఉన్నట్లు తెలుస్తుంటే విచారణ నివేదికల కోసం చేసిన ఖర్చు మాత్రం కోట్లలో ఉన్నట్లు తేలింది. ఆ ధనమంతా వృధా ఏ కదా! పేరుకు మాత్రం ఏసీబీ, సెట్, సిబిఐ, ఈడి వంటి దర్యాప్తు సంస్థలు రాష్ట్రంలో జరిగిన వివిధ రకాల అవినీతిపైన విచారణ జరుగుతున్నట్లు ప్రకటించబడినప్పటికీ వాటి యొక్క పురోగతి కనిపించకపోవడం, రెండు సంవత్సరాలు పూర్తి కావస్తున్న తరుణంలో ప్రభుత్వం కూడా ఆత్మ విమర్శ చేసుకోవాల్సిన అవసరం చాలా ఉన్నది.లేకుంటే భవిష్యత్తులో నేరాన్ని వాయిదా వేసినందుకు తగిన చర్యలు తీసుకోనందుకు ప్రస్తుత ప్రభుత్వం మీద రాబోయే ప్రభుత్వం విచారణ జరిపించే ప్రమాదం లేకపోలేదు. ప్రస్తుత ముఖ్యమంత్రి స్వ యానా గత ముఖ్యమంత్రి పైన లక్ష కోట్ల అవినీతి జరిగిందని అనేక వేదికల్లో ప్రకటించిన విషయం తెలుసు.మరి అలాంటప్పుడు లక్ష కోట్ల అవినీతిని ఎందుకు బయట పెట్టడం లేదు అని సామాన్య ప్రజలు ఎదురుచూస్తున్నారు. అవినీతి ప్రభుత్వాలను తరిమికొట్టి నీతివంతమైన పాలన చేసే ప్రభుత్వాలను స్వాగతించే క్రమంలో ఆ తేడాను చూపవలసినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది కదా! ఉన్నతాధికారులు, ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రితో సహా మంత్రులపైన పలు అవినీతి ఆరోపణలు రావడం ఆదాయానికి మించిన ఆస్తుల కూడ పెట్టారని జైల్లో వేసినటువంటి సందర్భాలు ఎన్నో. కానీ వాటి పరిస్థితి ఏమైంది? ఆ ధనాన్ని వసూలు చేసి ప్రభుత్వ ఖాతాకు జమ చేసినారా? ఏ స్థాయిలో ఉన్నది? తెలియచేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది. ""ప్రజల విశ్వసనీయతను సంపాదించడమే ప్రభుత్వ పనితీరుకు గీటురాయి. ఆర్థిక అరాచకత్వంతో ప్రభుత్వాన్ని దివాలా తీ యించినటువంటి పలు చర్యలు గత ప్రభుత్వ హయాంలో కొనసాగినట్లు మేధావులు, కాంగ్రెస్ పార్టీ, బిజెపి, ఇతరులు పలుమార్లు ఆరోపించినప్పటికీ వాటిపైన నిజనిర్ధారణ జరగాలి. నిగ్గు తేల్చాలి. నేరస్తులను కటాకటాల్లో వే యాల్సిందే. ఎందుకంటే ప్రజాధనాన్ని దిగమింగే అధికారం ఎవరికి లేదు కదా!""

( ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకులు అరసం రాష్ట్ర కమిటీ సభ్యుడు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ)

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333