ఆత్మలు ఉన్నాయా?

ఆత్మలు ఉన్నాయా? ఇది చాలామందిని కలవరపరిచే ప్రశ్న. మెదడును తొలిచేస్తున్న ప్రశ్న.స్వాములు, బాబాలు, ఆధ్యాత్మికవేత్తలు ఆత్మలు ఉన్నాయంటున్నారు. వారు ఆత్మ, జీవాత్మ, పరమాత్మ అంటూ మనిషిలో జీవాత్మ ఉంటుందని అది పరమాత్మతో కలిస్తే మోక్షం సాధించవచ్చని కల్లబొల్లి, మాయ మాటలు చెబుతున్నారు ఆత్మ గురించి మత గ్రంథాలలో విస్తృతంగా రాయబడింది. కానీ సైన్స్ వాదులు సైన్సుపరంగా ఆత్మలు లేవని వాదిస్తున్నారు
"ఆత్మవత్ సర్వభూతాని" అంటే సకల ప్రాణుల యందు ఆత్మ ఉంటుంది అని అర్థం.
ఈ మాటను సమయం, సందర్భం వచ్చినప్పుడల్లా ఆధ్యాత్మికవాదులు, ప్రవచన కారులు, ధర్మబోధ చేసేవారు, స్వాములు, బాబాలు అమాయకులైన ప్రజల ముందు హితబోధ చేసినట్లుగా నటిస్తారు. హావ భావాలతో స్వామి వారు చెప్పేదంతా అబద్ధాలే. నోటికి వచ్చింది అలా గాలిలో విడిచి పెడుతుంటారు. వినేవాళ్లు వారి మాటలకు సాక్ష్యాలు రుజువులు అడగరు. కేవలం తలూపడమే వారి పని.గొర్రె దాటుడు కల ప్రజలు తల ఊపుతూ తన్మయత్వంలోమునిగిపోతారు.
ఇదే అదనుగా ఇంకా కొన్ని మాటలు కలిపి తామేదో సత్యాన్ని, ధర్మాన్ని బోధించినట్లుగా వినేవారికి ఏమీ తెలియనట్లుగా భావిస్తారు ప్రవచన కారులు. చాలామంది మనసు, ఆత్మ ఒకటే అని భావిస్తుంటారు. కానీ మనసు వేరు,ఆధ్యాత్మిక వాదులు చెప్పే ఆత్మ వేరు.
మనసు అంటే..
మనసు అంటే రసాయనిక చర్యల వలన ,మెదడు చేసే పని ఆలోచించడం. అట్టి ఆలోచన ప్రక్రియను , విశ్లేషించేది "మనసు" అని అంటున్నాం.
ఆత్మ అంటే...
ఆత్మ నశించదు. అది నీటిలో నానదు. అగ్నిలో దహింపదు. ఆత్మ శాశ్వతము.దేహం తాత్కాలికము. ఆత్మ ఏదో ఒక శరీరాన్ని అంటిపెట్టుకొని ఉంటుంది. శరీరం లేనిదే ఆత్మ ఉండదు.ఇది భగవద్గీతలో చెప్పిన సారాంశం.
సమాజంలో ఇప్పటికీ ఆత్మలు వివిధ రకాలుగా ఉంటాయని తీవ్రమైన కోరికలు నెరవేరకుండా మరణించిన మనిషి ఆత్మ, దయ్యంగా మారుతుందని ప్రాణం ఉన్నప్పుడు తీరని కోరికలు, ఆ సమయంలో తీర్చుకుంటుందని, పగతో, ద్వేషంతో మనుషులను పీడిస్తుందని, చంపుతుందని అనేక సినిమాలు సీరియల్స్ లో చూపిస్తున్నారు. కానీ ప్రతి మనిషి కోరికలతోనే చనిపోతారు. మరుక్షణములో చచ్చిపోయే మనిషికి కూడా బతకాలన్న కోరిక ఉంటుంది.కోరికలు ఎన్నటికీ తీరిపోవు.
ఇంత ఆధునికత సంతరించుకున్న ఈ కాలంలో కూడా ప్రజల్లో ఆత్మ దేవుడు దయ్యము
లాంటి అబద్ధాలు, భయాలు కలిగించడం దారుణమైన విషయం.
పునర్జన్మ,ఆత్మ సిద్ధాంతాలు
ఎలా ప్రారంభమైనవి.
ఆదిమానవుడు జంతువుల లాగానే వేటాడి ఆహార సేకరణ చేసేవాడు కాలక్రమంలో మనిషికున్న "ఆలోచనాశక్తి"వలన వలసలు ఆపివేసి ఒకేచోట కుదురుగా ఉండే పద్ధతి మొదలైంది. మరికొన్ని సంవత్సరాలకు భూమిలో పడిన విత్తనాలు మొలకెత్తి చెట్టుగా పెరగడం గమనించాడు. ఈ విధంగా విత్తనాలు చల్లి పంటలు పండించుకోవడం మొదలైంది. ఇలా మారడానికి కొన్ని వేల సంవత్సరాలు పట్టాయి.
ఇలా వ్యవసాయం చేస్తున్న దశలోనే మనిషి ఉన్నట్టుండి పడిపోవడం చూసి ఇక ఆ మనిషి లేవలేని స్థితిలో ఉండగా, అలాగే విడిచి పెట్టగా కొన్ని రోజులకు దుర్వాసన రావడం ప్రారంభించింది ఇది చావు అని గ్రహించిన మనిషి అట్టి శవాన్ని భూమిలో పాతిపెట్టడం జరిగింది. వారికి మూర్ఛ పోయాడో చనిపోయాడో తెలియని పరిస్థితి. అందుకే కొంత సేపు అలాగే పడి ఉంటే పాతి పెట్టడం జరిగేది.
ఇంటి పెద్ద మరణిస్తే మరణించిన తరువాత అతనిని మర్చిపోలేక, మరణించిన వారికి తాము తినే ఆహార పదార్థాలు నైవేద్యంగా పెట్టడం ప్రారంభించారు.
అతడు మరలా తన ఇంటిలోనే పుడతారని విశ్వసించేవారు. తమ కళ్ళముందే మనుషులు పుట్టడం మరణించడం జరుగుతుంది కావున మరణించిన వారు మరల జన్మిస్తారని భావించేవారు.
ఈవిధంగా" పునర్జన్మ"ఆత్మ" అనే సిద్ధాంతం ప్రారంభమైంది.
మన సాహిత్యంలో ఆత్మ అనే పదంతో ఎన్నో పదాలు ఉన్నవి "ఆత్మాశ్రయము, ఆత్మబంధువు ఆత్మీయులు,ఆత్మాభిమానం,ఆత్మవిశ్వాసం"ఆత్మ శాంతి, "ఆత్మహత్యా సదృశం" లాంటి పదాలు ఎన్నో కనిపిస్తాయి.
సమాజంలో ఇప్పటికీ ఆత్మలు వివిధ రకాలుగా ఉంటాయని తీవ్రమైన కోరికలు నెరవేరకుండా మరణించిన మనిషి ఆత్మ దయ్యం గా మారుతుందని ఇప్పటికీ నమ్ముతున్నారు.
మనిషి శరీరంలో ఆత్మ అనే పదార్థం విడిగా ఉంటుందని, అట్టి ఆత్మ ప్రస్తుత శరీరాన్ని విడిచి "మనం మాసిన బట్టలు విడిచి,కొత్త వస్త్రములు ధరించినట్లుగా, మరో శరీరంలో దూరుతుందని, బ్రతికినన్ని రోజులు చేసిన పాపాలకు అంటే తప్పులకు శిక్షలుగా,మరో జన్మలో కుక్క గానో,పంది గానో, ఇతర జంతువులు గానో పక్షులు క్రిమికీటకాలు గానో పుట్టి అలా 84లక్షలప్రాణులుగా
జన్మలెత్తి చివరికి మనిషిజన్మతీసుకుంటుందని
మత గ్రంథాలలో విస్తృతంగా వ్రాయబడింది.
మనిషి తన జీవితంలో పుణ్యం చేస్తే.మరల మనిషిగా పుడతాడని, అత్యధికంగా పుణ్యం చేస్తే స్వర్గం చేరుకుంటారని,పాపాలు చేస్తే నరకంలో అనేక శిక్షలు అనుభవించాల్సి ఉంటుందని,
ఏ తప్పుకు ఏ శిక్షలు అనుభవించాలో గరుడ పురాణంలో విపులంగా రాయబడింది. శిక్షలు అనుభవించిన తర్వాత క్రిమి కీటక జంతువులలో పుడతారని మతగ్రంథాలు బోధిస్తున్నాయి.
ఆత్మ అంటే ఏ విధంగా ఉంటుంది? ఎక్కడ ఉంటుంది? శరీరంలో ఏ భాగం లో ఉంటుంది? అని తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు ఎన్నో పరిశోధనలు చేశారు. ఎంత వెతికినను మానవ శరీరాన్ని, జంతువుల శరీరాన్ని కోసి చూశారు. అటువంటి పదార్థం ఏది వారికి కనబడలేదు. చివరికి ఆత్మ అబద్ధమని, అది కేవలం ఊహాపోహలతో మాత్రమే అనుకున్నారు కానీ నిజం కాదని, అది కేవలం మోసకారుల, దోపిడీదారుల కల్పితమని తేల్చి వేశారు.
దేవుని నమ్మే వారిలో,ఆధ్యాత్మిక వాదుల్లో "ఆత్మ"ఉందని ప్రగాఢ భావనలు ఉన్నాయి. "ఆత్మవత్ సర్వభూతాని" అనే మాట అట్టి భావన ప్రకారమే వచ్చింది. మనిషి చనిపోయిన తరువాత మూడు రోజుల వరకు ఆత్మ ఆకాశంలో తిరుగుతుందని, ఒక వాదం ఉంది. కాదు కాదు ఆత్మ పది రోజుల వరకు తిరుగుతుందని ఇంకొక వాదం కూడా ఉన్నది. అందుకే చనిపోయినవారికి వారి ఇష్టమున్న తినే పదార్థాలు పెట్టడం,వస్తువులు పెట్టడం వలన వారికి "ఆత్మ శాంతి" చేకూరుతుందని ప్రజల్లో బలమైన విశ్వాసం ఉంది. మరి కొందరి వాదన లో ఆత్మ కలకాలం ఉంటుందని,అది మనలను గమనిస్తూనే ఉంటుందని,మన ఇంట్లో పిల్లల రూపంలో పుడుతుందని,ఆత్మశాంతి కోసం నెల, నెలా "మాసికం"పేరుతో పిండాల రూపంలో పెట్టడం, సంవత్సరానికి ఒకసారి "సంవత్సరీకం"పేరుతో శ్రాద్ధకర్మలు నిర్వహించడం, చనిపోయిన వారి పేరుతో బ్రాహ్మణులకు, పురోహితులకు దానాలు చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఈ తతంగమంతా బ్రాహ్మణులు, పురోహితులు కల్పించిన కల్పనలు మరియు వారి పొట్టకూటి కోసం చేస్తున్న మోసపూరితమైన, స్వార్థపూరితమైన అర్థరహితమైన విధానమే కానీ మరోటి కాదని సైన్స్ శాస్త్రవేత్తల అభిప్రాయం.
మనిషితో సహా ఏ ప్రాణిలోనైనను ఆత్మ ఉండదు. ఇది శాస్త్రవేత్తలు తేల్చిన అభిప్రాయం. ప్రాచీన కాలంన ఊహలతో ఏర్పడిన "ఆత్మ"అనే భావన అది నేటి దోపిడీదారులకు, అవకాశవాదులకు వరంగా మారింది. దోపిడీకి సులభ మార్గం అయింది.
కాబట్టి ప్రజలు ఎవ్వరు కూడా తమలో ఆత్మ ఉంటుందని అది వేరే జన్మ ఎత్తుతుందని, పుణ్యం చేస్తే స్వర్గం పోతామని పాపం చేస్తే నరకం పోఆ ముతామని తర్వాత మనిషి జన్మ వస్తుందని ఇలా ఊహించి తాము ఊహలతో జీవించవద్దు.
మనిషి చనిపోయిన తర్వాత అంతిమ సంస్కారాలకు ఈ పిండ ప్రదానాలకు వెళ్ళకూడదు.దీనితో డబ్బు వ్యర్థమే కాకుండా
సమయం కూడా వ్యర్థమవుతుంది.
దోపిడీదారులకు ప్రోత్సహించినట్టు అవుతుంది. చనిపోయిన వారు కాకుల రూపంలోవచ్చి మీరు పెట్టిన పిండాలు మాత్రం తినరు.
ఆత్మ లేదు కాబట్టి.
ఆత్మ శాంతి అనేది ఉండదు.
అడియాల శంకర్,
అధ్యక్షులు,
తెలంగాణ హేతువాద సంఘం.