మన తప్పులు మనం అంగీకరిస్తేనే మానవ సంబంధాలు బలపడతాయి
కుటుంబ సభ్యుల వికృత దుర్మార్గ ప్రవర్తన దుష్ట ఫలితాలు భావితరాలకు శోక కూడదు.
మానసిక క్షోభకు గురవుతున్న వాళ్ళ శాపనార్థాలు మంచివి కావు.
వివక్షతకు ఆస్కారం లేని కుటుంబ బంధాల బలోపేతానికి ఎక్కడికక్కడ పోరు జరగాలి. చట్టాలకంటే సమాజమే శిక్షిస్తే మార్పు సాధ్యం.
--వడ్డేపల్లి మల్లేశం
పాత కాలం నాటి కుటుంబ బంధాలను మానవ సంబంధాలను పరిశీలించినప్పుడు చదువు డబ్బు హోదాలో పెద్ద స్థానం లేకపోవచ్చు కానీ మర్యాద మన్నన , పెద్దవాళ్ల పట్ల గౌరవం చిన్నలపట్ల ప్రేమ, కుల మతాలకు అతీతంగా కలుపుగోలుతనం , కష్టాలలో పరస్పరం ఆదుకోవడం, మనసు విప్పి మాట్లాడుకోవడం ద్వారా సేదవీరిన సందర్భాలు అనేకం. వేగవంతమైన జీవితంలో యాంత్రిక సంబంధాలు , స్వార్థం , సామాజిక హితాన్ని కోరుకోకపోవడము, హింసా వాదం, తన చుట్టూ గిరిగేసుకునే కు సంస్కృతి ఇలాంటి ఎన్నో కారణాల వలన క్రమంగా మానవ జీవితము నిందలకు నేరాలకు విమర్శకు గురవుతున్న సందర్భాలను మనం గమనించవచ్చు. కుల మతాలకు అతీతంగా స్వార్థము స్వప్రయోజనాలకు దూరంగా విశ్వ మానవ కళ్యాణానికి చేరువగా పనిచేసే వాళ్లు కూడా లేకపోలేదు. అలాంటి వాళ్లతోనే అంతో ఇంతో ఈ విశ్వ మనుగడ కొనసాగుతున్నదన్న విషయాన్ని కూడా మనం అంగీకరించి తీరాలి. అదే సందర్భంలో మన వల్ల జరుగుతున్నటువంటి లోటుపాట్లు, చేస్తున్న పొరపాట్లు, పాల్పడుతున్న నేరాలు, కొనసాగుస్తున్న వివక్షతను మనకు మనమే పునరాలోచన చేసుకొని ఖండించుకోవాల్సిన అవసరం చాలా ఉన్నది . ఈ తప్పుడు పనుల వలన త క్షణ ప్రయోజనం కొన్నింటి నుండి తప్పించుకునే అవకాశం ఉండవచ్చు కానీ అంతకు మించిన స్థాయిలో నిందల పాలవుతున్న విషయాన్ని గమనించాలి. అంతేకాదు కుటుంబంలో ముఖ్యంగా వృద్ధులు వికలాంగులు ముఖ్యంగా పేదలు వివక్షతకు గురవుతున్న సందర్భంలో అదే స్థాయిలో వాళ్లు ఆవేదనను మాటల రూపంలో వ్యక్తం చేసినప్పుడు అవి శాపనార్థాల వలె మనలను గుచ్చుకుంటున్న విషయాన్ని కూడా మనం అంగీకరించి థీ రాలి . మానసిక క్షో భకు ఎవరిని గురిచేసిన అందుకు తగిన మూల్యం చెల్లించుకోవలసి ఉంటుంది , దీర్ఘకాలిక ప్రభావాన్ని గుర్తించకపోతే తాత్కాలిక ప్రయోజనం వరకు మాత్రమే ఆలోచిస్తే ఇక ఈ వ్యవస్థ మనుగడకు కృషి చేసేది ఎవరు?. విశాల దృక్పథం లేకపోవడం, సామాజిక చింతన క్రమంగా కొరవడడం, విస్తృత ప్రాతిపదికన లక్ష్యాలను నిర్వచించుకోకపోవడం ,విశ్వ మానవ భావనను పెంపొందించుకోకపోవడం , స్వార్థపరుల సహవాసంతో మూర్ఖులుగా మారడం వంటి అనేక సందర్భాలు మనిషిని క్రూర మృగంగా మార్చుతున్నాయి . కన్నీరు పెట్టిన , అవమానానికి గురైన, అగాధంలోకి నెట్టి వేయబడిన , పేదరికంలో మగ్గిన, కనీసం తోటి మనిషిని సాటి మనిషిగా చూడనటువంటి దుర్మార్గ వ్యవస్థనుండి మనకు మనమే బయట పడాల్సిన అవసరం ఎంతగానో ఉన్నది.
మనల మనం సంస్కరించుకోవడం అవసరం :-
************
కుటుంబాలలో వృద్ధులైన తల్లిదండ్రులను కొడుకులు కోడళ్ళు హింసించడం వివక్షతకు గురి చేయడం తో పాటు వాళ్ల పిల్లలు కూడా వృద్ధుల పట్ల జాలి లేకుండా అమానుషంగా వ్యవహ రించడాన్నీ మనం అనేక కుటుంబాలలో చూడవచ్చు . చాలా కుటుంబాలలో కొట్టవచ్చి నట్లుగా కనపడే ది పిల్లలు తండ్రి తరపు వారితో కంటే తల్లి తరపు వాళ్లతో ప్రేమగా ఆత్మీయంగా వుండడం వంటి వివక్షత స్పష్టంగా చూడవచ్చు. అన్నదమ్ముల మధ్యన తల్లిదండ్రులను పంచుకోవడం నెలవారిగా పోషించడంలో ఒక్కరోజు ఆలస్యమైనా తట్టుకోలేని పరిస్థితిలో వృద్ధులు మానసిక క్రో భకు గురవుతున్న విధానం సభ్య సమాజం తలదించుకునే విధంగా కనబడుతున్నది. కుటుంబ బంధాలు బంధుత్వాలలో కూడా డబ్బున్న వాళ్ళతో ఒక రకంగా డబ్బు లేని వాళ్ళతో మరొకరకంగా వ్యవహరించడం ఎరిగినదే. .బంధువులు ఇంటికి వచ్చినప్పుడు గానీ బంధువులింట జరిగే కార్యక్రమాలకు మనం వెళ్ళినప్పుడు గాని సందర్భాలను ఆర్థిక పరిస్థితిని గౌరవాన్ని చదువును బట్టి ప్రాధాన్యత ఇచ్చేటువంటి వివక్షత వంటి దుర్మార్గపు అవ లక్షణాలను భావితరాలకు సో కకుండా చూసుకోవాలి . అంటే మన తప్పులను మనం గుర్తించాలి మార్చుకోవాలి సభ్య సమాజం విమర్శలకు గురికాకుండా చూసుకోవలసిన బాధ్యత మనదే. తల్లిదండ్రుల దుర్మార్గపు లక్షణాలను పిల్లలు క్రమంగా స్వీకరించి తమ కుటుంబాలలో ఆధిపత్యము, వివక్షత, గందరగోళాలకు పాల్పడుతున్న సందర్భాలను కూడా మనం గమనించవచ్చు. ఇలాంటి లక్షణాల కారణంగా కుటుంబ సంబంధాలు తద్వారా మానవ సంబంధాలు బలహీనపడి సమాజం ఉనికి కష్ట సాధ్యమవుతున్న విషయం మనం గమనించాలి . పాలకుల తప్పిదాలు, పెట్టుబడిదారీ వర్గం యొక్క దోపిడి , దుష్ట రాజకీయాల కంటే కూడా ప్రమాదకరమైనది ఈ సామాజిక సంక్షోభం అని గుర్తించినప్పుడు దానిని తక్షణమే మార్చుకోవాల్సిన అవసరాన్ని భుజానికి ఎత్తుకోవలసి ఉంటుంది. మన నేరాలు తప్పిదాలు వివక్షత మన తర్వాత వారసులకు సోకినట్లయితే తరతరాల వరకు ఈ జాధ్యాన్ని నివారించడం చాలా కష్టమవుతుంది. పంట చేలకు పట్టిన చీడపీడలను విరగడ చేసినట్లు , నేరస్తులను శిక్షించి మార్చినట్లు , రోగాలను గుర్తించి తగిన శస్త్ర చికిత్స ద్వారా అనారోగ్యం నుండి దూరం చేసినట్లుగా మన తప్పిదాలను మనమే గుర్తించి సమీక్షించుకోవడం సంస్కరించుకోవడం ప్రక్షాళన చేసుకోవడం ద్వారా మెరుగైన వ్యవస్థ వైపు తీసుకువెళ్లడానికి అవకాశం ఉంటుంది. అన్నదమ్ములు, అక్క చెల్లెలు, తోటి కోడళ్ళు , బావా బావమరుదులు, తల్లిదండ్రులు సంతానం , ముఖ్యంగా అత్తమామలు కోడండ్ల మధ్యన నిరంతరం జరుగుతున్న ఘర్షణ పూరిత వాతావరణం సమాజంలో నెలకొన్న భారీ సంక్షోభం. ఈ సంక్షోభాన్ని గుట్టు చప్పుడు కాకుండా ఎక్కడికక్కడ నివారించగలిగే ప్రయత్నం చేయడం ద్వారా మనిషి బుద్ధి జీవి అని సంఘజీవి అని తో టి మనిషిని సాటి మనిషిగా చూడగలిగే సంస్కారి అని మనం రుజువు చేయవలసిన అవసరం ఉన్నది .
సమాజమే శిక్షించాలి :-
********
కుటుంబ సంబంధాలలో కొందరి దుర్మార్గాలకు అనేకమంది బలవుతున్న విషయాన్ని మనం గమనించినప్పుడు ఆ దుష్ట చేష్టలకు పాల్పడుతున్న వారిని చట్టం కంటే తోటి సమాజమే కఠినంగా శిక్షించడం ద్వారా మాత్రమే పరివర్తన సాధ్యమవుతుందని విశ్లేషకులు మానసికవేత్తలు అభిప్రాయపడుతున్నారు . మానసిక క్షోభకు గురి చేసే వాళ్లను సభ్య సమాజం వెలివేయడం , హెచ్చరించడం, మందలించడం, పదిమందిలో అవమానించడం , నిలదీయడం ద్వారానైనా వాళ్లకు జ్ఞానోదయం కలిగించే అవకాశం ఉన్నది . ఉదాహరణకు వృద్ధులైన తల్లిదండ్రులను పోషించక ఆదరించక అన్యాయానికి గురి చేస్తున్న కొడుకులు కోడండ్లను శి క్షించే విషయంలో చట్టాలు ఎన్ని ఉన్నా, సమీపంలో పోలీస్ స్టేషన్ల ఉన్న ఆ వృద్ధులకు దక్కిన భరోసా , చట్టం వల్ల ఒనగూరే ప్రయోజనం , నేరస్తులను శిక్షించిన తీరు అంత పెద్దగా ప్రయోజనకరంగా లేకపోవడం మన చట్టాలలోని లోసుగు లను తెలియచేస్తున్నాయి. అందుకే తక్షణ ప్రయోజనం కోసం చట్టాలు శాసనాలు న్యాయ వ్యవస్థ కంటే చుట్టూ ఉన్నటువంటి సమాజంలోని బుద్ధి జీవులు మనసున్న వాళ్లు తలచుకుంటే ఇలాంటి దుర్మార్గులకు కఠినమైన శిక్షలు విధించవచ్చు., వాళ్లను శాశ్వతంగా మార్చవచ్చు, వారిలో పరివర్తన తీసుకురావచ్చు .అయితే కొన్ని సందర్భాలలో మాకేమిటి?, వాళ్ల జోలికి అవసరమా ?, బదునా ము అయితాము అనే చిన్నపాటి సందేహాల కారణంగా సమాజం నుండి మానసిక క్షోభకు గురయ్యే వారికి న్యాయం జరగడం లేదు. ఈ పరిస్థితులను బేరీజు వేసుకొని మనవల్ల జరుగుతున్న పొరపాట్లు ఇప్పటికైనా గుర్తించి మనిషిగా బ్రతుకుదామని, పదిమందిలో గౌరవంగా నిలబడదామని, నేరాలకు పాల్పడకుండా సంస్కారంగా ఉందామని ఆలోచించి మనలో మనం మార్చుకున్నప్పుడు మాత్రమే కుటుంబ మానవ సంబంధాలు బలపడతాయి. అప్పుడు మాత్రమే సమాజం యొక్క మనుగడ పటిష్టంగా ఉంటుంది.
( ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు జేఏసీ సభ్యులు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ రాష్ట్రం) ఊ