జిల్లా ఉత్తమ ఉపాధ్యాయురాలు వనజ టీచర్ కు పాఠశాల ఉపాధ్యాయుల, విద్యార్థుల ఆత్మీయ అభినందన
తెలంగాణ వార్త ఆత్మకూరు ఎస్ : మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఆత్మకూర్ (ఎస్) ప్రధానోపాధ్యాయురాలు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయురాలు పి. వనజ ఇటీవల బయోసైన్స్ స్కూల్ అసిస్టెంట్ గా పదోన్నతి ద్వారా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నామవరం (మోతే మండలం) కు వెళ్ళింది. ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులు, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థుల సమక్షంలో కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు శ్రీ వి శ్రవణ్ కుమార్ అధ్యక్షతన వీడ్కోలు అభినందన సభ ఏర్పాటు చేసినారు. ఈ సందర్భంగా కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు శ్రీ వి శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ వనజ మేడం నూతన వినూతన బోధనా పద్ధతులతో విద్యార్థులను తీర్చి దిద్దిన విధానం మర్చిపోలేనిదని ప్రశంసించారు. వనజ మేడం ఉపాధ్యాయులను సమన్వయపరిచి వేసవిలో బడిబాట కార్యక్రమంలో ప్రతి ఇంటికి వెళ్లి తల్లిదండ్రులకు భరోసానిచ్చి సుమారు 50 నూతన అడ్మిషన్లు పొందడం అభినందనీయమన్నారు. వనజ మేడం పాఠశాల విద్యార్థిని విద్యార్థులందరికీ, నోటు పుస్తకాలు, పలుకలు, పెన్నులు పెన్సిల్లు, రైటింగ్ ప్యాడ్స్ బహుకరించారు, ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రసన్న కుమార్, మాజీ ప్రధానోపాధ్యాయురాలు వెన్న ఊర్మిళ, ఉపాధ్యాయులు రంగా జగన్, చౌదర్ రెడ్డి, రమేష్, సురేందర్ విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.