ఫీజు నియంత్రణ కమిషన్ కాదు..

Apr 2, 2025 - 07:15
Apr 2, 2025 - 07:19
 0  2

 ప్రైవేటు విద్యాసంస్థలన్నింటినీ(  పాఠశాలలు కళాశాలలను కలుపుకొని)  ప్రభుత్వమే ఆధీనం చేసుకునే  నూతన వ్యవస్థ ఆవిష్కృతం కావాలి.* అందుకు కమిషన్ వేస్తే అభ్యంతరం లేదు.*  ప్రభుత్వ ప్రైవేటు వివక్షత వల్ల  ఇంకెన్ని పేద కుటుంబాలు  అప్పుల పాలు కావాలి.*

----  వడ్డేపల్లి మల్లేశం


2025 -26వ సంవత్సరానికి తెలంగాణ రాష్ట్ర శాసనసభలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో విద్యాశాఖ paddu పై  25 మార్చ్ 2025 మంగళవారం  రోజున  జరిగిన చర్చకు సమాధానమిస్తూ  రాష్ట్ర మంత్రి శ్రీ  దామోదర రాజనర్సింహ గారు  ఒకవైపు గత పదేళ్లలో రాష్ట్రంలో 7.5 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ స్కూళ్లకు దూరం కావడం అదే రకంగా వాళ్లంతా ప్రైవేట్ స్కూళ్లలో చదువుకోవడం వలన ప్రభుత్వ విద్యారంగంకునారీల్లిపోయిందని   అంగీకరిస్తూనే  ఈ పరిస్థితిని అధిగమించడానికి   ప్రభుత్వ పాఠశాలకు కొత్త రూపం తీసుకువస్తామని హామీ ఇవ్వడం ఫీజు నియంత్రన కమీషన్ వేస్తామని ప్రకటించడం   కొంత సందిగ్ధంగా ఉన్నది.  ప్రతి ఏటా లక్షలాది మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలకు దూరం అవుతూ ఉంటే  ఇదే అదనుగా భావించినటువంటి ప్రభుత్వాలు  సామాజిక బాధ్యతనుండి  తప్పుకోవడానికి ప్రయత్నం చేస్తున్నట్లుగా మనం భావించాలి. ఇది కేవలం తెలంగాణ రాష్ట్రంలోనే కాదు ఆంధ్రప్రదేశ్ తో సహా దేశంలోని ఒకటి రెండు రాష్ట్రాలు మినహాయిస్తే అన్ని రాష్ట్రాలలోనూ కొనసాగుతున్న పరిస్థితి. ఒకవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాఠశాలలు  విద్యాసంస్థల యొక్క స్థితిగతుల పైన  దృష్టి సారిస్తూనే ఆయా కుటుంబాల పిల్లలకు ప్రత్యక్షంగా కొంత ఆర్థిక  స్వావలంబన  కల్పించడానికి తల్లికి వందనం  పేరుతో ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికి  ఆర్థిక సహకారం అందించడం కొనసాగుతూ ఉంటే  ఆ రకమైన వెసులుబాటు కూడా తెలంగాణ రాష్ట్రంలో లేకపోగా పేదలు మరీ పేదలుగా మారుతున్న సందర్భం ప్రైవేటు పాఠశాలల్లోకి పంపించడం వల్ల అప్పుల పాలై  ఆత్మహత్యల బారిన పడుతున్న విషయాలను కూడా మనం గమనించవలసిన అవసరం ఉంది .గత ప్రభుత్వ హయాములో "మన ఊరు మనబడి "అనే పథకాన్ని ప్రవేశపెట్టి  పాఠశాలల  స్థితిగతులను  మరింత మెరుగుపరచడానికి కృషి చేసినప్పటికీ సరిగా అమలు కాలేదని   దానిపైన పూర్తిస్థాయిలో విచారణ జరిపించాలని  మజలిస్  సభా పక్ష నేతశ్రీ  అక్బరుద్దీన్ ఓవైసీ గారు అసెంబ్లీలో చేసిన డిమాండ్ ను కూడా  ప్రభుత్వం పరిశీలించవలసిన అవసరం ఉన్నది.  నిధులు కేటాయించడం జరుగుతున్నదా? లేదా కేటాయించినటువంటి నిధులు పక్కదారి పడుతున్నవా? అనే సందేహం  ప్రజలకు  వచ్చే అవకాశం ఇక్కడ స్పష్టంగా కనబడుతున్నది.
           ఫీజు నియంత్రణ కమిషన్ కాదు  ప్రభుత్వమే ఉచిత నాణ్యమైన విద్యను అందించాలి
**********
  కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యారంగ  సంస్కరణల కోసం  ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి గారి నేతృత్వంలో విద్యా కమిషన్ ఏర్పాటు చేసిన విషయం మనందరికీ తెలుసు.  వారు గతంలో అనేక సందర్భాలలో మాట్లాడుతూ  రాష్ట్రంలో ప్రైవేటు విద్యను  రద్దు చేసి మొత్తం ప్రభుత్వ ఆధ్వర్యంలోనే కొనసాగించినప్పుడు మాత్రమే విద్యావ్యవస్థ మెరుగుపడుతుందని దాని ఫలాలు ప్రజలందరికీ అందుతాయని  రెండు యాజమాన్యాల పద్ధతిని వ్యతిరేకించిన విషయం  ఈ సందర్భంగా  ప్రభుత్వం ప్రజలు ఆలోచించవలసిన అవసరం ఉంది.  ఇక దేశవ్యాప్తంగా తెలంగాణ విద్యారంగ పరిస్థితులను గమనించినప్పుడు  రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాలతో కలుపుకొని 36 భాగాలకు గాను  వసతుల కల్పనలో తెలంగాణ 32వ స్థానంలో ఉంటే  విద్యా నాణ్యతలో 27వ స్థానంలో ఉన్నట్లు  తెలంగాణ విద్యా కమిషనర్ గారు తెలిపినట్లుగా పత్రికల కథనం.  ఆ రకంగా చూసిన తెలంగాణలో విద్య ఎంత దయనీయ స్థితిలో ఉన్నదో ప్రభుత్వం సీరియస్ గా ఆలోచించవలసిన అవసరం ఉంది.  ఈ పరిస్థితులలో రెండు యాజమాన్యాలలో విద్య కొనసాగడం శ్రేయస్కరం కాదు. ప్రభుత్వ రంగంలోనే నాణ్యమైన ఉచిత విద్యను అందించడానికి  ప్రైవేటు పాఠశాలలు కళాశాలలను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడానికి ప్రత్యేక కమిషన్ ఏర్పాటు   చేయాలని  ప్రజలు ప్రజాస్వామ్యతవాదులు విద్యారంగ పరిరక్షణకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.  ఫీజుల నియంత్రణకు కమిషన్ వేస్తామని ప్రభుత్వం ప్రకటించడం అంటే ప్రైవేటు రంగాన్ని పెంచి పోషించడమేనని అర్థమవుతున్నది.  గతంలో 2017- 18 ప్రాంతంలో  శ్రీ తిరుపతి రావు గారి నేతృత్వంలో  ఫీజుల నియంత్రణ కమిషన్ ఏర్పాటు చేసినప్పటికీ  స్పష్టమైన సిఫారసులు లేకపోగా ఏటా 10 శాతం పెంచుకోవచ్చని చేసిన సిఫారస్  ఇప్పటివరకు కొనసాగుతూ ఉంటే లక్షలాది ఫీజుల జులుం వల్ల   ప్రైవేటు పాఠశాలల్లో చదివిస్తున్నటువంటి పేదలు మరింత పేదలుగా తయారవుతున్న విషయాన్ని గమనించినప్పుడు  రెండు రకాల విద్య కొనసాగడం వల్లనే ఈ  దుర్భర పరిస్థితులు నెలకొన్నాయని ఒకే యాజమాన్యంలో విద్య కొనసాగినట్లయితే అందరికీ సమాన విద్య అందుతుందని  అదే కామన్ స్కూల్ విధానం అని మనం గ్రహించవలసిన అవసరం ఉంది. ఈ విషయంలో ప్రభుత్వం దృష్టి సారించి  పేదవాడికి సంపన్నులకు ఒకే రకమైన విద్యను అందించడానికి ముందుకు వచ్చినప్పుడు మాత్రమే ఈ రాష్ట్రంలో విద్యారంగంలో విప్లవాత్మకమైన మార్పులు వచ్చినట్లుగా భావించవలసి ఉంటుంది. " రెండు యాజమాన్యాల వ్యవస్థ కొనసాగించినప్పుడు ఫీజుల  నియంత్రన కమిషన్ అవసరం కానీ ప్రస్తుతం రాష్ట్రంలో ఒకే యాజమాన్యంలో విద్య ఉండాలని డిమాండ్ చేస్తున్న సందర్భంలో  ఫీజుల నియంత్రణ కమిషన్  అవసరము లేదు. ప్రైవేటు రంగంలో విద్యావ్యవస్థ కూడా  ఆమోదము కాదు అని ప్రభుత్వం అంగీకరించి  ప్రభుత్వ రంగంలో నాణ్యమైన ఉచిత విద్యను అందించడానికి  ప్రభుత్వం ఒక ప్రత్యేక కమిషన్ను ఏర్పాటు చేసి  ప్రైవేటు కళాశాలలు  పాఠశాలల  స్వాధీనం చేసుకోవడం ద్వారా  విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టాలి. అర్హులైనటువంటి సిబ్బందిని  సంస్థలకు సంబంధించినటువంటి  వనరులను ప్రభుత్వం  కొనుగోలు చేసి  పూర్తిస్థాయిలో ప్రజలందరికీ నాణ్యమైన విద్య అందించాలి."
        ప్రైవేటు స్కూలు కాలేజీల దోపిడీకి చెక్ పెట్టడానికి విద్యా కమిషన్ ఇచ్చే అనేక సూచనలతో విద్యారంగంలో సంస్కరణలు చేపడతామని ఇచ్చినటువంటి హామీని మంత్రి రాజనర్సింహ గారు  ఈ రాష్ట్రంలో దేశంలో విద్య ప్రభుత్వ ఆధ్వరంలో ఉండాలని చేస్తున్న డిమాండ్ ను కూడా  పరిశీలిస్తే బాగుంటుంది.  పాఠశాల స్థాయి వరకే సుమారు 60 లక్షల మంది విద్యార్థులు ఉంటే  దాదాపుగా 40 లక్షల  విద్యార్థులు ప్రైవేట్ రంగంలోనే చదువుతూ ఉంటే కేవలం 20 లక్షల పైచిలుకు విద్యార్థుల కోసమేనా ప్రభుత్వం తన బాధ్యతను నిర్వహించేది. దయనీయమైన పరిస్థితి ఏమిటంటే ప్రస్తుతము కొనసాగుతున్నటువంటి ప్రభుత్వ పాఠశాలల్లో కేవలం ఎస్సీ ఎస్టీ బీసీ దళితులు ఆదివాసీలు, పేదవర్గాల పిల్లలు మాత్రమే మెజారిటీగా విద్యను అభ్యసిస్తున్న సందర్భంలో  ఈ పాఠశాలల అభివృద్ధి కానీ విద్యా ప్రమాణాలు కానీ  ఆశించిన స్థాయిలో ఉండవని తెలుసు. ఆ అపనమ్మకముతోనే అనేకమంది తమ పిల్లలను ప్రైవేటు పాఠశాలలకు పంపించడం, అందులో ప్రభుత్వ ఉపాధ్యాయులు ఉద్యోగులు కూడా తమ పిల్లలను పంపించడం  రివాజ్ గా మారిపోయింది. " ప్రభుత్వానికి తన పట్ట తనకు విశ్వాసం లేకపోవడం, ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులకు తమ పాఠశాల పట్ల నమ్మకం లేకపోవడం  తగిన రీతిలో బడ్జెట్ కేటాయించక ప్రభుత్వ రంగాన్ని నిర్వీర్యం చేస్తున్న సందర్భంలో అనివార్యంగా తమ స్వప్రయోజనాల కోసం ప్రైవేట్ రంగాన్ని    ఎంచుకోవడాన్ని ప్రేక్షక పాత్రగా  చూస్తున్న   ప్రభుత్వం  ఫీజు నియంత్రణ కమిషన్ తో మాత్రమే సరిపెట్టుకుంటే సమస్యలు పరిష్కారం కావు."
              ప్రస్తుతం  గౌరవ ఆకునూరు మురళి గారి సారథ్యంలో పనిచేస్తున్న విద్యా కమిషన్  ప్రభుత్వ ప్రైవేటు విద్యావ్యవస్థలో సంస్కరణలకు మాత్రమే ఏర్పాటు చేయబడినది కానీ  ప్రైవేటు విద్య లేనటువంటి
  ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నాణ్యమైన ఉచిత విద్యను అందించడానికి సంబంధించి  మరొక్క విద్యా కమిషన్ను ఏర్పాటు చేయడం ద్వారా  ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడంతో  ఒకటి రెండు సంవత్సరాల వరకైనా ఈ రాష్ట్రంలో కొంతవరకు  ఉచిత విద్యను సా కారం చేయడానికి అవకాశం ఉంటుంది.  ఉచిత విద్యా ప్రభుత్వ రంగంలో విద్య  అనే డిమాండ్లు కేవలం తెలంగాణ రాష్ట్రానికి మాత్రమే పరిమితం కాదు .1966లో కొఠారి కమిషన్ తన సిఫారసులలో  విద్యను ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని, పేదలు, కోటీశ్వరులు అందరూ కలిసి చదువుకునే కామన్ స్కూల్ విధానాన్ని ఈ దేశంలో అమలు చేయాలని,  అత్యున్నత ప్రమాణాలతో విద్యను కొనసాగించడానికి కేంద్ర ప్రభుత్వం తన బడ్జెట్లో 10 శాతం, రాష్ట్ర ప్రభుత్వాలు 30 శాతం నిధులను కేటాయించాలని చేసిన సూచన  ఎండమావిగా మారిన విషయం మనందరికీ తెలుసు.  "ఈ దేశంలో ఏ ప్రభుత్వం  ఏ రాజకీయ పార్టీ కూడా  ఉచిత విద్య ఉచిత వైద్యం మా విధానం నినాదం అని  స్పష్టంగా ప్రకటించిన దాఖలా లేదు.  సుమారు 59 సంవత్సరాలకు పూర్వం ఈ దేశంలో చేయబడినటువంటి ఒక సిఫారసును ఇప్పటికీ రేఖామాత్రంగానైనా  అమలు చేయడానికి పూనుకోనటువంటి పాలకులు  తమ వైఫల్యాన్ని అంగీకరించి తీరాలి. అందుకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలతో సంప్రదించి తమ ఉమ్మడి బాధ్యతను గుర్తించి పాలన ప్రభుత్వ రంగంలో ఉన్నప్పుడు విద్య కూడా ప్రభుత్వ రంగంలో ఉండాలి కదా! అనే కనీస ఆలోచన చేస్తారని  బాధ్యతను తప్పుకొని ప్రైవేటు రంగానికి అప్పగించే దుస్ట  సంప్రదాయానికి చరమగీతం పాడుతారని  మనసారా కోరుకుందాం. తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థను ప్రభుత్వ రంగంలోనే కొనసాగించడానికి తీసుకునే విప్లవాత్మక చర్యలు దేశం మొత్తానికి ఆదర్శప్రాయం కావాలని ఆ వైపుగా ప్రభుత్వం అడుగులు వేస్తుందని ఆశిద్దాం.
 ఆమ్  ఆద్మీ పార్టీ నాయకత్వంలోని ఢిల్లీ ప్రభుత్వం గతంలో విద్యారంగ అభివృద్ధి కోసం బడ్జెట్లో 25% కేటాయించిన విషయం పాలకులు గుర్తించాలి  అలాగే కేరళ ప్రభుత్వం కూడా  24 శాతం బడ్జెట్ను కేటాయించడాన్ని గమనించి  కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు ఇచ్చినటువంటి 15%  బడ్జెట్లో నిధుల  కేటాయింపు కోసం ఇచ్చిన హామీ  మేరకైనా రాబోయే సంవత్సరం 20 శాతానికి కేటాయించడం ద్వారా తన నిబద్ధతను చిత్తశుద్ధిని ప్రదర్శించుకోవాలి.  గత 10ఏళ్లలో  6 శాతానికి పైగా కేటాయిస్తే ప్రస్తుతం  కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దగా మార్పు లేకుండా కేవలం 7.57%తో ముగిస్తే  అనుకున్న లక్ష్యాలు ఎలా నెరవేరుతాయి? ఈ దేశంలోని అట్టడుగు వర్గాలకు చెందిన అశేష పేద ప్రజానీకం అరకొర విద్యతో   ఏ విధంగా చైతన్యము చెందుతుందో ప్రభుత్వాలు ఆలోచించుకోవాలి. సమాజ పరినతికి మూలమైనటువంటి విద్యారంగం పట్ల పాలకులకు ఇంత నిర్లక్ష్యం తగదు.
(  ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు అరసం రాష్ట్ర కమిటీ సభ్యుడు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ )

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333