పుస్తకాలు ఉండాల్సిన చేతుల్లో బీర్ బ్రాండీ సీసాలు

Aug 28, 2024 - 22:29
 0  5

మాదకద్రవ్యాలు,  మత్తు పదార్థాలు,  

సిగరెట్ బీడీలతో  చిందులేస్తున్న యువత.

స్వార్థానికి ఎగబడి  సామాజిక స్ఫూర్తికి తిలోదకాలిస్తున్న

విద్యావంతులు,  సంపన్నులు,పాలకులు కూడా..

మరి  మానవాభివృద్ధి సా కారం అయ్యేది ఎలా?*

---  వడ్డేపల్లి మల్లేషము

దేశంలో రాజనీతిజ్ఞత కొరవడి  క్షుద్ర,  శవ, అవకాశవాద రాజకీయాలు కొనసాగుతున్న ఈ తరుణంలో  ప్రజా ప్రయోజనాల కంటే వ్యక్తిగత స్వార్థమే ముఖ్యం కావడం  అధికారంలో కొనసాగిన నాడు వారి  అనుచర గణానికి లేదా పెట్టుబడి సంపన్నదారులకు  దోచిపెట్టడం ఇవ్వాలా రివాజుగా మారిపోయింది  .అంతేకాదు అనారోగ్యకరము, హానికరం, సమాజానికి  చీ డ పురుగు వంటివి  కొన్ని సామాజిక రుగ్మతలనీ మేధావులు బుద్ధి జీవులు  సామాజికవేత్తలు ముఖ్యంగా  వైద్య నిపుణులు హెచ్చరించినప్పుడు  పాలకులు ఆ వైపుగా  దృష్టి సారించకుండా ఉండి  తమ ఆధిపత్యాన్ని కొనసాగించడానికి ప్రయత్నం చేస్తారు. కానీ  ప్రమాదాలు జరిగి  పెద్ద మొత్తంలో  విపత్తులు ఏర్పడినప్పుడు  జాతీయ సమస్యగా మారినప్పుడు  దేశంలో సర్వత్ర ఆందోళనతో  ప్రజా వ్యతిరేక ఉద్యమాలు తీవ్ర రూపం దాల్చినప్పుడు మాత్రమే  పాలకులు కొంత ఆలోచన చేస్తారు కానీ అది తాత్కాలికమే.  సంఘటన వరకు మాత్రమే ఆలోచన చేయడం సరైనది కాదు మౌలికంగా దేశంలో నిరంతరము సందర్భం గా జరుగుతున్నటువంటి అనేక ప్రమాదాలు,  దుస్ సంఘటనలు విపత్తులకు కారణాలను  అన్వేషించకుండా  మొక్కుబడిగా వ్యవహరించే ఏ పాలనా వ్యవస్థ అయినా ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదు.  ఇంత స్పష్టమైనటువంటి ఆదేశాలు రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు, ప్రాథమిక విధులలో స్పష్టంగా రాయబడి ఉన్నప్పటికీ  అంతేకాదు  రాజ్యాంగ పీఠికలో స్పష్టం చేయబడినప్పటికీ  పేద వర్గాలు తమ ప్రయోజనాలను కోల్పోతుంటే సంపన్న పెట్టుబడిదారీ పారిశ్రామిక వర్గాలు మాత్రం  తమ లాభాపేక్షను  సా కారం చేసుకుంటున్న పరిస్థితులను మనం గమనించవచ్చు. ముఖ్యంగా  కరోనా కాలంలో  ఎక్కడ చూసినా ఆర్థిక అరాచకతము సంక్షోభము పెచ్చు మీరిన సందర్భంలో కూడా  కార్పొరేట్ శక్తుల యొక్క ఆదాయం రెట్టింపు కావడాన్ని  వీధి వ్యాపారులు వలస జీవులు చిరు వ్యాపారులు  దారిద్రరేఖ దిగువన ఉన్న వాళ్ళ యొక్క ఆదాయము సగానికి సగం పడిపోవడాన్నీ గమనిస్తే ఈ  మోసాన్ని, వివక్షతను , స్వార్థాన్ని, అవకాశవాద రాజకీయాలను మనం అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. 
     పాలకుల యొక్క   దైనందిన నేరాలు  అవకాశవాద రాజకీయాలలో ముఖ్యంగా యువత విద్యార్థులు  పేద వర్గాలను ఉపయోగించుకునే తీరును మనం గమనించాల్సిన అవసరం చాలా ఉంది.  ఆరోగ్యానికి హానికరమనీ తెలిసి కూడా మద్యాన్ని ప్రభుత్వం అనుమతించి చట్టబద్ధంగా అమలు చేయడం  సిగ్గుచేటు కాదా  ?మధ్యము మత్తు పదార్థాలు  క్లబ్బులు పబ్బులు ఈవెంట్లు, అశ్లీల ప్రదర్శనలు ధూమపానం  వంటి వాటిని సమాజానికి  ప్రభుత్వమే కానుకగా ఇస్తున్నటువంటి దుర్మార్గపు విధానాన్ని ఎండగట్టకపోతే పాలకులు మరింత రెచ్చిపోతారు.  దాని పర్యవసానమే పుస్తకాలపై శ్రద్ధతో అధ్యయనం చేసి  సామాజిక బాధ్యతను భుజానికి మోసి భవిష్యత్తు కోసం పాకులాడవలసిన విద్యార్థులు యువత చేతుల్లో  మద్యపానం  సిగరెట్లు బీడీలు  బ్రాండీ విస్కీ సీసాలు దర్శనమిస్తున్నాయంటే  ఇది పాలకులు చేసిన  ప్రజా ద్రోహం కాదా  ?
     సామాజిక స్ఫూర్తికి తిలోదకాలిస్తున్న వైనం:-

 పేద వర్గాలు శ్రామికులు, కార్మికులు, రైతులు చిరు వ్యాపారులు వలస కార్మికులు  నిత్యం పని మీద ధ్యాసతో ఉత్పత్తిలో భాగస్వాములవుతున్న కారణంగా
ఇతర సామాజిక కార్యక్రమాలలో పాల్గొనలేకపోవచ్చును కానీ వారు పోషిస్తున్న పాత్ర అనితర సాధ్యమైనది అని చెప్పక తప్పదు . ఇక ఉద్యోగులు వ్యాపారస్తులు  కొంత పరిధిలో స్వార్థ చింతనతో పనిచేస్తున్న వారే  ఇక రాజకీయ నాయకుల గురించి చెప్పనలవి కానీ దుర్మార్గపు అరాచకాలకు పాల్పడుతున్న తీరు వర్ణనాతీతం. భూ కబ్జాలు, ఆక్రమణలు , అక్రమ వ్యాపారాలు,అవినీతి, పేదవర్గాలపైన దాడులతో  సంపదను పోగు చేసుకోవడం వంటి అరాచకాలకు పాల్పడుతున్న వారే  వారికి సేవా దృక్పథం కానీ ప్రజల ప్రయోజనాలు కానీ అంతగా రుచించవు.  అలాంటి పరిస్థితులలో విద్యావంతులు, యువత ,మేధావులు, బుద్ధి జీవులు కనీసం సామాజిక స్ఫూర్తితో బాధ్యతను భుజానికి ఎత్తుకోవాల్సిన అవసరం ఉన్నది కానీ ఇక్కడ కూడా యువతను నిర్వీర్యం చేసే క్రమంలో ప్రభుత్వం యొక్క విభజన విధానాలు  సమాజానికి యువతకు ద్రోహం చేసే విధంగా ఉన్న తీరు అందరికీ తెలిసిందే. ప్రధానమంత్రి సొంత రాష్ట్రంలో మద్యపానం  గత 60 సంవత్సరాలకు ముందే నిషేధించబడినప్పటికీ  ఇటీవల రెండు మూడు రాష్ట్రాలు తమ  స్వయం నిర్ణయాధికారంతో ప్రజల ప్రయోజనాల రీత్యా మద్యపానం నిషేధించిన సందర్భంలో మిగతా రాష్ట్రాలలో ఎందుకు ప్రధానమంత్రి చొరవ తీసుకోవడం లేదు? దేశవ్యాప్తంగా ప్రజల ప్రయోజనాలను తాకట్టుపెట్టే దుర్మార్గపు ఆలోచనకు భిన్నంగా సేవా దృక్పథంతో ఆరోగ్యవంతమైన భారతాన్ని నిర్మించడం పాలకుల యొక్క బాధ్యత కాదా?  అలాంటి పరిస్థితిలో విద్యావంతులు యువత  నిర్మాణ సేవా రంగాలలో  తల దూర్చే బదులుగా స్వార్థ చింతనకు ఒడిగట్టి, మద్యం మత్తులో ధూమపానం ముసుగులో  విలువైన కాలాన్ని  కోల్పోతున్న విషయం మనందరికీ తెలుసు. ముఖ్యంగా తల్లిదండ్రులు తమ పిల్లలు ఏ రకంగా అప్రయోజకులవుతున్నారో  సంఘద్రోహులుగా ముద్ర పడుతున్నారో అర్థం చేసుకోవాల్సిన అవసరం చాలా ఉన్నది. బాధ్యత మరిచిన యువత విద్యావంతులు సంపన్న వర్గాలకు చెందిన వారికి సామాజిక స్పృహ లేని కారణంగా ప్రజల యొక్క ప్రయోజనాలను అంతగా పెద్దగా ఆశించరు అందువల్ల ఆ వర్గాల యొక్క పాత్ర కూడా సమాజ నిర్మాణంలో లేకపోవడం విచారకరం . అలాంటి స్థితిలో కొన్ని పేద వర్గాలు శ్రామిక శక్తులు  బుద్ధి జీవుల్లో కొందరు మానవ పౌరహక్కుల కార్యకర్తలు సామాజిక చింతన కలిగినటువంటి వాళ్లు మాత్రమే దేశ ప్రయోజనాలను కాపాడడం కోసం  బుద్ధి జీవులను  కలుపుకుపోయే ప్రయత్నం  జరుగుతున్నప్పటికీ  కల్పిస్తున్నటువంటి ఆటంకాలే  ఎదురైన సందర్భంలో  నిబద్ధతగా ప్రజల కోసం దేశ ప్రయోజనాల కోసం  పనిచేస్తారని గ్యారెంటీ ఇవ్వగలమా  ?చదువుకొని విద్యాభ్యాసంలో ముందుండి దేశ  సేవలో లీనమై  ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నడుచుకోవలసినటువంటి యువత విద్యార్థులు  మద్యం మత్తు ఊపులో  ఊరేగుతున్నప్పుడు , దానికి తగిన వాతావరణాన్ని ప్రోత్సాహాన్ని పాలకులు కల్పిస్తున్నప్పుడు  తల్లిదండ్రులు మాత్రం ఏ రకంగా అడ్డుకోగలరు అనేది నేడు సమాజం ఎదుర్కొంటున్న ప్రశ్న.  పిల్లలను తమ అదుపులో ఉంచుకోవడానికి అవకాశం లేని పరిస్థితులు తల్లిదండ్రుల ముందు ఉంచబడ్డప్పుడు,  ప్రభుత్వపరంగా అదుపు నియంత్రణ  నిషేధము చట్టబద్ధంగా లేకుండా ప్రభుత్వ ఆదాయ వనరు గానే  వీటిని భావించినప్పుడు , దొంగలు దొంగలు కలిసి ఊర్లను పంచుకున్న మాదిరిగా  పారిశ్రామిక, సంపన్న,  పాలకవర్గాలు  ప్రజల ప్రయోజనాలను పక్కనపెట్టి జలగల్లా పీల్చుతున్నప్పుడు  ఆరోగ్య భారతావని ఎలా అవతరిస్తుంది ? మద్యం ధూమపానం ఇతరత్రా  మత్తు పదార్థాలు డగ్స్ కారణంగా  క్యాన్సర్ హార్ట్ ఎటాక్ కిడ్నీస్ ఫెయిల్యూర్  తోపాటు అనేక భయంకరమైన రోగాలు  సోకుతాయని తెలిసి కూడా  అదుపు చేయకపోవడం లో ఉన్న రహస్యం ఏమిటి ?అదే మూసలో యువత పెడదారిన పోతూ తాత్కాలిక ప్రలోభాలకు తలడిల్లి  బానిసలుగా మారుతున్న తరుణంలో  చట్టాలు  ఉక్కు పాదంమెపడంతో పాటు,   యువతలో నిబద్ధతను పెంపొందించడం ,పాలకులు తమ బాధ్యతను గుర్తించేలాగా ప్రజా పోరాటాలు నిర్వహించడం,  అనర్థాలకు వంత పాడుతూ  కాంట్రాక్టులను నిర్వహిస్తూ క్లబ్బులు పబ్బులు ఈవెంట్లను  ప్రజల ముందుంచి వాళ్ళ ఆలోచన సరళిని దిగజార్చేటువంటి  ప్రైవేటు వ్యక్తులను  తరిమి కొట్టకుండా ఈ దేశంలో  సాంస్కృతిక విప్లవం సాధ్యం కాదు.  ఈ ఆలోచనను ప్రజలందరికీ పంచడం, విద్యావంతులు బుద్ధి జీవులలో  సేవా దృక్పథాన్ని పెంపొందించడం,  తాత్కాలిక ప్రయోజనాలకు పాకు లాడకుండా  సామాజిక స్పృహను దేశవ్యాప్తంగా విస్తృతం చేయడం,  పాలకులను సందర్బచితంగా ప్రశ్నించడం,  ఉద్యమ రూపంలో దేశవ్యాప్తంగా ఆచరణలోకి వచ్చే విధంగా ప్రతిఘటనను తీవ్రతరం చేయడం వంటి అనేక అంశాలు చోటు చేసుకున్నప్పుడు మాత్రమే  అవమాన, అనారోగ్య,  అచేత నత్వంతో,  అమానవీయ పరిస్థితుల్లో జీవిస్తున్నటువంటి ఈ వర్గాలకు మేలుకొలుపు  సాధ్యమవుతుంది.  పాలకులు కూడా ప్రజల ఆకాంక్షలను అమలు చేయడానికి కనీస జీవన ప్రమాణాలను  అందుకునే విధంగా  ఆదాయ వనరులను పెంపొందించి ఉపాధి మార్గాలను అన్వేషించినప్పుడు మాత్రమే మానవాభివృద్ధి సాధ్యమవుతుంది .మానవాభివృద్ధికి భిన్నమైనది ఏది కూడా  దేశంలో వాంఛనీయం కాదు.
(  ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు అభ్యుదయ రచయితల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ రాష్ట్రం) 

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333