రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి: జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్.
ఖమ్మం 04 మార్చి 2025 తెలంగాణవార్త ప్రతినిధి:- ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అధికారులను ఆదేశించారు. మంగళవారం మణుగూరు ప్రభుత్వాసుపత్రిని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఆసుపత్రిలో కలియ తిరుగుతూ జనరల్ వార్డు, ఇన్ పేషెంట్ వార్డ్, ల్యాబ్, స్కానింగ్, డయాలసిస్ యూనిట్ లను పరిశీలించి రోగులతో మాట్లాడారు. రోగులతో మాట్లాడుతూ వైద్య సరిగ్గా అందుతున్నాయా, మందులు ఇస్తున్నారా, వైద్యులు అందుబాటులో ఉంటున్నారా, ఎన్ని రోజుల నుండి ఆసుపత్రిలో ఉంటున్నారు లాంటి తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రికి పేదవారు వస్తారని, వారికి మెరుగైన సేవలు అందించాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో అన్ని సదుపాయాలు కల్పిస్తున్నారని, వీటిని ప్రజలు ఉపయోగించుకునేలా చూడాలన్నారు. ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లి ఆర్థికంగా నష్టపోకుండా అవగాహన కల్పించాలని అన్నారు. ఆసుపత్రిలో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన గైనకాలజిస్ట్ డాక్టర్ అజంతా తో మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రిలో సాధారణ ప్రసవాల సంఖ్య పెరిగేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. గర్భిణీలు తీసుకోవలసిన జాగ్రత్తలు మరియు పోషక ఆహార గురించి అవగాహన కల్పించాలన్నారు.ఆసుపత్రిలో రానున్న వర్షాకాలంలో స్లాబ్ లీకేజ్ లేకుండా చేయవలసిన మరమత్తుల వివరాలను నివేదికలు సమర్పించాలని ఆసుపత్రి సూపర్డెంట్ ను ఆదేశించారు. ఆస్పత్రిలో బ్లడ్ స్టోరేజ్ ని అందుబాటులోకి తేవాలని అధికారులను ఆదేశించారు. ఆసుపత్రిలో డయాలసిస్ కోసం వచ్చే రోగులు అందరికీ సేవలు అందించాలని, డయాలసిస్ సేవల కోసం వచ్చే వారిని నిరీక్షించకుండా త్వరితగతిన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. అనంతరం ఆసుపత్రి సిబ్బందితో ఆస్పత్రికి కావలసిన వసతులు మరియు ఆసుపత్రిలో నెలకొన్న సమస్యలపై సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రక్త పరీక్ష కేంద్రం మరియు స్కానింగ్ కేంద్రంలో కావలసిన యంత్ర పరికరాల కోసం నివేదికలు సమర్పించాలని, వాటిని త్వరలోనే మంజూరు చేస్తామని కలెక్టర్ తెలిపారు.
ఈ పరిస్థితిలో కలెక్టర్ వెంట ఆసుపత్రి సూపర్డెంట్ సునీల్, ఆర్ఎంవో గౌరీ ప్రసాద్, డ్యూటీ డాక్టర్లు మరియు ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.