అవయవ దానం-ఒక అశ్వమేధ యాగం
సూర్యపేట, 07 ఏప్రిల్ 2026 తెలంగాణ వార్త రిపోర్టర్:- స్పందన శరీర, అవయవ దాన సంస్థ ఆధ్వర్యంలో సోమవారం పట్టణానికి చెందిన విశ్రాంత జిల్లా పరిషత్ ఉప ముఖ్య కార్యనిర్వహణాధికారి డిఎస్వి శర్మ (మాజీ మంత్రివర్యులు గుంతకంట్ల జగదీశ్వర్ రెడ్డి వ్యక్తిగత కార్యదర్శి) తమ అవయవ దాన అంగీకార పత్రాన్ని సంస్థ ప్రతినిధులకు అందజేశారు. ఈ సందర్భంగా స్పందన స్వచ్ఛంద సంస్థ గౌరవ అధ్యక్షులు గుండా రమేష్ మాట్లాడుతూ డిఎస్పి శర్మ విశాల దృక్పథంతో, మానవీయ కోణంలో పవిత్ర ఆశయంతో శరీర, అవయవ దాతగా ముందుకు రావడం సమాజానికి స్ఫూర్తిదాయకమని, అవయవ దానం ఒక అశ్వమేధ యాగంతో సమానమని ఈ ముందడుగు భావితరాలకు ప్రేరణ ప్రయత్నమని ప్రస్తుతించారు. సంస్థ అధ్యక్ష, కార్యదర్శులు జి రమేష్, మిట్ట కోల కోటయ్య, కోశాధికారి హెచ్. పిచ్చిరెడ్డి, సభ్యులు రౌతు రమేష్ అంగీకార పత్రాన్ని స్వీకరిస్తూ, దాత డిఎస్పి శర్మ సహృదయతను, సత్సంకల్పాన్ని అభినందించారు. శర్మ మాట్లాడుతూ ఈ ప్రక్రియ వల్ల మానవుడు మరణించిన ఇతరులలో జీవిస్తూ జన్మ సార్ధకతను పొందవచ్చు అని, అంతేగాక వైద్య విద్యార్థులకు శాస్త్రీయ పరిశోధన నిమిత్తం విజ్ఞానదాయకంగా ఉండగలదని అభిప్రాయపడ్డారు.