టిఫిన్స్ ఫాస్ట్ ఫుడ్ అంతా కల్తీ మయం .

విషతుల్యమవుతున్న నిత్యావసర వస్తువులు

May 11, 2024 - 21:58
Jun 7, 2024 - 17:14
 0  15
టిఫిన్స్ ఫాస్ట్ ఫుడ్ అంతా కల్తీ మయం .

 నూనెలు పండ్లు పాలు  నాసిరకమని ప్రజల ఆందోళన.

ప్రభుత్వ దృష్టికి తెచ్చిన చర్యలు లేవని  ప్రజల ఆవేదన.

ఆహార సలహా సంఘాలు, అధికారుల   నిఘా,  విస్తృత తనిఖీలు  తప్పనిసరి.

ప్రజల ఆరోగ్యాలు ప్రభుత్వానికి పట్టవా .?

--- వడ్డేపల్లి మల్లేశం 

ఒకవైపు నిత్యావసర  వస్తువులు ఆహార తినుబండారాల ధరలు భారీగా పెరగడంతో  హోటల్లు టిఫిన్ సెంటర్లు  తిను బండారాల కేంద్రాల వ్యాపారులు  కల్తీ వైపు మొగ్గుచూపుతున్నట్లు కొన్ని పరిశోధనలు  తెలియజేఇస్తున్నాయి.  నిత్యావసర వస్తువులు  వివిధ రకాల కల్తీ లతో  విషతుల్యం అవుతుంటే  నూనెలు పండ్లు  పాలు ఇతర  నిత్యవసరాలు అన్నీ కూడా  నాణ్యత లేకపోవడంతో అనివార్యంగా  అనారోగ్యం పాలు కాక తప్పడం లేదు.  ఇటీవల ముఖ్యంగా టిఫిన్ సెంటర్లు, హోటళ్లు  తిను బండారాల కేంద్రాల వైపు ప్రజలు ఎక్కువగా మొగ్గుచూపుతున్న కారణంగా  హోటల్ కల్చర్ మితిమీరిపోయి  అతి విశ్వాసంతో కొనుగోలు చేయడం  వినియోగించడం వల్ల కూడా  కల్తీ వ్యాపార కేంద్రాల సంఖ్య పెరుగుతూ ఉంటే అనారోగ్యం బారిన పడే ప్రజల సంఖ్య కూడా రోజురోజుకు మించి పోవడం ఆందోళన కలిగిస్తున్న విషయం . ఇది కేవలం కొన్ని పట్టణాలకు మాత్రమే పరిమితం కాకపోగా  గ్రామాలతో సహా అన్ని ప్రాంతాలకు కూడా విస్తరించడం,  ఇలాంటి తినుబండార కేంద్రాల పైన అనేక మంది ఆధారపడి బ్రతుకుతున్న నేపథ్యంలో  వీటి సంఖ్య గణనీయంగా పెరగడం,  ప్రజలు కూలీలు  గ్రామీణ ప్రాంత ప్రజలు పేదలు  ముఖ్యంగా అన్ని వర్గాల వాళ్లు కూడా వీటి బారిన పడక తప్పడం లేదు. 

  కారంపొడి లో ఇటుక పొడి  పసుపులో బియ్యం పిండి కలుపుతారని అనేక సందర్భాలలో మనం  విని ఉన్నాము.  అలాగే పాల పొడిలో నీళ్లు కలిపితే చిక్కటి పాలు,  అరటి కాడ గుజ్జుతో అల్లం వెల్లుల్లి పేస్టు, రసాయనాలు  కలిపితే నిగనిగలా డే పండ్లు,  నాణ్యతలేని నూనెతో బిర్యాని వంటకాలు  వేపుళ్ళు నూడుల్స్  ఇలా చెప్పుకుంటూ పోతే అనేక కల్తీలు మనకు ప్రతిరోజు దర్శనమిస్తున్న వాటిని మనసారా  స్వీకరిస్తూనే ఉన్నాo . ఆకర్షణీయమైన ప్యాకింగ్ తో కల్తీ వస్తువులను  ప్రజలకు అంటగడుతుంటే  నాగరికత ముసుగులో  ఈ సంస్కృతి మితిమీరిపోవడం  ప్రాణాల మీదికి కొనితెచ్చుకోవడమే అవుతున్నది. ఈ విషయాన్ని అందరం ఆలోచించాలి 

 నిరసన తెలిపి నిక్కచ్చిగా నిలదీసి  నాణ్యతను ప్రశ్నించినప్పుడు ఇలాంటి దుర్నీతికి ఆస్కారం ఉండకుండా పోతుంది . అదే సందర్భంలో  ప్రభుత్వపరంగా తనిఖీలు, నమూనాల సేకరణ  ఎప్పటికప్పుడు జరుగుతూ ఉండాలి.  ప్రతి తినుబండారం నాణ్యత ప్రమాణాలను పాటించే విధంగా నిబంధనలను అతిక్రమించిన సందర్భంలో  తనిఖీలు చేసి చర్యలు తీసుకుంటే  తిరిగి పునరావృతం అయ్యే అవకాశం ఉండదు. అనేక సందర్భాలలో ప్రజలు  ఫిర్యాదులు చేసినప్పటికీ ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని ఎంతోమంది వాపోతున్నారు.

      సంపన్నుల నుండి కూలీల వరకు వివిధ పనుల పైన బయటకు వెళ్లిన సందర్భంలో అవసరాన్ని బట్టి టీ టిఫిన్ భోజనము హోటల్లు ఫాస్టపుడు బేకరీలు రెస్టారెంట్లను  దర్శించి  పిల్లలు, కుటుంబ సభ్యుల కోరికల మేరకు  కూడా  రుచులను ఆరగించడం ఆనవాయితీగా మారిపోయింది.  నిబంధనలకు విరుద్ధంగా  అతిగా ఆకర్షించడానికి  తిను బండారాలలో కలుపుతున్న రంగులు, రసాయనిక పదార్థాల కారణంగా  క్యాన్సర్ గుండె జబ్బులు ఇతర ప్రాణాంతకమైనటువంటి రోగాల బారిన పడక తప్పడం లేదు.  నాసిరకం, చనిపోయిన కల్తీ మా0 సాన్ని విక్రయిస్తున్నారని కొన్నిచోట్ల ఆరోపణలు వస్తుంటే  భోజనాలు ఆర్డర్ చేసిన సందర్భంలో వంటకాలను  కల్తీ పదార్థాలతో చేసి తక్కువ ధరకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నట్లు కూడా  ప్రచారం జరగడం మనమందరం గమనించి ఉన్నాం.  ఇక రోడ్డు కిరువైపులా బజార్లలో దుమ్ము ధూళి ఇతర అనారోగ్య పరిస్థితుల లో  అమ్ముతున్నటువంటి ఆహార పదార్థాలు పండ్లు ఇతర తినుబండారాలు  కూడా అనేక రకాలుగా ప్రజలకు అనారోగ్యాన్ని తెచ్చిపెడుతున్నవి.  ప్లాస్టిక్  సంచుల వాడకం,  రసాయన పదార్థాలు, రంగులు,  అనేక రకాలుగా కల్తీ జరుగుతున్న ఈ మహమ్మారిని  ప్రజలు  ప్రభుత్వాలు ఉమ్మడిగా ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఎంతగానో ఉన్నది .

పరిష్కరించుకోలేమా? :-

ఫుడ్ ఇన్స్పెక్టర్ల వ్యవస్థ  మార్కెట్లో విక్రయించే నిత్యవసర వస్తువులను తరచూ తనిఖీలు చేపట్టడానికి ప్రత్యేకంగా ఉన్నప్పటికీ  మొక్కుబడిగా జరుగుతున్నట్టు తెలుస్తున్నది.  నమూనాలను సేకరించి లా బరేటరీకి పంపించి  నివేదికల ఆధారంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది  కానీ మొక్కుబడిగా తనిఖీలు నివేదికలు  నిర్వహించి చర్యలు తీసుకోవడం మాత్రం  గాలికి వదిలిపెట్టినట్లుగా అనేక దాఖలాలున్నవి. దాని కారణంగానే రోజురోజుకు ఈ కల్తీ సెంటర్ల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నది. 

 కల్తీ పేరుతో వ్యాపారుల మోసాల బారిన పడకుండా ప్రజలను  కాపాడడానికి చైతన్యం చేయడానికి అవగాహన కల్పించేందుకు మండల జిల్లా స్థాయిలలో  ఆహార సలహా సంఘాలను కొనసాగించవలసిన బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది.  గతంలో ఇలాంటి సలహా సంఘాలు ఉండేవని ప్రస్తుతం నామ మాత్రంగా మిగిలిపోవడంతో ఎలాంటి నిఘా ,  ప్రశ్నించే వాళ్ళు లేకపోవడంతో  కల్తీకి అంతే లేకుండా పోయింది అని ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి . ఆహార సలహా సంఘాలను ఏర్పాటు చేయడం ద్వారా వీటిని కొంతవరకు అడ్డుకో వచ్చు.

  ప్రజలు కూడా ఆహార పదార్థాలు తిరుబండారాలకు సంబంధించి  అవగాహన పెంపొందించుకొని కల్తీకి దూరంగా  ఉండాల్సిన అవసరం ఉన్నది. బహిష్కరించడం, నిగావేయడం,  ప్రశ్నించడం,  స్థానికంగా కొన్ని రకాల నిరసనలు ఉద్యమాలను లేవదీయడం ద్వారా కూడా ఇలాంటి అకృత్యాలకు అడ్డుకట్ట వేయవచ్చు . ఇక ముఖ్యంగా నిత్యవసర వస్తువుల ధరలు పెరగడం అనేది ప్రజలతోపాటు వ్యాపారస్తులకు కూడా పెద్ద విషయం అయింది దానిని అడ్డుకోవడానికి  కల్తీ నివారించడానికి నిత్యావసర  సరుకుల ధరలను క్రమంగా తగ్గించడంతోపాటు  నాణ్యతా ప్రమాణాల పైన సీరియస్ గా ప్రభుత్వం దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడవలసిన బాధ్యత ఉన్న ప్రభుత్వాలు  కల్తీ ఆహార పదార్థాలు మార్కెట్లో విచ్చలవిడిగా విక్రయించబడుతుంటే  చూస్తూ ఊరుకోవడం,

  పత్రికల్లో మీడియాలో  ప్రసారమైన కూడా చర్యలు తీసుకోకపోవడం అంటే  ప్రభుత్వ నిర్లక్ష్యం మాత్రమే కాదు అలాంటి తప్పుడు వ్యాపారస్తులతో ప్రభుత్వం అధికారులు కుమ్మక్కైనట్లే లెక్క.  ఎముకలతో నూనెలు తయారు చేస్తున్నట్లు , అలాగే కొన్ని రకాల  ఆయిల్స్ లో  వంట నూనెల ఫ్లేవర్స్ కలిపి  నూనెలుగా అమ్ముతున్నట్లు  నిజంగా కల్తీ నూనెలే అని అనేకమంది డాక్టర్లు  నిర్ధారణ చేసి  వీడియోల ద్వారా  జనాన్ని చైతన్యం చేస్తున్న సందర్భాలను కూడా మనం గమనించవచ్చు.  ఇంతటి ఆకృత్యాలను  దోపిడీని  ప్రజల అనారోగ్యాలకు కారణమవుతున్నటువంటి వ్యాపార సంస్థలు  చిరు వ్యాపారులు  కల్తీ చేస్తున్న వారు ఎవరైనా ఏ స్థాయిలో ఉన్న  వారి పైన కేసులు పెట్టి  జరిమానాలు విధించడంతోపాటు జైల్లోకి పంపినప్పుడు మాత్రమే  ఇలాంటి ఆగడాలకు అడ్డుకట్ట వేయవచ్చు.  ఈ విషయంలో  ప్రభుత్వానికి ఎంత బాధ్యత ఉందో ప్రజలకు కూడా  అంతే పట్టింపు ఉండాల్సినటువంటి అవసరం ఉంది. కళ్ళారా  చూస్తూ తమ ఆరోగ్యాన్ని తామే  కోల్పోయే  దుష్ట సంస్కృతికి ప్రజలు అలవాటు పడినంత కాలం  ఈ ఆగడాలు కొనసాగుతూనే ఉంటాయి.  ఈ అరాచకాలను నిగ్గదీసి అడిగినప్పుడే  కల్తీ అంతమవుతుంది,  ఆరోగ్యకరమైన తినుబండారాలు ఆహార పదార్థాలు  అన్నిచోట్ల దర్శనమిస్తాయి.  ఈ మార్పును సాధించేవరకు ఉద్యమిస్తూనే ఉండాలి, 

(ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు అభ్యుదయ రచయితల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ)

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333