బాల కార్మిక వ్యవస్థ సమూలంగా నిర్మూలించాలి:జిల్లా కలెక్టర్

జోగులాంబ గద్వాల 12 జూన్ 2024 తెలంగాణ వార్త ప్రతినిధి:-జిల్లాలో బాల కార్మిక వ్యవస్థను, బాల్య వివాహాలను సమూలంగా నిర్మూలించేందుకు అన్ని శాఖల అధికారులు కలిసికట్టుగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ బి. ఎం. సంతోష్ పిలుపునిచ్చారు. బుధవారం అంతర్జాతీయ బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవం సందర్భంగా తన ఛాంబర్ లో జిల్లా కలెక్టర్ బి. ఎం. సంతోష్ అదనపు కలెక్టర్ (రెవిన్యూ) ముసిని వెంకటేశ్వర్లు తో కలిసి బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు జిల్లాలో నియమించిన టాస్క్ ఫోర్స్ కమిటీతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తల్లిదండ్రులు పిల్లలతో పని చేయించకుండా వారి ఆర్థిక పరిస్థితులు మెరుగుపరిచేందుకు వివిధ ప్రభుత్వ ఉపాధి, సంక్షేమ పథకాలను అర్హులైన వారందరికీ వర్తింప చేయాలన్నారు.
ఇప్పటికే ఆపరేషన్ స్మైల్, ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమాలతో బాల కార్మికులను గుర్తించి వారిని పాఠశాలల్లో చేర్పించినప్పటికీ ఇంకా బడి బయట ఎవరైనా పిల్లలు ఉంటే వారందరినీ గుర్తించాలన్నారు. ఇందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వం పాన్ ఇండియా రెస్క్యూ రిహాబిలిటేషన్ కార్యక్రమాన్ని జూన్ 1 నుంచి నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో భాగంగా వివిధ శాఖల అధికారులు ఈనెల 30 వరకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించి బాల కార్మికులను ఆ ఊబిలో నుంచి బయటకు తీసుకొచ్చేందుకు కృషి చేయాలన్నారు. స్వచ్ఛంద సేవా సంస్థలు, యువత కూడా బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు తమ వంతు సహకారం అందించాలన్నారు.ఈ సందర్భంగా పలు శాఖల అధికారులు తమ ఆధ్వర్యంలో బాల కార్మిక వ్యవస్థ, బాల్య వివాహాల నిర్మూలనకు చేపట్టిన కార్యక్రమాలను వివరించారు. 2023లో జిల్లాలో 132 మంది బాల కార్మికులను, ఈ ఏడాది ఇప్పటిదాకా 85 మందిని గుర్తించి బడిలో చేర్పించినట్లు తెలిపారు. బాల కార్మిక నిషేధ చట్టం ప్రకారం ఎవరైనా 14 ఏళ్లలోపు పిల్లలను పనిలో పెట్టుకుంటే సంబంధిత యజమానులకు మూడు సంవత్సరముల వరకు జైలు శిక్ష, లేదా రూ. 20 వేల నుంచి రూ.50 వేల వరకు జరిమానా లేదా రెండు విధించవచ్చని తెలిపారు. ఎవరైనా బాల కార్మికులను పనిలో పెట్టుకుంటే 1098 చైల్డ్ లైన్ నెంబర్ కి ఫోన్ చేసి తెలుపవచ్చు అన్నారు. ప్రస్తుతం బడిబాట కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నందున ఇంటింటికి తిరిగి పిల్లలు బడిలో చదువుకునేలా తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నామన్నారు.
అనంతరం మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనపై ముద్రించిన గోడ పత్రికలను జిల్లా కలెక్టర్ వివిధ శాఖల అధికారులతో కలిసి విడుదల చేశారు.
ఈ కార్యక్రమంలో డీ. డబ్ల్యు. ఓ. సుధారాణి, డి.ఎం.హెచ్. ఓ. డాక్టర్. శశికళ, కార్మిక శాఖ అసిస్టెంట్ కమిషనర్ వెంకటరమణ, సి. డబ్ల్యూ. సి. చైర్మన్ సహదేవుడు, డి. సి. పి. ఓ. నరసింహా, సెక్టోరియల్ అధికారిని ఎస్తేరు రాణి, పలు స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.