విద్యార్థులతో కలిసి ఉపాధ్యాయులు కూడా మధ్యాహ్న భోజనం చేస్తే...

Sep 5, 2025 - 05:51
 0  5

విద్యార్థులతో కలిసి ఉపాధ్యాయులు కూడా మధ్యాహ్న భోజనం చేస్తే.... కుల మతాలకతీతంగా అన్ని వర్గాల ప్రజలు ప్రాంతీయంగా కలిసి ఒకే చోట చదివితే ... అక్కడ భోజనం మరింత నాణ్యతగా ఉంటుంది ఇక్కడ చదువు అందరికి సమానమే దక్కుతుంది......

**************************************

---వడ్డేపల్లి మల్లేశం 9014206412 

04...09...2025***************------

అభివృద్ధి చెందిన దేశాలలో అందరూ సమానమేనని ఒక ప్రాంతానికి చెందిన అన్ని వర్గాల పిల్లలు కూడా ఒకే పాఠశాలలో చదువుకోవాలని తద్వారా ఆ పాఠశాల పైన ఆ పాఠశాలలో బోధించే చదువు పైన ప్రభుత్వాల సమాజం యొక్క శ్రద్ధ మరీ పెరుగుతుందని శాస్త్రీయ అవగాహన కొనసాగుతూ ఉంటే, అభివృద్ధి చెందుతున్న దేశం అని చెప్పుకుంటున్న భారతదేశంలో మాత్రం కామన్ స్కూల్ కోసం 59 సంవత్సరాల క్రితం చేసిన సీఫా రసును అమలు చేయకడానికి ఇప్పటికీ రేఖామాత్రంగానై నా కృషి చేయకపోవడం సిగ్గుచేటు. అందుకే విద్యార్థుల కోసం పాఠశాలల్లో ఏర్పాటు చేస్తున్నటువంటి మధ్యాహ్న భోజనంలో నాణ్యత ఉండాలన్న, ఫుడ్ పాయిజన్ కాకుండా శ్రద్ధ పెరగాలన్న, అన్ని రకాల ఆహార పదార్థాలను సరిపోయే స్థాయిలో అందించాలన్న, ఒక రకమైన నిఘా అవసరమని అదే విద్యార్థులతో సహా కలిసి భోజనం చేసే ఉపాధ్యాయుల సహజీవనమని, ఆ రకంగా ఎందుకు విద్యార్థులతో ఉపాధ్యాయులు కలిసి భోజనం చేయకూడదని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నదంటే రాజకీయ పార్టీలు ప్రభుత్వాలు ఈ విషయంలో ఎంత వెనుకబడిపోయినాయో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలో రెసిడెన్షియల్ కళాశాలలో ఇతర విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థులంతా సాధారణ పేద వర్గాలకు చెందిన వాళ్లే అనే విషయాన్ని మనం అంగీకరించి తీరాలి. ఇక సంపన్న వర్గాల పిల్లలు ప్రభుత్వంతో సంబంధం లేకుండా వాళ్ల సంపదతో మాత్రమే పోటీపడి ప్రైవేటు పాఠశాలల్లో చదువు తున్నారు. వాళ్ల తో పోటీ బడి పేద వర్గాలు కూడా తమ పిల్లలను ప్రైవేటు పాఠశాలల్లోకి పంపడానికి ఆశపడుతున్నారంటే ఇది నిజంగా అనుకరణ మాత్రమే కానీ అక్షర సత్యం కాదు. అర్థవంతమైన ఆలోచన అంతకు కాదు. నేడు విద్య ప్రైవేట్ ప్రభుత్వ యాజమాన్యాలలో కొనసాగుతూ ప్రభుత్వ రంగాన్ని పాలకులే నిర్వీర్యం చేస్తూ ఉంటే రోజురోజుకు ప్రభుత్వ పాఠశాలల్లో సంఖ్య తగ్గి ప్రైవేటు పాఠశాలలు విచ్చలవిడి విహారం చేస్తూ ఉంటే ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న విద్యార్థులకుమాత్రం నాణ్యమైన భోజనాన్ని అందించడానికి కోటి సమస్యలు ఎదురు కావడం, అనేక ఆటంకాలు కల్పించడం, నిర్వాహకులు ఇతరుల యొక్క నిర్లక్ష్యం కారణంగా పేద పిల్లలు ఫుడ్ పాయిజ నుకు బలై అనేక సందర్భాలలో ఇబ్బందులకు గురై కొంతమంది చనిపోయిన విషయాన్ని గమనించవచ్చు. అంటే పేదవాడి కష్టాలకు అంతే లేదు అనేది ఇవాళ జగమెరిగిన సత్యం. పేదల కష్టార్జితంతో సంపద ఉత్పత్తి అవుతూ ఉంటే, మెజారిటీ పేద ప్రజల ఓట్ల తోని ప్రభుత్వాలు కొనసాగుతూ ఉంటే ,ఆ పేద వర్గాల యొక్క భవిష్యత్తును తీర్చిదిద్దడానికి మాత్రం పాలకులు కృషి చేయకపోవడం,అరకొర సౌకర్యాల మధ్య కోర్టులు మందలించే దాకా కూడా చర్యలు తీసుకోకపోవడాన్ని ఏమనాలి?

       2014 15 ప్రాంతంలో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి తెలుగు రాష్ట్రాలకు సంబంధించి పాఠశాలల్లో

మూత్రశారులు మరుగుదొడ్ల దుస్థితి పైన స్పందించిన భారత సర్వోన్నత న్యాయస్థానం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను సీరియస్గా మందలించి తగిన చర్యలు తీసుకోవాలని ఆ సౌకర్యాల లేమి కారణంగానే ప్రభుత్వ విద్యాసంస్థలకు పిల్లలు దూరమవుతున్నారని సోయి పాలకులకు లేకపోవడం విచారకరమని మందలిస్తేనె ఆనాడు పాలకులు చక చక మూత్రశాలలు మరుగుదొడ్దను యుద్ధ ప్రాతిపదికన నిర్మించిన సందర్భాన్ని మనం గమనించవచ్చు. గత దశాబ్ద కాలంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అనేక సందర్భాలలో కళాశాలలు పాఠశాలలు గురుకుల పాఠశాలల్లోని మధ్యాహ్న భోజన సమయములో ఫుడ్ పాయిజన్ భారీగా జరగడాన్ని గమనించినట్లయితే అనేక సందర్భాలలో విద్యార్థులు ధర్నాలు పీకటింగులు చేసిన విషయాన్ని కూడా మనం జ్ఞప్తికి తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఆ మాత్రమై నా పేద విద్యార్థుల పక్షాన న్యాయవ్యవస్థ కనక లేకపోతే పాలకులు స్వచ్ఛందంగా విద్యార్థుల కోసం ఆరాటపడతారంటారా? ఫుడ్ పాయిజన్ కాకుండా ఆ చర్యలు తీసుకుంటారా? ఒక్కసారి ఆలోచించండి. అందుకే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో పాఠశాలల్లో ముఖ్యంగా మధ్యాహ్న భోజన సౌకర్యాల విషయంలో ప్రభుత్వాల యొక్క బాధ్యత రాహిత్యాన్ని కే అఖిల్ శ్రీ గురుతేజ ప్రజాప్రయోజన వ్యాజ్యం ద్వారా హైకోర్టులో ప్రశ్నించినప్పుడు విధి లేని పరిస్థితుల్లోనైనా పేద పిల్లలకు జరుగుతున్న అన్యాయాన్ని సీరియస్ గా తీసుకొని ఇప్పుడు poisan పరిస్థితులను నివారించాలంటే కచ్చితంగా ఆ విద్యాసంస్థల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు పిల్లలతో కలిసి భోజనం చేయాల్సిందే అక్కడ ఎందుకు చేయడం లేదు అని రాష్ట్ర ప్రభుత్వాలను ప్రశ్నించిన తీరు కొంతవరకు అయినా చెంప చెల్లుమనిపించినట్లే. గతంలో నేను ఉపాధ్యాయులుగా పని చేసిన కాలంలో 2014-17 ప్రాంతంలో విద్యార్థులతో కలిసి ప్రతిరోజు కూడా భోజనం చేసి వృధా కాకుండా చూడడంతో పాటు నాణ్యమైన భోజనాన్ని అందించే సందర్భంగా అటు ప్రధానోపాధ్యాయులను ఇటు నిర్వాహకుల పైన ఒత్తిడి తీసుకురావడంతో పాటు మెనూ పూర్తిగా అమలయేలా చూడడం జరిగింది. నాణ్యమైన సరుకు లను వండి పెట్టే విధంగా సిఫారసు చేయడంతో పాటు ఫుడ్ పాయిజన్ సంబంధించినటువంటి జాడ లేనటువంటి పరిస్థితులను కల్పించిన విషయంలో మా అనుభవం దాగి ఉన్నది అని చెప్పక తప్పదు. నిజంగా ఉపాధ్యాయులు కూడా విద్యార్థులతో కలిసి భోజనం చేస్తే ఆ రూపురేఖలు హావ భావాలతో పాటు, విద్యార్థులు వృధా చేయకపోవడం, కలిసి భోజనం చేయడంలోనే సంస్కారం, నాణ్యమైన భోజనం అందుతుందని భరోసా మనం కల్పించడానికి అవకాశం ఉంటుందనేది నగ్న సత్యం. బహుశా ఈ అంశాలను దృష్టిలో ఉంచుకొని హైకోర్టు ఈ సూచన చేసి ఉంటుంది దాన్ని ఆదేశంగా స్వీకరించి ప్రతి పాఠశాలలో ఉపాధ్యాయులు ప్రతిరోజు కూడా విద్యార్థులతో కలిసి భోజనం చేసేటువంటి నూతన వ్యవస్థను ఆవిష్కరించవలసిన బాధ్యత ప్రభుత్వాలపైన ఉన్నది .

    హైకోర్టు ఆదేశాలను గమనిస్తే :-

------------------------ప్రభుత్వ విద్యాసంస్థల్లో నాణ్యమైన భోజనాన్ని అందించడానికి తీసుకున్న చర్యలు ఏమిటి విద్యార్థులకు అందిస్తున్నటువంటి మె ను వివరాలను సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ 3 సెప్టెంబర్ 2025 రోజున జరిగిన విచారణను 19వ తేదీకి వాయిదా వేసినట్లు తెలుస్తున్నది. జాతీయ బాలల హక్కుల రక్షణ కమిషన్ మార్గదర్శకాల ప్రకారంగా పాఠశాల లోపల విద్యార్థులకు సౌకర్యాలు కల్పించకపోవడం, పోషకాహారాన్ని అందించకపోవడం, మె ను నిర్వహణలో నిర్లక్ష్యం వంటి అంశాల పైన దాఖలైన పిటిషన్ పైన స్పందించినటువంటి హైకోర్టు మరింత లోతుగా చర్చించి ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వవలసిన అవసరం మాత్రం తప్పకుండా ఉన్నది .పేదవాడి కోపం పెదవికి చేటు అన్న మాదిరిగా ప్రభుత్వ పాఠశాలలు కళాశాలలో విశ్వవిద్యాలయాల్లో కేవలం పేద విద్యార్థులు మాత్రమే చదువుతున్నారనేది నగ్న సత్యం.ఈ పేద విద్యార్థులకు అంత మంచి భోజనం, ఇంత మంచి నాన్యతతో కూడుకున్న విద్యయా? అనె ఆలోచనతో కాబోలు ప్రభుత్వాలు ప్రభుత్వ పాఠశాలలు కళాశాలలు విశ్వవిద్యాలయాల పట్ల సవతి తల్లి ప్రేమ కనబర చడాన్ని తప్పనిసరిగా హైకోర్టు సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం చాలా ఉన్నది. ఇటీవల రాష్ట్రంలోని ఒక పాఠశాలలో కలుషిత ఆహారముతో 111 మంది బాలికలు ఆస్వస్థతకు గురైన సంఘటన పతాక శీర్షికలలో వచ్చిన విషయం మనందరికీ తెలుసు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాస్మెటిక్ చార్జీలను మెనూ తో పాటు నిర్వాహనకు అయ్యే ఖర్చులను భారీగా పెంచినట్లు ప్రకటించినప్పటికీ ఆచరణలో మాత్రం ఇప్పటికీ అర కొర సౌకర్యాల మధ్యన వంట ఏజెన్సీ వాళ్ళు పిల్లలకు భోజనం సరఫరా చేయడాన్ని మనం గమనిస్తే ఇది కేవలం పేద విద్యార్థులకు దయాదాక్షిణ్యము కింద సర పరా చేస్తున్నట్టుగానే ఉంది కానీ రాజ్యాంగబద్ధమైన హక్కు గా మాత్రం అనుభవించినట్టు లేదు అనేది నిజం. హైకోర్టు ప్రభుత్వాన్ని మందలించిన తీరే సాక్ష్యం. ఇలాంటి సన్నివేశాలు కేవలం తెలంగాణ రాష్ట్రానికి మాత్రమే పరిమితం కాలేదు. ఆంధ్రప్రదేశ్ ఇతర రాష్ట్రాలు అదే కోవలో పయనిస్తున్నాయి. నిధులను సకాలంలో అందించకపోవడం, నిధులను పెంచకపోవడం, సౌకర్యాలు కల్పించకపోవడం, వంట గదులను ఏర్పాటు చేయకపోవడం, పారిశుద్ధ్య సౌకర్యాలను ఏర్పాటు చేయకపోవడం, సక్రమమైనటువంటి మంచినీటి సరఫరా లేకపోవడం వంటి అనేక రకాల ఇక్కట్లతో పాఠశాలల్లో భోజన వ్యవస్థ కొనసాగుతూ ఉంటే దానికి బాధ్యత వహించవలసినటువంటి ప్రభుత్వాలు అక్కడో ఇక్కడో జరిగే చిన్నపాటి ఫుడ్ పాయిజన్ కేసులకు క్షేత్రస్థాయి నిర్వాహకుల పైన చిరు ఉద్యోగుల పైనన చర్యలు తీసుకోవడo తో సరిపెడితే నేరం ఒకరు చేస్తే శిక్ష ఒకరికి అన్నట్లుగా స్పష్టంగా కనబడుతున్నది. "బాధ్యత మరిచి విద్యారంగానికి నిధులను అత్యల్ప స్థాయిలో కేటాయిస్తున్నటువంటి పాలకులు ముందుగా బాధ్యతను గుర్తించాలి, తమ నేరాన్ని అంగీకరించాలి, రాజ్యాంగబద్ధమైన చర్యలను తీసుకునే క్రమము లోపల పేద విద్యార్థుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించే ప్రభుత్వ దమన నీతిని ఎండ కట్టాల్సిన అవసరం కూడా ఉన్నది. విద్య వైద్యం లాభాలు తెచ్చి పెట్టేవి కావని, ఓట్లను కుమ్మరించేవి కావని పాలకులకు తెలుసు.అందుకే ఈ రంగాల పైన పెద్దగా ఖర్చు చేయడానికి ప్రభుత్వాలు అంగీకరించవు. ప్రచార ఆర్భాటాలు వాగ్దానాలు హామీల మీద పెద్ద మొత్తంలో ఖర్చు చేసి అదే పరిపాలన అని మురిసిపోవడాన్ని ఇకనైనా ప్రభుత్వాలు మానుకోవాలి." ప్రభుత్వ రంగాన్ని పూర్తిస్థాయిలో తీర్చిదిద్ది ప్రైవేటు యాజమాన్యంలో విద్యా వైద్యం లేకుండా అదుపు చేయగలిగితే ఉచిత నాణ్యమైన విద్యను వైద్యాన్ని ప్రజలకు అందించగలిగితే అదే నిజమైన సుపరిపాలనకు గీ టు రాయి. ఆ వైపుగా ఆలోచించాలని ప్రజల జీవితాలతో చెలగాటమాడకూడదని విద్యా వైద్య రంగాలను వ్యాపార రంగాలుగా చూడకూడదని మేధావులు విశ్లేషకులు చేస్తున్న హెచ్చరికను ఇకనైనా ప్రభుత్వాలు పాటించాలని మనసారా కోరుకుంటున్నాం. ప్రభుత్వ విద్యా రంగం పైన సమగ్రమైన విచారణకు హైకోర్టుసుప్రీంకోర్టు చొరవ చూపాలని ఆశిద్దాం.

( ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకులు అరసం రాష్ట్ర కమిటీ సభ్యుడు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ)

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333