విచారణకు ఆదేశించే అధికారం కొత్త ప్రభుత్వాలకు ఉండాలి.

Aug 4, 2024 - 19:46
Aug 26, 2024 - 17:41
 0  6
విచారణకు ఆదేశించే అధికారం కొత్త ప్రభుత్వాలకు ఉండాలి.

 గత ప్రభుత్వాల అవినీతి పై  నిగ్గు తేల్చక పోతే ప్రజాధనం వృధా అయినట్లే కదా!   !దోషులని తేలితే శిక్షించి,  అక్రమ సొమ్మును రాబట్టి,  ప్రభుత్వ ఖాతాలో జమ చేయాలి  .*పేద వర్గాలకు పంపిణీ చేయాలి .
*************
--- వడ్డేపల్లి మల్లేశం 
ఒక ప్రభుత్వ హయాములో చేసిన అప్పులను  అదే ప్రభుత్వం చెల్లించి  అధికారాన్ని వేరొక ప్రభుత్వానికి అప్పగించాలని ప్రతిపాదన ఇటీవల కాలంలో వాట్స్అప్ గ్రూపులలో ప్రధానంగా కనిపిస్తున్నది
  ఆచరణ సాధ్యం అయినా కాకపోయినా  ప్రజాధనాన్ని కొల్లగొట్టి ఆర్థిక అరాచకత్వానికి పాల్పడే ఏ ప్రభుత్వమైనా ఇష్టం ఉన్నట్లుగా అప్పులను చేసి ప్రజలను వంచిస్తే  కచ్చితంగా ఆ ప్రభుత్వమే లేదా ఆ పార్టీకి చెందిన నాయకులే ఆ అప్పులు తీర్చే విధంగా చట్టం రావాల్సిన అవసరం ఉన్నది . ఈ అంశం ఇలాగా ఉంటే  ఒక ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిపైన  తరువాత వచ్చిన ప్రభుత్వం   విచారణ కమిషన్లను వేసిన సందర్భం అంతగా కనిపించడం లేదు.  ఒకవేళ అలా చేస్తే కక్షపూరితంగా చర్యలు చేపట్టినట్టుగా ప్రజలు లేదా  ప్రతిపక్షాలు భావించడం కూడా బహుశా  కారణం కావచ్చు.  ఇక మరికొన్ని సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ప్రతినిధులు  ఒక రాష్ట్రంలో జరిగిన అవినీతిపైన విచారణ జరిపించడానికి రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం కోరితే సిబిఐ విచారణ చేయించడానికి సిద్ధమని పదేపదే చెప్పిన సందర్భాలు ఉన్నాయి . అంటే రాష్ట్ర ప్రభుత్వం కోరకుండా సిబిఐ విచారణ కేంద్ర ప్రభుత్వం చేయదు అని అర్థమవుతుంది . ఇక్కడ  అవినీతిని  కట్టడి చేయడము చర్యలు తీసుకోవడం కంటే అవినీతిపరులను కాపాడడమే ప్రధానంగా కనిపిస్తుంది . రాష్ట్ర ప్రభుత్వ ప్రమేయం లేకుండా కూడా  ఒక రాష్ట్రంలో జరిగినటువంటి అవినీతిని ప్రజాప్రయోజనం దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం సిబిఐ ఈ డి ద్వారా విచారణ జరిపిస్తే నేరమేమి కాదు కానీ ప్రజల ఆమోదం ప్రజాస్వామ్యవాదుల యొక్క అనుమతి ఉన్నప్పుడు  కచ్చితంగా చర్యలు చేపట్టవలసిందే. ఇక్కడ కావలసినది ప్రజలకు చెందిన డబ్బు వృధా పోయిన పరిస్థితిలో దానిపైన నీ గ్గు తేల్చి ఆ డబ్బులు రాబట్టి ప్రభుత్వ ఖాతాకు జమ చేయడమే ప్రధానమైన ఇతివృత్తం కావాలి . తెలంగాణ రాష్ట్రంలో  కాలేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి నాణ్యత లోపం పైన  రాష్ట్ర ప్రభుత్వం కోరితే సిబిఐ విచారణ జరిపించడానికి తమ వంతు కృషి చేస్తామని కేంద్ర మంత్రి అనేకసార్లు ప్రస్తావించిన విషయాన్ని మనం గమనించవచ్చు. అంతేకాకుండా  తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ అధికారంలో ఉన్న కాలంలో  ప్రధానమంత్రి తో పాటు  బిజెపి అధ్యక్షులు ఇతర సీనియర్ నాయకులు సైతం రాష్ట్రంలో అవినీతి విచ్చలవిడిగా కొనసాగుతున్నదని ,అవినీతిని  ఉపేక్షించే ప్రసక్తి లేదని,  తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించినా ఎలాంటి చర్యలు లేకుండానే అంతర్గత ఒప్పందాలతో  అవినీతి అటుకెక్కిన విషయాన్ని మనం గమనించవచ్చు.  కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల యొక్క ప్రయోజనాలు  అభివృద్ధి సంక్షేమం దృష్ట్యా  రాష్ట్రాల నుండి వస్తున్న పనుల ద్వారా వచ్చిన ఆదాయంలో నుండి కొంత భాగాన్ని రాష్ట్రాలకు ఇవ్వడంతో పాటు  కేంద్రం సాయం చేస్తున్న విషయాన్ని కూడా గమనించినప్పుడు రాష్ట్ర ప్రజల యొక్క ప్రయోజనాలను కాపాడవలసిన బాధ్యత కూడా కేంద్రం పైన ఉందని గుర్తిస్తే మంచిది. అందుకు సంబంధించిన చట్టాలను  పార్లమెంటు చేయడం ద్వారా  రాష్ట్రాలలో ఒక ప్రభుత్వం చేసిన అవినీతిని తర్వాత వచ్చే ప్రభుత్వాలు  ఉక్కు పాదం మోపి  విచారణ జరిపించి దోషులను శిక్షించే విధంగా అధికారాన్ని కల్పించాలి. అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన  అవినీతి బాగోతం పైన అవసరమైతే కేంద్ర ప్రభుత్వం కూడా ప్రత్యక్షంగా జోక్యం కల్పించుకొని సిబిఐ ఈడి విచారణ ద్వారా  ప్రజల సొమ్మును తిరిగి రాబట్టగలిగి దోషులను బోనులో నిలబెట్టాలి . ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం  కొనసాగుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం  ఫోన్ టాపింగ్  కాలేశ్వరం ప్రాజెక్టు  అవినీతి  వంటి అంశాల పైన  విజిలెన్స్  అధికారుల ద్వారా విచారణ జరిపిస్తున్నట్లు కనపడినప్పటికీ  ఆ విచారణ వేగవంతమైనట్లు లేదా దోషులకు శిక్ష పడే అవకాశం ఉన్నట్లు అంతగా కనిపించడం లేదు. పైగా ప్రతిపక్షం కూడా  ప్రభుత్వాన్ని నిలబెట్టి  కాలేశ్వరం ప్రాజెక్టులో తమ నేరం ఏమీ లేదని ఇటీవల పెద్ద ఎత్తున దుమారం లేపడం కూడా ఆలోచించ తగినది  అంటే దోషులను నిర్ధారించడంలో జాప్యానికి కారణాన్ని కూడా మనం గ్రహించవలసిన అవసరం ఉన్నది . ఇక  గత నాలుగైదు రోజులుగా కొనసాగుతున్నటువంటి బడ్జెట్ సమావేశాలలో  ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే విధంగా ప్రతిపక్షం ముఖ్యంగా టిఆర్ఎస్ మాట్లాడిన సందర్భంలో  ముఖ్యమంత్రి గారు  కెసిఆర్ కిట్, గొర్రెల పంపిణీ  వంటి  అవినీతి బాగోతాల పైన విచారణ జరిపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం మీరు అంగీకరిస్తారా  ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారని ప్రశ్నించడంలో  కొంత సందేహం కనపడుతున్నది.  గత ప్రభుత్వం అక్రమంగా ఏ పనులు చేసిన అన్నింటి పైన  సమగ్రంగా విచారణ జరిపించడానికి  అసెంబ్లీలో చర్చించడంతోపాటు ప్రత్యేక  కమిటీలను వేయడం ద్వారా విచారణ జరిపించి దోషులను శిక్షించడానికి ప్రతిపక్షాల యొక్క  అనుమతి అడగవలసిన అవసరం లేదు.  విచారణ కమిటీ నిర్దోషులని తేలితే  ఇబ్బంది లేదు లేకుంటే అవినీతిపరులనీ తేలితే కచ్చితంగా శిక్షించాలి ఆ సొమ్మును రాబట్టి ప్రభుత్వ ఖాతాకు జమ చేయాలి. పేద వర్గాల సంక్షేమంలో ఆ ధనాన్ని వినియోగించాలి
         .ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత ప్రభుత్వం  తొమ్మిది లక్షల కోట్లకు పైగా అప్పులు చేసినట్లు , సంక్షేమం పేరుతో విచ్చలవిడిగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం ద్వారా పోలవరం ప్రాజెక్టు రాజధాని అమరావతి వంటి ప్రధానమైనటువంటి ప్రాజెక్టులు  మూలకు పడినట్లు తెలుస్తున్నది . ఈ విషయం పైన అక్కడి ప్రభుత్వం  అసెంబ్లీలోనూ  బయట కూడా ప్రస్తావించిన సందర్భంలో అరాచకత్వం  ఆర్థిక  దోపిడీ  కొనసాగించిన గత ప్రభుత్వ  అవినీతిపైన విచారణ జరిపించడం  తమ బాధ్యత అని ప్రకటించడం  సరైనదే.  పాఠశాలల పైన కొంతవరకు దృష్టి సారించినట్లు కనిపించినప్పటికీ మిగతా అన్ని విషయాలలోనూ  స్వేచ్ఛ స్వాతంత్రాలు లేకుండా పత్రికా స్వాతంత్రాన్ని తుంగలో తొక్కి ప్రతిపక్ష కార్యకర్తలను ఇష్టారాజ్యంగా హింసించి  వివిధ  పథకాల పేరుతో ప్రజల ఖాతాలలో జమ చేయడానికి కోట్ల రూపాయలను ఖర్చు చేసి,  సంపదను పెంచే విషయంలో దృష్టి సారించని కారణంగా మొన్నటి ఎన్నికల్లో  ప్రజలు ఓట్లు వేయని విషయాన్ని మనం గమనించాలి . సంపాదన సృష్టించి ప్రజలకు పo చాలంటే  ఉద్యోగ ఉపాధి అవకాశాలను మెరుగుపరచాలి ప్రజలు తమ కాళ్ళ మీద నిలబడే విధంగా ప్రోత్సహించాలి కానీ అలాంటి పనులు జరగని కారణంగా అక్కడ ప్రభుత్వం కూలిపోయింది అని విశ్లేషకులు భావిస్తున్నారు. అదే మాదిరిగా తెలంగాణలో కూడా గత బిఆర్ఎస్ ప్రభుత్వం ఆర్థిక అరాచకత్వానికి పాల్పడి కోట్లాది రూపాయల అప్పులు చేసి, పేద వర్గాలను విస్మరించి, భూస్వాములు పెట్టుబడిదారులకు ఉపయోగపడే కార్యక్రమాలతో పాటు ప్రభుత్వ రంగాన్ని నిర్వీర్యం చేసిన కారణంగా  సామాన్య ప్రజలు నవంబర్ 2o23 లో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో  ఓడించినారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు . ప్రజల ప్రయోజనాలను కాపాడకపోవడం ఒక ఎత్తు అయితే ప్రజాధనాన్ని కొల్లగొట్టడం మరొక అంశం ప్రజాధనాన్నీ కొల్లగొట్టే అధికారం ఎవరికి లేదు కానీ ఇటీవల కాలంలో అధికారంలో కొనసాగిన ప్రభుత్వాలు విచ్చలవిడిగా ఖర్చు చేయడమే కాకుండా పొదుపును పాటించకుండా  నిర్మాణాల పేరుతో కమిషన్లకు ఎగబడి  కొంతమంది జేబులు నింపడానికే ప్రయత్నం చేయడాన్నీ గమనించినప్పుడు  కచ్చితంగా గత పాలకులు అధికారుల పైన  విచారణ జరపాల్సిందే .ఇటీవల వెలుగు చూసిన కొన్ని అంశాలను చూస్తే ఆంధ్రప్రదేశ్లోనూ తెలంగాణలోనూ గత ప్రభుత్వ హయాములో పనిచేసినటువంటి అధికారులు ప్రభుత్వా రికార్డులను మార్చడం తగలబెట్టడం లేదా విచ్చలవిడిగా అధికారాన్ని దు ర్వినియోగం చేసిన సందర్భాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఏ ప్రభుత్వమైనా  విధాన పరమైన నిర్ణయాలు తీసుకునే అధికారుల పైన ఉక్కు పాదం మోపాల్సినటువంటి అవసరం ఉంది అదే సందర్భంలో నిఘా వేయడం కూడా చాలా అవసరం . అధికారులకు శాసనసభ్యులకు మంత్రులకు స్వేచ్ఛ  ఉండాల్సిందే కానీ అక్రమంగా తమ అధికారాన్ని వినియోగించి స్వార్థ ప్రయోజనాలకు పాకులాడే సందర్భాలు ఎక్కువగా ఉన్న ఈ పరిస్థితులలో  అంతే స్థాయిలో ప్రభుత్వం ఉక్కు పాదం మోపడం కూడా చాలా అవసరం. ఇటీవల వెలుగు చూసిన సందర్భాలను గమనిస్తే కోట్లాది రూపాయలను కొల్లగొట్టినటువంటి  అధికారులు,  భూ కబ్జాలకు పాల్పడినటువంటి శాసనసభ్యులు మంత్రులను దేశవ్యాప్తంగా కూడా మనం గమనించవచ్చు.  కేంద్ర ప్రభుత్వంలో కానీ ఏ రాష్ట్ర ప్రభుత్వంలో కానీ అవినీతి జరిగిన ప్రతిచోట విచారణ జరిపించడంపై కేంద్రం ప్రత్యేకంగా చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక కుటుంబానికి తల్లిదండ్రి పాత్రను కేంద్రం వహిస్తున్నది కనుక దేశంలో ఏ మూలన అవినీతి జరిగి ప్రజాధనం వృధా అయిన దానిని అడ్డుకొని వసూలు చేసి ప్రజల ఫరం చేయాల్సిన బాధ్యత కేంద్రం పైన ఉన్నదని గుర్తిస్తే మంచిది . లేకుంటే పాలకుల అవినీతిఅరాచకాల  పైన ప్రజలు ప్రజాస్వామ్యవాదులు  ప్రతిఘటించి   పోరాడే  సందర్భాలు భవిష్యత్తులో రాక మానవు అని గుర్తిస్తే మంచిది.
(  ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు అభ్యుదయ రసియితల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు హుస్నాబాద్ (చౌటపల్లి) జిల్లా సిద్దిపేట తెలంగాణ  )

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333