వేసవి దుక్కులపై మరియు ప్రయోజనాల గురించి రైతులకు అవగాహన సదస్సు
జోగులాంబ గద్వాల 23 మార్చి 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి:- ఇటిక్యాల. చాగాపురం రైతు వేదిక నందు వ్యవసాయ విస్తరణ అధికారి భరత సింహా ఆధ్వర్యంలో రైతులకు వేసవి దుక్కులపై అవగాహన కల్పించడం జరిగింది. ఈ సందర్భంగా వ్యవసాయ విస్తరణాధికారి భరత సింహా మాట్లాడుతూ.....
పంటలకు వేసవి దుక్కులు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. చాలా మంది రబీ పంటలు కోయగానే పొలాన్ని అలాగే వదిలేస్తారు. మళ్లీ తొలకరితోనే ఖరీఫ్‌కి సన్నద్ధమవుతారు. చినుకులు పడగానే దుక్కులు దున్నడం మొదలెడతారు. అలాకాకుండా వేసవిలోనే దుక్కులు దున్నడం వల్ల చాలా ప్రయజనాలు ఉంటాయి
వేసవి లోతు దుక్కుల వలన కలిగే ప్రయోజనాలు: వేసవి లోతు దుక్కులతో భూమిలో తేమ నిల్వ సామర్ధ్యాన్ని పెంపొందించుకోవడం సాధారణంగా చాలా మంది రైతులు సేద్యానికి గొర్రు, గుంటక, దంతె, కల్టివేటరు లాంటి పరికరాలను పదే పదే ఉపయోగించటం వలన నేల లోపల 3-5 అంగుళాల లోతులో గట్టి పొర ఏర్పడుతుంది. అందువల్ల నేలకు నీటిని పీల్చుకొనే సామర్ద్యం తగ్గుతుంది. కాబట్టి నేలను లోతుగా దున్నటం వల్ల ఈ గట్టి పొర ఛేదించబడి నేలకు నీటిని పీల్చుకొనే శక్తీ అధికమవుతుంది. అంతే కాకుండా భూమిలోని లోతైన పొరల నుంచి నీరు ఆవిరి కాకుండా ఉంటుంది. లోతైన వేసవి దుక్కులు (30 సెం. మీ.) వాలుకు అడ్డంగా దున్నటం వలన వర్షపు నీరు వృధా పోకుండా భూమి లోపలి పొరల్లోకి చేరుతుంది. ఒకవేళ వాలుకు అనుకూలంగా దున్నితే నేల కోతకు గురయ్యే అవకాశం ఉంది. సాళ్ళ వెంట వర్షపు నీరు పరుగెత్తి సారవంతమైన మట్టినంతా ఒరవడికి గురిచేసి భూమిని నిస్సారంగా తయారు చేస్తుంది. వాలుకు అడ్డంగా దున్నుకోవటం వలన ఈ సమస్య అధిగమించబడి, భూమి ఎక్కువ తేమను గ్రహించి నిల్వ చేసుకొనే సామర్ద్యాన్ని పెంపొందించుకుంటుంది. లోతు దుక్కుల వలన నేలలోని నీరు ఇంకని పొరలు తొలిగిపోయి, నీరు ఇంకే గుణం పెరుగుతుంది. దీని వలన భూమిపై పడిన ప్రతి వర్షపు నీటి బిందువు అక్కడికక్కడే ఇంకి, నీరు పరిరక్షింపబడుతుంది. తద్వారా నీటిని పరిరక్షించడమే కాకుండా నేల కోతను కూడా నివారిస్తుంది. వర్షాధార పంటలు వివిధ కీలక థల్లో బెట్టకు గురైనప్పుడు (లేదా) తక్కువ వర్షపాతం నమోదు అయినప్పుడు పంట వేర్లు లోతుగా పోవడం వలన నేల లోపలి పొరల్లోని తేమను మరియు పోషకాలను గ్రహించి బెట్టను తట్టుకునే శక్తిని చేకూరుస్తుంది. వేసవి లోతు దుక్కులతో భూసారాన్ని పెంపొందించుకోవటం వేసవిలో లోతు దుక్కి చేసినపుడు భూమి గుళ్ల బారి, గట్టి పొరలు ఏర్పడకుండా మెత్తగా తయారవు తుంది. అంతేగాకుండా, లోతు దుక్కుల వలన ఖరీఫ్, రబీ పంట అవశేషాలు, కలుపు మొక్కలు, పంట మొక్కల నుండి రాలిన ఆకులు వంటి వివిధ సేంద్రీయ పదార్థాలు ఎరువుగా మారతాయి. తద్వారా నేలలో తేమ శాతం పెరగడంతో పాటు సేంద్రీయ కర్బన శాతం, పోషక పదార్థాలు పెరుగుతాయి. దీని వలన మేలు చేసే సూక్ష్మ జీవులు గణనీయంగా వృద్ధి చెందటమే కాకుండా, వానపాములు కూడా వృద్ధి చెందుతాయి. తద్వారా భూసారం వృద్ధి చెందుతుంది. వేసవిలో లోతు దుక్కులు దున్నే ముందుగా భూమిలో పశువుల ఎరువు గానీ, కంపోస్టు గానీ, చెరువు మట్టిని గానీ వెదజల్లటం వలన నేల సారవంతం అవుతుంది. ఈ వేసవి లోతు దుక్కులు దున్నే ముందు పొలంలో పశువుల మందలు గానీ, గొర్రెల మందలు గానీ వదలాలి. ఇలా చేయడం వలన అవి విసర్జించే మల మూత్రాదులు భూమిలోనికి చేరటం వలన సేంద్రీయ పదార్ధం పెరిగి భూసారం వృద్ధి చెందుతుంది. తద్వారా, ప్రత్యేకించి పశువుల ఎరువును (లేదా) రసాయన ఎరువును కొనవలసిన ఖర్చు తగ్గుతుంది. ఈ విధంగా సేంద్రీయ ఎరువులను అందించటం ద్వారా పండించే పంటల్లో స్థూల-సూక్ష్మ పోషక పదార్థాల లోపాలను నివారించుకోవచ్చు. అంతే కాకుండా లోతు దుక్కుల వలన భూమి లోపలి పొరల్లోని మట్టి భూమి పైకి, భూమి పైమట్టి లోపలి పొరల్లోకి కలసిపోవడం ద్వారా భూసారం సమానంగా మొక్కలకు అందుతుందని. ఏఈఓ రైతులకు పలు సూచనలు చేశారు.