పిల్లలను క్రమం తప్పకుండా ప్రభుత్వ పాఠశాలలకు పంపించాలి: జిల్లా కలెక్టర్

Jun 12, 2024 - 21:48
Jun 12, 2024 - 22:01
 0  12

జోగులాంబ గద్వాల 12 జూన్ 2024 తెలంగాణ వార్త ప్రతినిధి:- ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు తల్లిదండ్రులు తమ పిల్లలను క్రమం తప్పకుండా ప్రభుత్వ పాఠశాలలకు పంపించాలని జిల్లా కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు.బుధవారం గద్వాల మండలం పరమాల గ్రామ శివారు వద్ద నూతనంగా నిర్మించిన ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల వద్ద బడిబాట కార్యక్రమాన్నికి జిల్లా కలెక్టర్ బీఎం సంతోష్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... విద్యార్థుల హాజరు 90 శాతానికి పైగా ఉంటేనే వాళ్లు చదువులో రాణిస్తారన్నారు.

 గతేడాది 10వ తరగతి ఫలితాల్లో మన జిల్లా రాష్ట్రంలోనే చివరి నుంచి రెండో స్థానంలో నిలవడానికి విద్యార్థుల హాజరు శాతం తక్కువగా ఉండడమే ప్రధాన కారణం అన్నారు. ప్రభుత్వ పాఠశాలలోనే ప్రతిభ గల ఉపాధ్యాయులు ఉంటారని, తల్లిదండ్రులు ఈ విషయాన్ని గుర్తించి తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని సూచించారు. ప్రభుత్వ విద్యాసంస్థల్లో ఉచితంగా ఏకరూప దుస్తులు, పాఠ్య, రాత పుస్తకాలు అందజేయడమే కాక మధ్యాహ్న భోజన సౌకర్యం ఉందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే ఎంతోమంది ఉన్నతోద్యోగాలు సాధించారని, ప్రజా ప్రతినిధులుగా రాణిస్తున్న వాళ్లు చాలామంది ఉన్నారని చెప్పారు. ఆయా పాఠశాలల్లో అమ్మ ఆదర్శ కమిటీలను ఎన్నుకొని అవసరమైన మరమ్మత్తులు చేయించడంతో విద్యార్థులకు ఎలాంటి సమస్యలు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించినట్లు వివరించారు. ఈ విద్యా సంవత్సరం మొదటి రోజునే విద్యార్థులకు ఏకరూప దుస్తులు అందజేయాలన్న సంకల్పంతో మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులతో దుస్తులను కుట్టించినట్లు తెలిపారు. ఫలితంగా ప్రభుత్వం తరఫున మహిళా సంఘాల సభ్యులకు ఉపాధి లభించి ఆర్థికంగా ఎదిగేందుకు సహకరించినట్లు పేర్కొన్నారు. పాఠశాలల్లో ప్రతివారం పేరెంట్స్ మీటింగ్ లు నిర్వహించి ప్రభుత్వ పాఠశాలల్లో అందిస్తున్న సౌకర్యాలను తెలియజేయడమే కాక, పిల్లలను పనికి పంపకుండా తప్పకుండా బడిలో చదువుకునేలా సహకరించాలని కోరాలని తెలిపారు.14 ఏళ్ల లోపు బాల బాలికలందరూ తప్పకుండా పాఠశాలలో చదువుకోనెలా చూడాలని, తల్లిదండ్రులు వాళ్ళతో పని చేయించడం చట్టరీత్య నేరం అని చెప్పారు. పిల్లలను బాగా చదివిస్తే వారి భవిష్యత్తు బాగుంటుందని, గొప్ప స్థాయిని చేరుకునే అవకాశం ఉందన్నారు. అనంతరం కలెక్టర్ విద్యార్థులకు ఏకరూప దుస్తులు, పాఠ్యపుస్తకాలను అందజేశారు. బడిబాటకు సంబంధించిన కరపత్రాలను విద్యాశాఖ అధికారులతో కలిసి కలెక్టర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా పాఠశాల యాజమాన్యం కలెక్టర్ ను సన్మానించారు. నూతనంగా నిర్మించిన పాఠశాలకు అవసరమైన వంటగది, ప్రహరీ గోడ నిర్మించాలని ఉపాధ్యాయులు కలెక్టర్ ను కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారిని ఇందిర, ఎస్ జి ఎఫ్ జిల్లా కార్యదర్శి జితేందర్, ఎం ఈ ఓ సురేష్, సెక్టోరియల్ అధికారి హంపయ్య, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్పర్సన్ ధనలక్ష్మి, ఉపాధ్యాయులు, విద్యార్థులు వారి తల్లిదండ్రులు, తదితరులు పాల్గొన్నారు.

G.THIMMA GURUDU Jogulamba Gadwal Staff Reporter Jogulamba Gadwal District Telangana State