ఇప్పుడు మాట్లాడుకోవాల్సింది వాస్తవాలే !

Feb 22, 2024 - 15:46
Mar 11, 2024 - 00:53
 0  2
ఇప్పుడు మాట్లాడుకోవాల్సింది వాస్తవాలే !

అదుపుతప్పి నోరు జారితే  ఇండ్ల ముట్టడి, తరిమికొట్టుడే.

గతంలో దోపిడీ పాలకులకు  ప్రస్తుత ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు ఎక్కడిది?

వెసులుబాటు లేకుండా బెదిరిస్తున్నారంటే మీరు కటకటాల్లోకి వెళ్ళడం మరి ఖాయమైనట్లే.

హామీలు నెరవేర్చని మీరు నేరాన్ని అంగీకరించడమే తరువాయి కాదా  ?

 ప్రజా సంఘాలు, బుద్ధి జీవులు టిఆర్ఎస్కు వేస్తున్న ప్రశ్నలివి.

బాధ్యతలకు నిలబడినప్పుడే హక్కులకై ప్రశ్నించే అధికారం ఎవరికైనా ఉంటుంది.  ఈ రాజనీతిని కనీసం అర్థం చేసుకో ని  బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు  తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల అధికారానికి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని  బెదిరించడం అంటే ఎంత అవివేకమో మనం అర్థం చేసుకోవాలి . అదే సందర్భంలో పరిపాలన, పాలకుల ధర్మాలు, రాజనీతి, గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వం తొమ్మిదిన్నర సంవత్సరాల   పాటు చేసిన దోపిడీ, పాలన  విస్మరించిన హామీలు,  రాచరిక పోకడ  ,గడీల పాలన  మనం అర్థం చేసుకోవాల్సి ఉందిమ. అదే సందర్భంలో వాస్తవాలు మాట్లాడితేనే  నేరస్తులు ఎవరో, శిక్షార్హులెవరో, జైలుకు వెళ్ళవలసింది ఎవరో తెలిసిపోతుంది.  ఈ మాటలు సర్వత్రా వినిపిస్తున్న ఈ సందర్భంలో  కొంతమంది కాంగ్రెస్ నాయకులు, ప్రజా సంఘాల వాళ్ళు, ఉద్యమకారులు, మేధావులు  కూడా టిఆర్ఎస్ నాయకులను ప్రశ్నిస్తూ ఎండగడుతూ బజారుకీడుస్తూ నోటి దురుసుతనాన్ని  ఆదిపత్యాన్ని అహంకారాన్ని ఎక్కడికి అక్కడ ప్రశ్నిస్తున్నారు. ఇది నిజంగా జరగాల్సిన పని . ఇక ఆ తర్వాత  రకరకాల అవినీతి పనుల్లో వారి పాత్ర, నేరం శిక్ష  ఎంత తొందరగా రుజువైతే అంత ఈ వ్యవస్థకు మేలు జరుగుతుందనీ  ప్రజలందరి  నోట వింటున్న మాట.

అసెంబ్లీలో  ఆరు బయట మీ ఎగురుడేంది? :-

తొమ్మిదిన్నర సంవత్సరాల పాటు ఈ రాష్ట్రాన్ని  పాలించి, ప్రజలకు ద్రోహం చేసి ,భిన్న వర్గాలకు హాని తలపెట్టి, ప్రజా ప్రయోజనాన్ని ఆశించకుండా స్వప్రయోజనాలకు పాల్పడి కుటుంబ సభ్యులకు మాత్రమే ఉద్యోగాలు సంపాదించుకున్న మీరు తెలంగాణ రాష్ట్ర సాధకులు ఎలా అవుతారు ? మాట మాటకు తెలంగాణ సాధించిన మేము మా కళ్ళ ముందు ఈ రాష్ట్రాన్ని  కాపాడుకుంటాం! కష్టాల పాలు కానివ్వం! అని చెప్పడం అంటే ఈ రాష్ట్రం మీద మీ పెత్తందారితనం ఏంటి ? మీ కుటుంబంలో ఎంతమంది ఆత్మహత్య చేసుకున్నారు? ఎంతమంది పైన కేసులు నమోదైనవి?   ఒక్కసారి చెప్పగలరా అని ప్రజలు ప్రశ్నిస్తుంటే మీ దగ్గర సమాధానం లేదు..... ఇవన్నీ వాస్తవాలు కాదా?  దోపిడీ పాలనకు ప్రతిరూపంగా మిగిలిన మీరు ప్రస్తుత తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బెదిరించడం, లొంగదీసుకోవడం,  ఆరు మాసాల్లో కుప్పకూలిపోతుందని శాపనార్థాలు పెట్టడం, ఒకవైపు  రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి బాధ్యతలు చేతకాకపోతే  మాకు అప్పజెప్పండి అంటూ హరీష్ రావు ప్రగల్ బాలు పలకడం ఎంత విడ్డూరం! ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని ధిక్కరించడం అంటే అది  అది అహంకారానికి ప్రతిరూపం, అది ఒంటెద్దు పోకడకు, ఏకచత్రాధిపత్యానికి, నిరంకుశత్వానికి ఆనవాలు.  ఉమ్మడి రాష్ట్రంలో కానీ భారతదేశంలో ఎక్కడైనా  ఎన్నికైన ప్రభుత్వాన్ని ఆరు మాసాల్లో గద్దే ది0 చుతామని హెచ్చరించిన ప్రతిపక్ష పార్టీ ఎక్కడైనా ఉందా? ఇది ఒక వాస్తవం కాదా?  నిర్మాణాత్మక పాత్రలో ప్రజల అభిమానాన్ని చురగొని ఓటమిని అంగీకరించి ప్రజా తీర్పును గౌరవించి సుపరిపాలన అందించే క్రమంలో ప్రభుత్వానికి సహకరించడం చేదోడు వాదోడుగా నిలవడం అనేది విజ్ఞత గల ప్రతిపక్ష పార్టీ యొక్క కర్తవ్యం. ఇదే రాజనీతి  .కానీ బి ఆర్ ఎస్ పార్టీ గతంలో కొనసాగించిన ధమన నీతిని ప్రతిపక్ష స్థానంలో కూడా కొనసాగిస్తూ ఇచ్చిన హామీలను గాలికి వదిలి  తప్పుదారి పట్టించిన గత ప్రభుత్వ ప్రతినిధులుగా నేడు ప్రతిపక్ష స్థానంలో ప్రభుత్వాన్ని బెదిరించడం అంటే  తొందరగా శిక్ష వేయమని, నేరాన్ని రుజువు చేయమని, మమ్ములను కటకటాల్లోకి నెట్టు మని కోరుకోవడం కాబోలు!  ఆ తరుణం అసన్నమైనది కోట్లాది ప్రజాధనాన్ని కొల్లగొట్టిన మీకు శిక్ష తప్పదు. ప్రజలందరూ ఎదురుచూస్తున్నారు, ఆకాంక్షిస్తున్నారు, ఆ సమయం దగ్గరలోనే ఆసన్నమవుతుంది . ఇప్పటికైనా  అహంకారాన్ని వీడి  చట్టసభల నిబంధనలు  ప్రతిపక్ష బాధ్యతలు  ప్రజా ప్రయోజనాలను కాపాడే  కర్తవ్యాలకు మాత్రమే పరిమితమై  వినయ విధేయతలతో ఉంటేనే భవిష్యత్తు!!! లేకుంటే అంధకారమే!!! అంతే కాదు  ఈ అహంకారం ఇలాగే కొనసాగితే  ఆ కుటుంబాన్ని ముట్టడించడానికి వెనుకాడరు అని హెచ్చరికలు  జారీ అవుతున్న సందర్భంలో  నేరాన్ని అంగీకరించి నిర్మాణాత్మక పాత్ర పోషించడానికి  సిద్ధపడితే మంచిది.

ప్రజలకు ఇచ్చిన మాట తప్పిన మీకు   ప్రశ్నించే హక్కు ఎక్కడిది?

గుట్టలు ప్రకృతి విధ్వంసాన్ని కాపాడాలని  ఉమ్మడి రాష్ట్ర పాలనలో జరిగినటువంటి  ద్రోహాన్ని  అడ్డుకోవాలని పదేపదే చెప్పి నీ ప్రభుత్వంలోని మంత్రులకే ఆ అవకాశాన్ని కట్టబెట్టి  గుట్టలు  ప్రకృతి  గుల్ల బారినా ఏనాడు  ఆ వైపు కన్నెత్తి చూడని నీ మాటలు నీ హామీలు ఏమైనట్లూ .? టిఆర్ఎస్ అధికారంలోకి రాగానే దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని సగర్వంగా ప్రకటించి  ఆ పీఠాన్ని మీరే ఆక్రమించుకొని  దళిత వర్గానికి చేసిన ద్రోహానికి ఇప్పటికీ మీ దగ్గర సమాధానం లేకపోవడం సిగ్గుచేటు కాదా ? భూమిలేని దళిత కుటుంబాలకు మూడు ఎకరాల చొప్పున వ్యవసాయ భూమిని  పంపిణీ చేస్తామని మాట ఇచ్చి  మీ హామీని మీరే తుంగలో తొక్కి  నయవంచనకు పాల్పడిన మీకు నేటి ప్రభుత్వాన్ని ప్రశ్నించే అధికారం అందునా  అధికారానికి వచ్చిన కొద్ది రోజులకి ప్రశ్నించడం అంటే  ఎంత అవమానం? ఎంత బాధ్యతారాహిత్యం ? ఇంటికి ఒక ఉద్యోగాన్ని ఇస్తామని  నిరుద్యోగ భృతి  అందచేస్తామని మాట ఇచ్చి  మీ కుటుంబాలకు ఒక పదవి పోతే మరొక పదవితో భర్తీ చేసుకున్నారే కానీ యువతకు ఉద్యోగాలేవి? ఎంతోమంది నిరుద్యోగంతో  తల డిల్లి ఇక ఉద్యోగాలు రావేమో అని ఆందోళనతో ఆత్మహత్యలు చేసుకున్న స్కాలర్లు, మేధావులు, విద్యావంతులు మీ కండ్లకు కనిపించలేదా?  తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేరున పరీక్షలు నిర్వహించి పేపర్ లీకేజీలకు కారణమై  సుమారు 30 లక్షల నిరుద్యోగులతో ఆటలాడుకున్న మీ జీవిత గాధ  ఎవరికీ తెలియదు?  గత మూడు సంవత్సరాలకు పైగా విద్యార్థులకు ఇవ్వవలసిన స్కాలర్షిప్స్ రియంబర్స్మెంట్ విడుదల చేయకుండా  కోట్లాది రూపాయలను పెండింగ్లో ఉంచి విద్యార్థులకు చేసిన ద్రోహం తెలియనిదా?  సుమారు 6000 పాఠశాలలను విద్యార్థులు లేరనే సాకుతో మూయించి పేద ప్రజలకు ద్రోహం తలపెట్టి  విద్యను ప్రైవేటుపరం చేసి ప్రైవేటు ఫీజులకు  అడ్డు అదుపు లేకుండా చేసిన చరిత్ర మీది కాదా ? విద్యను ప్రభుత్వ రంగంలో కొనసాగించవలసిన బదులు ప్రైవేటులో 5 విశ్వవిద్యాలయాలను అనుమతించి  పేద విద్యార్థులకు విద్యను దూరం చేసిన మీ నైజం ఎవరికి తెలియదు ? ప్రాజెక్టులు నిర్మాణాల పేరుతో ప్రాధాన్యత ఇచ్చి  కోట్లాది రూపాయల కమిషన్ కోసం పాకులాడి  భూ కబ్జాలకు మీ అధికార యంత్రాంగానికి శాసనసభ్యులకు  అనుమతించి కోట్లాది రూపాయలకు గండి కొట్టిన  విషయాలు వాస్తవం కాదా? మెల్లమెల్లగా అన్ని విషయాలు బయటకు వస్తున్నాయి!  నేరం చేసిన వాళ్లకు శిక్ష పడాల్సిందే!  ప్రజా సంపదను కొల్లగొట్టిన వారికి కారాగారం  నివాస స్థానం కావాల్సిందే! . రైతుబంధు పేరుతో వందల ఎకరాలు ఉన్నటువంటి భూస్వాములకు పండించని  భూములకు  అప్పనంగా కట్టబెట్టి  సుమారు 30 వేల కోట్ల రూపాయల  లూటీ చేసింది మీరు కాదా ?కాలేశ్వరం ప్రాజెక్టు  చరిత్రాత్మకమని ప్రకటించి  నాణ్యత లేకుండా నిర్మించి ఒక వైపు పిల్లర్లు కూలిపోతుంటే  కనీస స్పందన కూడా లేకుండా రిపేరు చేసుకోవాలి! గతంలో కూలిపోలేదా! అని  బాధ్యతారహితంగా మాట్లాడుతున్న మీకు  తగిన సమయంలో శిక్ష వేయాల్సిందే!  ఆ సమయం కోసం ప్రజలందరూ ఎదురుచూస్తున్న మాట వాస్తవం కాదా?

ఇలా చెప్పుకుంటూ పోతే మీది అడుగడుగునా నయవంచన పాలనే! పాలాభిషేకాలతో ఒకవైపు పాదాభివందనాలతో మరొకవైపు మీ పరిపాలనలో  ప్రజల ఆత్మగౌరవం అధికారుల గౌరవం అడుగంటిపోయినది. అధికారులు పోలీసు అధికారులను కూడా అవినీతిపరులుగా మార్చిన మీ గత పాలనలోని అనుభవాలు ఒక్కొక్కటి బయటపడుతుంటే అధికారుల అవినీతి బాగోతం చరిత్రగా మిగిలిపోతున్నది . ఈ దౌర్భాగ్య చరిత్రకు సారథులు మీరు కాదా?  తప్పు చేసినవాళ్లు సిగ్గుతో తలవంచుకొని నేరాన్ని అంగీకరించి ప్రజల ముందు మోకరిల్ల వలసిందే.  ఇంత నే ర చరిత్ర పెట్టుకొని  కప్పిపుచ్చుకోవడానికి  దూకుడు మాటలు మాట్లాడుతుంటే  మీ  ద్రోహబుద్ధి,  విద్రోహ పాలన,  ప్రజలకు చేసిన మోసాన్ని గుర్తించని వారు ఎవరు ? ప్రజలు తరిమి కొట్టక ముందే విజ్ఞతతో బాధ్యతాయుతంగా వ్యవహరించడమే  బి ఆర్ ఎస్ ముందున్న తక్షణ కర్తవ్యం . ఇది కేవలం ఒక్క పార్టీకి సంబంధించిన వ్యవహారమే కాదు....... రాజనీతికి సంబంధించిన అంశం నేరస్తుడు ఎవరైనా శిక్ష పడాల్సిందే  అలాంటి ద్రోహం భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ కొనసాగించినా  ప్రజలు ప్రశ్నిస్తారు. ప్రజలకు పార్టీ ముఖ్యం కాదు, పాలనముఖ్యం,  ప్రజా ప్రయోజనాలు, ప్రజాస్వామిక విలువలు, మానవ హక్కులు  మరీ ముఖ్యం.  వీటిని ఎవరూ ఖాతరు చేయకపోయినా ఆ పరిపాలన నిలవదు! నిలబడదు!  తస్మాత్ జాగ్రత్త !

----  వడ్డేపల్లి మల్లేశం

(ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు, అభ్యుదయ రచయితల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు హుస్నాబాద్ (చౌటపల్లి) జిల్లా సిద్దిపేట తెలంగాణ రాష్ట్రం)

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333