యువశక్తిని నిర్వీర్యం చేస్తున్న ప్రభుత్వ విధానాలు
కాలానుగున సాంకేతిక విధానాలకు సర్దుబాటు కాకపోతే ఎలా ?
అత్యధిక యువ జనాభా కలిగి ఉండి ఆర్థిక స్వావలంబ న లేకపోతే ప్రయోజనం ఏమిటి ?
గ్రహణాలను తొలగించుకొని ప్రగతికి దారులు వేద్దాం.
---వడ్డేపల్లి మల్లేశం
ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో యువత ఉన్న దేశంగా భారత్కు గుర్తిo పు రావడం కలిసి వచ్చిన అవకాశం కాగా 35 సంవత్సరాల లోపు వారు 65 శాతం ఉన్నట్లు గణాంకాలు చెబుతుంటే 18 నుండి 35 ఏళ్ల వయసున్న వారి జనాభా 60 కోట్లకు పైగా ఉండడం పాలకులు యువతపై దృష్టి సారించాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతున్నది .కాలం చెల్లిన విద్యా విధానాలు, మారుతున్న సాంకేతిక నైపుణ్యాలు, పరిజ్ఞానానికి భిన్నమైనటువంటి మూస విధానాల కారణంగా విద్యారంగం , నైపుణ్యం, శిక్షణ , ఉద్యోగ ఉపాధి అవకాశాల మధ్యన విపరీతమైన గ్యాప్ ఏర్పడుతున్నది . ఇక పాఠశాల విద్య ముగించుకొని ఎటూ దారి లేక చదువుకునే అవకాశాలు కానరాక ఏదో ఒక మార్గాన్ని వెతుకుని చాలీచాలని వేతనాలతో ఆదాయ మార్గాలతో బ్రతుకుతున్న వారి సంఖ్యకు లెక్కేలేదు. ఈ గణాoకాలను,యువశక్తినీ సమన్వయపరిచి తగిన వసతులను సౌకర్యాలను విధానాలను రూపకల్పన చేయవలసిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపైన ఉన్నది .
దీనికి తోడు ముఖ్యంగా మద్యం, ధూమపానం, క్లబ్బులు, పబ్బులు, ఈవెంట్లు, అశ్లీల అరాచక ప్రదర్శనల కారణంగా కూడా యువశక్తి తాత్కాలిక ప్రలోభాలకు క్షణిక ఆవేశాలకు లోనై తమ నిండు జీవితాలను దుర్భరం చేసుకున్న సందర్భాలను కూడా మనం గమనించవచ్చు . ఇక్కడ యువతది ఎంత బాధ్యతనో అంతకుమించిన సామాజిక కర్తవ్యం పాలకులు విస్మరిస్తున్న కారణంగా అత్యంత విలువైన మానవ వనరులు భారతదేశంలో నిష్క్రియాత్మకంగా మిగిలిపోతున్నాయి. యువశక్తిని ప్రణాళిక బద్ధంగా వినియోగించుకుంటే ఆదాయ మార్గాలు పెరిగి, పేదరికం తగ్గి, సంపద సృష్టించబడి, కుటుంబ ఆదాయాలతో పాటు దేశం కూడా ఆర్థికంగా స్వావలంబ న దిశగా అడుగులు వేస్తుంది ." ఇండియా నైపుణ్యాల నివేదిక 2024 " ఇటీవల వెలువరించిన తన నివేదికలో దేశవ్యాప్తంగా ఉన్నత విద్యాభ్యాసం ముగించిన వారిలో ఉద్యోగాలను సంపాదించే సత్తా ఉన్న వారి సంఖ్య 51.25% అని తేల్చడం మన విద్యారంగా శిక్షణ నైపుణ్యాల డొల్లతనాన్ని బయటపెడుతున్నది . ఉపాధి అవకాశాలు మెరుగ్గా ఉన్నటువంటి ఆటోమొబైల్, టెక్స్టైల్, సరుకు రవాణా వంటి రంగాలలో నైపుణ్యం ఉన్న మానవవనరుల కొరత ఎక్కువగా ఉన్నట్లు అదే స్థాయిలో ఆహార శుద్ధి, ఆరోగ్య సేవలు, నిర్మాణ రంగాలు ఇతర రంగాలు కూడా నైపుణ్యాభివృద్ధి లోటును ఎదుర్కొంటున్నట్లుగా తెలుస్తుంది. శాస్త్ర సాంకేతిక రంగాలు ఆధునిక పరిశోధనల విషయాలలో శిక్షణ పొందిన వారి సంఖ్య తక్కువగా ఉండడం ఉద్యోగాలు ఎక్కువగా ఉన్న కారణంగా కూడా ఈ అంతరం ఏర్పడుతున్నది . కాలం చెల్లినటువంటి దేశ అవసరాలను పట్టించుకోని మొక్కుబడి చదువులు కూడా యువతను పక్కదారి పట్టిస్తున్నాయని అనేకమంది మేధావులు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. డిమాండ్ ఉన్న మేరకు సరఫరా ఎంత ముఖ్యమో డిమాండ్ ఉన్నటువంటి రంగాలను భర్తీ చేయడానికి యువతకు నైపుణ్య శిక్షణ బాధ్యత కూడా అంతే ముఖ్యం . ఆ కృషి ప్రభుత్వాల పరంగా కొరవడిన కారణంగా ఈ దుస్థితి దాపురించిందని మేధావులు అభిప్రాయపడుతున్నారు.
కొన్ని గణాంకాలను పరిశీలిస్తే:-
ప్రపంచవ్యాప్తంగా యువత నైపుణ్య స్థాయిని అంచనా వేయడానికి గాను సింగపూర్ లోని హ్యూమన్ క్యాపిటల్ లీడర్షిప్ ఇన్స్టిట్యూట్ మరికొన్ని ఇతర సంస్థలు కలిసి ప్రతి సంవత్సరం విశ్వ సామర్థ్య స్పర్ధ సూచినీ ప్రకటిస్తుంటాయని విద్య, నైపుణ్య శిక్షణ, అందుబాటులో ఉన్న అవకాశాలు, ప్రభుత్వాల చొరవ, యువత ఆసక్తి వంటి అంశాల ఆధారంగా దీనిని రూపొందిస్తారని తెలిసింది. ఇటీవల వెలువరించిన 2023వ సూచీలో ప్రపంచంలోని 134 దేశాలకు గాను భారత్ 1o 3వ స్థానంలో నిలబడింది అంటే నైపుణ్య శిక్షణ సాంకేతిక రంగాలలో భారత్ ఎంత వెనుకబడి ఉందో అర్థం చేసుకోవచ్చు .కానీ దానికి భిన్నంగా ప్రభుత్వం భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రతిభ ఉపాధి కర్మగారం అని ప్రకటించుకోవడం కల్లబొల్లి మాటలే అని తేలిపోతున్నది. ఇనుప కండరాలు ఉక్కు నరాలు గల యువత దేశానికి అవసరమని వివేకానందుడు వక్కానించి ఉండవచ్చు కానీ అనారోగ్య అనేక రుగ్మతలతో తల్లడిల్లుతున్న భారతదేశంలో ఇనుప కండరాలు కాదు కదా కనీస ఆరోగ్య రక్షణ లేని యువతను చూస్తున్నామంటే పాలకుల యొక్క వికృత చేష్టలు ఎంత దయనీయస్థితిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు . కేంద్రం ప్రకటించి అమలు చేస్తున్న(ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన) పిఎంకెవివై పథకం కింద ఎంపికైన వారు అత్యధిక సంఖ్యలో దర్జీ, సఫాయి, కర్మచారి వంటి కోర్సులను ఎంపిక చేసుకున్నారని కేంద్రమే స్వయంగా లోక్సభకు ప్రకటించినప్పుడు యువత ఏ స్థాయిలో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు . .లక్ష్యాలను ఆదర్శాలను యువత ముందు పెట్టి ఆదర్శవంతమైన పరిపాలనను ప్రభుత్వాలు అందించగలిగినప్పుడు శాస్త్ర సాంకేతిక రంగాలలోని నిపుణులు మేధావులు సామాజికవేత్తల యొక్క ఉమ్మడి కృషి మధ్యన యువతకు సరైన శిక్షణ ఇప్పించినప్పుడు మాత్రమే రాబోయే సవాళ్లను తట్టుకునే విధంగా ఉపాధి అవకాశాలను సాన పట్టి యువతను నిలబెట్టే అవకాశం ఉన్నది. ప్రభుత్వము, పరిశ్రమలు ,విద్యాసంస్థలు, పౌర సమాజ ప్రతినిధులు, మేధావులు, సామాజికవేత్తలతో కలిసి ఒక బృందం శ్రామిక శక్తిలో నైపుణ్యాల కొరత ఉపాధి ఉద్యోగ అవకాశాలలోని సమస్యలు వైఫల్యాలకు గల కారణాలను అన్వేషించి కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తారని 2018లోనే ఈ టాస్క్ పోర్సెను ప్రభుత్వం ప్రకటించినట్లుగా తెలుస్తూ ఉంటే ఆ పథకం ఏ మేరకు ముందుకు వెళ్ళిందో తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది .
ముఖ్యంగా దేశంలో గిరాకీ ఉన్న రంగాల వారీగా అవసరాలు అవకాశాలను గుర్తించి మానవ వనరుల గిరాకీని సర్దుబాటు చేసే క్రమంలో పూర్తిగా శాస్త్రీయ స్థాయిలో అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది . భిన్న రంగాల నిపుణులతో కమిటీని ఏర్పాటు చేయడంతో పాటు రాష్ట్రాల యొక్క సహకారంతో కేంద్రం రాష్ట్ర జిల్లా జాతీయస్థాయిలో ఇలాంటి కమిటీలను విస్తృతపరచాలి. వాటి సలహా మేరకు చదువులను సంస్కరించి, విద్యాలయాల నైపుణ్యాలను మెరుగుపరిచి, ఉపాధ్యాయుల యొక్క ఆధునిక పరిజ్ఞానానికి పదును పెట్టి, నూతన విలువలతో కూడినటువంటి జవసత్వాలు గల యువతను తయారు చేయగలిగితే ప్రభుత్వ విధానంలో నిజాయితీ గనుక ఉంటే యువత తమ శక్తి యుక్తులను ప్రదర్శించడానికి ఎప్పుడూ వెనుకాడదు. అసాంఘిక పరిస్థితులు , సామాజిక రుగ్మతలు, మద్యము మత్తు లాంటి ఇతర దయనీయ పరిస్థితులను దేశం నుండి తరిమి కొట్టిన నాడు యువత దేశ పరిపాలనలో భాగస్వామి కావడమే కాకుండా ఆధునిక, ఆరోగ్య, ఆనందదాయక , అభివృద్ధితో కూడిన భారతాన్ని ప్రపంచ వేదిక మీద నిలబెట్టే అవకాశం ఉంటుంది . యువశక్తిని దేశ జనాభాలో ఒక భాగంగానే చూడకుండా జాతి సంపదగా భావి సవాళ్లకు ప్రతినిధిగా పాలకులు చూసినప్పుడు మాత్రమే దేశ ప్రయోజనాలు యువత అవకాశాలు ఫ లవంతమవుతాయి.
( ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకులు సీనియర్ ఉపాధ్యాయ ఉద్యమ నేత హుస్నాబాద్( చౌటపల్లి) జిల్లా సిద్దిపేట తెలంగాణ రాష్ట్రం)