అవును చీత్కరించినా ఏ ముఖం పెట్టుకుని ప్రజలను ఓట్లు అడుగుతారు.
*పదేళ్ల పాలన విద్రోహ, గాయాల చరిత్ర అయితే.. కాంగ్రెస్ ప్రభుత్వం పై విరుచుకు పడడం
తమ అస్తిత్వాన్ని కోల్పోవడమే. * విమర్శ మాని సంస్కరించుకోవడం పైనే దృష్టి పెట్టాలని మేధావుల హెచ్చరిక.అహంకారం వీడకపోతే అదోగతి తప్పదు.
--- వడ్డేపల్లి మల్లేశం
ప్రతిరోజు ఏదో ఒక సందర్భంలో బారాస పార్టీకి చెందిన మాజీ మంత్రులు కేటీఆర్ హరీష్ రావు గారలు ఇతరులు తమ వైఫల్యాలను లోపాలను కప్పిపుచ్చుకునే క్రమంలో సంస్కరించుకోవడాన్ని మరిచి కాంగ్రెస్ ప్రభుత్వం పైన విమర్శలు చేయడం రివాజుగా మారిపోయిన వేల అదే ఆ పార్టీకి గుదిబండగా మారక తప్పదు. అధికారానికి వచ్చిన కొద్ది రోజుల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ద్రోహం చేసిందని , ఏ ముఖం పెట్టుకొని పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లు అడుగుతారని హరీష్ రావు ఇతర మాజీ మంత్రులు మాట్లాడడాన్నీ గమనిస్తే అసలు "నీ చరిత్ర బాగా లేకనే కదా గత డిసెంబర్లో ఓటమిపాలైనది. ఇప్పటికీ తెలంగాణ గాయాల చరిత్రను నెమరు వేసుకుంటున్న ప్రజలు టిఆర్ఎస్ ప్రభుత్వం యొక్క ద్రోహాన్ని, వంచనను, దోపిడిని ,భూకబ్జాలను, అక్రమార్జ న ను తలచుకొని తీవ్ర వేదనకు గురవుతున్నారు అందుకే ఎన్నికల్లో బీఆర్ ఎస్ కు ఓటమి చవిచూపించినారు అయినా ఇప్పటికీ సోయి లేకపోతే ఎలా ? తమను ఎక్కడ విమర్శిస్తారోనని తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునే ప్రయత్నంలో భాగంగా ప్రభుత్వాన్ని విమర్శించి శాపనార్థాలు పెట్టి నిందలకు గురి చేస్తే సులభంగా బయటపడగలుగుతామని టిఆర్ఎస్ ఆలోచిస్తున్నది. కానీ మీరు చేసిన నేరాలు, ఘోరాలు, ఆత్మవంచన, ఇచ్చిన హామీలు నెరవేర్చక పది సంవత్సరాలు దాటవేసి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలను పీడించి దోపిడీ చేసిన చరిత్ర ఎవరికీ తెలియదు . అందుకే కాంగ్రెస్ పార్టీకి కాదు మీ పార్టీకి ఓటు వేయడానికి ప్రజలు సిద్ధంగా లేరని గుర్తిస్తే మంచిది. ఏ ముఖం పెట్టుకొని వెళతారు కాంగ్రెస్ వాళ్లు అన్నారు కానీ అదే మనకు వర్తింప చేసుకుంటే మంచిది.
ఎన్నికల సందర్భంగా అన్ని రాజకీయ పార్టీలు ఒకరిని మించి మరొకరు అనేక హామీలు వాగ్దానాలు ఇవ్వడం పరిపాటిగా మారిపోయింది . ఆకర్షణ పథకాల నుండి రాజకీయ పార్టీలు బయట పడాల్సిన అవసరం ఉన్నది కానీ అదే సందర్భంలో గతంలో అనేక వాగ్దానాలు చేసి ఏ వాగ్దానాన్ని కూడా నెరవేర్చకుండా కుటుంబ పాలనకు పరిమితమై దొరతనం, గడీల పాలన, అవినీతిలో కూరుకుపోయి, యువతను నిర్వీర్యపరిచి ,యువతకు ఉద్యోగాలు కల్పించకుండా ద్రోహం చేసిన విషయాన్ని రాష్ట్రంలోని అనేకమంది బుద్ధి జీవులు మేధావులు టిఆర్ఎస్ పార్టీ యొక్క పెద్ద నేరంగా గుర్తిస్తున్నారు. టిఆర్ఎస్ ఇచ్చినటువంటి హామీలను పదేళ్ల లోపల కూడా అమలు చేయకుండా దాటవేసి ఏ ఒక్కనాడు ప్రతిపక్షాలు ప్రజాసంఘాలు అఖిలపక్షాలు విమర్శించకుండా విజ్ఞతకు వదిలిపెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాము కనుక టిఆర్ఎస్ పార్టీని కూడా కాపాడుకోవాలని సంస్కారంతో ఆనాటి ప్రజలు వ్యవహరిస్తే ప్రజల తెలంగాణ సెంటిమెంటు ఆధారం చేసుకుని ఇలాంటి ప్రయోజనాలను కల్పించక తెలంగాణ ఆకాంక్షలను తుంగలో తొక్కిన మీ చరిత్ర ఎవరికీ తెలియదు. నీళ్ల కోసం పోరాటం అన్నావు మీ గడీల కోసం మీ ఫామ్ హౌజుల కోసమే నీళ్లను చేర్చుకున్న చరిత్ర మీకు లేదా? నిధుల కోసం ఆరాటపడి తెలంగాణ సంపదను తెలంగాణ ప్రజలకే కల్పిస్తామని మాట ఇచ్చారు కానీ భూ కబ్జాలు, అక్రమ దందాలు, అవినీతి పేరున కోట్లాది ప్రజాధనాన్ని మీ పార్టీ నాయకులే కొల్లగొట్టి
ఈ ప్రాంత ప్రజలకు ఎలాంటి సౌకర్యాలు కల్పించకుండా ఎస్సీ ఎస్టీ బీసీ సబ్ ప్లాన్ నిధులను కేటాయించకుండా విద్యా వైద్య రంగాలకు బడ్జెట్లో నిధులను కేటాయించకుండా మీ వర్గ ప్రయోజనం కోసం పనిచేసి కుటుంబ పాలనను ప్రోత్సహించిన మీ తీరు ఎవరికీ తెలియదు. అలాంటి మీకా రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో ఓటు వేసేది గెలిపించేది అది అసంభవం. ఇక మిగిలిన ఆకాంక్షలైన నియామకాలు ఆత్మ గౌరవాన్ని కాపాడే క్రమంలో 30 లక్షల మంది నిరుద్యోగ యువతకు అన్ని రంగాలలో ద్రోహం చేసి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నిర్ణయించి నియమించినటువంటి పరీక్షలను రద్దుచేసి పేపర్ లీకేజ్ ల ప్రోత్సహించి యువతను పక్కదారి పట్టించిన మీ చరిత్ర ఎవరికీ తెలియదు. ఇక ఆత్మగౌరవం పేరుతో తెలంగాణను తెలంగాణ సెంటిమెంట్తో సాధించినప్పటికీ పోలీసులు, అధికారులు, కలెక్టర్లు, మంత్రులు, శాసనసభ్యులు కూడా ముఖ్యమంత్రి యొక్క కాళ్లకు పాదాభివందనం చేసి ఈ రాష్ట్ర ప్రజల యొక్క ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టింది నిజం కాథా?. గత పది ఏళ్ల పాలన విద్రోహాల గాయాల చరిత్ర ఆ నెత్తుటి మరకలు అవమానాలు ఇచ్చిన హామీలను నెరవేర్చక చేసిన ద్రోహం పర్యవసానమే మొన్నటి ఎన్నికల్లో మీ ఓటమి రేపటి ఎన్నికలకు మీకు మరొక అపజయానికి ఉనికి ప్రశ్నార్థం కావడానికి మూలమవుతుంది అనడంలో సందేహం లేదు.
తెలంగాణ ఉద్యమ కాలంలో దశదిశల మన తెలంగాణ అస్తిత్వానికి సంబంధించిన సమాచారాన్ని నూరిపోసి మేధావిగా మన గలిగిన ప్రొఫెసర్ గంటా చక్రపాణి గారు కొన్ని విషయాలలో టిఆర్ఎస్ ప్రభుత్వం పరిపాలనను సమర్ధించినప్పటికీ ఎన్నికైన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించడాన్నీ సూటిగా తప్పు పట్టిన తీరు టిఆర్ఎస్ గుర్తిస్తే మంచిది . దొరతనం, గడీల పాలన , కుటుంబ పాలన , కుటుంబ సభ్యులందరికీ పదవులను నిరంతరం కట్టబెట్టుకొని లక్షలాది మంది యువతకు ద్రోహం చేసినటువంటి చరిత్రను అక్షరాల అంగీకరించి ఈ నాలుగు విషయాలలో బిఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి తీరని ద్రోహం చేసిందని ఇప్పటికైనా ఆ ద్రోహాన్ని ప్రజల మనసుల నుండి చెరిపివేయాలంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించడం మానుకొని పార్టీని సంస్కరించుకోవాలి . విమర్శలను మానుకొని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఐదేళ్లపాటు కొనసాగేలా నిర్మాణాత్మక పాత్ర పోషించాలి అని చక్రపాణి గారు చేసిన సూచన టిఆర్ఎస్ పార్టీకి కనువిప్పు కావాలి. ఒకవైపు మేధావులు బుద్ధి జీవులు ప్రజాసంఘాలతో పాటు సామాన్య ప్రజలు కూడా టిఆర్ఎస్ ప్రభుత్వం పైన చేస్తున్న విమర్శలపై చాలా ఆగ్రహంతో అసహనంతో ఉన్నారు. అంతేకాదు పార్లమెంటు ఎన్నికల్లో ఒక్క సీటు కూడా టిఆర్ఎస్ పార్టీకి రావద్దు, గెలవనీయద్దు ,ఓట్లు వేయొద్దు అని కచ్చితంగా నినదిస్తున్నారు. అంటే టిఆర్ఎస్ పార్టీ యొక్క ద్రోహబుద్ధి అహంభావము అహంకారము శాపనార్థాలు తమ గోతిని తామే తవ్వుకోవడం అని తమ ఉనికిని తామే ప్రశ్నార్థకం చేసుకోవడం అని ఇప్పటికైనా గుర్తించాలి. నోరు మూసుకొని తలవంచుకొని విమర్శించడాన్నీ మానుకొని ఎన్నికల్లో ఓడిపోవడానికి గల లోపాలను కారణాలను విశ్లేషించుకుని ప్రజల ముంగిట్లో పని చేయడం ద్వారా ప్రజా అభిమానాన్ని చూర కుంటే మంచిదని బుద్ధి జీవులు చేస్తున్న సూచనను టిఆర్ఎస్ పాటించాలి. నిరంతరం విమర్శిస్తే, శాపనార్థాలు పెడితే, ఎలా నిధులు తె స్తారు? ఎప్పుడు అమలు చేస్తారు? అని కేవలం మూడు మాసాలకే ఇంత పోరాటం చేస్తే మీరు 10 ఏళ్ల కాలంలో కూడా చేయకుండా మిగిల్చిన అనేక హామీల సంగతి ఏమిటి? ప్రజలు గనుక నిలదీస్తే, ఉద్యమిస్తే, ప్రశ్నిస్తే మీ బ్రతుకు బజారు పాలు అవుతుంది జాగ్రత్త సుమా!!!!
( ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకులు అభ్యుదయ రచయితల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు హుస్నాబాద్ సిద్దిపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం)