అధికారంలో ఉన్న నాడు అహంకారమే
ప్రతిపక్షంలో ఉన్న నేడు కూడా పంతాలు పట్టింపులు ఉంటే ప్రజలు మరోసారి ఓడిస్తారు.
పరిపాలన ఎలా చేస్తారో చూస్తాం అంటూ బెదిరిస్తే పరాభవం తప్పదు.
ఇనుప కంచె బద్దలైనా మీఆదిపత్యం చావలేదంటే మీగోతిని మీరే తవ్వుకున్నట్లు కాదా?
--- వడ్డేపల్లి మల్లేశం
అధికారంలో ఉన్న పార్టీకి పనిచేసిన ప్రభుత్వానికి విమర్శలు తప్పవు అనే నానుడి ఉండనే ఉన్నది. అయితే అందించిన పాలన , తీసుకున్న నిర్ణయాలు , ప్రజా దృక్పథ్యము, అనుసరించిన ప్రజాస్వామిక పంథాను కొ లమానంగా తీసుకోవడం జరుగుతుంది. ప్రజలు అధికారం ఇచ్చిందే ప్రజలకు సేవ చేయడానికి ప్రజా సమస్యలు పరిష్కరించడానికి మెరుగైన సమాజాన్ని ఆవిష్కరింప చేయడానికి కానీ అందుకు భిన్నంగా తమను తామే పొగడుకొని ప్రజలను ఖాతరు చేయకుండా అధికారం శాశ్వతం అని భావించే ఏ పార్టీ ప్రభుత్వానికైనా వరాభవం తప్పదు అని ఇటీవలి తెలంగాణ శాసనసభ ఎన్నికలు రుజువు చేసినవి . అదే సందర్భంలో ప్రజలు ఇచ్చిన తీర్పును సానుకూలంగా స్వీకరించి, తప్పులను సవరించుకొని, లోపాలను గుర్తించి ప్రజల మధ్యలో పనిచేయడం ద్వారా రాబోయే కాలంలో గెలుపు కోసం పోరాడవలసిన అవసరం ఉంటుంది. కానీ అందుకు భిన్నంగా ప్రతిపక్షంలో కూర్చున్న కొద్ది రోజులకే అధికారం కోల్పోయినామనే అక్కస్తో ప్రభుత్వం పైన తిరుగుబాటు చేయడం, శాపనార్థాలు పెట్టడం, బెదిరింపులకు పాల్పడాన్ని గమనిస్తే ప్రజలు ఈ ఆధిపత్యాన్ని ధిక్కరించియే ఓడించినారని గుర్తించక తప్పదు . అధికారానికి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కూడా ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను గ్యారంటీలను సకాలంలో పరిష్కరించడంతోపాటు ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలించకపోతే ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తే ప్రజలు తమ పట్ల కూడా ఇదేవిధంగా స్పందిస్తారని గుర్తిస్తే మంచిది.
అసెంబ్లీలో బీఆర్ఎస్ బెదిరింపు ధోరణి :-
గత ప్రభుత్వ కాలంలో చట్టసభల పనితీరును గమనించినప్పుడు అసలే ప్రతిపక్షాలను లేకుండా చేసిన సందర్భంలో ఎక్కువ సమయం అధికార పార్టీ తీసుకొని 20 ఏళ్ల పాటు తామే పరిపాలిస్తామని ప్రగల్భాలు పలికి ఒకానొక సందర్భంలో మార్షల్స్తో ప్రశ్నించిన ప్రతిపక్షాలను బయటకి గెంటివేసిన సందర్భం మనందరికీ తెలుసు. కానీ దానికి భిన్నంగా కాంగ్రెస్ పార్టీ అధికారానికి వచ్చిన తర్వాత స్పీకర్ నియామకము జరిగి 15 డిసెంబర్ 2023వ రోజున గవర్నర్ ఉభయ సభల సంయుక్త సమావేశంలో ప్రసంగించిన తర్వాత ధన్యవాదాలు తెలిపే తీర్మానం పైన చర్చలో పాల్గొన్న టిఆర్ఎస్ నాయకుల వింత ప్రవర్తనను మనం గమనించవలసి ఉన్నది. 16 డిసెంబర్ 2023 రోజున ధన్యవాద తీర్మానాన్ని ప్రభుత్వం ప్రవేశపెడితే జరిగిన చర్చలో బి ఆర్ఎస్ ప్రక్షాన కేటీఆర్, హరీష్ రావు గారలు మాట్లాడుతూ గవర్నర్ ప్రసంగం కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఉన్నదని, అసత్యాలు, తప్పులతడకా అని, నియంతృత్వం పై మాట్లాడడం మిలీనియం జోక్ అని, ఎలా పరిపాలిస్తారో చూస్తామని శాపనార్థాలు బెదిరింపులను వరుసగా ప్రకటించడాన్ని బట్టి చూస్తే వీరి ప్రసంగాలు ఎంత బాధ్యతారాహిత్యంమో అర్థం చేసుకోవచ్చు . అధికారానికి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వము తాను ఇచ్చిన గ్యారెంటీలను అమలు చేయడానికి సంబంధించి చేస్తున్న కృషిలో భాగంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల పైన సమీక్షలు జరుపుతున్న సందర్భంలో అనేక లోపాలు లోటుపాట్లు బయటపడుతున్నాయి.
24 గంటల కరెంటు పేరుతో ఆడంబరాలు పలికినటువంటి గత ప్రభుత్వం 85 వేల కోట్ల రూపాయల అప్పును కుప్పగా చేసిందని, నిర్మించిన కాలేశ్వరం ప్రాజెక్టు లో అవినీతితో పాటు నాణ్యత లోపం కారణంగా ప్రజాధనం దు ర్వి నియోగమైనదని ప్రభుత్వం ప్రకటించినప్పుడు సమాధానం చెప్పకుండా దాటవేస్తూ ఇచ్చిన గ్యారెంటీలను వెంటనే అమలు చేయాలని ప్రభుత్వం ఏర్పడిన రెండు రోజులకే ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన విషయాన్ని గమనిస్తే టిఆర్ఎస్ పార్టీకి ఎంత మి డిసిపాటు ఉన్నదో అర్థం చేసుకోవచ్చు . పదేళ్ల టిఆర్ఎస్ పాలనలో అనుత్పాదక రంగం పైన ఖర్చు చేసి, రైతుబంధు పేరుతో సంపన్న వర్గాలకు దోచిపెట్టి , కాయిలాపడిన ప్రభుత్వ రంగ పరిశ్రమలను తెరిపించక, నిరుద్యోగులకు ద్రోహం చేసి, పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహణలో వైఫల్యాన్ని మూట కట్టుకున్న విషయం అందరికీ తెలిసిందే .
ఈ లోపాలను వైఫల్యాలను మాటమాత్రంగా అంగీకరించకపోగా హామీలు ఎలా అమలు చేస్తారో చూస్తాం అంటూ కాంగ్రెస్ పార్టీని, ప్రధాని నెహ్రూ నుండి చరిత్రను త్రవ్వడానికి చే సిన శ్రద్ధ ప్రభుత్వానికి సూచనలు ఇచ్చే విషయంలో కానీ తమ ప్రభుత్వంలో జరిగిన లోపాలను అంగీకరించే విషయంలో కానీ చూపకపోవడం లోనే బి ఆర్ ఎస్ ఆధిపత్యము, అహంభావము అర్ధమైపోతున్నది. చట్టసభల్లో మాట్లాడే ధోరణిని గమనిస్తే స్పీకర్ను, ముఖ్యమంత్రిని, సభను ఖాతరు చేయకుండా ప్రసంగించిన తీరు ప్రజలందరూ చూసి ఉన్నారు. "అహంకారం పోవాలి ప్రజాస్వామ్యం రావాలి" అని నినదించినటువంటి ప్రజలు ఎన్నికల్లో ఆ తీర్పును ఇవ్వగా ఇప్పటికీ మళ్ళీ టిఆర్ఎస్ పార్టీ చట్టసభలో అదే వైఖరిని అవలంబిస్తుంటే ప్రజలు మరొక్కసారి కూడా ఓడించడానికి సిద్ధపడతారు అని గుర్తిస్తే మంచిది .
టిఆర్ఎస్ పాలనలో స్వేచ్ఛ లేదు, సమానత్వం లేదు, అంతరాల వ్యవస్థ నెలకొల్పి , ప్రజల ప్రజాస్వామ్యవాదుల విప్లవకారుల మానవ హక్కుల కార్యకర్తల పట్ల నిరంకుశంగా వ్యవహరించి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసినది టిఆర్ఎస్ ప్రభుత్వం కాదా !ప్రగతి భవన్ లోనికి ఆనాటి రాష్ట్ర హోం మంత్రిని కూడా రానివ్వకపోవడం, మరో మంత్రి ఈటల రాజేందర్ ను పోలీసులు అడ్డుకోవడం, ప్రజా యుద్ధనౌక గద్దర్ సమస్యలను దృష్టికి తీసుకురావడానికి అపాయింట్మెంట్ కోరితే గంటల తరబడి ఎండలో నిలబెట్టి అనుమతించకపోవడం , అర్ధరాత్రి ప్రజాస్వామిక వాదుల ఇళ్లల్లో పోలీసులు జొరబడి తలుపులు బద్దలు కొట్టి హౌస్ అరెస్టు చేయడం టిఆర్ఎస్ ప్రభుత్వంలో కొనసాగినది వాస్తవం కాదా? ఇన్ని పొరపాట్లు ప్రజల మదినిండా గాయాలుగా మిగిలిపోతే నూతన ప్రజాస్వామిక దృక్పథంతో ప్రజల కోసం పాలించే ప్రభుత్వాన్ని ఎన్నుకునే క్రమంలో టిఆర్ఎస్ పార్టీని ఓడించిన విషయం అందరికీ తెలిసిందే . ఎన్నికల సమయంలో బుద్ధి జీవులు మేధావులు ప్రజాస్వానిక సంస్థలు ఎన్నో అహంకారానికి చిరునామాగా ఉన్న టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఓడించాలని పిలుపు ఇచ్చిన విషయం టిఆర్ఎస్ నాయకులు మాజీ మంత్రులు ఇప్పటికీ గుర్తించకపోతే భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించక తప్పదు అని గుర్తిస్తే మంచిది. ప్రజాస్వామ్య బద్ధంగా హుందాగా చట్టసభలను నిర్వహించుకోవలసి ఉంటుంది. ప్రతిపక్షాల స్వేచ్ఛను కాపాడడంతోపాటు ప్రభుత్వం యొక్క హుందాతనాన్ని కూడా ప్రతిపక్షాలు నిలబెడితేనే కోట్లాది రూపాయల ప్రజాధనంతో నిర్వహించబడుతున్న చట్టసభలకు సార్థకత ఉంటుంది కానీ పంతాలకు పట్టింపులకు పోతే ఆవులు కొట్లాడితే లేగల కాళ్లు విరిగినట్లు ప్రజల సమస్యలు పక్కదారి పడతాయనే సంస్కారం లేకపోతే ఎలా?
గత తప్పిదాలు నిజం కాదా?
ధర్నా చౌక్ ను ఎత్తివేసి, 8000 మంది రైతుల ఆత్మహత్యలకు కారణమై, యువతను నిర్వీర్యపరచి , మద్యం డ్రగ్స్ అనేక రకాల మాఫియాలకు అవకాశం కల్పించి, సంపన్న వర్గాలకు దోచిపెట్టి , ప్రభుత్వ భూములను అమ్మి, అనేక నిర్మానాల లో అవినీతికి పాల్పడి, బంగారు తెలంగాణ పేరుతో పేద ప్రజల బ్రతుకులను బుగ్గిపాలు చేసి, నిరుద్యోగ యువత జీవితాలను నిండా ముంచి, ప్రకృతి గు ట్టల విధ్వంసాన్ని ప్రోత్సహించి నియంత పోకడలతో నిరంకుశత్వం గా కొనసాగించిన పాలన అప్పుడే మరిచిపోయినారా? కాంగ్రెస్ ప్రభుత్వం పైన దాడికి పాల్పడినట్లుగా మాట్లాడడం ఓటమిపాలైన మిడిసిపాటును తెలియచేస్తున్నది. ప్రజాస్వామ్య పాలన పునరుద్ధరించే దిశగా రాష్ట్రంలో ఎంతో కృషి చేయవలసిన అవసరం ఉన్నది. అందుకు ప్రగతి భవన్ దగ్గర ముల్లకంచెలను బద్దలు కొట్టి ప్రజలకు అవకాశం కల్పించిన తీరును టిఆర్ఎస్ స్వాగతించకపోతే, సచివాలయంలోకి అన్ని పక్షాల వారికి సామాన్యులకు కూడా ప్రవేశాన్ని అనుమతించిన తీరును గుర్తించకపోతే, ఇలాగే సంఘర్షణకు పాల్పడితే ప్రజలే న్యాయ నిర్ణేతలుగా అహంకారాన్ని బద్దలు కొట్టే పరిస్థితి రావచ్చు జాగ్రత్త!
( ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు సీనియర్ ఉపాధ్యాయ ఉద్యమ నేత హుస్నాబాద్ చౌటపల్లి జిల్లా సిద్దిపేట తెలంగాణ రాష్ట్రం)