రైతు కడగండ్లను శాశ్వతంగా నివారించాలి.

Dec 29, 2024 - 22:00
 0  1

రైతు కడగండ్లను శాశ్వతంగా నివారించాలి.  ఉత్పత్తి రంగంలో పనిచేస్తున్న కార్మికులు, చేతివృత్తుల వాళ్ళు పేద వర్గాలు  ఎంత ముఖ్యమో  తిండి పెట్టే రైతన్న కూడా  అంతే.  మౌలిక సౌకర్యాలు,  గిట్టుబాటు ధర, పండించిన రైతులకే  ప్రోత్సాహాన్ని అందించాలి.

వడ్డేపల్లి మల్లేశం

21...10..2024

ఆరుగాలము శ్రమించి కష్టనష్టాలకోర్చి ప్రకృతి  బీభత్సాలతో పోరాడి  చీకటి ప్రమాదాలను  అధిగమించి  పంట పండించి ఉత్పత్తిలో భాగస్వామ్య  పాత్ర పోషించే  ప్రజలందరికీ తిండి పెట్టే రైతన్న జీవితం మాత్రం  సానుభూతితో కూడుకున్నది కావడం విషాదకరం .దేశంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు పేద వర్గాలు కార్మికులు అల్పసంఖ్యాకులు  దారిద్రరేఖ దిగువన  ఉన్న వాళ్లకు ఈ దేశంలో ఎలాంటి స్థానం ఉందో  రైతులకు కూడా అలాంటి స్థానాన్ని ఉండడాన్ని మనమంతా గమనించాలి.  పాలకులు ఇదేదో  ఈ వర్గాల పైన సానుభూతితో పని చేసినట్లు  వాళ్ల కోసం ఆరాట పడినట్లు  ప్రభుత్వ సహకారం లేకుంటే బ్రతకలేరని   మాట్లాడడం సరైనది కాదు.  రైతులు లేకుంటే రాజకీయరంగముతో సహా ఏ వర్గము కూడా బతికి బట్ట కట్టలేదనేది నగ్నసత్యం. ఈ క్రమంలోనే గతంలో కేంద్ర ప్రభుత్వం రైతు ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని అనేక సందర్భాలలో హామీ ఇచ్చి  ప్రకటనలు కుమ్మరించినప్పటికీ  అత్యల్ప స్థాయిలో ఆర్థిక సహకారం తప్ప  పెట్టుబడి సాయం గణనీయంగా పెంచడం కానీ  పెట్టుబడికి సంబంధించినటువంటి ఖర్చులను భారీగా తగ్గించడం కానీ జరగలేదు. ఇక అన్ని రాష్ట్రాలతో పాటు తెలంగాణ రాష్ట్రంలో కూడా  కొన్ని రాయితీలను ప్రకటించడంతో  సరిపెట్టుకుంటే కుదరదు  స్పష్టమైనటువంటి  హామీలతో పాటు నిర్మాణాత్మకమైనటువంటి ప్రజలు ప్రజాస్వామ్యవాదులు అఖిలపక్షాల సూచనలను చట్టసభల్లో చర్చించి  అమలు చేయడం ద్వారా రైతుల పట్ల మొసలి కన్నీరు కాదు కార్చేది  సానుభూతి పవనాలు కానే కాదు. రైతుపోరాటం అంటే   ఈ దేశ సంపదలో తమ వాటా తమకు  పొందడానికి గల హక్కును సాధించుకోవడమే.రాజ్యాంగబాధ్యతగా  పాలకవర్గాల ద్వారా అమలు చేయడం అనే భాషలో  వ్యవసాయ రంగ విధానాలు కొనసాగాలి.  సబ్సిడీలు  రాయితీలు ఇవ్వడం ద్వారా  పేద వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు దళితులు ఆదివాసీలతో పాటు రైతులు   కూడా  యాచకులుగానే మిగిలిపోతున్నారు. ఇతర వర్గాల దృష్టిలో  వీళ్లంతా ప్రజల సొమ్మును  కొల్లగొడుతున్నట్లుగా భావించడం జరుగుతున్నది  ఒక రంగం ప్రజా సంక్షేమానికి దేశాభివృద్ధికి పోషిస్తున్న పాత్రను లెక్కించడంతోపాటు  జాతి సంపదను ఏ రకంగా తన వాటా తాను పొందాలో  అనే అంశం పైన స్పష్టమైన అవగాహన లేని కారణంగా  ప్రభుత్వాలు ఇచ్చేది ప్రతిది కూడా దానం చేయడo అని  కొన్ని వర్గాలు ఆక్షేపణ చేస్తూ అసూయ పడుతూ  ముఖ్యంగా రైతు వర్గాలను  అవమానిస్తున్న తీరు  ఖండించవలసింది. అదే సందర్భంలో  రైతాంగ హక్కుల పరిరక్షణకు  వ్యవసాయ  రక్షణ చర్యలలో భాగంగా మౌలిక అవకాశాలు సౌకర్యాలను కల్పించడంతోపాటు  అల్పాదాయమైన వ్యవసాయాన్ని పట్టుకొని  దేశం కోసం పనిచేస్తున్నటువంటి రైతాంగం పైన  యావత్తు ప్రజానీకానికి ముఖ్యo గా పాలకులకు    గౌరవభావం  సంస్కారం  ఉండాల్సినటువంటి అవసరం చాలా ఉన్నది.
     
 వ్యవసాయ రంగంలో జరగాల్సిన కొన్ని సంస్కరణలు:- ఢిల్లీ పరిసర ప్రాంతాలలో  గిట్టుబాటు ధరకు చట్టబద్ధత కల్పించబడాలని  స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను అమలు చేయాలని  రైతుల ఊబిలో కూరుకు పోకుండా రైతులు రక్షణ  ప్రభుత్వ బాధ్యత తీసుకోవాలని   చేస్తున్న డిమాండ్ల పైన ప్రభుత్వం దిగిరాని  కారణంగా  ఉద్యమం అలాగే కొనసాగుతున్నది.గత రెండు సంవత్సరాల పూర్వం కూడా రైతులకు ఆటంకంగా మారినటువంటి మూడు రైతు వ్యతిరేక చట్టాలను అమలు చేయడానికి పూనుకున్న సందర్భంలో  సుమారు 13 మాసాలపాటు  ఇదే తరహాలో రైతులు ఉద్యమించి తమ  సత్తా చాటుకోవడంతో ప్రభుత్వం దిగివచ్చి రైతు చట్టాలను విరమించుకోవడం మనందరం గమనించినదే.. స్వేచ్ఛ, స్వతంత్రాలు, సామాజిక న్యాయం ప్రతి పౌరునికి ఎలా అవసరమో అలాగే పంటలు పండించి ఉత్పత్తిలో భాగస్వాములయ్యే  రైతన్నలు కూడా  స్వేచ్ఛగా పండించడానికి  ఎక్కడైనా అమ్ముకోవడానికి  ధరను నిర్ణయించడానికి  తనకు నష్టం రాకుండా  పెట్టుబడులు ఎక్కువగా  చేస్తున్న ప్రతిపాదనలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆమోదించి ధరలను తగ్గించడానికి అవకాశాలు ఉన్నప్పుడు  రైతుల గురించి ఇంత పెద్ద చర్చ చట్టసభ లోపల బయట జరగాల్సిన అవసరం ఉండదు. ఇతర వృత్తుల లాగే రైతు వ్యవసాయం కూడా  చక చక సాగిపోయేది కానీ  ప్రకృతితో  కొన్ని ఇతర శక్తులతో  అతివృష్టి అనావృష్టితో సంబంధం ఉన్నటువంటి వ్యవసాయం ఏదో సందర్భంగా నష్టపోవడం జరుగుతున్నది కనుక  నిరంతరము రైతులు నష్టాల్లో కూరుకుపోవడం నష్టాన్ని భర్తీ చేయడానికి అప్పులు తీసుకువచ్చి కుప్పలుగా పెరిగిపోతుంటే  భరించలేని పరిస్థితిలో ఆత్మహత్యలకు పాల్పడడం వంటి  బాధాకరమైనటువంటి సన్నివేశాలు దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి.  2014లో  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత  2016 మధ్యన మూడు సంవత్సరాలలో రైతుల ఆత్మహత్యలను గమనించినప్పుడు  మహారాష్ట్రలో 8,000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో 3000 మంది ఆత్మహత్యలు చేసుకున్నట్లుగా గణాంకాలు తెలియజేస్తున్నాయి  అదే అధిక జనాభా కలిగి  పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్లో మాత్రం  మూడు సంవత్సరాలలో 300 మంది  రైతులు కూడా ఆత్మహత్య చేసుకో లేదంటే అక్కడి రైతాంగ విధానం ప్రభుత్వ పాలసీని మనం పరిశీలించవలసిన అవసరం కూడా ఉన్నదని తెలుస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో 2016 నుండి 2023 వరకు సుమారు 12  సార్లు రైతుబంధు పేరుతో  ప్రభుత్వం ఆర్థిక సాయం చేసినప్పటికీ  నిజమైన రైతులకు కానీ పంట పండించే భూములకు కానీ  చెల్లించకుండా రోడ్డు వేసిన భూములు,అడవులు,   గనుల భూములు, అసైన్డ్ భూముల్లో  ఆక్రమించుకున్న వాటితోనే కలుపుకుంటే  మొత్తం 72,816 కోట్లు ఖర్చు చేస్తే అందులో 22,6 06కోట్ల రూపాయలు  పండించని వృధా భూములకే ఖర్చు చేసినట్టు తెలుస్తుంటే ఇది ఏ రకంగా రాష్ట్రానికి ఉపయోగకరము? ఇలాంటి తప్పుడు విధానాలకు పాల్పడి రైతుల పట్ల సానుభూతిని చూపితే  రైతులు స్వావలంబన దిశగా సాగకపోగా ఎప్పుడు యాచించే వాళ్ళు గానే  మిగిలిపోతున్నారు దాన్ని కట్టడి చేయాల్సినటువంటి అవసరం, కొంత ప్రక్షాళన చేయడం కూడా కీలకం.
వ్యవసాయరంగనిపుణులు, రైతు, ప్రజా సంఘాలతో నిరంతరం చర్చ జరపాలి.
 వ్యవసాయం  చేసే ప్రతి క్షేత్రానికి కూడా రైతులకు పెట్టుబడి  వస్తువులు విత్తనాలు పురుగుమందులు తీసుకుపోవడానికి సరైనటువంటి రోడ్లను ప్రభుత్వం నిర్మించాలి, మార్కెట్, రవాణా సౌకర్యాలు కల్పించాలి.
ప్రతి పంటకు  పంట కాలాలకు అనుగుణంగా  అప్పటి ప్రకృతి  పరిస్థితులను బట్టి  గిట్టుబాటు ధరను ప్రభుత్వం ప్రకటించడంతోపాటు  దానికి చట్టబద్ధతకు   కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు  చట్టాలు చేయాలి.
అన్ని రంగాల మాదిరిగా వ్యవసాయదారులు కూడా ఈ జాతి సంపదను, తమ వాటాను అనుభవించడానికి అర్హులు కనుక ఆ కోణంలోనే ఆలోచించి  నిధులు మంజూరు చేసి వ్యవసారంగాన్ని ప్రోత్సహిస్తేనే  నీకు బుక్కడు మెతుకులు దొరికేది అని   తెలుసుకుంటే మంచిది.
ప్రకృతి పరంగా నష్టపోయినప్పుడు కేవలం సానుభూతి వచనాలు పలకడమే కానీ గతంలో తెలంగాణ ప్రభుత్వం  నష్టపరిహారం ఇచ్చిన దాఖలా లేదు ఇటీవల కాలంలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో  ఆగస్టు సెప్టెంబర్ మాసాలలో వరదలు వచ్చి నష్టం జరిగినప్పుడు ప్రభుత్వాలు కొంత ప్రయత్నం చేసిన విషయాన్ని గమనించి దేశవ్యాప్తంగా కచ్చితంగా నష్టపరిహారాన్ని చెల్లించాలి.
---  పంటలు నష్టపోయినప్పుడు రైతులు నష్టపోకుండా  ఇదేదో రైతుల తప్పు వల్ల జరిగింది కాదు గనుక  ఇన్సూరెన్స్ పంటల బీమా పథకాన్ని అమలు చేయాలి పంటల   ప్రీమియమును ప్రభుత్వాలే చెల్లించేలా  చట్టాలు అమలు జరగాలి .
--సాగుకు యోగ్యమైన భూములను వివిధ పనుల నిమిత్తము  ప్రభుత్వాలు సేకరించడం స్వాధీనపరచుకోవడం కంటే  యోగ్యమైన భూములలో అవసరమైనటువంటి పంటలు పండించడానికి తగు విధంగా రైతులను ప్రోత్సహించి ఉత్పత్తిలో  కీలక పాత్ర పోషించాలి.
--  చిన్న నీటి వనరులు ప్రాజెక్టుల నిర్మాణ సందర్భంలో  రైతుల భూములకు  నష్టపరిహారాన్ని తగ్గించడం వాయిదా వేయడం హక్కులకై పోరాటం చేస్తే  జైల్లో పెట్టడం బేడీలు వేయడం వంటి   దుష్ట రాజకీయాలను పాలకులు మానుకోవాలి . భూములను ఇవ్వడానికి ప్రభుత్వం ఒప్పించాలి కానీ నిర్బంధం చేస్తే  అసాధ్యమని  తెలుసుకుంటే మంచిది.పెట్టుబడి సాయం అన్నప్పుడు  క్షేత్రస్థాయిలో పండించిన  భూములకు, ఆ  రైతులకు  మాత్రమే ప్రభుత్వం చెల్లించాలి కానీ  దుర్మార్గంగా  అక్రమాలకు పాల్పడకూడదు అలాంటి సంఘటన తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వ హయాంలో జరిగిన విషయం అందరికీ తెలుసు.ముఖ్యంగా నాణ్యమైన విత్తనాలు పురుగు మందులు ఎరువులను  ప్రభుత్వం సరఫరా చేయడంతో పాటు  పెద్ద మొత్తంలో ధరలను తగ్గించడం ద్వారా రైతు సులభంగా  కొనుగోలు చేసి ఆత్మగౌరవంతో పండించే స్థితిని తీసుకురావాలి.క్రమంగా ఎరువులు పురుగుమందుల వాడకాన్ని తగ్గించడంతోపాటు సేంద్రీయ పద్ధతిలో వ్యవసాయం చేయడానికి రైతాంగాన్ని ప్రోత్సహించాలి ఆ విధానాన్ని అవలంబించిన వారికి ప్రభుత్వం ప్రోత్సాహకాలు చెల్లించాలి  తద్వారా అనారోగ్యం బారిన పడకుండా ఉండే ఆస్కారం ఉంటుంది.వందలాది ఎకరాలతో  కూడుకున్న వ్యవస్థను  కూలదోసి  భూ సంస్కరణలను తీసుకురావడం ద్వారా  అందరి ఆమోదంతో కుటుంబానికి  ఉండాల్సిన భూమిని నిర్ణయించి మిగతా భూమిని పేద వర్గాలకు పంపిణీ చేసి వ్యవసాయాన్ని మరింత విస్తృతంగా లాభసాటిగా నిర్వహించడానికి  రైతాంగాన్ని ప్రోత్సహించాలి అదే సందర్భంలో అవసరమైనటువంటి ధాన్యాలను పండించడానికి  సూచన చేయడం ద్వారా  ధరలను తగ్గించడానికి ఆస్కారం ఉంటుంది. రైతులకు రుణమాఫీ అని రైతు భరోసా అని  అంతేకాకుండా  పనిముట్లు యంత్రాలు కొనుక్కోవడానికి సహకరిస్తున్నటువంటి ప్రభుత్వాలు  అసలే భూమి లేనటువంటి, రెక్కలను మాత్రమే నమ్ముకుని బతుకుతున్నటువంటి నిరుపేదలకు కూడా  ఈ దేశ సంపదలో తమ వాటాకై  డిమాండ్ చేసే హక్కుందని తెలుసుకుంటే మంచిది.  ఉపాధిని కల్పించడం ద్వారా  ప్రజలకు ప్రభుత్వాలు భరోసాను ఇవ్వాలి  అది చట్టబద్ధంగా చెల్లించాలి కానీ సానుభూతితో మాత్రం కాదు  నిజానికి ఈ దేశంలో ఎవరికీ ప్రభుత్వాలు సానుభూతితో  నిధులు ఇవ్వాల్సిన అవసరం లేదు. ప్రతిదీ కూడా రాజ్యాంగబద్ధంగా వచ్చిన చట్టం ప్రకారంగా  సంక్రమించిన హక్కులే.  భూస్వామ్య  వర్గాలను కూడా రైతులుగా చూడాల్సిందే కానీ  సంపన్నులకు ఉచితాలు రాయితీల  ఇవ్వడం ద్వారా  ప్రజా ప్రయోజనాలను తాకట్టు పెట్టకూడదు.  పేద వర్గాలకు అందితేనే  సమానత్వాన్ని తీసుకురావడానికి, అంతరాలు లేని వ్యవస్థను ఆవిష్కరించడానికి  పునాది పడ్డట్టు లెక్క.. రుణమాఫీ  రైతు భరోసా  వంటి సహకారాలను చెల్లించడానికి కొన్ని నిబంధనలను పాటించి  వాటిని కట్టుదిట్టంగా అమలు చేయాలి.
( ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు అరసం రాష్ట్ర కమిటీ సభ్యుడు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ)

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333