తెలంగాణ రాష్ట్ర విద్యా కమిషన్   కామన్ స్కూల్ విధానాన్నీ  సిఫారసు చేయాలి

Dec 29, 2024 - 21:55
 0  0

తెలంగాణ రాష్ట్ర విద్యా కమిషన్   కామన్ స్కూల్ విధానాన్నీ  సిఫారసు చేయాలి.  ప్రైవేట్ విద్యా రంగానికి తావులేని  నాణ్యమైన ఉచిత విద్యను  ప్రభుత్వ ఆధ్వర్యంలోనే కొనసాగించాలి పేద వర్గాల కొనుగోలు శక్తిని  పెంచి  వివక్షత  తుoచడానికి, రాజ్యాంగలక్ష్యాలైన  న్యాయం సమానత్వ సాధనకు  ప్రభుత్వ రంగమే కీలకం.

వడ్డేపల్లి మల్లేశం 90142206412
23...10...2024

తెలంగాణ రాష్ట్రంలో  ఉమ్మడి రంగంలో ఉన్న విద్యా  గత ప్రభుత్వాల  తప్పుడు  విధానాల కారణంగా  ప్రభుత్వ రంగాన్ని క్రమంగా నిర్వీర్యం చేస్తూ ప్రైవేటు రంగానికి పెద్ద పీట వేయడం   తెలంగాణ ఏర్పడిన తర్వాత 9న్నర  సంవత్సరాల కాలం లో కూడా  తన అస్తిత్వాన్ని కోల్పోవడంతో పాటు  ప్రైవేటు విద్య సామాన్య పేద వర్గాలకు పెను బారమై  వివక్షతకు  దారి తీసిన విషయాన్ని సమాజం గమనించాలి.  సంపన్న వర్గాలు తమకేమీ పట్టనట్లు ప్రైవేటు విద్యారంగాన్ని నమ్ముకుని ప్రభుత్వ పాఠశాలల పట్ల చులకన భావాన్ని ప్రదర్శించడం కూడా  పేద వర్గాల పిల్లలకు  ప్రభుత్వ పాఠశాలల పట్ల  సద్భావన లేకపోవడానికి కారణం అవుతున్నది. ప్రభుత్వాలు   ప్రైవేట్ రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ  అక్కడక్కడ ప్రభుత్వ పాఠశాలల ప్రస్తావన వచ్చినప్పుడు "ప్రైవేటు పాఠశాలలకు దీటుగా నడుస్తున్నవి" అని చులకన మాటలు మాట్లాడడం ముఖ్యమంత్రి నుండి మంత్రులు కిందిస్థాయి అధికారులు  శాసనసభ్యులు మండల పరిషత్ అధ్యక్షులు సర్పంచ్ వరకు కూడా  అలవాటు కావడం  మరింత ప్రైవేటు పాఠశాలలను ఆకాశానికి ఎత్తడమే అయ్యింది.  60 లక్షల మంది పాఠశాల స్థాయి విద్యార్థులు ఉన్నటువంటి తెలంగాణ వ్యవస్థ  లో  ప్రభుత్వ ప్రైవేటు రంగాలలో 30: 30 లక్షల మంది  చొప్పున ఉన్నటువంటి  సంఖ్య  2018 నుండి 24 వరకు  ప్రభుత్వ రంగంలోని పాఠశాలల్లో  విద్యార్థుల సంఖ్య 24 లక్షలకు పడిపోవడం  ఆందోళన కలిగించే విషయం అంతే కాదు ప్రభుత్వానికి అవమానకరం కూడా.  గత ఏడు సంవత్సరాల క్రితం  ప్రైవేటు పాఠశాలల ఫీజుల పైన  ఏర్పాటుచేసిన తిరుపతిరావు కమిటీ  పూర్తి విచారణ జరపలేక ఏటా 10% ఫీజు  పెంచుకోవచ్చని  సిఫారసు చేసి చేతులు దులుపుకోవడం  నాటి ప్రభుత్వం ఆమోదించడం మొక్కు  బడి కార్యక్రమం కాదా!? ఆ తర్వాత వేసినటువంటి మంత్రివర్గ ఉప సంఘం కూడా  ప్రైవేటు వ్యవస్థ పైన నిర్ణయం తీసుకోకపోవడం ఎలాంటి సిఫారసులు చేయకపోవడంతో  ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల సంఖ్య మరింత దిగజారిన విషయం గమనించాలి. ఇటీవల కాలంలో  రిటైర్డ్ ఐఏఎస్  ఆకునూరి మురళి గారు విద్యా వ్యవస్థ పైన  విద్యా ఫలితాల పైన మాట్లాడిన ప్రతి సందర్భంలోనూ  ప్రైవేటు వ్యవస్థను తొలగించి  విద్య యావత్తు ప్రభుత్వ రంగంలోనే కొనసాగాలని  హెచ్చరించిన తీరు  ఇప్పటికైనా  ప్రభుత్వం ఆమోదించి అమలు చేస్తే  పరువు నిలబడుతుంది.
       ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  సుమారు  నాలుగైదు దశాబ్దాలుగా కూడా విద్యార్థి ఉపాధ్యాయ మేధావి సంఘాలు  కామన్ స్కూల్ విధానాన్ని ప్రవేశపెట్టాలని,  నాణ్యమైన విద్యా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే పిల్లలకు అందించాలని,  విద్యా వ్యవస్థలో వివక్ష ఉండకూడదని  ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది. ఆ తర్వాత కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత  ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయిన ఏనాడు కూడా గత ప్రభుత్వం పట్టించుకున్న దాఖల లేదు అంతెందుకు ఏనాడు కూడా విద్యారంగం పైన స్పష్టమైన సమీక్ష జరగలేదు కనుకనే  క్రమక్రమంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల సంఖ్య దిగజారి పేలవంగా  తయారయింది.  ఈ పరిస్థితులను చక్కదిద్దడానికి  2023  డిసెంబర్లో అధికారానికి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం  కొంత కసరత్తు చేస్తున్న సందర్భంలో  విద్యా ప్రమాణాలను  పెంపొందించడానికి  తగు సూచనలు చేయడానికి  ప్రభుత్వ ఏర్పాటు సందర్భంగా ప్రజలను చైతన్యం చేసి క్రియాశీలక భూమిక పోషించినటువంటి  మాజీ ఐఏఎస్ అధికారి ఆకునూరు మురళి గారి ఆధ్వర్యంలో  ముగ్గురు సభ్యులతో  18 అక్టోబర్ 2024 నాడు 194 ఉత్తర్వు ద్వారా  విద్యా కమిషన్ ఏర్పాటు చేయడం సంతోషమే. అయితే.....
  విద్యా కమిషన్  చర్చించవలసిన కీలక అంశాలు:- కేంద్ర ప్రభుత్వం కానీ భారతదేశంలోని ఏ రాష్ట్ర ప్రభుత్వం కానీ విద్యావ్యవస్థ గురించి పూర్తిగా  ప్రభుత్వ రంగంలో కొనసాగా  లని ఆలోచన చేసిన సందర్భం ఎక్కడా లేదు.  కాకపోతే కేరళ ఢిల్లీ వంటి కొన్ని రాష్ట్రాలలో  విద్యా రంగానికి 24, 25% నిధులను కేటాయించడం,  ప్రభుత్వ పాఠశాల మౌలిక అవసరాలను సమకూర్చడం,   అంతర్జాతీయ స్థాయిలో నాణ్యమైన శిక్షణ, విద్యను అందించడం ద్వారా  ప్రభుత్వ రంగాన్ని బలోపేతం చేయడం జరిగింది. దాని కారణంగా ఢిల్లీలో  ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్నటువంటి ఉన్నత అధికారులు సంపన్న వర్గాల పిల్లలు ప్రభుత్వ పాఠశాలకు రావడం  గొప్ప శుభ పరిణామమే అని చెప్పక తప్పదు. అయితే  ప్రైవేటు వ్యవస్థలో పాఠశాలలు కొనసాగినంత కాలం  వివక్షత తప్పదు కనుక  ఆ వ్యవస్థను నిర్వీర్యపరిచి  ప్రభుత్వమే స్వాదీనం  చేసుకోవడం ద్వారా  నూతన వ్యవస్థకు అంకురార్పణ జరగాల్సిన అవసరం ఉంది.  తెలంగాణ రాష్ట్రంతో పాటు  అన్ని రాష్ట్రాలలోనూ కేంద్ర ప్రభుత్వం కూడా తన విధానాన్ని  ప్రభుత్వ రంగంలో కొనసాగించడానికి అనుగుణంగా స్పష్టం చేయాల్సిన అవసరం ఎంతో ఉన్నది.  1964లో ఆనాటి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి  డి ఎస్ కొఠారి కమిషన్  1966 లో తన నివేదికను సమర్పించిన సందర్భంగా  కామన్ స్కూల్ విధానాన్ని(ఇంగ్లాండ్, అమెరికా, కెనడాలలో అమలులో వుంది )  ప్రవేశపెట్టాలని,  విద్యా ప్రభుత్వ ఆధీనంలోనే కొనసాగాలని,  కేంద్రం తన బడ్జెట్లో 10% రాష్ట్రాలు 30 శాతం నిధులను కేటాయించాలని  స్పష్టంగా పేర్కొనడం జరిగినప్పటికీ ఏ ప్రభుత్వం కూడా ఆ వైపు  తగిన శ్రద్ధ తీసుకున్న దాఖలా లేదు  ఒకటి రెండు రాష్ట్రాలు బడ్జెట్ లో  మినహాయిస్తే. 
  
 సామాజిక న్యాయానికి ప్రభుత్వ రంగమే కీలకం:-వివక్షతకు ఆస్కారం లేని సమానత్వం సామాజిక న్యాయానికి  ప్రభుత్వ రంగమే కీలకమని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాజ్యాంగ రచనలో   పొందుపరిచిన అంశాన్ని  ప్రభుత్వ రంగం  బాధ్యతగా స్ఫూర్తిగా తీసుకోవాల్సిన అవసరం ఉంది.  ఇటీవల రాష్ట్రంలో ఏర్పాటు చేసినటువంటి విద్యా కమిషన్  సమానత్వాన్ని న్యాయాన్ని సాధించడానికి, సంపన్నులు పేద వర్గాల మధ్యన వివక్షతను  కులదొయడానికి, ప్రైవేటు వ్యవస్థ ద్వారా  కొనసాగుతున్న ఆర్థిక దోపిడిని  నిర్మూలించడానికి, విద్య సామాజిక బాధ్యత అని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి  పేద వర్గాల ఖర్చులను తగ్గించడం ద్వారా కొనుగోలు శక్తిని పెంచి ఆర్థిక పురోగతికి  తోడ్పడడానికి  ప్రభుత్వ రంగంలోనే విద్య కొనసాగాలని కీలక నిర్ణయాన్ని  సిఫారస్ చేయవలసిన అవసరం ఎంతగానో ఉన్నది."  ఒక ప్రాంతంలో ఉన్న విద్యార్థులందరూ ఒకే పాఠశాలలో చదువుకోవడం ద్వారా  ఆర్థిక  కులమత  అంశాలకు అతీతంగా  సమానత్వ భావన  వివక్షత లేనటువంటి  పరస్పర  గౌరవము  సంస్కారము పునాదిగా  నాణ్యమైన విద్యను అందించడానికి   కొటారి సూచించిన  కామన్ స్కూల్ విధానాన్ని రాష్ట్రంలో  ప్రవేశపెట్టాల్సిన అవసరాన్ని కమిషన్ పరిగణనలోకి తీసుకొని  ప్రధానమైన సిఫారసు చేయవలసిందిగా రాష్ట్రంలోని ప్రజానీకం ప్రజాస్వామ్యవాదులు బుద్ధి జీవులు మేధావులు  విద్యా కమిషన్ పైన  ఒత్తిడి చేస్తున్నారు".  సహజంగా కమిషన్ చైర్మన్ గా ఉన్నటువంటి ఆకునూరి మురళి గారు  విద్యా వ్యవస్థ పైన చేసిన పలు  ప్రసంగాలలో  నాణ్యమైన విద్య ప్రభుత్వ రంగంలోనే సాధ్యమని ప్రైవేటు పాఠశాలలను మూసివేయాలని  చేసిన సూచనకు అనుగుణంగా  సిఫారసులలో కఠిన నిర్ణయం తీసుకోవడం ద్వారా  సామాజిక బాధ్యతను గుర్తించాల్సిన అవసరం ఉన్నదని  విద్యాభిమానులు భావిస్తున్నారు.  ప్రైవేటు విద్యారంగాన్ని  రద్దు చేయడం, ఆ పాఠశాలను ప్రభుత్వం ఆధీనం చేసుకోవడం,  అర్హులైన వారికి ఉద్యోగ అవకాశాలను కల్పించడం,  ఆస్తులకు తగిన  మొత్తాలను  అందించడం ద్వారా  విద్య పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకోవడం ప్రభుత్వం కూడా తన బాధ్యతగా గుర్తించాల్సిన అవసరం ఉంది.  కమిషన్ ఎన్ని సిఫారసులు చేసిన  అమలు చేయడానికి  సంసిద్ధంగా లేకపోతే  ప్రభుత్వ విద్యా రంగం పట్ల సవతి తల్లి ప్రేమను ప్రదర్శిస్తే  కమిషన్ వేసి కూడా ప్రయోజనం లేదు.  విద్య ద్వారా  అసమానతలు అంతరాలు లేనటువంటి సమసమాజా న్ని స్థాపించడమే లక్ష్యం కనుక  ఆ లక్ష్యానికి రెండు రంగాలలో విద్య కొనసాగడం  ఆటంకం అవుతున్న నేపథ్యంలో భారత దేశంలోనే  సంస్కరణ చేసిన తొలి రాష్ట్రంగా తెలంగాణ  సిద్ధపడితే బాగుంటుంది.  మొక్కుబడి రాయితీలు, ప్రలోభాలు, ఉచితాలతో కాదు  ప్రభుత్వం విద్యారంగాన్ని తన పూర్తి ఆధీనంలోకి తీసుకోవడం ద్వారా  విప్లవాత్మక చర్యలకు శ్రీకారం చుట్టినప్పుడు  ప్రైవేట్ రంగంలో కొనసాగుతున్న ఫీజుల జులుం ఆగడాలు  వివక్షత  అసమానతలు  తొలగిపోతాయి.  ఒకే రకమైన విద్య ఒకే స్థాయిలో  అమలు కావడానికి అవకాశం ఉంటుంది.
       ఉపాధ్యాయులకు అంతర్జాతీయ స్థాయి విద్యను  శిక్షణ ద్వారా అందించడం,  ముఖ్యమంత్రి మంత్రులతో సహా  ఉన్నత స్థాయి ప్రతినిధి వర్గం నిరంతరం పాఠశాలలను సందర్శించడం,  ప్రభుత్వ పాఠశాలను  మౌలిక వస్తువులతో సహా భారీగా తీర్చిదిద్దడం,  వైద్య అవకాశాలను  పాఠశాలలకు అనుబంధంగా అందుబాటులో ఉంచడం,  బడ్జెట్లో ఢిల్లీ ప్రభుత్వం మాదిరిగా 25% నిధులను కేటాయించడం  వంటి కీలకమైన నిర్ణయాలు తీసుకోవడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం  తన సత్తాను చాట వలసిన అవసరం ఉంది. తద్వారా కోట్లాది ప్రజానీకం  వేలాది కుటుంబాలు  చాలీచాలని తమ సంపాదనను ప్రైవేటు విద్యారంగానికి ధారపోస్తూ పేదరికంలోకి నెట్టివేయబడుతున్న ఈ తరుణంలో  ప్రభుత్వ చర్య  పేదల కొనుగోలు శక్తిని పెంచేదిగా  న్యాయం సామాజిక  సమానత్వాన్ని సాధించేదిగా  ఉంటుందని ఉండాలని ఆ వైపుగా ప్రభుత్వం  విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టాలని  అందుకు తగిన సిఫారసులను విద్యా కమిషన్  అందించాలని  ప్రజల పక్షాన విజ్ఞప్తి చేద్దాం.
(  ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకులు అరసం రాష్ట్ర కమిటీ సభ్యుడు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ )

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333