మెరుగైన ఉత్తీర్ణత శాతాన్ని సాధించేలా కృషి చేయాలి:జిల్లా కలెక్టర్ బీఎం. సంతోష్
జోగులాంబ గద్వాల 16 మే 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి పదో తరగతి ఫలితాల్లో జిల్లా వెనుకబడటానికి కారణాలు తెలుసుకొని, వచ్చే విద్యా సంవత్సరంలోనైనా మెరుగైన ఉత్తీర్ణత శాతాన్ని సాధించేలా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ బీఎం. సంతోష్ అధికారులను ఆదేశించారు. పదో తరగతి ఫలితాలు, వచ్చే విద్యా సంవత్సరం విద్యాశాఖ ప్రణాళిక అంశాలపై గురువారం గద్వాలలోని ఐడీఓసి కాన్ఫరెన్స్ హాల్ లో జరిగిన సమీక్ష సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. ఎస్ఎస్సీ ఫలితాల్లో మన జిల్లా రాష్ట్రంలో చివరి నుంచి రెండో స్థానంలో నిలవడం సరికాదని, మంచి ఫలితాలు సాధించకపోవడానికి కారణమేంటని ప్రశ్నించారు. ఈ సందర్భంగా విద్యాశాఖ అధికారులు స్పందిస్తూ జిల్లాలో విద్యార్థుల హాజరు శాతం తగ్గుతోందని, కొన్ని పాఠశాలల్లో సబ్జెక్టు టీచర్ల కొరత వేధిస్తోందన్నారు. పరీక్షలకు ముందు పదవ తరగతి విద్యార్థుల పై పర్యవేక్షణ చేసేందుకు కొంతమంది ప్రత్యేక అధికారులను నియమించినప్పటికీ వారికి ఎక్కువ పాఠశాలలు అప్పగించడంతో కొంత సమస్య ఏర్పడిందన్నారు.కలెక్టర్ మాట్లాడుతూ...ఈ విద్యా సంవత్సరంలో జూన్ నెలలోనే జిల్లా స్థాయి అధికారులను ప్రతి మండలంలో ఆయా పాఠశాలలకు ప్రత్యేక అధికారులుగా నియమించనున్నట్లు తెలిపారు. విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంచేందుకు అవసరమైతే ఎన్జీవోల సహకారం తీసుకోవాలని, ఉపాధ్యాయులు నిబద్ధతతో పని చేయాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి విద్యాశాఖ ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని కానీ ఆశించిన స్థాయిలో ఫలితాలు రాకపోవడానికి కారణం ఏమిటో విశ్లేషించాలని, సమస్యలను పరిష్కరించుకుంటూ ముందుకెళ్లాలన్నారు. బడి బయట పిల్లలందరూ తప్పకుండా పాఠశాలల్లో చదువుకునేలా పోలీస్ శాఖ, బాలల సంరక్షణ విభాగం వారి సహకారం తీసుకోవాలన్నారు. ఇక నుంచి ప్రతి నెల ఆయా పాఠశాలల్లో విద్యార్థుల హాజరు శాతాన్ని క్రమం తప్పకుండా తమకు పంపించాలన్నారు.ప్రభుత్వ హాస్టల్ లలో ఉండి చదువుకునే విద్యార్థుల పై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. బడిబాట కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, ఏకరూప దుస్తులను సకాలంలో అందజేయాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారిని ఇందిర, ఎస్సీ, బీసీ సంక్షేమ శాఖ అధికారిని శ్వేత ప్రియదర్శిని, జిల్లా పరీక్షల అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాసులు, డీసీఈబీ సెక్రటరీ ప్రతాప్ రెడ్డి, సెక్టోరియల్ అధికారులు హంపయ్య, ఎస్తేరు రాణి, ఎంఈఓ లు, తదితరులు, పాల్గొన్నారు.