ఆరో దశలో అదృష్టవంతులు ఎవరు..

May 22, 2024 - 21:06
 0  74
ఆరో దశలో అదృష్టవంతులు ఎవరు..

 ఇక్కడ పైచేయి సాధిస్తేనే ఇండియా కూటమికి ఛాన్స్.. 

దేశంలో సార్వత్రిక ఎన్నికల సమరం చివరి దశకు చేరుకుంది. మెజార్టీ నియోజకవర్గాల్లో పోలింగ్ ముగిసింది. మరో రెండు దశలు పూర్తైతే ఎన్నికల ప్రక్రియ ముగుస్తుంది. మొత్తం ఏడు దశల్లో ఎన్నికలు జరగాల్సి ఉండగా.. ఐదు విడతల పోలింగ్ ముగిసింది. ఆరో విడత పోలింగ్ ఈనెల 25వ తేదీన జరగనుంది. ఎనిమిది రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 58 లోక్‌సభ స్థానాలకు జరగనున్న ఎన్నికల సమరంలో 889 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. దేశ రాజధానిలో ఢిల్లీలోని మొత్తం ఏడు స్థానాలతో పాటు హర్యానాలోని 10 లోక్‌సభ స్థానాలకు ఆరో విడతలో పోలింగ్ జరగనుంది. ఈ 58 లోక్‌సభ నియోజకవర్గాల్లో గత ఎన్నికల్లో ఎక్కువ సీట్లను ఎన్డీయే కూటమి గెలచుకుంది. అధికారంలోకి రావాలని పట్టుదలతో ఉన్న ఇండియా కూటమి.. ఈ 58 స్థానాల్లో మెజార్టీ సీట్లు గెలుచుకుంటే అధికారానికి దగ్గరయ్యే ఛాన్స్ ఉంటుంది. గత ఎన్నికల్లో మెజార్టీ సీట్లు సాధించిన బీజేపీని ఓడించి ఇండియా కూటమి తన సత్తా చాటితే కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటుకు కావాల్సిన మెజార్టీ ఫిగర్‌కు ఇండియా కూటమి చేరుకునే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

కాంగ్రెస్‌కు జీరో..

ఆరో దశ ఎన్నికలు జరగనున్న 58 లోక్‌సభ స్థానాల్లో 2019లో కాంగ్రెస్ ఒక్కసీటు గెలుచుకోలేదు. ఈసారి అధికారంలోకి రావాలంటే ఇండియా కూటమి ఖాతా తెరవడమే కాకుండా బీజేపీ గతంలో గెలిచిన సీట్ల సంఖ్యను తగ్గించి.. మెజార్టీ సీట్లను సాధించుకోవల్సి ఉంది. ప్రధాని మోదీ హ్యాట్రిక్ కొట్టాలంటే మరోసారి ఈ 58 నియోజకవర్గాల్లో తన అధిపత్యాన్ని కొనసాగించాల్సి ఉంటుంది. మరోవైపు ప్రాంతీయ పార్టీలకు ఆరో దశ ఎన్నికలు అగ్నిపరీక్ష కానున్నాయి. ఈ నేపథ్యంలో ఆరో దశలో ఎవరు అధిపత్యం కనబరుస్తారనేది ఆసక్తికరంగా మారింది.

ఆరో దశలో.

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఆరవ దశలో 8 రాష్ట్రాలతో పాటు ఢిల్లీ, జమ్మూ కాశ్మీర్‌లో ఎన్నికలు జరగనున్నాయి. ఉత్తరప్రదేశ్‌లో 14, బీహార్‌లో 8, హర్యానాలో 10, ఢిల్లీలో 7, పశ్చిమ బెంగాల్‌లో 8, జార్ఖండ్‌లో 4, ఒడిశాలో 6, జమ్మూ కాశ్మీర్‌లో ఒక స్థానానికి పోలింగ్ జరగనుంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఈ 58 లోక్‌సభ స్థానాల్లో 40 స్థానాల్లో బీజేపీ విజయం సాధించింది. బీఎస్పీ 4, టీఎంసీ 3, బీజేడీ 4, జేడీయూ 3, ఎల్‌జేపీ ఒకటి, ఏజేఎస్‌యూ ఒకటి, నేషనల్ కాన్ఫరెన్స్ ఒక స్థానంలో విజయం సాధించాయి. ఎస్పీ కూడా ఒక్క సీటు గెలుచుకుంది. కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ, ఆర్జేడీ వంటి పార్టీలు తమ ఖాతాను తెరవలేకపోయాయి. హర్యానా, ఢిల్లీలో బీజేపీ క్లీన్ స్వీప్ చేసింది. ఈసారి ఢిల్లీ, హర్యానాలో బీజేపీకి సీట్లు తగ్గే అవకాశం ఉందనే చర్చ నడుస్తోంది. గతంలో సాధించిన 40 సీట్లను గెలుచుకునేందుకు బీజేపీ సైతం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఈక్రమంలో ఆరో దశలు ఎక్కువ సీట్లు ఎవరు గెలుస్తారనేది ఎన్నికల ఫలితాల వరకు వేచి చూడాల్సిందే..

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333