పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత

జోగులాంబ గద్వాల: పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకొని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలంగాణ సాంస్కృతిక సారధి కళాకారులు అన్నారు. శనివారం జిల్లా కలెక్టర్ బి ఎం సంతోష్ ఆదేశాలతో సమాచార పౌర సంబంధాల శాఖ అధికారి అరిఫుద్ధిన్ ఆధ్వర్యంలో గట్టు ఎంపీడీవో, ఎస్సైలను కలిసిన అనంతరం మండల పరిధిలోని బోయలగూడెం గ్రామపంచాయతీ కార్యాలయం దగ్గర కళాకారులు ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, బాల కార్మిక నిర్మూలన, బాల్యవివాహాలు, వెట్టి చాకిరి నిర్మూలన, పరిసరాల పరిశుభ్రత తదితర అంశాలపై ఆట,పాటల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ లాంటి వ్యాధులు ప్రబలకుండా ఉంటుందని వారు ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో కళాకారులు కేశవులు, ప్రసాద్, రమాదేవి, స్వామి, భూపతి, రాహుల్, కృష్ణ, హజ్రత్ తదితరులు పాల్గొన్నారు.