మహిలో భక్తి కి మైలు రాయిగా మారుతి నిలిచే

Apr 12, 2025 - 00:27
Apr 12, 2025 - 00:30
 0  5
మహిలో భక్తి కి మైలు రాయిగా మారుతి నిలిచే

ఆణువంత ఉన్న ఓ హనుమంత 

జగమంతా ఎట్లెగిరితివయ్యా... 

తనువంత నిండే శ్రీ రామ చింత 

జనులంతా నిన్ను కీర్తించేరయ్యా..

రామాయణమంతా నీ భక్తి పారాయణమే 

రాముని మనసు లో నీపై వాత్సల్యమే

హనుమంతా ఓ పవన సుతా...

అంజని పుత్రా అతి బలవంతా...

సుమధుర భాండం నీ సుందర కాండం

కన్నుల కాంచిన కలుగును భాగ్యం.

సుందర రూపం సున్నిత తత్వం

రాముని మదిలో సుస్థిర స్థానం

అంజని తనయ నీ భక్తి అపారం.

నిన్ను తలచిన భూత ప్రేతాలు మాయం..

సూర్యుని పండుగ తలచి మింగిన వాడా..

ముల్లోకాలను చీకటిలో ముంచిన వాడా...

అమ్మ అంజని మందలించగా మందహాసముతో రవి ని భువి కిచ్చి చిరంజీవిగా ఇలలో నిలిచిన వాడా...

అర్జున రథమును అధిరోహించి 

విజయము చేకూర్చిన వాడా...

జానకిరాములు ఎక్కడో లేరంటూ..

నీ హృదయం చీల్చి చూపావయ్యా....

సంజీవని మొక్కను తెమ్మంటే

పర్వతమే తెచ్చిన పవన సుతా 

లక్ష్మణు ప్రాణ దాతవై నిలిచి

రాముని మనసు గెలిచినావయ్యా...

సీత జాడ కై సముద్రం దాట 

నేనెంత వాడినంటూ సిన్నబోతివా...

నీ బలమెంతో నీకే తెలియని 

విచిత్ర మూర్తివి నీవయ్యా...

అరవై ఆమడ దూకే సామర్థ్యం

 నీదని జాంబవంతుడు తెలుపగా,

 జై శ్రీరామంటూ లంఘించి దూకి

లంకను రెప్ప పాటిలో చేరితివి....

అశోక వనమున విచార వదన 

సీత ను చూసి మనసు చలించే...

అయినా ఓర్పుతో అమ్మను చేరి

రాముని ఉంగరమిచ్చే మారుతీ...

రామ చంద్రుని రాక సత్యము

రావణ వధ జరుగు తథ్యము

అని అమ్మకు అభయమిచ్చి 

కదిలే హనుమా..

లంకను కూకటి వేళ్ళతో కూల్చాలని

రగ రగ రగిలే ప్రతీ రక్త కణం 

భగ భగ మండే గుండెల బాధ.....

చూసి రమ్మనే రామ ఆజ్ఞకు బద్దుడై

లంకను కాల్చి వచ్చే చిచ్చర పిడుగై...

ఇలలో ఇంతటి వినయుడు లేడని

ముల్లోకాలు మురిసే....

మహిలో భక్తి కి మైలు రాయిగా

మారుతి నిలిచే......

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333