కూలిపోతున్న కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నమవుతున్న మానవ సంబంధాలు

మానవ ప్రవర్తన లోని వింత ధోరణి, స్వార్థం,
మీడియా ప్రలోభాలు మనిషిని ఒంటరిగా
వింత పశువుగా మార్చుతున్న ధోరణి విషాదకరం.
పతనo అంచుకు చేరుకున్న పరిస్థితిని నిబద్ధతతో చక్కదిద్దడం మనందరి బాధ్యత.
ప్రపంచంలోనే కుటుంబ వ్యవస్థ బలంగా ఉన్నటువంటి దేశమని భారత్కు గుర్తింపు ఉంటే అందుకు ప్రధాన కారణం కుటుంబ సభ్యులందరూ ఆర్థికంగా ఉత్పత్తిలో భాగస్వాములు కావడంతో పాటు సజీవ మానవ సంబంధాలను బలంగా కొనసాగించడం అని ఆర్థికవేత్తలు విశ్లేషకులు గతంలో అభిప్రాయపడేవాళ్ళు. అంతేకాదు కుటుంబ సభ్యుల మధ్యన సమన్వయం, సహకార ధోరణి , పరస్పర అవగాహన, ఏకాభిప్రాయంతో కుటుంబ ప్రయోజనం కోసం ఆరాటపడే తత్వం బలంగా ఉన్న గతంలో నిజంగా కుటుంబ సంబంధాలు అంతకుమించిన మానవ సంబంధాలు అద్భుతంగా విలసిల్లినవి అనడంలో అతిశయోక్తి లేదు. ,
సోషల్ మీడియా దుష్ప్రభావం , టీవీ ప్రసారాలు సినిమాలలోని వింత వికృత పోకడలు, స్వార్థ ప్రయోజనాలకు మనిషిని తాకట్టుపెట్టే పే డదోరని, సామాజిక బాధ్యత చింతన క్రమంగా కొరవడి వ్యక్తి ఆరాధన స్వప్రయోజనాలు స్వార్థ o డబ్బు చుట్టే మనిషి ప్రదక్షణలు చేసే దుస్థితి దాపు రించడం వలన కుటుంబ సంబంధాలతో పాటు మానవ సంబంధాలు కూడా అడుగంటి పోతున్నవి. క్రమంగా పతనం అంచుకు చేరుకుంటున్న ఈ దుస్థితి నుండి మానవ సమాజాన్ని భవిష్యత్తు తరాలను కాపాడుకోవాల్సిన అవసరం మన అందరి పైన ఉన్నది.
మానవ ప్రవర్తనలో వచ్చిన విష సంస్కృతిని పరిశీలించడం ద్వారా నిబద్ధతతో ఎవరికి వారిమి సానుకూల దృక్పదముతో కలిసి పోవడానికి ప్రయత్నించడం ద్వారా ప్రమాదము నుండి బయటపడే అవకాశం ఉంటుంది. మానవ సంబంధాలు ఎప్పుడైతే విచ్ఛిన్నమైపోతాయో దాని పరిణామం వ్యక్తి జీవితం, ఆరోగ్యం మానసిక పరిస్థితులు, హింస, అల్లర్లు , ఆధిపత్య ధోరణి, తెగింపు వంటి దుష్ఫలితాలు దాపురించే అవకాశం ఉంటుంది. మన వికృత ప్రవర్తనకు చెక్ పెట్టడానికి గల అవకాశాలను పునరాలోచన చేద్దాం.
--గమనించదగిన విషమ పరిస్థితులు:-
క్రమంగా ఆదాయ మార్గాలు పెరిగిన కారణ0గా ఎవరికి వారే అతి తెలివిని ప్రదర్శిస్తూ గర్వము అహంకారము ఆధిపత్య ధోరణితో డబ్బులు అధికంగా ఉన్నాయని ఎగిసిపడడం ప్రధాన కారణాలుగా చెప్పుకోవచ్చు . తల్లిదండ్రులు మందలించారని పిల్లలు, భర్త మంద లించాడని భార్య, భార్య అవమానపరిచిందని భర్త , కుటుంబ సభ్యుల మధ్యన లేనిపోని అనుమానాలు అపనమ్మకాలు క్రమంగా ఆత్మహత్యలు హత్యలు బలవన్ మరణాలకు దారితీస్తున్న విషయం తెలుసు. తప్పును నేరాన్ని ఒప్పుకోకపోవడం, వాస్తవాన్ని జీర్ణించుకోలేక అసహనం ప్రదర్శించడం ఇందుకు ప్రధాన కారణాలు . పిల్లలతో సహా వృద్దు ల వరకు ఎక్కువ సమయాన్ని సెల్ ఫోన్లు టీవీ ప్రసారాలు సీరియల్లో దృష్టి సారించడం ద్వారా కృత్రిమ జీవితానికి అలవాటు పడుతున్నారు. క్రికెటర్స్ స్టార్స్ కళాకారులు సినీ నటుల పైన మోజు పెంచుకోవడం, కుటుంబ జీవితం పట్ల ఆసక్తిని కనబరచకపోవడం, చిన్న విషయాలకు మనస్పర్ధలు పెంచుకొని ఒకరిపై ఒకరు ద్వేషం తో అలిగి కుటుంబ సభ్యులకు సొంత మనుషులే దూరం అవుతున్న గడ్డు పరిస్థితులను గమనించవచ్చు
.కొందరు నోటి దురుసుతనాన్ని, అత్యంత కోపాన్ని చూపి మనుషులను దూరం చేసుకోవడం ప్రధాన కారణాలు. పెద్దల సలహా కాకుండా ఎవరికి వారే సొంత నిర్ణయాలు తీసుకోవడంతో ఆర్థిక విషయాలు కూడా విచ్ఛిన్నమవుతున్న సందర్భాలను గమనించవచ్చు. కుటుంబంలోని పిల్లలు లేదా యువత సభ్యులు ఒక నిర్ణయం తీసుకోవడానికి సామూహిక అభిప్రాయాలు కలిగి ఉండకపోవడం ఇతర పెద్దలు వస్తే జీర్ణించుకోకపోవడం వంటి కారణాల వలన భార్యాభర్తలు తల్లిదండ్రులు తరచుగా గొడవలు పడడం కూడా కుటుంబ సభ్యుల్లో ముఖ్యంగా పెళ్లి కావలసిన పిల్లల్లో అభద్రతను పెంచి పోషిస్తున్నది నిజం కాదా !
మధ్యవర్తిత్వాన్ని అంగీకరించక ఎవరికి వారే అహాన్ని పెంచుకోవడం వలన మానవ సంబంధాలు మసక బారిపోవడంతో పాటు మొరటుతనం అదే స్థాయిలో సున్నితత్వం మనుషుల కొన్ని కటోర నిర్ణయాలకు కారణమవుతున్నది. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య మనస్పర్దలతో పాటు ఎక్కువ కుటుంబాలలో పురుషుల పైన స్త్రీల ఆదిపత్యం ఎక్కువగా ప్రదర్శించడం వలన కూడా చాలా కుటుంబాలలో కన్నీరు కళతలు తప్ప ఆనందం కనిపించడం లేదంటే అతిశయోక్తి కాదు . ప్రమాదానికి గురైన హత్యగావించబడిన ఆత్మహత్య చేసుకున్న సహజ మరణం పొందినా కూడా అయ్యో అనలేనటువంటి అద్వాన్న పరిస్థితులు ముఖ్యంగా నేటి యువతలో చోటు చేసుకున్నాయి . అన్యాయం జరుగుతున్న, నేరం రుజువైన, కళ్ళ ముందు హత్యలు ఘర్షణలు చెలరేగిన ఆపే ప్రయత్నం కానీ కనీసం మందలించే ఓర్పు బాధ్యత లేనటువంటి కాలమిది. నేరం జరుగుతున్న సందర్భంలో చూస్తూ బాధ్యతను విస్మరించి పట్టించుకోని వాళ్లు కూడా నేరస్తులే అంటే అర్థం చేసుకోవచ్చు.
కుటుంబ సభ్యులతో పాటు మానవ సమాజంలో సామూహిక దృక్పథానికి బదులుగా ఎవరికి వారే అన్నట్లుగా నిర్లిప్తంగా ఉండిపోవడం ఒంటరితనానికి దిగజారడం బాధ్యతాయుతంగా వ్యవహరించకపోవడం ఇక ఆదర్శం ప్రేమానురాగాలు ఆత్మీయత అనే వాటికి స్థానమే లేనటువంటి గడ్డు కాలం . ఈ దుస్థితి విస్తరిస్తున్న కొద్ది కుటుంబ వ్యవస్థనే కాదు మానవ సంబంధాలు కూడా మసక పారిపోయే ప్రమాదం ఉన్నది ఆ ప్రమాదం నుండి గట్టెక్కడానికి ఉన్న మార్గాలను కూడా ఆలోచన చేయాల్సిన బాధ్యత అందరిది .
ద్వేషం స్థానంలో ప్రేమను పెంచుకొని అహంకారం స్థానంలో ఆత్మీయతను అనువనువు నా నింపుకొని ఒంటరితనానికి బదులుగా సామూహిక దృక్పథాన్ని అలవర్చుకొని సామాజిక స్పృహ సామాజిక బాధ్యతను కర్తవ్యంగా భావించి సీరియళ్లు సినిమాలు సోషల్ మీడియాలో వస్తున్నటువంటి తప్పును దూరం పెట్టి తోటి మనిషిని సాటి మనిషిగా చూడగలిగే సంస్కారాన్ని అలవర్చుకోవడం ద్వారా మాత్రమే నేడు సమాజమంతా విస్తరిల్లిన దుష్ట సంస్కృతిని తుద ముట్టించడానికి ప్రేమానురాగాలతో బలమైన సంబంధాలను కొనసాగించడానికి అవకాశం ఉంటుంది. .ప్రతి మనిషి తన్ను తాను సంస్కరించుకోవడం, తన నేరాన్ని అంగీకరించడం, తన తప్పులను బాధ్యతాయుతంగా గుర్తించడం , కర్తవ్యాలను సామాజిక బాధ్యతగా కొనసాగించగలిగినప్పుడు మాత్రమే వ్యవస్థకు ద్రోహం తలపెడుతున్నటువంటి పెట్టుబడుదారులు భూస్వాములు పాలకులు, రాజకీయ వ్యవస్థ నేరగాళ్లు దోపిడీదార్ల ఆకృత్యాలకు అడ్డుకట్ట వేయడానికి అవకాశం ఉంటుంది .
పటిష్టమైన కుటుంబ వ్యవస్థ పకడ్బందీ మానవ సంబంధాలకు ఊపిరి పోస్తుంది సజీవ మానవ సంబంధాలు ప్రశ్నించి ప్రతిఘ టించి హక్కుల కోసం పోరాడే ఉద్యమ నేపథ్యాన్ని అందిస్తుందని గుర్తించాలి. ఆ వైపుగా మనిషి పయనాన్ని కొనసాగించడానికి దారి తప్పిన తన ప్రవర్తనను గత లోపాలను ఒక్కసారి పున: సమీక్ష చేసుకోవడం ఉత్తమ మానవ సంబంధాల పునరుద్ధరణకు చాలా తోడ్పడుతుంది. కారణాలు తెలుసు,... పరిణామాలు తెలుసు...? చేజేతులా అలాంటి పతనం వైపు పయనించకుండా సన్మార్గంలో పయనిస్తే కుటుంబం మానవ సంబంధాలు దేశం ప్రపంచం విశ్వ మానవ సౌబ్రాతృత్వానికి దారితీస్తుంది . అంబేద్కరీ జం , బుద్ధిజం, మార్క్సిజమ్, అన్ని మతాలు, మానవతావాదం, ప్రాపంచిక దృక్పథం ఏ వాదమైనా సాధించేది ఆశించేది సమాజంలో కోరేది మనసున్న మనుషుల ద్వారా వ్యవస్థను బలోపేతం చేయడమే.
--- వడ్డేపల్లి మల్లేశం
( ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు అభ్యుదయ రచయితల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ రాష్ట్రం)