ధ్వంసమైన విశ్వవిద్యాలయాలను గాడిలో పెట్టాలి
ప్రజా ఉద్యమాలకు నిలయమైన ఓయూ తో పాటు
అన్ని విశ్వవిద్యాలయాల కు భారీగా నిధులు మంజూరు చేయాలి
అధ్యయనం, పరిశీలన , అన్వేషణ, సామాజిక
సమస్యల పరిష్కారానికి వేదికలుగా మార్చాలి.
పటిష్ట పరిచే చర్యలకు రాష్ట్ర సర్కారు
యుద్ధప్రాతిపదికన శ్రీకారం చుట్టాలి .
---వడ్డేపల్లి మల్లేశం
ఉమ్మడి రాష్ట్రంలో ఉద్యమాలతో పాటు విద్యా పరిశోధన సమగ్ర అధ్యయనానికి బాటలు వేసిన తెలంగాణ విశ్వవిద్యాలయాలు గత పదేళ్లలో పాలకుల వికృత చేష్టల వల్ల అంధకారంలోకి నెట్టి వేయబడినవి . ప్రజా సంక్షేమం అభివృద్ధి నాణ్యమైన విద్య జాతీయస్థాయి అంతర్జాతీయ సమస్యల పరిష్కారానికి పరిశోధనా గారాలుగా నిలవాల్సినటువంటి విశ్వవిద్యాలయాలు గత పదేళ్ల తెలంగాణ ప్రభుత్వంలో నిధుల మంజూరు లేక ప్రభుత్వం పట్టించుకోక పోవడంతో ముఖ్యంగా పేద వర్గాలకు ఉన్నత విద్య అందని ద్రాక్షగా మారింది. అంతే కాదు టిఆర్ఎస్ ప్రభుత్వం ఐదు ప్రైవేటు రంగంలో విశ్వవిద్యాలయాలకు అనుమతి ఇవ్వడంతో పాటు మరో ఐదు విశ్వవిద్యాలయాలకు గవర్నర్ దగ్గర బిల్లు పెండింగ్లో గతంలో ఉన్న విషయం మనందరికీ తెలుసు. అంటే టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రాథమిక స్థాయి నుండి విశ్వవిద్యాలయ స్థాయి వరకు విద్యను ప్రైవేటుకు వదిలి తన సామాజిక బాధ్యత నుండి తప్పుకున్న దుర్మార్గ చర్యలకు ప్రతిఫలాన్ని ఇప్పుడు రాష్ట్రం అనుభవిస్తున్నది . వాటిని సరి చేయవలసిన బాధ్యత కొత్త ప్రభుత్వం పైన ఎంతైనా ఉన్నది .
ముఖ్యంగా తొలి మలిదశ తెలంగాణ ఉద్యమాలకు, ఇతర సామాజిక అంతరాలు అసమానతలు ప్రజా ఉద్యమాలకు ప్రధానంగా వేదికైనటువంటి ఉస్మానియా విశ్వవిద్యాలయం నేడు కనీస వనరులు లేక బోధన సిబ్బంది కరువై పట్టించుకునే వారు లేక వేలవేల పోతున్నది. అంతేకాదు అన్ని విశ్వవిద్యాలయాల పరిస్థితి కూడా అంతే స్థాయిలో ఉండడం విచారకరం విశ్వవిద్యాలయాలకు ఉపకులపతులను నియమించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య వైఖరి ఒక కారణమైతే అర్హత లేని వారు ప్రభుత్వం యొక్క మెప్పు కోసం ప్రయత్నించిన వారిని మాత్రమే నియమించినట్లు ఆరోపణలు ఉన్నాయి . గత పది ఏళ్లలో కేవలం రెండుసార్లు మాత్రమే నియమించినట్టు తెలుస్తుంటే అనేక సంవత్సరాల పాటు ఉపకులపతులు లేకుండా ఇన్చార్జిలతోనే గడిపిన సందర్భం విద్యారంగానికి తీరని నష్టం కలిగించింది. ఇటీవల మార్చ్ లో గడువు ముగియడంతో వివిధ హోదాలలో పనిచేస్తున్న అధికారులను ఇన్చార్జీలుగా నియమించడం జరిగినప్పటికీ విద్యా రంగంలో నిపుణులైన వాళ్లు ఉన్నప్పుడు మాత్రమే విశ్వవిద్యాలయం యొక్క బాగోగు లను పరిష్కరించడానికి, సమగ్రమైన విద్యను అందించడానికి, విశ్వవిద్యాలయాల అభివృద్ధికి కృషి చేయడానికి మార్గం సుగమవుతుంది. ఆ వైపుగా ప్రభుత్వం వెంటనే పూర్తిస్థాయి ఉపకులపతులను నియమించడానికి దృష్టి సారించాలి. ఒక అంచనా ప్రకారం గా రాష్ట్రంలో యూనివర్సిటీలలో దాదాపుగా 2828 పోస్టులు ఉండగా వాటిలో 1869 అధ్యాపకుల పోస్ట్లు ఇప్పటికీ ఖాళీగా ఉన్నట్లు అందులో ఓయూలో సింహ భాగం 845 ఖాళీగా ఉన్నట్లు తెలుస్తుంటే 80 శాతం ఖాళీలు ఉండగా కేవలం 20 శాతంతో విశ్వవిద్యాలయాలు నడుస్తున్నాయి అంటే అందులో చదువుకునే పేద మధ్యతరగతి విద్యార్థులకు ఏపాటి నాణ్యమైన విద్య అందుతుందో అర్థం చేసుకోవచ్చు. అంటే ప్రభుత్వాలు ఏవైనా పేద వర్గాలను కాకుండా ఉన్నత వర్గాల సంక్షేమం కోసం ప్రయత్నిస్తున్న సందర్భంలో ప్రైవేటు విశ్వవిద్యాలయాలను ప్రోత్సహించడం ,ప్రభుత్వ విశ్వవిద్యాలయాలకు నిధులను తగ్గించి నిర్వీర్యం చేయడం అనేది కుట్ర ప్రణాళికా ప్రకారంగా జరుగుతున్నదని అంచనా వేయవచ్చు. కానీ దానికి భిన్నంగా కాంగ్రెస్ ప్రభుత్వం సిబ్బంది నియామకంతో పాటు మౌలిక సౌకర్యాల కోసం సిబ్బంది వేతనాలు ఇతరత్రా అవసరాలకు భారీగా నిధులను కేటాయించడం ద్వారా ప్రైవేటు విశ్వవిద్యాలయాలను నిర్దాక్షిణ్యంగా మూసి వేయించి ప్రభుత్వ రంగంలోనే ఉన్నత విద్యను అందించడానికి ప్రభుత్వం సాహసోపేతమైన కృషి చేయవలసిన అవసరం ఎంతగానో ఉన్నది. అంతేకాకుండా గవర్నర్ దగ్గర పెండింగ్లో ఉన్న మరో ఐదు ప్రైవేటు విశ్వవిద్యాలయాల బిల్లును నిరాకరించి గత ప్రభుత్వం యొక్క దుష్ట ప్రయత్నాన్ని లోకానికి చాటి చెప్పవలసిన అవసరం ఎంతగానో ఉన్నది.
పరిశోధనలకు, మౌలిక వసతులు కల్పించాలన్న, నూతన పరికల్పనలకు జీవం పోయాలన్నా, సామాజిక ఆర్థిక రాజకీయ శాస్త్రీయ అంశాలలో నూతన ఆవిష్కరణలు సాధ్యం కావాలన్నా విశ్వవిద్యాలయ విద్య బలోపేతం కావలసిన అవసరం ఎంతగానో ఉన్నది .అప్పుడు మాత్రమే పాలకులు ఆ ఫలితాల ఆధారంగా సమాజానికి మేలు చేయగలుగుతారు. 2023 నవంబర్లో జరిగిన ఎన్నికల్లో గత టిఆర్ఎస్ ప్రభుత్వం యొక్క విద్యా వ్యతిరేక విధానాలకు నిరసనగా విద్యార్థులు, సంబందిత వర్గాలు, నిరుద్యోగులు, ప్రజలు ప్రజాస్వామికవాదులు పోరాటాలు స లిపి నిరుద్యోగ సమస్య పరిష్కరించుకోవడం కోసం ప్రభుత్వా మార్పు కోరిన క్రమంలో వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే రాష్ట్రంలో ఉన్నటువంటి 15 విశ్వవిద్యాలయాలను అభివృద్ధి పరచడానికి సమగ్ర అధ్యయనము సర్వే చేయించి అవసరాలను గుర్తించి బలోపేతం చేయడానికి తొలి ప్రాధాన్యత ఇవ్వాలి . భవిష్యత్ తరాలకు నాణ్యమైన విద్య అందించాలన్న విద్యా లక్ష్యం నెరవేరాలన్నా గత టిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన విధ్వంసాన్ని ప్రజలకు విప్పి చెబుతూనే ఆ సమస్యల పరిష్కారానికి తగు చర్యలు తీసుకోవడం ద్వారా విద్యారంగ అభివృద్ధికి కృషి చేసినట్లయితే నిరుద్యోగులు, ఉద్యోగులు యువత మేధావులు ప్రజాస్వామ్యవాదుల ఆకాంక్షలు నెరవేర్చిన ప్రభుత్వం కాగలదు.
( సామాజిక రాజకీయ విశ్లేషకుడు అభ్యుదయ రచయితల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ )