ప్రగతికి ఆయుధమైన ప్రశ్న మూగబోరాదు
అన్వేషణలు, ఆవిష్కరణలు, అభివృద్ధి పలా లు ప్రజలకు అందాలంటే ప్రశ్నలే కీలకం.* తెలిసిన దాని నుండి తెలియని దానికి రహదారి ప్రశ్న.*
************
-- వడ్డేపల్లి మల్లేశం 90142206412
--17....02....2025******
"ప్రశ్నలోని పదును ప్రశ్నింప నేర్పును
ప్రశ్నతోనే ప్రగతి సాధ్యమగును
ప్రశ్నలేని నాడు బానిసత్వం పెరుగు
ప్రశ్న చైతన్యపు ఆనవాలు."
ప్రశ్న సమాధానం అనే పరంపర కేవలం విద్యార్ధులకు సంబంధించిన పాఠ్యాంశాల లోని మొక్కుబడి సోపానంగా భావిస్తే అంతకుమించిన అమాయకత్వం మరొకటి ఉండదు. ప్రశ్నలోని పదును, ప్రశ్నించే సందర్భము, ప్రశ్న ద్వారా రాబట్టగలిగే సమాధానం, ప్రశ్నించే చైతన్యాన్ని బట్టి లభించే ప్రయోజనం అంచనా వేయడానికి ఆస్కారం ఉంటుంది. ముఖ్యంగా రాజకీయ రణక్షేత్రంలో, ప్రజా సమస్యల పరిష్కారంలో, ప్రజా వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్న పాలకులను ప్రశ్నించే సందర్భంలో ప్రతిపక్షాల చేతిలో ప్రధాన ఆయుధమై నిలుస్తుంది. అనేక రకాల విమర్శలకు గురైన, ప్రభుత్వ టార్గెట్ కు బలైన, అవమానాలు బహిష్కరణలకు దారి తీసిన అది పోషించే పాత్ర కీలకమైనది. బుద్ధిపూర్వకంగా దారి తప్పించడం, తప్పులను దాచిపెట్టడం, వర్గ ప్రయోజనాలను కొంతమందికి దోచిపెట్టడం, ప్రజా ప్రయోజనాలను విస్మరించడం వంటి అంశాలు ప్రశ్న పైన దాడి చేస్తూ ఉంటాయి. ఆ దాడికి గనుక భయపడి ప్రశ్నించే వాళ్ళు ప్రశ్నను అదుపులో ఉంచుకోకపోతే తాడే పామ్ అయినట్లుగా అనవసరపు అనుమానాలకు గురికాక తప్పదు. అదే సందర్భంలో చిన్న పామును అయినా పెద్ద కర్రతో కొట్టాలి అన్న సామెత మాదిరిగా ప్రశ్నలోని పటు త్వాన్ని మరింత పెంచుకోవడం ద్వారా ఎదుటి పక్షం తలవంచుకునేలా తప్పును అంగీకరించేలా చివరికి రాజీపడి ప్రజల పక్షాన దిగివచ్చేలా చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. విద్యా విభాగంలో విద్యార్థి కేంద్రమైనట్లు రాజకీయాలలో ప్రజలు మూల స్తంభాలు.. ప్రజలకు అతీతమైనటువంటి ప్రయోజనాలు ఏమీ ఉండవు కనుక పాలక ప్రతిపక్షాలు ప్రజాసంఘాలు మేధావులు బుద్ధి జీవులు అధికార యంత్రాంగం కూడా ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టకుండా కాపాడడానికి కృషి చేసే క్రమంలో ప్రశ్న నిరంతరం ఆయుధమై పనిచేస్తుంది అనడంలో సందేహం లేదు.
ప్రగతికి ఆయుధమైన ప్రశ్న మూగబోరాదు
************
ప్రశ్నించే వాళ్ళ సంఖ్య క్రమక్రమంగా తగ్గుతూ ఉంటే ప్రశ్నలోని పట్టు కూడా నిస్సారమై మొక్కుబడిగా మిగిలిపోతూ ఉంటే నిర్బంధం అణచివేత నిర్లక్ష్యం నిరంకుశత్వం చేతిలో ప్రజలు ప్రజాస్వామ్యవాదులు బలికావలసి వచ్చినప్పుడు బలమైనటువంటి ప్రశ్న ఈ అపసవ్యాలను పరిరక్షించడానికి ఎంతో తోడ్పడుతుంది. అది న్యాయస్థానంలో, చట్టసభలో, ప్రజాక్షేత్రంలో, ప్రజా ప్రతినిధులు అధికార యంత్రాంగం కర్తవ్య నిర్వహణలో తగిన, మార్పులు తీసుకురావడానికి ఎంతగానో తోడ్పడుతుంది. తరగతి గదిలో విద్యార్థులు వేసే ప్రశ్నలు, చట్టసభల్లో సభ్యులు సంధించే విమర్శనాస్త్రాలు, ప్రజా క్షేత్రంలో ప్రశ్నలు సమాధానాల రూపంలో జరిగే చర్చలు అంతర్జాతీయ స్థాయిలో ప్రపంచ మానవాళి కోసం చేస్తున్న తీర్మానాలు ఆధిపత్యం కోసం అక్రమంగా యుద్దాలకు పాల్పడుతున్నటువంటి కొన్ని దేశాల దుందుడుకు చర్యలు కూడా సందర్భోచి తంగా జరుగుతున్నటువంటి ఆలోచన సరళి మన ఊహలను నిజం చేయడానికి, సందేహాలను నివృత్తి చేయడానికి, సమైక్యతకు దారి తీయడానికి, సమన్వయాన్ని పెంచి పోషించడానికి బాటలు వేస్తున్న తరుణంలో ప్రశ్న మూగబోరాదు. ప్రశ్న తన చైతన్యాన్ని నిట్ట నిలువునా సమాజం ముందు నిలిపి విభిన్న వర్గాల సందేహాలకు సమాధానం ఇవ్వవలసిందే. ప్రజల సందేహాలు, శాస్త్రవేత్తల సాధన, వైద్య విద్య ఇత్యాది రంగాలలో ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం
నిరంతరం కొనసాగుతున్న ఆలోచన వల్లనే కదా అనేక ప్రయోగాలు ఫలించినది, ఆవిష్కరణలు అంది వచ్చినది,. సిద్ధాంతాలు ప్రతిపాదించబడినది, ఫలితాలు ప్రజలు వినియోగించుకుంటున్నది.
అన్యాయాన్ని ఎదిరించేవాళ్ళే ఆరాధ్యులు:-
*************
ప్రశ్న తరగతి గది కి, చట్టసభ లకు మాత్రమే పరిమితం కారాదు. ప్రతివాళ్ళ జీవితంలో అంతరభాగం కావాలి.కారు చీకటిలో, కఠిన ఇబ్బందుల మధ్యన, అనారోగ్యం మానసిక ఆర్థిక సామాజిక సంక్షోభాల ముసుగులో ఈ వ్యవస్థ కొట్టుమిట్టాడుతూ ఉంటే మరింత మెరుగైన సమాజం కోసం కృషి చేయవలసిన అవసరాన్ని ఎక్కడికక్కడ గుర్తించి గ్రహించి ప్రతిపాదనలు సిద్ధం చేసుకుని ప్రశ్నావళిని ఎక్కు పెట్టడం వల్లనే కదా నూతన ఆవిష్కరణలు సాధ్యమైనది... అనేక సందేహాలకు సమాధానాలు రాబట్టగలిగినది. ముఖ్యంగా శాస్త్రీయ రంగంలో వైద్య అవసరాలు వివిధ రంగాలలోని అభివృద్ధి కి బాటలు పరిచింది. శాస్త్రీయమైన పద్ధతిలో కొనసాగిన అధ్యయనం అంటే ప్రశ్నల రూపంలో వెల్లువెత్తిన చైతన్యమే కదా! తరగతి గదిలో పాఠ్యాంశాల వెనుక ప్రశ్నలకు సమాధానాలను వెతుక్కోవడం అనేది ఒకనాటి పాత వరస. పాఠ్యాంశాన్ని అధ్యయనం చేసి తగిన ప్రశ్నలను తయారు చేయడమనే కీలకమైనటువంటి దశలో మనం ఉన్నాం. ఇవాళ దున్నాల్సింది కేవలం పంట పొలాలను మాత్రమే కాదు మనుషుల మెదళ్లను కూడా అని ఒక మహా రచయిత అన్నట్టు మూగబోతున్నటువంటి మనిషి ఆలోచన ధోరణులకు పదును పెట్టడం ద్వారా వినూత్నమైన విభిన్న పరిష్కార మార్గాలను కనిపెట్టడానికి అవకాశం ఉంటుంది. సాధించిన దానితో తృప్తిని పొంది అదే విజయం అంటే పొరపాటు అన్న శ్రీశ్రీ మాటలను కొద్దిసేపు మనసున పెడితే సాధించవలసింది ఎంతో ఉన్నది అనే భావనకు మద్దతుగా ఈ వ్యవస్థ గురించి అనేక ప్రశ్నలను మనకు మనం వేసుకోవలసినటువంటి అవసరం ఉన్నది. నిత్య జీవితానికి సామాజిక చైతన్యానికి అభివృద్ధికి అన్ని రంగాలకు సంబంధించినటువంటి అంశాల పైన ప్రశ్నల రూపంలో ఒక నిర్ణయానికి రాగలిగితే సమాధానాలు వాటి అంతట అవే బయటికి వస్తాయి. ప్రశ్నలను తయారు చేయగలిగిన సత్తా ఉన్న వాళ్లకు సమాధానాలు దొరకడం పెద్ద కష్టమేమీ కాదు. ప్రశ్నల ఆకృతి నిర్మాణం నిండుధనం మరింత బలవంతంగా ఉండాలంటే తెలిసిన దాని నుండి తెలియని దానికి అనే సిద్ధాంతం ప్రకారంగా శక్తి మేరకు ప్రశ్నించడం, సందేహాలను వ్యక్తం చేయడం, అనుబంధ అంశాలను కూడా ప్రస్తావించడం, ఆటు పోట్లను ముందుగానే ఊహించడం, కొన్ని ప్రతిపాదనలు సిద్ధం చేయడం ద్వారా మనమంతా ఈ వ్యవస్థకు ఎన్నో రకాలుగా దోహదపడవలసినటువంటి అవసరం ఉన్నది. ప్రశ్నించే వాళ్లు సమాధానాలు ఇచ్చేవాళ్లు తరగతి గదిలోనూ చట్టసభల్లోనూ ఉండేవాళ్లే కే పరిమితం అని మనకు సంబంధం లేదని అనుకుంటే వ్యవస్థ ఎదుగుదల అపరిపక్వంగా అర్ధాంతరంగా మిగిలిపోతుంది. ఆలోచించగలిగిన ప్రతి వ్యక్తి అడగదల్చుకున్న అంశాన్ని చెప్పదలచుకున్న విషయాన్ని నచ్చజెప్పదల్చుకున్నటువంటి ధోరణిలో ఎక్కడికక్కడ చర్చ చేస్తూనే ఉండాలి.ఆ చర్చ నుండి సమాధానాలు ప్రశ్నలు సందేహాలు కొత్త ప్రతిపాదనలు పుట్టుకొస్తూ ఉంటాయి. మరింత మెరుగైన వ్యవస్థను రూపకల్పన చేయాలన్న, సంక్షోభాలకు అతీతమైన ఆరోగ్య భారతాన్ని నిర్మించాలన్న, ఆర్థిక సామాజిక ప్రయోజనాలను ఉన్నత స్థాయిలో వ్యవస్థకు అందించాలన్న, చట్టపరమైన అంశాలు న్యాయపరమైన ప్రస్తావనలు తీర్పులు సిద్ధాంతాలు సమాజానికి మరింత మేలు చేయాలన్నా ప్రశ్నతోనే ప్రారంభం కావలసినటువంటి అవసరం ఉంది. ప్రతి వ్యక్తి కూడా ఆ ప్రశ్నను సాధనంగా ఆయుధంగా మలుచుకున్నప్పుడే ప్రగతి సాధ్యమవుతుంది. ఈ ప్రశ్నల పరంపర విద్యాలయాలు విశ్వవిద్యాలయాలు చట్టసభలు ప్రజలు భూమి గూడే సర్వత్ర నిరంతరం తమ విశ్వరూపాన్ని ప్రదర్శించాలి అయిన వాళ్లకు కానీ వాళ్లకు అధికార గణానికి ఆత్మీయులకు కూడా అప్పుడప్పుడు అసహనాన్ని కలిగించినప్పటికీ ప్రశ్నను ఎప్పుడూ వదలకూడదు. ప్రశ్న సజీవమైనది సజీవంగా ఉన్నంతకాలం ప్రశ్న పలుచబడకుండా మరింత పద్దునె క్కే విధంగా తీర్చిదిద్దుకోవడం మనిషి కనీస ప్రాథమిక బాధ్యత.
( ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు అరసం రాష్ట్ర కమిటీ సభ్యుడు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ)