అంతర్జాతీయంగా కట్టడి చేయడమే కీలకం

విష పరిణామాలు తెలిసి అలసత్వం ఎందుకు ,?
విష ఫలితాలను అవగాహన చేసుకోవడం చైతన్యానికి చాలా అవసరం
చర్చలను ప్లాస్టిక్ లాగా సాగదీస్తే ప్రపంచం పెను ప్రమాదాన్ని ఎదుర్కోక తప్పదు
---- వడ్డేపల్లి మల్లేశం
ప్రపంచ మనుగడను కొన్నేళ్లుగా పరిశీలిస్తే మైక్రో నానో ప్లాస్టిక్లు మానవ రక్తంలో చివరకు గర్భిణుల మావిలోనూ కనిపిస్తున్నాయని శాస్త్రవేత్తలు అంచనా వేసినారంటే ఇది ఆందోళనకర పరిణామమే కదా ! ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ మాత్రమే సరిపోదు ఉత్పత్తిని గణనీయంగా తగ్గించడం ద్వారా విష పరిణామాలను ప్రపంచం తరిమికొట్టాలని చేస్తున్న ప్రయత్నాలకు 2024 మే తొలి వారంలో కెనడా రాజధాని ఒ ట్టావా వేదికైనా ఒప్పందంపై నిర్ణయం కుదరకపోవడం, ప్లాస్టిక్ను నిరోధించాలని 192 దేశాలలో ఎక్కువ దేశాలు అంగీకరించడం జరిగినప్పటికీ ఉత్పత్తిపై పరిమితులు విధించే అంశం పైన ఒక్క తాటికి రాలేకపోవడం నిరాశ కలిగించే అంశం అని విజ్ఞులు అభిప్రాయపడుతున్నారు.
ప్లాస్టిక్ పైన అంతర్జాతీయ ఒడంబడిక ప్రక్రియ 2022లోనే అంతర్జాతీయ స్థాయిలో ప్రారంభమై ఉత్పత్తిని ఆపేయాలని, వినియోగాన్ని భారీగా తగ్గించాలని, అందుకు కాలవ్యవధిని నిర్ణయించాలని ప్రపంచ దేశాలు నిర్ణయించి అంతర్జాతీయ స్థాయిలో ఒక కమిటీని ఏర్పాటు చేసి 2024 డిసెంబర్ కల్లా ఖరారు చేయాలనేది ఒప్పందంలో భాగం . భారతదేశo 2022లోనే ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ నిబంధనలు తీసుకువచ్చి 19 రకాల సింగిల్ యూస్ ప్లాస్టిక్ ను నిషేధించినప్పటికీ దేశానికో తీరు ప్రాంతానికోతీరు నిబంధనలు ఉన్న కారణంగా కచ్చితంగా నియంత్రణ వ్యర్థాల నిర్వహణ అమలు కావడం లేదు. సమస్య తెలిసింది, పరిష్కారాలు తెలుసు, విష పరిణామాలు కూడా ప్రపంచ దేశాలకు తెలుసు, ఇక కావలసింది అంతర్జాతీయ స్థాయిలో చిత్తశుద్ధి కఠిన నిర్ణయాలు మాత్రమే .
వినియోగం, ఉత్పత్తి, పరిణామాలకు సంబంధించిన సమాచారం
అందుబాటు ధరల్లో ప్రత్యామ్నాయ వస్తువులు లేకపోవడంతో ప్లాస్టిక్ వినియోగం భారీగా పెరగడం కలవరపరిచే సమస్య . 1950లో 20 లక్షల టన్నుల ప్లాస్టిక్ ఉత్పత్తి ఉంటే 2019 నాటికి 4,600 లక్షల టన్నులకు చేరడం అది 205o నాటికి ఏటా 1220 లక్షల టన్నులకు చేరనుందని అంచనా పసిగట్టిన ప్రపంచ దేశాలు వ్యర్థాల నిర్వహణను 100% తీసుకురావాలని లక్ష్యంతో అంతర్జాతీయ వడంబడిక రెండేళ్ల క్రితమే ప్రారంభమైనట్లు తెలుస్తున్నది . ప్లాస్టిక్ భూమిలో కలిసిపోదు గనుక పర్యావరణానికి ప్రజల ఆరోగ్యానికి ఇబ్బంది కలిగించడంతోపాటు గ్రీన్ హౌస్ వాయువులు వెలువడి భూతాపం పెరగడంతో సముద్రాలు ఉప్పొంగే ప్రమాదం కూడా ఉంది. కార్బన్డయాక్సైడ్ వాతావరణం లోకి వదలడంతోపాటు మనం వాడే ప్లాస్టిక్ లో 16,000 రకాల రసాయనాలు ఉంటాయని ,వాటిలో కనీసం 4200 విషపూరితమైనవ ని , వాటి వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలతో 2015లో అమెరికా దేశం తన ప్రజల కోసం 9200 కోట్ల డాలర్లను ఖర్చు చేయక తప్పలేదని తెలుస్తున్నది.
ఈ పరిస్థితులలో ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడంతోపాటు ఉత్పత్తిని పై నియంత్రణ విధించి రీసైక్లింగ్ చేయడం ద్వారా విష ఫలితాలను తగ్గించాలని ప్రయత్నం చేస్తున్నప్పటికీ విజయవంతమైనట్టుగా కనిపించడం లేదు. ఇటీవల ఒట్టావా లో జరిగిన సమావేశంలోనూ ఉత్పత్తిపై పరిమితులు విధించడంతోపాటు వ్యర్థాల నిర్వహణ పునర్ వినియోగం పైన దృష్టి పెట్టాలని ప్రపంచ దేశాలు డిమాండ్ చేసినట్లుగా తెలుస్తున్నది . అయితే కఠోరమైన వాస్తవం ఏమిటంటే ఇప్పటిదాకా ప్రపంచంలో జమైనటువంటి ప్లాస్టిక్ వ్యక్తపదార్థాలలో 10 శాతం మాత్రమే పునర్ వినియోగమైనట్లు మిగతా వ్యక్త పదార్థాలు సముద్రాలు నేలలు పశువుల జీర్ణవ్యవస్థలోకి వెళ్లినట్లు తెలుస్తున్నది.
దీనితో నదులు ప్రవాహాలలోని నీరు కూడా కలుషితం కావడం ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్న విషయాన్ని గమనించాలి. ప్రపంచవ్యాప్తంగా ఒకే నిబంధనలను తీసుకురావడం ద్వారా ఉత్పత్తి పునర్వినియోగము వ్యర్త పదార్థాల నిర్వహణ పైన ఉక్కు పాదం మోపాల్సిన అవసరం ఉన్నది. ప్లాస్టిక్ ప్రత్యామ్నాయాన్ని సాధించే క్రమంలో కూడా పరిశోధనలు సాగాలి . ధనిక దేశాలు తమ వాణిజ్య ప్రయోజనాల కోసం ప్లాస్టిక్ ఉత్పత్తి పైన దృష్టి పెట్టడాన్ని తగ్గించి ప్రపంచ మానవాళి మనుగడ కోసం ప్లాస్టిక్ విష పరిణామాలను నిరోధించడంలో దృష్టి సారించి పేద ఇతర దేశాలతో కలిసి పని చేసినప్పుడు మాత్రమే ఏకత్వం సాధ్యమవుతుంది . పరిణామాలు పరిష్కారాలు తెలిసినా కట్టడి చేయలేకపోతున్నాం అంటే కొన్ని దేశాల వర్గ ప్రయోజనాన్ని అంతర్జాతీయ కాలుష్యానికి తాకట్టు పెట్టడమేనని భావించవలసి వస్తుంది . లక్ష్యం భారీగా ఉన్నప్పటికి ఇటీవలి ఒట్టావా సమావేశం ప్రజలలో అసంతృప్తిని మిగిల్చి తమ బాధ్యతను విస్మరించినట్లుగా భావించవలసిన అవసరం ఉంది.
ఈ విషయంలో ప్రపంచ దేశాల ప్రజలు కూడా చైతన్యమై ఎక్కడికక్కడ పాలకులను నిలదీయడం ద్వారా ప్లాస్టిక్ వినియోగాన్ని స్వచ్ఛందంగా తగ్గించడంతోపాటు ప్రత్యామ్నాయ వస్తువుల పైన దృష్టి సారించగలిగినప్పుడు.... పౌర సమాజం పాలకుల చిత్తశుద్ధి రెండు కలిస్తేనే అలసత్వంతో ప్రపంచాన్ని పెను ప్రమాదంలోకి నెట్టుతున్న ఈ ప్లాస్టిక్ కల్లోలాన్ని ఆపడానికి అవకాశం ఉంటుంది. .ముఖ్యంగా అభివృద్ధి చెందిన సంపన్న దేశాలలో ప్లాస్టిక్ తయారీ పంపిణీ పరిశ్రమ జోరుగా సాగుతుండడం తో ప్లాస్టిక్ ఉత్పత్తి వినియోగం పైన పరిమితి విధించాలనే నిబంధనను ఉల్లంఘించినట్లుగా తెలుస్తున్నది. అంటే సంపన్న వర్గాల తో సమాజానికి ప్రపంచానికి ఎప్పుడైనా హాని ఉంటుందని, తమ వర్గ ప్రయోజనం కోసం మాత్రమే ఆలోచన చేస్తారనే విశాల భావజాలాన్ని ప్రజలు అవగాహన చేసుకుంటే ప్లాస్టిక్ అదుపు, అందుకు తగిన పోరాటాలు చేయడానికి, ఉద్యమాలను తీసుకురావడానికి అవకాశం ఉంటుంది.
( ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు అభ్యుదయ రచయితల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ రాష్ట్రం)