నేరస్తులు,  విచారణకు హాజరయ్యే వారికి  ప్రత్యేకత అవసరమా?

Jan 24, 2025 - 19:55
 0  2

 పోలీసు బలగాలు, బందోబస్తు,  వెనుక కాన్వాయ్,  మీడియా సమావేశాలు  విచారణ లక్ష్యాన్ని దెబ్బతీస్తాయి .* నేరం ఆరోపించబడిన పేదవాడిపై ఉక్కు పాదంమోపే  చట్టం   పదవి,నోరు, డబ్బున్నోడిపట్ల   ప్రత్యేకత చూపడం  అనాగరికం.*

---వడ్డేపల్లి మల్లేశం

చట్టం ముందు అందరూ సమానులే అనే  సమన్యాయ పాలన రాజ్యాంగంలో స్పష్టంగా పేర్కొనబడినప్పటికీ  అన్ని రంగాలలో మాదిరిగానే నేరస్తులు నేర చరిత్ర కలవాళ్ళు నేరం ఆరోపించబడిన వాళ్ళు విచారణ ఎదుర్కొంటున్న వాళ్ల పట్ల  పేదలు ధనికులు సంపన్నుల మధ్యన  వివక్షత కొనసాగడాన్ని మనం స్పష్టంగా గమనించవచ్చు.  ఒకవైపు రాజ్యాంగంలో అందుకు సంబంధించిన చట్టంలో పొందుపరచబడినప్పటికీ  పాలకుల పుణ్యమా అని రాజకీయ పార్టీల  మద్దతుతో  పోలీసు బలగాలు ఇతర అధికారులను ప్రభావితం చేసి  కొంతమందికి  విచారణ సమయములోనూ  నేరస్తుడని తేలి  జైలుకెళ్లిన సందర్భంలోనూ  మరి కొంతమంది జైలు నుండి విడుదలైన సందర్భంలోనూ  పెద్ద హంగామా సృష్టించడం,  టపాసులు పేల్చడం, కానువాయితో  ప్రచారం చేసుకోవడం, నిజంగా  సిగ్గుచేటు .ఆ అవకాశాన్ని చట్టం పోలీసులు పాలకులు కల్పించకూడదు.  ఇలాంటి పెడ దొరణుల  పట్ల న్యాయ వ్యవస్థ కూడా స్పష్టమైనటువంటి ఆదేశాలను జారీచేసి ఉక్కు పాదం మోపాలి. అప్పుడు మాత్రమే నేరస్తులు, నేర చరిత్ర కలిగిన వాళ్లు,  దోపిడీగాళ్లను అరికట్టడానికి అవకాశం ఉంటుంది.  చట్టాలలోని లొసుగులు రాజకీయ పార్టీల అండ కారణంగానే  బడా నేరగాళ్లు, మహిళలపై అత్యాచారాల కేసులో నిందితులు,  దేశద్రోహానికి సంబంధించినటువంటి  నేరం చేసినటువంటి వాళ్లు కూడా ప్రస్తుతం చట్టసభల్లో ఉండడాన్ని  మనం గమనించవచ్చు.  అలాంటి  దుష్కృత్యాలకు  అవకాశం లేని  కఠిన వైఖరిని అవలంబించిన నాడు మాత్రమే  చట్టం ముందు అందరూ సమానులే అనే భావనపట్ల  పేదవాళ్లకు  నమ్మకం కుదురుతుంది .
      నేరస్తులని విచారణకు  హాజరుకావాలని ఏసీబీ, ఈడీ, సీఐడీ,  కోర్టులు  ఆదేశాలు జారీ చేస్తే  చట్టం అంటే గౌరవం అని  చెబుతూనే  ఈ కేసు లొట్ట పీసు కేసు అని  ఒక మాజీ మంత్రి  విచారణకు ముందు విచారణ తర్వాత కూడా ప్రెస్ సమావేశంలో  ప్రకటించడాన్ని బట్టి నిజంగా చట్టం అంటే గౌరవం   లేదు అని తేలిపోతుంది. అలాంటప్పుడు  చట్టాన్ని న్యాయవ్యవస్థను గౌరవించని వాళ్ల పట్ల  మరింత కఠిన వైఖరి అవలంబిస్తే గాని  మార్పు రాదు. అధికారంలో ఉన్న పార్టీ పట్ల  చులకన భావాన్ని వ్యక్తం చేస్తూనే  లుచ్చా గాళ్లు కచ్చా గాళ్ళ రాజ్యంలో  ఇలాంటి విచారణలు మామూలేనని, ప్రభుత్వం పైన  తిరుగుబాటు చేయాలని,  ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను అమలు చేసేదాకా వెంటాడి వేటాడాలని  తన పార్టీ కార్యకర్తలకు  పిలుపు ఇవ్వడం అంటే  ప్రజలను  రెచ్చగొట్టడమే  కదా!  ఇదంతా విచారణకు ముందు విచారణ తర్వాత జరిగినటువంటి  మీడియా సమావేశంలో  బాహాటంగా ప్రకటించడం  ముఖ్యమంత్రి మంత్రి వర్గాన్ని ప్రభుత్వాన్ని ఇష్టారాజ్యంగా నిందించడం  నేరం ఆరోపించబడి విచారణ ఎదుర్కొంటున్న వారికి విజ్ఞత అవుతుందా?  ఒక సామాన్యుడు   నేరం ఆరోపించబడితే అతనికి చట్టాలు న్యాయం  లౌకిక జ్ఞానం ఏమీ తెలియని పరిస్థితుల్లో  ప్రశ్నించలేక శిక్షలు అనుభవిస్తూ  ఏళ్ల తరబడి విచారణ ఎదుర్కొంటున్న పరిస్థితులను భారతదేశవ్యాప్తంగా చూడవచ్చు. విచారణ ఖైదీలుగా  మొత్తం దేశంలో జైల్లో ఉన్న వాళ్ళలో 75% మంది  నేరం రుజువు కాకుండానే కొనసాగుతున్నటువంటి దౌర్భాగ్య పరిస్థితులలో  పేదల పట్ల ఉక్కు పాదం మోపడం భావ్యం కాదు.  అధికారంలో ఉన్న నాడు  సంపదను కొల్లగొట్టి  భూ కబ్జాలు భూ దందాలకు పాల్పడి  అక్రమ ఆస్తులు కూడా పెట్టడమే కాకుండా  కోట్లాది రూపాయల అవినీతికి పాల్పడి కూడా  వాటిని మరిచిపోయే విధంగా  తర్వాత వచ్చిన ప్రభుత్వాన్ని  బ్లాక్ మెయిల్ చేయడానికి పాల్పడుతున్నటువంటి రాజకీయ పార్టీలు కార్యకర్తలు మాజీ మంత్రులు ఎవరైనా  వారి అవినీతిపైన ఉక్కు పాదం మోపాల్సిందే.అనువణువు నా విచారణ జరపాల్సిందే. తెలంగాణ రాష్ట్రతొలి    ముఖ్యమంత్రి   లక్ష కోట్ల అవినీతికి పాల్పడినాడని స్వయంగా ప్రస్తుత కాంగ్రెస్   ముఖ్యమంత్రి  అనేక వేదికల్లో  ప్రకటించిన విషయం తెలుసు.  దానితో పాటు వివిధ ప్రాంతాల్లో   ఇటీవల కాలంలో  మంత్రివర్గ సభ్యులపై ప్రభుత్వ అధికారులపై వచ్చిన  అనేక అవినీతి ఆరోపణలను  వదిలి పెట్టకుండా  బోనులో నిలబెట్టి  విచారణ జరిపించి కటకటాల్లోకి తోయాలి. దేశ వ్యాప్తంగా .  ఎందుకంటే ఆ రకంగా ఆరోపించబడినటువంటి కోట్లాది రూపాయలు విచారణలో నిజమని తేలితే అదంతా ప్రజల ఆస్తి కాపాడుకున్నట్లే  కదా!   ప్రజా సంపదకు కాపలాదారులుగా ఉండవలసినటువంటి ప్రభుత్వాలు పాలకులు  అధికార0 ముసుగులో   అక్రమాలకు పాల్పడితే చూస్తూ ఊరుకుండడానికి  మిగతా రాజకీయ పార్టీలు సిద్ధంగా ఉన్నాయేమో కానీ ప్రజలు సిద్ధంగా లేరని తెలుసుకుంటే మంచిది. రాష్ట్రాల ఏర్పాటు కోసం దేశవ్యాప్తంగా జరిగిన ఉద్యమాలు,  రైతుల హక్కుల కోసం జరుగుతున్నటువంటి దేశ వ్యాప్త  పోరాటాలు,  జాతుల సమస్యలు అనగారినటువంటి  వర్గాల హక్కుల కోసం జరుగుతున్నటువంటి  ప్రజా ఆందోళనలు  ప్రత్యేకమైన సెంటిమెంట్ ఆధారంగా కొనసాగినవి కనుక  వివిధ రూపాలలో జరిగినటువంటి పోరాటాలలో ప్రజలు విస్తృతంగా పాల్గొని తమ ప్రత్యేకమైనటువంటి ఆకాంక్షలను నెరవేర్చుకోవడం జరిగింది. కానీ ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న సమస్యల్లో అధిక ధరలు,  పేదరికం, నిరుద్యోగము, ఆకలి చావులు, ఆత్మహత్యలు, వివక్షత పీడన అణచివేత, నిర్బంధం,  విద్యా వైద్యం ప్రైవేటుపరం కావడాన్ని   ఖండిస్తూ  కొన్ని వర్గాలు మాత్రమే చేస్తున్నటువంటి పోరాటానికి ప్రజల మద్దతు పూర్తిగా లభించకపోవడం వల్ల  ఈ హక్కులను సాధించుకోవడం కొంత కష్టమవుతున్న విషయం వాస్తవమే! కానీ భవిష్యత్తులో  ఏ రకమైనటువంటి సమస్యకైనా ప్రజలు  స్పందించి  పోరాడే రోజులు  వస్తాయని పాలకులు తెలుసుకుంటే మంచిది. ప్రజలను అమాయకులుగా  చూస్తూ  దేశ సంపదను ప్రతిపక్ష  పాలక పక్షాలు  పంచుకు తినడానికి అలవాటు పడితే మాత్రం సహించే ప్రసక్తి ఉండదు. అందుకే  అవినీతికి ఎవరు పాల్పడిన  ముందు విచారణ జరగాలి, దానిని వేగవంతం చేయాలి, నేరస్తులని  తేలితే జైలు శిక్షతోపాటు  జరిమానా విధించడం,  తప్పుడు విధానాలకు పాల్పడితే  నష్టపరిహారాన్ని ప్రభుత్వ ఖాతాకు జమ చేయడం వంటి కీలక నిర్ణయాలు తీసుకునే ప్రభుత్వానికి ప్రజలు మద్దతిస్తారు.  అధికారంలో ఉన్నప్పుడు  మంత్రులుగా  మంత్రివర్గ సమావేశ తీర్మానం లేకుండానే నిధులు  మంజూరు చేయడం,  ఆర్.బి.ఐ నిబంధనలను తుంగలో తొక్కడం,  అధికారులను ఆదేశించి బలి పశువులను చేయడం వంటి  ఆరోపణల పైన,   విచారణ జరుగుతున్న నేపథ్యంలో  ముద్దాయిగా ఉన్నప్పుడు  చట్టాన్ని గౌరవించాలి,  విజ్ఞత, వినయ విధేయతలతో ఉండాలి. కానీ ప్రభుత్వాలను చట్టాన్ని న్యాయవ్యవస్థను  అగౌరవపరిచే పద్ధతిలో  మీడియా సమావేశంలో   మాట్లాడడాన్ని    మనం గమనిస్తున్నాము.  విచారణ ఎదుర్కొనే సమయంలోపల  ఆ వ్యక్తి లేదా వ్యక్తులకు  ప్రత్యేక అవకాశాలు, హోదా, కాన్వాయి, పోలీసు బలగాల  తోడ్పాటు,  మీడియా సమావేశాలను పెట్టి  రెచ్చగొట్టే ప్రకటనలు చేయడం,  విచారణ నుండి బయటికి రాగానే  ఏదో సాధించినట్లు  కార్యకర్తలు సన్మానాలు పూలమాలలు వేసి సత్కారం చేయడం వంటివి  అనాగరికమైన చర్యలుగా భావించి  న్యాయవ్యవస్థ ఉక్కుపాదం మోపడానికి తగు ఆదేశాలు జారీ చేయవలసిన అవసరం  ఎంతగానో ఉంది. ఇది ఒక రాష్ట్రానికి మాత్రమే పరిమితం కాకుండా దేశవ్యాప్తంగా జరిగే ప్రతి విచారణలోనూ  ప్రధానితో సహా ఏ మంత్రి గాని ఏ ప్రజా ప్రతినిధి పైన జరిగిన  విచారణ సమయంలో  సాధారణ పౌరులుగానే చూడాల్సినటువంటి అవసరం ఉంది. ప్రత్యేకతను ఆపాదించి  గౌరవించడానికి పూనుకుంటే  అహంకారంతో మరింత విర్రవీగే ప్రమాదం ఉంటుంది జాగ్రత్త.!
          విచారణ అధికారులు  ప్రశ్నించిన సందర్భాన్ని కూడా బయట ప్రస్తావిస్తూ  అధికారులు అడిగిన ప్రశ్నల్లో పసలేదని,  వాళ్లకు ప్రశ్నించడం రాదని,  ఆ ప్రశ్నలు ఎవరో  రాసిస్తే అడిగినవని   ప్రస్తుత పాలకులకు  ఆపాదిస్తూ మాట్లాడే మాటలను  కూడా న్యాయవ్యవస్థ పట్టించుకొని  వాళ్లపై  మరిన్ని ఆంక్షలు విధించవలసిన అవసరం ఉంది. అంటే  విచారణకు హాజరైన వ్యక్తి మాట్లాడే తీరుపైన  న్యాయవ్యవస్థ పట్టించుకొని    మీడియా సమావేశంలో మాట్లాడిన అంశాలను సేకరించి,  అందుకు సంబంధించిన సాక్షాలను  భద్రపరిచి సంబంధిత వ్యక్తికి ఆదేశాలు జారీ చేసి  నోరు మూయించడం కూడా చాలా అవసరం. కులం, డబ్బు, హోదా, గత పదవులు,  తల్లిదండ్రుల యొక్క వారసత్వం  వంటి అంశాలలో    తమకు తామే గొప్పవాళ్లుగా చెప్పుకునే  నేరస్తులను విచారణ ఎదుర్కొంటున్న వాళ్లను  కఠినంగా శిక్షించవలసిన అవసరం ఎంతైనా ఉన్నది ఎందుకంటే  పార్లమెంటు ఉభయ సభల్లో కూడా  నేరస్తులు నేర చరిత్ర ఉన్నవాళ్లు  సభ్యులుగా కొనసాగుతున్నారంటే ఈ దేశం సిగ్గుతో తలవంచుకోవాల్సిన పరిస్థితిలో ఉన్నది.  బహుశా కిందిస్థాయిలో నేర విచారణ ఎదుర్కొంటున్న వాళ్లు నేరం ఆరోపించబడిన వాళ్లు  పార్లమెంటులోని  ఉభయ సభల్లో ఉన్న నేర చరిత్ర గలవాళ్ళను  ఆదర్శంగా తీసుకున్నారో  ఏమో?  అందుకే ఏ చట్టానికి ఏ న్యాయ వ్యవస్థకు  కూడా భయపడడం లేదు అని మనం అర్థం చేసుకోవాలి. ముందు దీనికి  ముగింపు పలకాలంటే  భారత సర్వోన్నత న్యాయస్థానం 17వ లోక్సభలోని 80% పైగా ఉన్న నేరస్తులు,  రాజ్యసభలోని 34 శాతంగా ఉన్నటువంటి నేరస్తులు నేర చరిత్ర కలిగిన వాళ్ళ భరతం పట్టాలి, వాళ్లను గుర్తించి  ప్రజా క్షేత్రంలో నిలబెట్టి కటకటాలకు  పంపాలి, ఇదంతా ప్రత్యక్ష ప్రసారం ద్వారా ప్రజలంతా కళ్లారా చూడాలి, అప్పుడు మాత్రమే  ప్రజలు ఈ పాలకుల యొక్క దుందుడుకు చర్యలపైన ప్రత్యక్ష కార్యాచరణకు సిద్ధపడతారు. తమకు ఇంత కాలంగా జరిగినటువంటి అన్యాయం దోపిడీ,  పాలకులు ఏ రకంగా  దోచుకున్నారో తెలుసుకొని  పోరాటానికి   సిద్ధమవుతారు. ప్రజల సొమ్మును అక్రమంగా మెక్కిన  ప్రభుత్వ ప్రతిపక్ష  సభ్యులతో పాటు అధికారులు, చివరికి ఎవరినైనా చట్టం ముందు నిలబెట్టాలి. మాటకారితరం, ఆధిపత్య లక్షణంతో  డాంబికాలు ప్రదర్శించే వారి పట్ల మరింత కటు  వుగా వ్యవహరించాలి.  అప్పుడే విచారణ సందర్భంలో  సరైన నేరం బయటపడుతుంది.  ప్రజలకు న్యాయం జరుగుతుంది.

(ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు అరసం రాష్ట్ర కమిటీ సభ్యుడు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ  )

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333