ఆర్థిక అక్షరాస్యత పై అవగాహన కలిగి ఉండాలి

తిరుమలగిరి 10 సెప్టెంబర్ 2025 తెలంగాణ వార్త ప్రతినిధి
ఆర్థిక అక్షరాస్యత పై అవగాహన కలిగి ఉండాలని నల్గొండ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ లిమిటెడ్ తిరుమలగిరి బ్రాంచ్ మేనేజర్ ఎస్ కే అలిమొద్దీన్ అన్నారు. సోమవారం నాబార్డ్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని మోడల్ స్కూల్లో ప్రిన్సిపల్ సంజీవ్ కుమార్ అధ్యక్షతన ఆర్థిక అక్షరాస్యత పై విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మేనేజర్ మాట్లాడుతూ ఆర్థిక అక్షరాస్యత కష్టపడి సంపాదించిన వాటికి విలువను, గుర్తింపును తీసుకువస్తుందన్నారు. భవిష్యత్తు ప్రణాళికలో ఆర్థిక అక్షరాస్యత కీలకపాత్ర పోషిస్తుందన్నారు. బ్యాంకింగ్ వ్యవస్థను అర్థం చేసుకోవడం, సైబర్ నేరాల పట్ల అప్రమత్తత పొదుపు తదితర బ్యాంకింగ్ కార్యకలాపాలు అన్ని ఆర్థిక అక్షరాస్యతకు సంబంధించినవేనని తెలిపారు. విద్యార్థుల కుటుంబాలు నిత్యజీవితంలో అవసరమగు పంట గృహ వాహన తదితర రుణాల వివరాలను అర్థమయ్యేలా విద్యార్థులకు వివరించారు. విద్యార్థులకు పొదుపు పై అవగాహన కల్పిస్తూ భవిష్యత్తు కోసం ఆర్థికంగా ఇప్పటినుంచే స్థిరమైన ప్రణాళికతో సన్నద్ధంగా ఉండాలన్నారు. చిన్న చిన్న పొదుపులను అలవాటు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ మేనేజర్ ఎస్ కె షరీఫ్, బ్యాంకు సిబ్బంది భద్రయ్య, పాఠశాల వయసు ప్రిన్సిపల్ క్రాంతి కిరణ్ రెడ్డి, పాఠశాల అధ్యాపకులు, ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.