జ్యోతిరావు పూలే అంబేద్కర్ ల స్ఫూర్తిని భావితరాలకు అందించడం మన కర్తవ్యం
హైదరాబాద్ 26 మే 2024 తెలంగాణవార్త రిపోర్టర్:- బహుజన స్ఫూర్తిదాత జ్యోతిరావు పూలే , ప్రపంచ దార్శనికుడు అంబేద్కర్ ల ఆశయాలను కొనసాగించడానికి భవిష్యత్తు తరాలకు వారి స్ఫూర్తిని అందించడానికి నేటి తరం నిరంతరం కృషి చేయాలని, అసమానతలు అంతరాలతో కుదేలైన వ్యవస్థను సంస్కరించడానికి వారి బోధనలు ఎంతో తోడ్పడతాయని ప్రముఖ అంబేద్కరిస్ట్, అభ్యుదయ రచయితల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు, కవి హుస్నాబాద్ కు చెందిన వడ్డేపల్లి మల్లేశం పిలుపునిచ్చారు .
26 మే 2024 ఆదివారం రోజున సికింద్రాబాద్ లోని ఓల్డ్ ఆల్వాల్ అంబేద్కర్ నగర్లో గల జ్యోతిరావు పూలే అంబేద్కర్ విగ్రహాల దగ్గర స్థానిక అంబేద్కర్ యువజన సంఘం, అణగారిన హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన 50వ జ్ఞానమాల కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొంటూ వడ్డేపల్లి మల్లేశం బహుజనులు ఆత్మస్థైర్యంతో తమ హక్కుల కోసం పోరాడ టానికి నేటి సిద్ధంగా ఉన్నారంటే దానికి వారిచ్చిన చైతన్యమే కారణమని ఆయన గుర్తు చేశారు. సంపద, చైతన్యానికి వారసులు కావాలంటే ముందుగా అక్షరాస్యత ప్రధానమని జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే పాఠశాలలు ఏర్పాటు చేసే స్వయంగా విద్యా బోధన కొనసాగించినారని ఆయన అన్నారు.
రిజర్వు బ్యాంకు ఏర్పడడానికి, మహిళలు, కార్మికులు, అణగారిన వర్గాల హక్కులను సాధించి పెట్టడంలో అంబేద్కర్ కృషి ఎనలేనిదని ఆయన విశ్వ మానవుడు, దార్శ నికుడు కనుకనే ఆయన జన్మదినం అయిన ఏప్రిల్ 14 ను ప్రపంచవ్యాప్తంగా జ్ఞాన దినోత్సవంగా జరుపుకుంటున్నారని ఈ సందర్భంగా ప్రస్తావించారు. ప్రతి వ్యక్తి చైతన్యముతో సామాజిక అధ్యయనము చరిత్రను పరిశీలించడం ద్వారా రాబోయే తరాలకు గత వారసత్వాన్ని చారిత్రక సాంస్కృతిక కృషిని అందించవలసిన బాధ్యత మనందరి పైన ఉందని, ఓటు హక్కును సాధించిపెట్టిన అంబేద్కర్ బహుజనుల యొక్క రాజ్యాధికారాన్ని ఆశించినాడని అందుకు మనం సిద్ధంగా ఉండి రాజ్యాధికారాన్ని సాధించుకోవడం ద్వారా ఆత్మస్థైర్యంతో జీవించాలని ఆయన కోరారు .
ఈ సమావేశంలో దళిత రత్న గంపల రాజయ్య అధ్యక్షత వహించగా అణగారిన వర్గాల హక్కుల పోరాట సమితి అంబేద్కర్ యువజన సంఘాలకు చెందినటువంటి సభ్యులు సిఎల్ యాదగిరి, టి యాదల య్య, ఆర్ బాలరాజు, రమేష్ , దాసు, డప్పు ఆనoద్ , మూర్తి తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు పాల్గొన్న వారందరూ జ్యోతిరావు పూలే అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలవేసి నివాళులర్పించడం జరిగింది.
వడ్డేపల్లి మల్లేశం అభ్యుదయ రచయితల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు, కవి, సామాజిక రాజకీయ విశ్లేషకుడు. (హుస్నాబాద్ జి.సిద్దిపేట)