సోనియమ్మ మాట ఇచ్చారంటే అది శిలాశాసనమే..
పేదల ఇంట్లో వెలుగులు నింపేందుకు సోనియాగాంధీ ఆరు గ్యారంటీలను తెలంగాణ ప్రజలకు అంకితమిచ్చారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. మంగళవారం సచివాలయంలో అభయహస్తం గ్యారంటీల ప్రారంభ కార్యక్రమంలో సీఎం మాట్లాడుతూ... సోనియాగాంధీపై విశ్వాసంతో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అధికారం కట్టబెట్టారన్నారు. నిజమైన లబ్ధిదారులకు, అర్హులకు పథకాలను అందించడమే ప్రజా పాలన ఉద్దేశమని చెప్పుకొచ్చారు. అందులో భాగంగా ఇవాళ 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.500లకే గ్యాస్ సిలిండర్ పథకాలు ప్రారంభించుకుంటున్నామన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా పథకాలను సచివాలయంలో లాంఛనంగా ప్రారంభించుకుంటున్నామన్నారు. మహిళల కళ్లలో ఆనందం చూడాలనే రూ.500 గ్యాస్ సిలిండర్ పథకాన్ని ప్రారంభిస్తున్నామని తెలిపారు. పేదలకు పథకాలు చేరేలా అధికారులు విధి విధానాలు రూపొందించారన్నారు. ఆర్ధిక నియంత్రణ పాటిస్తూ పేదలకు ఇబ్బంది కలగకుండా పథకాలు అమలు చేస్తున్నామని చెప్పారు. హామీలు అమలు చేయడంలో తమ ప్రభుత్వం నిబద్ధతతో ఉందని స్పష్టం చేశారు. తండ్రీ కొడుకులు, మామా అల్లుళ్లు తప్పుడు ప్రచారం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. సోనియమ్మ మాట ఇచ్చారంటే అది శిలాశాసనమన్నారు. సోనియా గాంధీ ప్రజలకు ఇచ్చిన ప్రతీ హామీని నెరవేరుస్తామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు..