ప్రపంచ పొగాకు వ్యతిరేక దినం యుఎన్ఓ ఆమోదించి ప్రకటించినా విచ్చలవిడిగా ఉత్పత్తి, వినియోగం ఎందుకు జరుగుతున్నది?
ప్రపంచ పొగాకు వ్యతిరేక దినం యుఎన్ఓ ఆమోదించి ప్రకటించినా విచ్చలవిడిగా ఉత్పత్తి, వినియోగం ఎందుకు జరుగుతున్నది? ప్రజలు అనారోగ్యం బా రిన పడుతున్నా ప్రభుత్వాల ఉదాసీనత సిగ్గుచేటు * త క్షణ చర్యలకై డిమాండ్.
వడ్డేపల్లి మల్లేశం
31....05....2025
పొగాకు దాని ఉత్పత్తులు సిగరెట్లు బీడీలు తంబాకు అంబర్ అనారోగ్యానికి హేతువని ప్రజలకు తెలిసిన ప్రభుత్వాలను అంతర్జాతీయ సంస్థలు ఐక్యరాజ్యసమితి హెచ్చరించి పొగాకు వ్యతిరేక దినమంటూ 31 మే రోజుకు ప్రాధాన్యత కల్పించినా భారతదేశంలో పాలకులు మాత్రం ఆ వైపుగా కన్నెత్తి చూడలేదు కనీస చర్యలు తీసుకోవడం లేదు. "పొగాకు ఉత్పత్తుల వినియోగం వల్ల 100 మందిలో 80 నుండి 90 మందికి కచ్చితంగా క్యాన్సర్ సోకే ప్రమాదం ఉన్నదని పరిశీలనలు తెలియజేస్తుంటే అవేమీ తమకు పట్టనట్లు ప్రజలు వినియోగిస్తున్నారు, పాలకులు అనుమతిస్తున్నారు, దేశాన్ని అనారోగ్యం అంచుకు నెట్టుతున్నారు". ముఖ్యంగా పొగాకు దాని అనుబంధ ఉత్పత్తులలో నీకోటిన్ అనే విష పదార్థము పొగ పీల్చిన తర్వాత అనేక రకాలుగా ప్రభావం చూపి తాత్కాలికంగా ఉపశమనం పొందవచ్చు కానీ శాశ్వతంగా బీపీ, షుగర్, లివర్, కిడ్నీస్, హార్ట్, క్యాన్సర్ అనేక రకాలైనటువంటి వ్యాధులకు కారణమవుతున్న వేళ ఆ ఉత్పత్తులను రద్దుచేసి పంపిణీ నిరోధించి వీటి వినియోగం పైన ఉక్కు పాదం మోపాల్సిన అవసరం చాలా ఉన్నది. పాలకులు ప్రజల యొక్క ఆరోగ్యానికి భరోసా ఇవ్వగలిగిన వారైతే ప్రజల ఆరోగ్యం పైన చిత్తశుద్ధి గనుక ఉంటే ప్రభుత్వాలు వెంటనే దేశవ్యాప్తంగా నిషేదించాలి. ఉత్పత్తులను కూకటి వేళ్లతో పెకి లించే ప్రయత్నం చేయాలి ప్రజల్లో అవగాహన కార్యక్రమాలను తీ సుకోవాలి.
ఐక్యరాజ్యసమితి 1988లో పొగాకు ఉత్పత్తుల యొక్క వినియోగం వల్ల మానవజాతి పైన పడుతున్న ప్రభావాన్ని గుర్తించి అనేక దేశాల నుండి వచ్చిన ఒత్తిడి మేరకు పొగాకు ఉత్పత్తులను నిషేధించే క్రమములో ప్రపంచ దేశాలకు మార్గ నిర్దేశం చేస్తూ ప్రతి ఏటా మే 31వ తేదీని ప్రపంచ పొగాకు వ్యతిరేక దినంగా నిర్వహించాలని ఆదేశాలు చేసియున్నది. అయినప్పటికీ ప్రజల్లో అవగాహన పెరగలేదు, ప్రభుత్వాలు అవగాహన కల్పించలేదు, ఉత్పత్తులను నిషేధించలేదు, వాటిని మరింత భారీగా పెంచుతూ వ్యాపార, పెట్టుబడిదారులకు లాభాలను పంచుతున్నదే కానీ ప్రభుత్వం తన సామాజిక ధర్మాన్ని విస్మరించడం విచారకరం. ఆ కారణంగా లక్షలాదిమంది రోహగ్రస్తులై మృత్యు బారిన పడుతున్న విషయం తెలియదా? .ముఖ్యంగా పొగాకు ఉత్పత్తుల కారణంగా సుమారు 4000 రకాల రసానిక పదార్థములు 43 రకాల క్యాన్సర్ కారకాలు 400 రకాల విష పదార్థాలు శరీరాలలోకి వెళుతున్నట్లు అవి శరీరాన్ని గుల్ల చేస్తూ మృత్యుకుహరంలోకి నెట్టుతున్నట్లు పరిశీలకులు తెలియచేస్తుంటే ఇవేవీ తమకు పట్టనట్లు పాలకులు నిశ్శబ్దంగా తటస్థంగా మౌనంగా ఉండడం సిగ్గుచేటు కాదా? ఈ ఉత్పత్తులలో పాల్గొంటున్నది ఈ దేశ ప్రజలే కావచ్చు కానీ ఉత్పత్తిలో భాగంగా అనారోగ్యానికి వాళ్లు గురికావడమే కాకుండా వాటిని వినియోగించే కోట్లాది దేశ ప్రజలు కూడా అనారోగ్యం బారిన పడుతున్నపుడు ఈ ఉత్పత్తులు మనకు అవసరమా? ఈ ఉత్పత్తులపై ఆధారపడిన ప్రజల జీవన విధానం మనకు ముఖ్యమా? అవసరమైతే ప్రత్యామ్నాయ పని కల్పించుకుంటారు లేదా పాలకులకు కల్పించ కల్పించవలసిన బాధ్యత ఉండవచ్చు కానీ వాళ్ళ ఉపాధి కోసం నిర్బంధంగా అమ్మడం ప్రజల పైన రుద్దడం అనేది అవివేకం.
ప్రభుత్వం తీసుకోవలసిన కనీస చర్యలు:-
**********
ప్రపంచ పొగాకు వ్యతిరేక దినము సందర్భంగా అయినా ప్రభుత్వాలు కనీసం ఆలోచించి సంబంధిత మేధావులు,విశ్లేషకులు,నిపుణులతో సంప్రదించి పొగాకు అనుబంధ ఉత్పత్తులన్నింటిపైన కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలతో చర్చించి పూర్తిస్థాయిలో నిషేధించడానికి ఉక్కు పాదం మోపాల్సినటువంటి అవసరం చాలా ఉన్నది. అనారోగ్యం అని తెలిసినా పొగ త్రాగడం,చట్టరీత్యా నిషేధం అని సిగరెట్లు బీడీల పైన రాసి ఉన్న, అంబర్ లేదా ఇతర గుట్కాల పైన క్యాన్సర్ కారకాలని మృత్యుకుహారాలని బొమ్మలు గీసి ఉన్న ఇవేవీ తమకు పట్టనట్లు ప్రజలు వినియోగిస్తూ విశ్రాంతి పొందుతున్నారు తృప్తిని అనుభవిస్తున్నారు. అరకొ ర ఆదాయముతో బతికే వాళ్ళు తమ సంపాదనలో కొంత భాగాన్ని ఖర్చు చేస్తూ తమ కుటుంబాలకు దూరమవుతు కుటుంబాలను వీధిపాలు చేస్తున్నారు ఇదంతా ప్రభుత్వాలకు సంబంధం లేనిఅంశమా? ప్రజలు ప్రజాస్వామిక వాదులు ఆరోగ్య అభిలాషలు ప్రభుత్వాలపైన ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం కూడా ఉన్నది.ఇది ఒక ప్రజా ఉద్యమంగా వస్తే తప్ప, సామాన్య ప్రజలను వినియోగదారులను అవగాహన కల్పిస్తే తప్ప వినియోగం ఆగదు. వినియోగం ఆగినప్పుడు మాత్రమే ఉత్పత్తి అయిన నిష్ప్రయోజనం కనుక ఉత్పత్తిని ఉత్పత్తి సంస్థలు ఆపివేస్తాయి. తద్వారా కొంతవరకైనా నిషేధించడానికి అవకాశం ఉంటుంది. అంటే ప్రభుత్వo తో పాటు మరో వైపు ప్రజలు స్వచ్ఛందంగా విరమిస్తే తప్ప వీటి ఉత్పత్తి వినియోగం ఆగదు. చావు అంచు తప్పదని తెలిసినా కూడా వాటిని వినియోగించడంతో అనుభూతి పొందుతున్నారంటే ఏ స్థాయిలో ఉత్పత్తి వినియోగం ప్రచారం జరిగిందో మనం అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా యువత 15 ఆ పై సంవత్సరాల మధ్య వాళ్ళు విచ్చలవిడిగా పొగాకును సిగరెట్లు వాటి ఉత్పత్తులను వినియోగిస్తూ తాత్కాలిక ఆనందం పొందుతున్నారు. వాటి అమ్మకాల ద్వారా వచ్చే పన్నును ఆదాయంగా భావించే ప్రభుత్వాలు పరిపాలనకు ఉపయోగిస్తున్నాయే తప్ప ప్రజలను నిర్మూలించే పొగాకు ఉత్పత్తుల ద్వారా వచ్చే ఆదాయం కోసం ప్రభుత్వాలు ఆశించి ప్రజా ప్రయోజనాన్ని విస్మరించడమంటే ప్రభుత్వాల యొక్క బాధ్యతారాహిత్యమే అవుతుంది
ప్రజా ఉద్యమాలు తప్పనిసరి
ప్రజలు స్వచ్ఛందంగా వీటి ఉత్పత్తిని నిషేధించడానికి వినియోగం పైన ఉక్కు పాదం మోపడానికి ప్రభుత్వాలు అన్ని రకాలుగా చర్యలు తీసుకోవడానికి పెద్ద ఎత్తున ప్రజల్లో ఉద్యమం రావాల్సిన అవసరం ఉంది. అదే సందర్భంలో తల్లిదండ్రులు కూడా తమ పిల్లలు పొగాకు ఉత్పత్తులకు అలవాటు పడిన తీరు పైన నిఘా వేసి కళ్లెం వేయవలసిన అవసరం కూడా ఉన్నది. ఇక ప్రభుత్వాలు ప్రత్యేక కార్యక్రమాలు ప్రకటనలు ప్రచారాలు టీవీ ప్రసారాలు ఇతరత్రా కార్యక్రమాల ద్వారా జోరుగా వీటి ఉత్పత్తులు ఏ రకంగా ప్రజలకు అనారోగ్యం కొని తెచ్చి పెడుతున్నాయో తెలియజేయడం ద్వారా ప్రజలకు వీటి పట్ల విముఖత కల్పించవలసిన అవసరం కూడా ఉన్నది. అనారోగ్యాన్ని చట్టబద్ధంగా అనుమతిస్తూ, ప్రజలకు అందిస్తూ, రాజ్యాంగం నిషేధించినటువంటి పొగాకు ఉత్పత్తులను అనారోగ్యాన్ని ఫ్రెంచి పోషించే ప్రభుత్వ చర్యల పైన న్యాయవ్యవస్థ కూడా కొరడా జు లిపించాల్సినటువంటి అవసరం ఉన్నది. అన్ని విషయాలకు ప్రభుత్వాలదే బాధ్యత అని మిగతా సంస్థలు లేదా వ్యవస్థలు మౌనంగా ఉంటే, పాలకులు చేసే నేరాల పైన వ్యాఖ్యానించవలసినటువంటి న్యాయవ్యవస్థ కూడా తమ పరిధి కాదని స్పందించకుంటే, అవినీతికి అక్రమార్జనకు పెట్టుబడిదారీ వ్యవస్థ కు వంత పాడుతున్న ప్రభుత్వాలకు ఇక ఎదురులేకుండా పోతుంది. "పాలకులకు కావలసింది సంపాదన, అధికారం, ప్రజల పైన స్వారీ చేయడం, ప్రజలు మత్తులో ఊరేగుతుంటే ఆనందిస్తూ, రోగాల బారిన పడి చావు బతుకుల్లో ఉంటే తమకు ఎదురేలేదని భావించి బహుశా ఇలాంటి వాటికి అనుమతిస్తారో ఏమో? ఏది ఏమైనా ప్రజాస్వామ్య దేశంలో సామాజిక బాధ్యత గల ప్రభుత్వాలు ప్రజల కోసమే పనిచేయాలి, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలి, ప్రజల కొనుగోలు శక్తిని పెంచాలి, ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టకూడదు, ప్రజలే ప్రభువులు అని రుజువు చేస్తే మంచిది. తమ చేతిలో ఉన్నటువంటి పొగాకు అక్రమ ఉత్పత్తులను ఆపివేసి, వినియోగం పైన ఉక్కు పాదం మోపి, ఎక్కడికక్కడ నిగావుంచి, కనిపించకుండా చేయగలిగితే ప్రపంచ పొగాకు వ్యతిరేక దినానికి అర్థం ఉంటుంది.కానీ ఇది కేవలం మే 31 నాడు మాత్రమే ఆలోచిస్తే సరిపోదు సంవత్సరమంతా దీనిపైన ఆలోచన జరగాలి, నిషేధం విధించాలి, ఉద్యమాలు తీవ్రంగా రావాలి. ప్రజలు కూడా ప్రతిఘటిస్తే తప్ప పొగాకు ఉత్పత్తుల అనారోగ్యము నుండి ప్రజలను కాపాడుకోలేము.
( ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు అ రసం రాష్ట్ర కమిటీ సభ్యులు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ )