60 పైబడిన పెద్దవాళ్ళని  ప్రత్యేకంగా చూడాలి.*  మాట్లాడనివ్వాలి   అనుభవాలు చెప్పనివ్వాలి

Aug 22, 2025 - 18:21
 0  5

 కలిసి మాట్లాడే   సమ వయస్కుల సహవాసం చాలా అవసరం అంటున్న శాస్త్రవేత్తలు.*   అల్జీమర్స్ ను అడ్డుకొని   తృప్తిగా జీవించడం  సాధ్యమట.*
*************
----  వడ్డేపల్లి మల్లేశం 90142 06412 
-----04....02....2025*******
సైగలతో జీవితాన్ని ప్రారంభించిన ఆదిమ  మానవుడు  అవసరాలు,అన్వేషణ, ప్రతిస్పందనలు, ప్రకృతి నుండి  అందిన సహకారం కారణంగా  శబ్దాలు  నేర్చి  పదాల కూర్చి  భాషను  నిర్మించి బతుకు బాటను సాగిస్తున్న  ఈ పరిణామ క్రమం వెనుక చాలా కృషి  పట్టుదల సాధన  ఉన్నది.  ఆ కృషి ఇప్పటికీ కొనసాగుతూ  విశ్వాంతరాళము యొక్క రహస్యాలను చెధించే  క్రమంలో  శాస్త్రీయ పరిశోధనలు కొనసాగుతున్నాయంటే  మనిషి యొక్క మను గడకు ఆధార భూతమైనటువంటిది భాషా, మాటలు,  సాహిత్యము, పరిజ్ఞానము,  చర్చలు, సంప్రదింపులు అని చెప్పక తప్పదు.  అంత క్రియాశీల భూమిక మానవ జీవితంలో పోషిస్తున్నటువంటి  భాషా లేదా మాటలు  ముఖ్యంగా వృద్ధాప్య దశలో  కీలక పాత్ర పోషిస్తాయని ఇటీవల కాలంలో శాస్త్రవేత్తలు  తమ అధ్యయన సారాంశాన్ని  వెలిబుచ్చడం మనమందరము గ్రహించి తీరాలి.  సాధారణంగా 50, 60 సంవత్సరాలు దాటిన తర్వాత  మనుషులు తమకు వయసు పైబడినదని  వృద్ధాప్య దశలోకి చేరుకుంటున్నామని  ఒక రకమైన ఆత్మ న్యూనతకు గురి అయ్యే అవకాశాలు ఉన్నాయి. అయినప్పటికీ  గతాన్ని వర్తమానాన్ని భవిష్యత్తును గురించి మాట్లాడగలిగే సత్తా  ఉన్న వృద్ధులు మాట్లాడకుండా ఉండలేకపోవడం గ మ్మత్తనిపిస్తుంది. అనుభవాలు జ్ఞాపకాలను కథలుగా వల్లిస్తూ  అనుభవ సారాంశాన్ని వె తలను ఆవేదన ఆర్ద్రత రూపంలో  తోటి వాళ్లతో పంచుకోవడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటారు. ఆ వయసుకు  చేరుకున్న మనము నీవు నేను అందరికి తప్పదు  అనుకోవడమే   శ్రేయస్కరము.  పెద్ద మనుషులు మాట్లాడుతూ ఉంటే యువత ఇతర  వయసులో వాళ్లు కొంత అసహనానికి గురవుతూ ఉంటారు  వారితో మాట్లాడటానికి ఇష్టపడకపోగా  వారు నిరంతరం ఏదో మాట్లాడుతున్నారని గెలిచేయడానికి ప్రయత్నిస్తారు. అంతే కాదు  వారి మాటలకు మద్దతు ఇచ్చే వాళ్ల సంఖ్య కూడా క్రమంగా తగ్గుతూ ఉంటుంది కారణం ఏమిటంటే వాళ్లతో  మనకు అవసరం అంతగా లేదని  బలంగా శక్తిగా  వయసులో ఉన్న మనకు వారితో పని ఏమిటి అని  చులకన భావం ఉన్న వాళ్లు కూడా ఈ సమాజంలో  ఎక్కువగా కనపడతారు. దాని వల్లనే పాపం  వృద్ధులకు కుటుంబ సభ్యులతో పాటు తోటి వాళ్లతోను  ఇరుగుపొరుగులోనూ నిరాదరణ ఎదురవుతుంది.  వయస్సును బట్టి అవసరాలు అనే ఇంగిత జ్ఞానం లేని కారణంగా  అహంకారం ఆధిపత్యంతో విర్రవీగే లక్షణం వలన  వాళ్లకు మాట్లాడే అవకాశాన్ని మనం ఇవ్వలేకపోతున్నామని గ్రహించాలి. ఆ లోటుపాట్లను సవరించుకునే ప్రయత్నం చేయాలి ఎందుకంటే   మాట్లాడనివ్వడం ద్వారా వృద్ధులనే కాదు పిల్లలకు కూడా పరిజ్ఞానం పెరుగుతుంది, అనుభవాలు వస్తాయి,ఆత్మస్థైర్యం పెరుగుతుంది, ఆత్మగౌరవం   ఇనుమడిస్తుంది.

  వయస్సు పైబడిన కారణంగా వృత్తికి  ఉత్పత్తికి దూరమై చేతగాని పరిస్థితులలో  కొడుకులు కూతుర్లు కుటుంబ సభ్యుల పైన ఆధారపడి బ్రతకడం అనేది  వృద్ధులకు  రివాజుగా ఆనవాయితీగా అలవాటుగా మారిపోయిన విషయం మనందరికీ తెలుసు. ఇప్పటికీ కొంతమంది పిల్లలు తల్లిదండ్రులను  గౌరవించడం అభిమానించడం ప్రేమించడం బాధ్యతగా చూసుకునే వాళ్ళను  మనం చూడవచ్చు.  మరికొన్నిచోట్ల వృద్ధులైన తల్లిదండ్రులకు కూడా పని పాట అప్పగించి పనిచేయకుంటే విసుక్కోవడంతో పాటు వారిని చులకనగా చూడడం, బయటికి గెంటి వేసే ప్రయత్నం చేయడం, లేకపోతే వాళ్ల పట్ల బాధ్యతలనుoడి  తప్పుకునే వాళ్లను కూడా మనం చూడవచ్చు. ఇలాంటి దుస్థితి  కొనసాగుతున్నటువంటి కుటుంబ నేపథ్యంలో  వృద్ధ వయస్సులో వాళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే మాట్లాడనివ్వాలి పలకరించాలి పలకరించే వాళ్లను తోడుగా  జతపరచాలి అని శాస్త్రవేత్తలు చెబుతున్న మాటలు  తల్లిదండ్రుల పట్ల  బాధ్యత గల వాళ్లకు మాత్రమే సాధ్యమవుతుంది. ఎక్కడైతే నిరాకరించి దూరం పెట్టే ప్రయత్నం చేస్తారో అలాంటి వాళ్ళు కనీసం పలకరించరు  మాట్లాడితే అంగీకరించరు మాట్లాడే స్వేచ్ఛనివ్వరు  అలాంటి వాళ్ల వల్లనే వృద్దులు  దిగులు పడి
ఆవేదనతో ఆందోళనతో అల్జీమర్స్ వ్యాధి బారిన పడే ప్రమాదం కూడా ఉన్నది.దీనికి విరుగుడు శాస్త్రవేత్తలు  ఏం చెబుతున్నారో ఒక్కసారి పరిశీలన చేద్దాం.
   స్వేచ్ఛగా మాట్లాడనివ్వాలి  అంటున్న శాస్త్రవేత్తలు :-
************---***
తల్లిదండ్రులను వృద్ధులను మాట్లాడనివ్వాలి కానీ  విసుక్కో కూడదని   శాస్త్రవేత్తలు  హెచ్చరిస్తున్నారు.  చాలామంది వృద్ధులలో తమతో మాట్లాడే వాళ్లు లేక,  వాక్య నిర్మాణం సరిగా రాక,  స్పందన ప్రతిస్పందన లేని కారణంగా, ప్రశ్నకు ఏం జవాబు చెప్పాలో తెలియనటువంటి పరిస్థితులు  సంభవిస్తాయని  ఆ వయస్సులో అల్జీమర్స్ వ్యాధి గనుక ఉంటే మరింత జ్ఞాపకశక్తి నశించి  మూగవాళ్లుగా మారే ప్రమాదం ఉందని  శాస్త్రవేత్తలు చేస్తున్న హెచ్చరికను  సమాజం పరిశీలించి  తమ పెద్దల పట్ల జాగ్రత్తగా వ్యవహా  రించాలి.  మాట్లాడే స్వేచ్ఛ ఉన్నప్పుడు భాష సజీవంగా ఉంటుంది  అది వృద్ధులకైనా పెద్దలకైనా పిల్లలకైనా ఎవరికైనా.... మాట్లాడే అవకాశం లేనప్పుడు భాష  మృత భాష అయ్యే ప్రమాదం ఉంటుందని ఇటీవల భాషా శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం ప్రస్తావించుకోవలసిన అవసరం ఉంది.  ఆంగ్ల భాష మీది వ్యామోహంతో కొన్ని స్థానిక భాషలను మాట్లాడడం క్రమంగా తగ్గుతున్న వేళ  భాషలతో పాటు కొన్ని జాతులు కూడా అంతరించిపోయే ప్రమాదం ఉన్నదని భాషా శాస్త్రవేత్తలు చేస్తున్న హెచ్చరిక వృద్ధులకు కూడా వర్తిస్తుంది. అభ్యాసములో లేకుంటే  మాటలు కూడా రాకపోవచ్చు అనేది శాస్త్రీయమైనటువంటి అవగాహన.  కెనడాలోని టొరంటో యూనివర్సిటీ కి చెందిన  శాస్త్రవేత్తలు పరిశోధకులు  గతంలో మాట్లాడిన వాళ్లు ప్రస్తుతం మాట్లాడలేకపోతున్నారంటే  ముఖ్యంగా వృద్ధులకు అది  అల్జీమర్స్ వ్యాధికి గుర్తేనని  హెచ్చరిస్తూ ఆ వ్యాధిని అడ్డుకోవడం సాధ్యం కాకపోవచ్చు కానీ తరచుగా వృద్ధులతో మాట్లాడే అవకాశం కల్పించడం ద్వారా  ఆ వ్యాధిని  అడ్డుకోవడానికి  అవకాశం ఉందని, నిరంతరం మాట్లాడడమే దానికి పరిష్కారం అని  చెబుతున్నారంటే  ఒక దశలో మాటకెంత ప్రాధాన్యత ఉందో అర్థం చేసుకోవచ్చు.  మాట్లాడే అవకాశం కనుక మనం ఇవ్వకపోతే వాళ్ళ అభిప్రాయాలు వ్యక్తం కాకపోవడం  తో పాటు  గతంలో వారి అనుభవాలు కూడా మరిచిపోయే ప్రమాదం ఉంటుందని దీని అర్థం.  కాబట్టి వృద్ధాప్యంలో ఉన్న ఎవరికైనా ఈ సిద్ధాంతాన్ని  వర్తింప చేసుకోవడం ద్వారా వారి వారి స్వేచ్ఛను  స్వాతంత్రాన్ని అడ్డుకోకుండా మాట్లాడే అవకాశాలు కల్పించడం ద్వారా వారిని ఆత్మగౌరవంతో బ్రతికేలా  కొనసాగించవలసిన బాధ్యత కుటుంబ సభ్యులతో పాటు సమాజం పైన ఉన్నది అనేది ఈ వ్యాసం యొక్క అంతరార్థం. పలకరించడానికి, కళ్ళ ముందు  కనిపించడానికి అవకాశం ఇవ్వనటువంటి దుర్మార్గులు ఉన్నటువంటి ఈ వ్యవస్థలో  వారి ఆరోగ్యాన్ని జ్ఞాపకశక్తిని  పెంపొందించడానికి  సంయమనంతో    ఆదరించడం అంటే నిజంగా సమాజంలోని కుటుంబ సభ్యుల యొక్క సంస్కారమే అని చెప్పక తప్పదు. ఆ సంస్కారాన్ని కాపాడుకుందాం ఎందుకంటే అది మన తల్లిదండ్రులు బంధువులకు మాత్రమే వర్తించదు మనకు కూడా అదే సిద్ధాంతం వర్తిస్తుంది కదా!
(  ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు అరసం రాష్ట్ర కమిటీ సభ్యుడు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ)

GireeshKumar Ekalavya విలేకరులు కావలెను No డిపాజిట్..! No టార్గెట్..! న్యూస్ లు మీవి ...! పబ్లిష్ మాది ..! చేయవాల్సిందల్లా ఒక్కటే న్యూస్ సేకరించడం. ఆ న్యూస్ ను పబ్లిక్ లోకి తీసుకపోవడం ప్రముఖ మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి న్యూస్ ఛానల్, పేపర్, వెబ్సైట్ చూసుకుంటుంది. మా న్యూస్ ఛానల్ నందు పనిచేయుటకు మండలాల వారిగా విలేకరులు కావలెను. సంప్రదించవలసిన నెంబర్ 9063881333