ప్రజాస్వామ్య పరిరక్షణ, ప్రజలకు సుపరిపాలన అందించడంలో
ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలు కీలక పాత్ర పోషించాలి
.పాలకులకు తొత్తులుగా వ్యవహరిస్తే ప్రయోజనం ఉండవచ్చు కానీ శాశ్వతంగా బహిష్కరించబడతారు.
ప్రజలు ఉద్యోగుల హక్కుల కోసం పోరాడటమే సంఘాల లక్ష్యం కావాలి
----వడ్డేపల్లి మల్లేశం
ప్రజాస్వామ్య ప్రక్రియలో రాజ్యాంగ పలాలను ప్రజలకు అందించడంలో ప్రజా ప్రతినిధుల కంటే మిన్నగా వ్యవహరించవలసిన బాధ్యత ఉద్యోగులది. రాజకీయ ప్రయోజనాల కోసం ఆధిపత్యం అధికారం కోసం తమ వర్గ ప్రయోజనాలను కాపాడుకోవడానికి మాత్రమే రాజకీయ యంత్రాంగం పని చేస్తూ ఉంటుంది. ఆ క్రమంలో పరిపాలన ప్రజాసేవ ప్రజల కోసమే పని చేస్తున్నామని చెప్పుకునే మాటలు కేవలం కల్పితాలు మాత్రమే. అంతో ఇంతో కొద్దిమంది నిబద్ధత కలిగిన ప్రజాప్రతినిధుల చో రవ అంకిత భావం కలిగిన ఉద్యోగ ఉపాధ్యాయ అధికారుల వల్లనే ఈ మాత్రమైనా పరిపాలన సాధ్యమవుతున్నది. అప్పుడప్పుడు ఉద్యోగులకు సంబంధించినటువంటి సమస్యలు తలెత్తినప్పుడు ప్రజలు ప్రతిఘటించి అధికారులను హింసించి దాడి చేసిన సందర్భాలు లేకపోలేదు. ఆ కారణంగా ఉద్యోగుల పైన కేసులు పెట్టి బనాయించి ఇబ్బందులకు గురి చేసిన సందర్భాలు అనేకం.
ప్రజాస్వామ్యబద్ధంగా రావలసినటువంటి ప్రతిఫలాలను ఉద్యోగులకు అందకుండా అడ్డుకునే అధికారుల వలన కూడా ఎంతోమంది ఉద్యోగులు ఇబ్బందులకు గురవుతున్నారు. ఇ న్ని పరిస్థితులను తట్టుకోవడానికి ఉద్యోగులకు ప్రత్యేక సంఘాలు ఏర్పాటు చేయడం ఆంగ్లేయుల కాలంలోనే మనదేశంలో ఆరంభమైనది . సంఘాలు పెట్టుకునే హక్కును సాధించుకున్న ఘనత ఆనాటి నుండి నేటి వరకు కొనసాగుతుంటే గమ్మత్ ఏమిటంటే తెలంగాణ రాష్ట్రంలో 2019లో ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె తర్వాత ఉద్యోగ సంఘాలను రద్దు చేసిన ఘనత టిఆర్ఎస్ ప్రభుత్వానికి దక్కుతుంది .
సమ్మె హక్కు ఎంత ఉదాత్తమమైనదో సంగం పెట్టుకునే హక్కు కూడా రాజ్యాంగబద్ధమైనది దీనిని కాలరాచే అధికారం ఎవరికి లేదు. అప్పుడప్పుడు ప్రభుత్వాలు ఉద్యోగ సంఘాల పైన నిర్బంధాన్ని అమలు చేసే ప్రయత్నం చేస్తాయి గతంలో ఉద్యమ భావజాలం కలిగిన సంఘాల పైన ఉక్కు పాదం మోపిన విషయం ముఖ్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మనందరికీ తెలిసినదే. ."హక్కులకై కల బడుతూనే బాధ్యతలకు నిలబడు" అనే పద్ధతిలో బాధ్యతాయుతంగా ఉన్న ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక సంఘాలు తమ సభ్యులకు పాలనలో ప్రభుత్వానికి సహకరిస్తూనే తమ ప్రతిపత్తిని కాపాడుకునే కోణంలో పని చేయవలసి ఉంటుందని ఉద్భోదించాలి. కొన్ని ఉనికి కోసం మొక్కుబడి సంఘాలుగా ప్రభుత్వాలతో మమేకమై ప్రభుత్వాలకు వంత పడే సంఘాలను ఇదే సందర్భంలో ప్రతిఘ టించవలసిన అవసరం కూడా ఉన్నది.
ఉద్యోగ సంఘాల పాత్ర
ఉద్యోగులు నిజాయితీగా సేవా తత్పరతతో పని చేసినప్పుడు ఉద్యోగ సంఘాలకు మంచి పేరు వస్తుంది .అవినీతి, అసమర్థత, రెడ్ టేపిజం , నిరంకుశత్వంతో ప్రజలను పీల్చిపి చేసే కోణంలో పనిచేసే కొన్ని డిపార్ట్మెంట్ల ఉద్యోగుల వలన అందరికీ చెడ్డపేరు రావడాన్నీ కూడా మనం గమనించవలసిన అవసరం ఉన్నది . ముఖ్యంగా విద్యుత్, రెవిన్యూ, పోలీస్, వంటి డిపార్ట్మెంటులో పనిచేసే అధికారులు కిందిస్థాయి ఉద్యోగి నుండి అవినీతికి పాల్పడినట్లు అనేక దాఖలాలు ఉన్నాయి. బిల్లులు మంజూరు చేయడానికి, కాంట్రాక్టులను వశపరచుకోవడానికి, పాసుబుక్కులు జారీ చేయడానికి, వ్యవసాయ భూముల పేరు మార్పిడి పట్టాలు, ఇతరత్రా విద్యుత్ కనెక్షన్లు విద్యుత్ రంగంలో మార్పులకు సంబంధించిన సందర్భంలో ప్రజలు రైతుల నుండి అనేక విమర్శలు ఎదుర్కొంటున్న ఉద్యోగుల వల్ల ఉద్యోగ సంఘాలకు కూడా చెడ్డ పేరు వస్తున్నది.
అప్పట్లో హైదరాబాదులో ఒక ఎమ్మార్వో పై రైతు కిరోసిన్ పో సి కాల్చి చంపిన ఘటన చాలా దురదృష్టం అదే సందర్భంలో వాంఛనీయం కూడా కాదు. ఆ పరిస్థితులు రాకుండా చూసుకోవాలి మరొక గెజిటెడ్ అధికారి చేసిన అవినీతి బాగోథా నికి భర్త ఉన్నత ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్న ఘటనను కూడా ఇటీవల మనం హైదరాబాదులో చూడవచ్చు. ఇలాంటి ఉద్యోగులకు సంబంధించినటువంటి అవినీతి బాగోతాలు కేవలం ఒక రాష్ట్రానికి మాత్రమే పరిమితం కాదు భారతదేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో విస్తృతంగా వ్యాపించిన అవినీతిని రెడ్ టేపిజాన్ని బాధ్యతారాహిత్యాన్ని తొలగించవలసిన బాధ్యత కూడా ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలదే.
-- సంఘాలు తమ సభ్యులకు క్రమశిక్షణ , నిబద్ధత, ప్రజల పట్ల సేవా తత్పరత, బాధ్యతను సక్రమంగా నిర్వర్తించడం పైన శిక్షణ ఇవ్వాలి. మనం వేతన రూపంలో తీసుకుంటున్న ప్రతి పైసా కూడా ప్రజలకష్టం అనే అవగాహన కలిగించడంతోపాటు ఆస్పృహ సోయి ప్రతి ఉద్యోగికి ఉండవలసిన అవసరం ఉన్నది.
--- ఉద్యోగ సంఘాలు ప్రభుత్వానికి పరిపాలనలో క్రమమైన పద్ధతిలో సూచనలు సలహాలు ఇవ్వడం ద్వారా ప్రభుత్వ పాలన గాడి తప్పకుండా చూడవచ్చు.
-- ముఖ్యంగా విద్యా వైద్యం ,సామాజిక న్యాయం, పేదరిక నిర్మూలన, ఉపాధి అవకాశాలు, గ్రామీణ ప్రాంత అభివృద్ధి వంటి అంశాలలో బుద్ధి జీవులు మేధావులు ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాల నాయకుల తో సమావేశాన్ని ఏర్పాటు చేసి ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు తగు సలహాలు తీసుకోవాలి .
---అవినీతికి పాల్పడినటువంటి ఉద్యోగుల పైన ఉద్యోగ సంఘాలు క్రమశిక్షణ చర్యలు తీసుకోవడంతోపాటు ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తూ ఉండాలి. ఒక గంట కార్యాలయానికి ముందు రావడం ఒక గంట వెనుక పోవడం ద్వారా ప్రజాసేవలో గడపడానికి అవకాశం ఉందని ప్రజల చెమట రూపంలో వస్తున్న సంపదను వేతన రూపంలో పొందుతున్నందుకు ఆమాత్రం కృతజ్ఞత ఉండాలనే భావన ఉద్యోగులకు సంఘాలు కల్పించాలి .
-- ఉద్యోగుల హక్కులకు సంబంధించిన విషయంలో ఉద్యోగ సంఘాలు రాజీ పడవలసిన అవసరం లేదు. కచ్చితంగా అవసరమైతే పోరాటాలను దశల వారి ఉద్యమాలను ప్రకటించడం ద్వారా బాధ్యతలతో పాటు హక్కులకై పోరాడవలసినదే. కానీ అక్కడక్కడ కొన్ని ఉద్యోగ సంఘాలు ఉద్యోగుల యొక్క ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టి వ్యక్తిగత ప్రయోజనాల కోసం రాజీ పడిన సందర్భాలు లేకపోలేదు అలాంటి నాయకత్వాన్ని వెంటనే తొలగించవలసిన బాధ్యత కూడా సంఘాలు సంఘంలోని సభ్యులు కార్యవర్గం పైన ఉన్నది.
--- ఒక పరిపాలనా కాలంలో అధికారుల నుండి క్రింది స్థాయి ఉద్యోగి వరకు అందరు కూడా నిబంధనల మేరకు రాజ్యాంగానికి లోబడి పని చేయాలి. కానీ ఉన్నతాధికారుల పోలీసుల ఒత్తిడి ,ప్రభుత్వ పెద్దలకు తలవంచి పనిచేస్తే శిక్ష తప్పదని గతంలో భారత సిజెఐ ఎన్.వి రమణ గారు చేసిన హెచ్చరిక జ్ఞాపకం ఉంచుకుంటే మంచిది. ముఖ్యమంత్రి మెప్పు కోసమో మంత్రుల కోసమో కాదు ప్రజల కోసం మాత్రమే ఉద్యోగులు పనిచేయాలి అనే ప్రాథమిక సూత్రాన్ని ఉద్యోగులు, ఉద్యోగ సంఘాలు ఉపాధ్యాయ సంఘాలు ఆమోదించి అనుకరించాలి.
---ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక సంఘాలు సందర్భోచితంగా కొన్ని ప్రజాసేవ కార్యక్రమాలను నిర్వహించడం, స్వచ్ఛంద కార్యక్రమాలలో పాల్గొనడం, పేద విద్యార్థులు అనాధలకు సహకరించడం వంటి కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా మానవత్వాన్ని ప్రదర్శించుకోవాలి. అలాగే సంఘ సభ్యులలో ఇబ్బందులు ఉన్నటువంటి వాళ్లకోసం కూడా సంఘాలు పనిచేయాలి అవసరమైతే వాళ్ళ రక్షణ కోసం ప్రభుత్వంతో పోరాడి ప్రత్యేక ఏర్పాట్లు చేయించడం కూడా సంఘాల బాధ్యత. అయితే సంఘాలు కేవలం సంఘ సభ్యులకు మాత్రమే కాదు సమాజ హితం కోసం, పాలన గాడిదప్పకుండా చూడడానికి, ప్రజల సంక్షేమం అభివృద్ధికి బాసటగా నిలవవలసిన ఉత్కృష్టమైన బాధ్యత కూడా ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల పైన ఉన్నది అని మర్చిపోకూడదు. " ఉద్యోగులు కూడా ప్రజల్లో భాగమేననే" సాధారణ చింతన ఉన్ననాడు ఇదంతా సాధ్యమవుతుంది.
( వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు అభ్యుదయ రచయి తల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు హుస్నాబాద్ సిద్దిపేట జిల్లా తెలంగాణ )