జిల్లాలో వచ్చే ఐదు రోజులు 45 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి జిల్లా కలెక్టర్ బి. యం. సంతోష్.
జోగులాంబ గద్వాల 27 ఏప్రిల్ 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి:- జిల్లాలో వచ్చే ఐదు రోజులు తీవ్రమైన వడగాలులతో పాటు ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో 45 డిగ్రీలకు చేరుకునే ప్రమాదం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ బి. యం. సంతోష్ ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల లోపు అవసరమైతే తప్ప ఎండలో బయటకు వెళ్ళరాదు అన్నారు. అత్యవసరంగా వెళ్లాల్సి వస్తే తలకు టోపీలు, రుమాలు పెట్టుకోవాలని, గొడుగులు సైతం వినియోగించాలన్నారు. శరీరంలో నీటి శాతం తగ్గకుండా రోజుకు కనీసం ప్రతి ఒక్కరూ ఐదు లీటర్ల మంచినీటిని తాగాలని సూచించారు. వేసవిలో అత్యవసరం అయితే తప్ప ప్రయాణాలు చేయకూడదని, ఒకవేళ వెళ్లాల్సి వచ్చిన తెల్లవారుజామున బయలుదేరేలా ప్రణాళిక రూపొందించుకోవాలన్నారు. నలుపు, ముదురు రంగు, మందంగా ఉండే దుస్తులు కాకుండా తెలుపు, లేత రంగు, వదులుగా ఉండే దుస్తులు ధరించాలి అన్నారు. కాఫీలు, టీలను ఎక్కువ వేడి సమయంలో తాగరాదని, మజ్జిగ, కొబ్బరి బోండాలు తాగడం ఆరోగ్యానికి శ్రేయస్కరమని తెలిపారు. చిన్నారులు ఎండలో ఆడుకోవడానికి వెళ్లకుండా తల్లిదండ్రులు వారిని కనిపెట్టుకొని ఉండాలన్నారు. ఎవరైనా వడదెబ్బకు గురైతే వారి శరీరాన్ని చల్లటి తడిగుడ్డతో శరీర ఉష్ణోగ్రత 101 డిగ్రీల కంటే తక్కువ స్థాయికి వచ్చేవరకు తుడుస్తూ ఉండాలన్నారు. వడదెబ్బకు గురైన వారిని చికిత్స నిమిత్తం సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించాలని పేర్కొన్నారు. వీరికి చికిత్స అందించేందుకు అవసరమైన మందులు సిద్ధంగా ఉంచుకోవాలని, వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది అప్రమత్తంగా ఉండేలా అధికారులు తగు చర్యలు తీసుకోవాలన్నారు. ఉపాధి హామీ పనులకు వెళ్లే కూలీలకు నీడ కల్పించడమే కాక తాగునీరు, ప్రథమ చికిత్స కి ట్లు అందుబాటులో ఉండేలా సంబంధిత అధికారులు చొరవ తీసుకోవాలని అన్నారు. వృద్ధులు ఎండతో ఇబ్బంది పడకుండా నీడ పట్టునే ఉండేలా చూసుకోవాలని వివరించారు.