ఆక్రమణదారులను కఠినంగా శిక్షించాలి
జలాశయాల ఆక్రమణలను తొలగించి ప్రభుత్వ స్వాధీనం చేసుకోవాలి.
" హైడ్రా" పేరుతో హైదరాబాదులో ప్రారంభమైన వేట ఆంధ్రప్రదేశ్ తో సహా గ్రామీణ ప్రాంతాలకు దేశమంతా విస్తరించాలి.
ముంపుకు గురవుతున్న జనావాసాలను రక్షించాలి.
---వడ్డేపల్లి మల్లేశం
దేశవ్యాప్తంగా దశాబ్దాలుగా పాలకుల నిర్లక్ష్యం అధికార యంత్రాంగం యొక్క అలసత్వం కారణంగా చెరువులు కుంటలు ఆక్రమణలకు గురికావడంతో ప్రజలు నివసించే ప్రాంతాలన్నీ వరద ఉధృతికి కొట్టుకుపోతున్న సందర్భాలను మనం గమనిస్తూనే ఉన్నాం . ఇటీవల ఆగస్టు 30, 31 సెప్టెంబర్ 1 ఆ తర్వాత అల్పపీడన కారణంగా కురిసిన భారీ వర్షాల కారణంగా ఆంధ్రప్రదేశ్లో ము మ్మరంగా అదే స్థాయిలో తెలంగాణలో జలాశయాలు ఆక్రమణకు గురికావడంతో అనివార్యమైన పరిస్థితుల్లో జనావాసాలను ముంచెత్తిన దురవస్థ మనందరికీ తెలిసిందే . ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బుడమేరు ఆక్రమణ కొంతమంది అకృత్యాల కారణంగా విజయవాడ ఈసారి మొత్తం నీట మునిగిన విషయాన్ని అక్కడ వరుసగా ముఖ్యమంత్రి తిష్ట వేసి సహాయ చర్యలను పర్యవేక్షించిన తీరు మనందరికీ తెలిసిందే
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పదేపదే బు డమేరు ఆక్రమణ వల్లనే విజయవాడ నీట మునిగిందని హెచ్చరించడం గమనార్హం. ఈ అంశం పైన అధికార యంత్రాంగం గత కొంతకాలంగా చర్యలు చేపడుతున్న క్రమంలో భాగంగా కేంద్ర జల శక్తి శాఖ ఇటీవల మొదటిసారిగా అక్రమనకు గురైనటువంటి జలాశయాలు 15 వేలకు పైగా ఉన్నట్లు క బ్జా కోరల్లో చిక్కిన జల వనరుల్లో 80 శాతం ఉత్తరప్రదేశ్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ ,తెలంగాణ రాష్ట్రాలకు మాత్రమే పరిమితం కావడం పట్ల ఆందోళన వ్యక్తం చేసింది. ఆంధ్రప్రదేశ్లో 3920 చెరువులు కుంటలు తెలంగాణలో 3o 32 జలాశయాలు ఆక్రమణ గురైనట్లుగా కేంద్రం నివేదిక ద్వారా తెలుస్తున్నది. రాష్ట్రవ్యాప్తంగా ను ముఖ్యంగా హైదరాబాద్ దాని చుట్టూ పరిసర ప్రాంతాలలో వందలాది చెరువులు కుంటలు మాయమైనట్లు వాటిని పూడ్చేసి నాలాల పైన వేలాది నిర్మాణాలు చేపట్టడంతో వర్షాకాలంలో జనావాసాలు నీట మునుగుతున్న గత కొంతకాలంగా చూస్తూనే ఉన్నాం . గత బి ఆర్ ఎస్ ప్రభుత్వ హయాములో వర్షాకాలంలో చెరువులు జలాశయాలు ఆక్రమణలకు గురికావడంతో ఆ నీరు విధి లేని పరిస్థితిలో జనావాసాలు ముంచెత్తినట్లు గుర్తించిన నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖ్యంగా వరంగల్ ప్రాంతంలో ముంపుకు గురైన ప్రాంతాలను సందర్శించినప్పుడు కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటించడం జరిగింది . ఇక హైదరాబాద్కు సంబంధించి చెరువులు నాళాల పైన నిర్మించిన 28 వేల అక్రమ కట్టడాలను కూల్చే స్తామని ఎంతటి వారినైనా వదిలిపెట్టే సమస్య లేదని ప్రకటించినప్పటికీ ఆ వైపుగా తదనంతర కాలంలో చర్యలు తీసుకోకపోవడం దాని కారణంగా వరంగల్లు హైదరాబాదు రాష్ట్రంలోని ఇతర జిల్లాలు ముంపుకు గురికావడం గత 10 సంవత్సరాలుగా చూస్తూనే ఉన్నాం .
న్యాయవ్యవస్థ సూచనలు-- ప్రభుత్వ చర్యలు:-
********
జలాశయాలు నాలాల ఆక్రమణలకు స్పందించి 2020 లోనే తెలంగాణ హైకోర్టు చెరువులు కుంటలు, జలాశయాల సంరక్షణకు తగిన చర్యలు తీసుకోవాలని అక్రమ నిర్మాణాలను దృఢహస్తముతో అణచివేయాలని త ద్వారా భూమిని ప్రభుత్వ స్వాధీనం చేసుకోవడంతో పాటు వరద ముప్పు నుంచి జనావాసాలను రక్షించాలని ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే. కానీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ప్రతి ఏటా భారీ వర్షాలు అల్పపీడనం కారణంగా వచ్చే వరదలు తీరని భారీ నష్టాన్ని కలిగిస్తూనే ఉన్నాయి. జనావాసాల మధ్యన అక్రమ నిర్మాణాలు తద్వారా వరదల్లో చిక్కుకుంటున్న జనావాసాలు ఈ సమస్య పట్ల ఆందోళన వ్యక్తం చేసిన భారత సర్వోన్నత న్యాయస్థానం శాటిలైట్ మ్యాపింగ్, జియో ఫెన్సింగ్ వంటి శాస్త్ర సాంకేతిక పరిశోధనల ద్వారా భూ కబ్జాలను అరికట్టి ప్రభుత్వ సాధనం చేసుకోవాలని అక్రమణాలను తొలగించడం ద్వారా జనావాసాలను ముంపు నుండి తప్పించాలని సూచించిన విషయం కూడా తెలిసిందే.
తెలంగాణ రాష్ట్రo లో ఖమ్మం నల్గొండ మహబూబ్నగర్ నిజామాబాద్ కరీంనగర్ వంటి జిల్లాలు ఆక్రమణలకు గురి కావడంతో పాటు ముంపు ప్రాంతాలు నీట మునిగిన విషయం గతంలోనే దృష్టికి వచ్చింది . ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కడప తిరుపతి నెల్లూరులో 18 పైగా చెరువులలో నిర్మాణాలను చేపట్టడంతో మరదలు ముంచెత్తినట్లు అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు . శ్రీకాకుళం నుండి కర్నూలు దాకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నో చెరువులు వాగులు కబ్జాలకు గురైనట్లుగా నివేదికలు వెల్లడిస్తుంటే ఇటీవల ఈ దురాక్రమణల నుండి రక్షించడానికి జూలై 2024 మాసంలో తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఆక్రమణలను తొలగించే సంస్థ హైడ్రా పేరుతో ప్రారంభించబడినది . రాజకీయాలు ఒత్తిడికి ఆస్కారం లేకుండా స్వయం ప్రతిపత్తి గల సంస్థగా కొనసాగుతున్న హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారి నాయకత్వంలో స్వతంత్రంగా వ్యవహరిస్తూ ఆక్రమణలను తొలగిస్తూ భూమిని స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తున్నది
నాళాలు చెరువులు కుంటలు మాత్రమే కాక పార్కులు ఖాళీ స్థలాల లోపల అక్రమ నిర్మాణాలను కూల్చివేయడం ద్వారా ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుంటున్న గణాంకాలు వెళ్లడవుతున్నాయి. కట్టుదిట్టంగా కఠిన చర్యలు తీసుకుంటున్న కారణంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలు రాజకీయ పార్టీ నాయకులు అధికార యంత్రాంగం రాష్ట్రవ్యాప్తంగా ఈ చర్యలను విస్తరించాలని అనేకచోట్ల ఆక్రమణ గురి అయినటువంటి భూములను స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వాన్ని ఆహ్వానించడం ఆశించదగిన పరిణామం. వందలు వేలాది ఎకరాల భూమి అన్యాక్రాంతం కాకుండా సంపన్న వర్గాల నుండి స్వాధీనం చేసుకోవడానికి అవకాశం ఏర్పడింది. ఈ పరిస్థితులకు ప్రజలు పూర్తి మద్దతు ప్రకటించినప్పుడు మాత్రమే ప్రభుత్వం చిత్తశుద్ధిగా పనిచేయగలదు ఇటీవల కాలంలో పేదలకు సంబంధించిన ఇల్లు కూడా అనివార్యంగా ఆక్రమణల్లో భాగంగా కూల్చివేసినట్లు ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో పేద వర్గాలకు సంబంధించి అనివార్య పరిస్థితుల్లో కూల్చివేయబడినoదుకు ప్రత్యామ్నాయ గృహ వసథి కల్పించాలని పేదవర్గాలు ప్రజాస్వామ్యవాదులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు ఈ విషయంలో ప్రభుత్వం ఆలోచించాలి.
ప్రభుత్వ చర్యలు ముమ్మరం చేయాలి:-
*****
అక్రమ నిర్మాణాల కూల్చివేతకు సంబంధించి కఠిన చర్యలు తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతుండగా ఇలాంటి దుష్పరిణామాలే ఆంధ్రప్రదేశ్ లోపల కూడా చోటు చేసుకోవడం అలాంటి నిర్మాణాలను తొలగించడానికి అక్కడి ప్రభుత్వం పూనుకోవడం గమనించదగిన విషయం. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ప్రజలు ప్రజాస్వామ్యవాదులు సమ్మతిస్తూ హర్షిస్తున్న సందర్భంలో దేశవ్యాప్తంగా ఆక్రమణకు గురైన అంశం పైన న్యాయస్థానాలు ఇటీవల కాలంలో స్పందించడం సంతోషించదగిన పరిణామం. ఈ క్రమంలో భాగంగానే "జలాశయాలు చెరువులు కుంటలను స్వార్థ ప్రయోజనాలకు ఆక్రమించుకునే వ్యక్తులు లేదా సంస్థలు లేదా సంపన్నులు దేశద్రోహులతో సమానమని మద్రాస్ హైకోర్టు 2023 సంవత్సరంలో నిందించిన విషయాన్ని కూడా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పాలకులు ఆలోచించవలసిన అవసరం ఉంది" . ఈ అంశం జాతీయస్థాయిలో ప్రాధాన్యత కలిగి ఉన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమాలోచనలు జరిపి ప్రభుత్వానికి సంబంధించినటువంటి జల వనరులు భూములు అన్యాక్రాంతం కాకుండా ఆక్రమించుకునే విధానం హైదరాబాదులో ప్రారంభమైన దానిని ఆసరాగా చేసుకొని దేశవ్యాప్తంగా కొనసాగడానికి సూచనలు చేసినట్లయితే కొంత ఆలస్యంగా నైనా జరిగిన నష్టాన్ని సవరించుకోవడానికి జనావాసాలు ముంపుకు గురికాకుండా రక్షించుకోవడానికి తిరిగి జల వనరులను కాపాడుకోవడం ద్వారా వ్యవసాయం మంచినీటి అవసరాలకు వినియోగించుకోవడానికి ఆస్కారం ఉంటుంది .ఈ కృషి పట్టణ ప్రాంతాల్లోనే కాకుండా గ్రామీణ స్థాయికి విస్తరించాలి , అదే సందర్భంలో నిరంతరం కొనసాగి చివరి ఆక్రమణల వరకు కూడా తొలగించినప్పుడు మాత్రమే దీనిని పెద్ద విజయంగా భావించవలసి ఉంటుంది.
( ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు అభ్యుదయ రచయితల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ )