రైతులలో ఆత్మవిశ్వాసం, ఆలోచన సరళి ,సామాజిక బాధ్యతను నింపాలి

సమాజానికి తిOడిపెట్టే రైతన్నకు మనమంతా రుణపడి ఉన్నాము
కానీ రాజకీయాలతో లబ్ధి పొందే అక్రమార్కులపై
ప్రజలు రైతులు పోరు చేయాల్సిందే.
జరిగిన జరుగుతున్న చరిత్రను ప్రజలకు విప్పి చెప్పడం చారిత్రక బాధ్యత.
దేశానికి తిండి పెట్టే రైతన్నల పైన ప్రజలు ప్రజాస్వామిక వాదులకు గౌరవము మర్యాద ,వారి కష్టం పట్ల సానుభూతి, శ్రామిక దృక్పథం పట్ల మానవత్వం ప్రదర్శిస్తే తప్పులేదు. కానీ నినాదాలు రాజకీయాలు పుకార్లు పరస్పర ఆరోపణలతోని రైతుల ద్వారా లబ్ధి పొందే రాజకీయ పార్టీలకు మాత్రం రైతుల గూర్చి మాట్లాడే అర్హత లేదు అని చెప్పక తప్పదు. రైతుల పట్ల ముసలి కన్నీరు కార్చుతూ సానుభూతి చూపడం అంటే రైతులను యాచకులుగా మార్చినట్లే కానీ ప్రభువులుగా చూడడం లేదు ఈ దేశ పాలకులు అని అర్థం చేసుకోవాలి.
సామాన్య ప్రజలతో పాటు రైతులకు కూడా ఈ దేశ రాజ్యాంగపరంగా రావలసినటువంటి హక్కులు ఫలాలను పొందే క్రమంలో ప్రభుత్వాలు సానుభూతిని వ్యక్తం చేసి తామేదో ఉద్దరిస్తున్నట్లుగా ప్రకటించడమే గిట్టని సమస్య. కేంద్ర ప్రభుత్వం గత 10ఏళ్లుగా రైతుల యొక్క ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని ప్రచారం చేసుకొని ఆ వైపుగా ఎలాంటి చర్యలు చేపట్టక పోగా రైతులకు వ్యతిరేక చట్టాలను చేసి 750 మంది రైతులను బలి తీసుకోవడంతోపాటు రైతు వ్యతిరేక ప్రభుత్వంగా ముద్రపడి సన్న బియ్యానికి మాత్రమే బోనస్ ఇస్తారా అంటూ తెలంగాణలో ముసలి కన్నీరు కార్చే ముందు నీ హామీలను ఎందుకు విస్మరించినావో సమాధానం చెప్పుకుంటేనే ప్రశ్నించే అర్హత ఉంటుంది .
తెలంగాణను కోటి ఎకరాల మాగానం చేస్తామని ప్రతిచోట తాను కుర్చీ వేసుకుని కూర్చుని ప్రాజెక్టులు నిర్మిస్తామని మాట ఇచ్చి ప్రకటించిన చోట కూర్చోలేదు దశాబ్దాలుగా అనేక ప్రాజెక్టులు పెండింగ్ లోనే ఉన్నాయి. ఇక అక్కడక్కడ చేసినటువంటి ప్రాజెక్టుల నిర్మాణంలో నిపుణుల ఆధ్వర్యంలో కాకుండా గత ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వంలోనే ప్రణాళిక రూపుదిద్దుకోవడం కారణంగా కాలేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డతో సహా అన్ని బ్యారేజీలు కూడా పతనావస్థకు చేరుకోవడం, అనేక కాలువలు తెగిపోవడం, నిర్మించిన వంతెనలు కూలిపోవడం, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లతో సహా నిర్మించిన వాటర్ ట్యాంకులు కూడా ఒరిగిపోయినటువంటి సందర్భాలను గమనిస్తే ప్రజలు రైతుల పట్ల ముసలి కన్నీరు కార్చే ప్రభుత్వాల నిజస్వరూపాన్ని అర్థం చేసుకోవచ్చు.
గత పాలనలో దేశవ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి ప్రజా ద్రోహాన్ని అసమానతలను పేద వర్గాలకు జరిగిన మోసాన్ని పెట్టుబడిదారులు భూస్వాములకు మాత్రమే అందిన లాభాలను ముఖ్యంగా శాసనసభ్యులు మంత్రులు, రాజకీయ నాయకుల అక్రమార్జన భూకబ్జాలను గమనిస్తే గతమంతా మోసాల మయమే. ఆ మోసాల నుండి బయటపడడానికి నూతన ప్రభుత్వాన్ని నిర్మించుకోవడానికి గత నవంబర్లో జరిగినటువంటి చారిత్రక ఎన్నికల సందర్భంగా ప్రజలు మేధావులు తీసుకున్న నిర్ణయం కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి కారణమైంది. ప్రస్తుత ప్రభుత్వం కూడా ప్రజలు మేధావులు, సామాజిక కార్యకర్తల యొక్క ఆకాంక్షలు ఆశయాలను కాపాడవలసిన బాధ్యతలో ఉన్నదని గుర్తిస్తే మంచిది.
రైతులను యంత్రాలుగా మార్చకూడదు:-
ఉద్యోగులు వ్యాపారులు మేధావులు రైతులు ఎవరైనా ముందుగా మానవులు ఆ తర్వాతనే నిపుణులు ఇతర వర్గాలకు చెందిన వారుగా నిలిచిపోతారు అలాగే రైతులను కూడా ప్రతి రాజకీయ పార్టీ పాలకులు టార్గెట్గా తీసుకొని వాళ్ల ద్వారా లబ్ధి పొందడానికి సానుభూతిని ప్రదర్శించి ఏమో ఉద్ధరించినట్లుగా వాళ్ళ పక్షాన మాట్లాడడంలో ఉన్నటువంటి కుట్ర కుతంత్రాలను ప్రజలు గమనించవలసిన అవసరం ఉంది అదే సందర్భంలో రైతులు కూడా ఎవరి వాస్తవం ఎంత ఎవరి పాలనలో జరుగుతున్న మోసం ఏమిటి అనే విషయాలను గమనించకుండా ఉంటే ఏ రాజకీయ పార్టీ అయినా పాలన ఒకటే అని నిర్ణయానికి రావడం సమంజసం కాదు అదే సందర్భంలో రైతులకు కూడా ఈ దేశానికి ప్రతి వర్గానికి తిండి పెట్టే బాధ్యతతో పాటు ఆత్మగౌరవంతో జీవించే అవకాశం ఉండాలని ప్రజల అవసరాలను తీర్చగలిగే పంటలను పండించడం ద్వారా కరువు కాటకాలు లేని అధిక ధరలకు అవకాశం లేని దిగుమతికి చోటు లేనటువంటి పంటల విధానాన్ని రూపొందించే క్రమంలో రైతులు రైతు సంఘాలు ముందు వరుసలో ఉండాలి .
ప్రభుత్వాలు ఎటు వీలైతే అటు మాట్లాడే పద్ధతే తప్ప ప్రజల యొక్క అవసరాలు పంటల ప్రణాళిక నిపుణుల ఆలోచన భూసార పరీక్షల నిర్వహణ ద్వారా భూమిలో పండే పంటలను నిర్ధారించి రైతులు రైతు సంఘాలతో చర్చించడం వంటి సామాజిక కోణంలో పాలకులు ఆలోచించకుండా రైతులకు మాత్రమే వదిలిపెడితే కెసిఆర్ ఆలోచన లాగా కోటి ఎకరాలకు నీళ్లు ఇస్తామని నమ్మ బలికితే ఇక వరి పంట వేసుకోవడానికి మాత్రమే రైతులు కూడా ఇష్టపడుతున్న తరుణంలో మిగతా ఆహార పంటల కొరత రాకమరేమవుతుంది.
ఖమ్మంలో రైతులు తమ పంటకు గిట్టుబాటు ధర కావాలని పోరాడినప్పుడు బేడీలు వేసిన చరిత్ర గత బిఆర్ఎస్ ప్రభుత్వానికి ఉంది సిరిసిల్లలో కూడా రైతులు గిట్టుబాటు ధర కావాలని ధాన్యం కొనుగోలు తక్షణమే చేయాలని పోరాడినందుకు అరెస్టు చేసినటువంటి సందర్భాన్ని మనం ఎలా మర్చిపోగలం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ప్రాంతంలో నిర్మిస్తున్న గౌరవెల్లి ప్రాజెక్టు ముంపు బాధితులకు పరిహారం సందర్భంగా జరిగిన పోరాటాన్ని అడ్డుకోవడంతోపాటు నేరస్తులుగా చిత్రీకరించి బేడీలు వేసి రైతులను న్యాయస్థానానికి తీసుకువచ్చిన ఘన చరిత్ర కలిగిన బారాస ప్రభుత్వం యొక్క అవినీతి పనులను ప్రస్తుత రైతాంగం ప్రజలు బుద్ధి జీవులు అర్థం చేసుకోకపోతే ఎలా అన్ని ప్రభుత్వాలు ఒక్కటే అని ఆలోచిస్తే కూడా ప్రజలకు న్యాయం జరగదు నిజాన్ని నిర్భయంగా మాట్లాడాలి తప్పులను విమర్శించాలి కొత్త ప్రభుత్వానికి దారి చూపాలి తమ డిమాండ్లను సాధించుకోవడానికి రైతాంగ ఉద్యమాలను కూడా ఉమ్మరం చేయాలి అప్పుడు మాత్రమే పాలకులు సానుభూతి కాకుండా వారి హక్కులను రాజ్యాంగబద్ధంగా గుర్తిస్తారు. నిరంతరం రైతులు రైతు సంఘాలతో చర్చలు జరుపుతారు వాళ్ళ అవసరాలను తీర్చడానికి సిద్ధపడతారు అలాంటి ప్రభుత్వాన్ని మనం కోరుకోవాలి .
సన్న వడ్ల పేరుతో రాజకీయ పార్టీల నాటకాలపర్వం:-
టిఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో కూడా సన్న వడ్లు పండించాలని 100 రూపాయల బోనస్ కూడా ఇస్తామని ఆశ చూపినారే తప్ప బోనస్ ఇచ్చిన సందర్భం లేదు కానీ నవంబర్ 2023 లో అధికారానికి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు క్వింటాల్కు 500 రూపాయలు బోనస్ ఇస్తామని ప్రకటించిన నేపథ్యంలో ముఖ్యంగా సన్నవ డ్ల సాగును ప్రోత్సహించడానికి 500 రూపాయలు బోనస్ ఇస్తామని ప్రభుత్వం ప్రారంభించినట్లుగా ప్రకటిస్తే ఆ విషయంలో బిజెపి టీఆర్ఎస్ యెనలేని రాజకీయం చేస్తూ ప్రభుత్వాన్ని ప్రశ్నించి గందర గోల పరుస్తున్న విషయాలను గత వారం రోజులుగా రాష్ట్రంలో మనం గమనించవచ్చు.
పేదలకు ఇచ్చే రేషన్, పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం సంక్షేమ హాస్టల్లో విద్యార్థులకు వినియోగదారులందరికీ సరిపడా సరఫరా చేయడానికి సన్న బియ్యాన్ని అందించడానికి కృషి చేస్తున్న తరుణంలో సన్న వడ్లను ప్రోత్సహించే క్రమములో 500 బోనస్ ప్రకటిస్తే దాన్ని రాజకీయం చేస్తూ దొడ్డు వడ్లకు గూడా వర్తింప చేయాలని పోరాడుతున్నారే కానీ గతంలో కేంద్రం కానీ టిఆర్ఎస్ ప్రభుత్వం కానీ చేసిన దాఖలా లేదు అనే సోయి లేకపోతే ఎలా? తమ ప్రభుత్వ హయాంలో బిజెపి కేంద్ర ప్రభుత్వం టిఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వం రైతులను మోసగించి చిత్రపదకు గురిచేసి అరెస్టు చేసి ఇప్పుడు ఏదో వాళ్ల పట్ల సానుభూతి చూపి ముసలి కన్నీరు కార్చితే రైతులు గుడ్డిగా నమ్ముతే సమాజం కూడా మోసపోయే ప్రమాదం ఉంది.
వాస్తవాలు తెలుసుకోవాలి వాస్తవాలనే ప్రచారం చేయాలి వక్రీకరించినటువంటి పార్టీలను వ్యక్తులను దోషులుగా నిలబెట్టాలి . గతంలో రాష్ట్రంలో పండించిన పంటను కొనుగోలు చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కయ్యం పెట్టుకున్న విషయం మనందరికీ తెలుసు. కేంద్ర బిజెపి ప్రభుత్వం కూడా సన్నవడ్ల సాగును పెంచాలని రైతులకు చెప్పినప్పటికీ ఆ వైపుగా చేసిన ప్రోత్సాహం లేదు కదా! ఇక టిఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చినటువంటి హామీలలో రుణమాఫీ చేయలేదు, పంట బీమా ఇవ్వలేదు, ఎరువులు ఉచితంగా ఇస్తామని దగా చేసిన సందర్భం తెలుసు అంతేకాదు తడిసిన మొలకెత్తిన ధాన్యాన్ని మద్దతు ధరకు కొనక పోగా వంట నష్టపరిహారం ఇస్తామని మాట ఇచ్చి కూడా చివరికి ఎగవేసిన సందర్భం మనకు తెలుసు. అలాంటి బీఆర్ఎస్ కు రుణమాఫీకి ప్రయత్నం చేస్తూ నష్టపరిహారానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్న తరుణంలో విమర్శించే అధికారం ఎక్కడిది . పేద రైతాంగాన్ని ఇబ్బందుల పాలు చేసి భూమిలేని వ్యవసాయ కార్మికులు పేదలకు ఉపాధి కల్పించక ప్రజాధనాన్ని కొలగొట్టి పెట్టుబడిదారులు భూస్వాములకు మాత్రమే రైతుబంధు పేరుతో కొట్టాది రూపాయలు అప్పనంగా కట్టబెట్టి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి కొందరు నాయకులు శాసనసభ్యులు మంత్రులు కూడా ప్రజా సంపదను కొల్లగొట్టిన సందర్భం మనం మరిచిపోతామా?
అధికారం పోయి ఐదు మాసాలు గడుస్తున్న సందర్భంలో ప్రజల కోసం ప్రజాస్వామ్య హక్కుల కోసం ఏర్పడిన ప్రభుత్వమని స్వయంగా ముఖ్య మంత్రి ప్రకటించిన నేపథ్యంలో ప్రజలను రైతులను మభ్య పెట్టేందుకు ఆయా పార్టీలకు ఉన్నటువంటి పత్రికలు టీవీ మీడియాలలో వ్యతిరేక ప్రచారం చేస్తూ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తున్నదని హామీలను విస్మరించిందని చేస్తున్న ప్రకటన పట్ల ప్రజాస్వామ్యవాదులు ప్రజలు నిక్కచ్చిగా ఆలోచించాలి. పదేళ్లపాటు ఈ దేశాన్ని రాష్ట్రాన్ని మోసగించినటువంటి ప్రభుత్వాలకు ప్రస్తుత ప్రభుత్వానికి తేడాను చూడాలని నూతన ఒరవడిలో ప్రజల పక్షాన పాలన కొనసాగాలని రాజ్యాంగబద్ధమైన హక్కులు పౌర హక్కులు మానవ హక్కులను ఈ రాష్ట్రంలో పరిరక్షించుకోవాలని ప్రజలు ప్రజాస్వామిక వాదులు బుద్ధి జీవులు ఆలోచిస్తున్న తరుణంలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడానికి ప్రభుత్వాన్ని సక్రమ మార్గంలో నడిపేలా చూడడానికి మనమందరం కూడా ప్రజాస్వామ్య ప్రభుత్వంలో భాగస్వామ్యం కావడం ద్వారా మాత్రమే జరుగుతున్న అవినీతి అక్రమాలు రాజకీయ పార్టీల దుష్ప్రచారానికి అడ్డుకట్ట వేయగలం . కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పట్ల గుడ్డిగా సానుభూతి అవసరం లేదు మొక్కుబడిగా ప్రేమ చూపాల్సిన అవసరం అంతకు లేదు.
విధానపరమైన నిర్ణయాలు ,అంశాల ప్రాతిపదికగా గతంలో జరిగిన పాలనకు భిన్నమైనటువంటి నూతన విలువలతో కూడిన పరిపాలన తీసుకురావాలని కోరుకునే తరుణంలో ఆ వైపుగా ఆలోచించే బుద్ధి జీవులుగా మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వానికి వెన్నుదన్నుగా నిలవాల్సినటువంటి అవసరముంది. దారితప్పినప్పుడు, తడబాటు పడ్డప్పుడు, నిద్ర పోయినప్పుడు, నటించినప్పుడు ప్రస్తుత ప్రభుత్వానికి కూడా మనం సున్నితంగా హెచ్చరిక చేయాల్సిన అవసరం ఉంటుంది. అదే సందర్భంలో ప్రజలు రైతుల కోసం పనిచేయని బిజెపి బారాస పార్టీల యొక్క ప్రస్తుత విమర్శలను ఖండించకుండా ఉండలేము. ఆ రాజకీయ పార్టీలు ముందు సోయి తెచ్చుకొని తమ పార్టీని నిర్మాణం చేసుకోవడం పైన దృష్టి సారించాలి కానీ ప్రతి విషయంలో విమర్శకు దిగితే సందర్భం వచ్చినప్పుడు ప్రజలే బుద్ధి చెబుతారు. ఏ ప్రభుత్వానికైనా రాజకీయ పార్టీకైనా ఈ విజ్ఞత ఉంటే మంచిది.
---వడ్డేపల్లి మల్లేశం.
(ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు అభ్యుదయ రచయి తల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట (చౌటపల్లి) తెలంగాణ రాష్ట్రం)