మోత్కూర్ మండలాన్ని ... అసెంబ్లీ నియోజకవర్గం చేయాలి

మోత్కూర్ 10 సెప్టెంబర్ 2025 తెలంగాణ వార్త ప్రతినిధి
కేంద్ర ప్రభుత్వం 2026లో చేపట్టనున్న నియోజకవర్గ పునర్విభజనలో మోత్కూరు మండలాన్ని అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంగా ఏర్పాటు చేయాలని బీసీ రిజర్వేషన్ సాధన సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు బుర్ర శ్రీనివాస్ గౌడ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.ఈ మేరకు మంగళవారం మోత్కూరు మండలంలో సమితి మండల కమిటీ ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిరావు పూలే చౌరస్తా వద్ద రాస్తారోకో నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ, ప్రతి 20 ఏళ్లకోసారి కేంద్రం చేపట్టే నియోజకవర్గ పునర్విభజనలో భాగంగా తెలంగాణలో ప్రస్తుతం ఉన్న 119 స్థానాలకు అదనంగా 34 నియోజకవర్గాలు ఏర్పడనున్నాయని తెలిపారు.ఉమ్మడి నల్లగొండ జిల్లాలో (ప్రస్తుతం యాదాద్రి) మోత్కూరు మండలం అభివృద్ధిలో వెనుకబడిన ప్రాంతమని ఆయన గుర్తు చేశారు. గుండాల, అడ్డగూడూరు, ఆత్మకూరు (ఎం), మోటకొండూరు మండలాలకు అనుసంధానంగా ఉన్న మోత్కూరు కేంద్రంగా కొత్త నియోజకవర్గాన్ని ఏర్పాటు చేయడం అవసరమని ఆయన కోరారు.ఈ ఐదు మండలాల్లో 68 రెవెన్యూ గ్రామాలు, 90 గ్రామపంచాయతీలు ఉన్నాయని, 2011 జనాభా లెక్కల ప్రకారం 1.73 లక్షల జనాభా ఉందని, ఈ మధ్య కాలంలో మరో 50 వేల వరకూ పెరిగి ఉండవచ్చని చెప్పారు. అందువల్ల మోత్కూరు నియోజకవర్గం ఏర్పాటుకు అన్ని అర్హతలు ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. అభివృద్ధి నుండి దూరంగా ఉన్న మోత్కూరు మండలానికి న్యాయం జరిగేలా ప్రజాప్రతినిధులు, అధికారులు చొరవ చూపాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో బీసీ రిజర్వేషన్ సాధన సమితి జిల్లా నాయకులు కలిమెల నర్సయ్య, మండల అధ్యక్షుడు శివార్ల శ్రీనివాస్ యాదవ్, పట్టణ అధ్యక్షుడు నిలిగొండ మత్స్యగిరి, స్థానిక నాయకులు మోత్కూరి బ్రహ్మ ఆచార్య, కురిమేటి యాదయ్య, మర్రి కమల్ నాథ్, తొగిటి మనోరచారి, బత్తిని ప్రభాకర్, బత్తిని ప్రవీణ్, బోడ దేవస్వామి, బత్తిని తిరుమలేష్, మన్నె చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.