మున్సిపల్ ఉద్యోగి అశోక్ పై శాఖ పరమైన చర్యలు తీసుకోవాలి. CITU డిమాండ్

May 21, 2026 - 20:34
May 21, 2026 - 20:51
 0  3

జోగులాంబ గద్వాల 21 మే 2026 తెలంగాణ వార్త ప్రతినిధి :- పట్టణ మున్సిపాలిటీ లో సీనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్న అశోక్ ఫై శాఖ పరమైన చర్యలు తీసుకోవాలని సీఐటీయు జిల్లా అధ్యక్షులు ఉప్పేర్ నరసింహ డిమాండ్ చేశారు. గురువారం జిల్లాలోని వివిధ మున్సిపాలిటీలలో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై కలెక్టర్ గారికి, మరియు అదనపు కలెక్టర్ కి వినతిపత్రం అందించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ గద్వాల మున్సిపాలిటీలో సీనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్న అశోక్ అనే ఉద్యోగి తన విధులను సక్రమంగా నిర్వర్తించకపోగా, కార్మికుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నారని తెలిపారు. జయమ్మ అనే కార్మికురాలు జనవరి చివరి వారంలో తన కొడుకు సంజీవ్ కు సంబంధించిన మరణ పరిహారం గురించి అన్ని పత్రాలు సమర్పించి దరఖాస్తు చేసుకుంటే, నాలుగు నెలల తర్వాత సర్టిఫికెట్లు పోయాయని చెబుతు వేరే ఉద్యోగికి ఆ బాధ్యతలు అప్పజెప్పె ప్రయత్నం చేస్తూ కార్మికురాలిని కార్యాలయం చుట్టూ తిప్పున్నాడని విమర్శించారు. ఇదే విషయమై కమిషనర్ దృష్టి కి తీసుకెళ్లిన ఎటువంటి ఫలితం లేకుండా పోయిందన్నారు. శివ,పాండు అనే కార్మికులను ఎటువంటి కారణం లేకుండా అక్రమంగా తొలగించి విధులలోకి తీసుకోవడం లేదని అన్నారు. జిల్లాలో ఎక్కడా లేనివిధంగా గద్వాల మున్సిపాలిటీ లోనే సంవత్సరాల తరబడి కార్మికులకు ఇవ్వవలసిన బట్టలు,సబ్బులు,నూనెలు, రైన్ కోట్లు ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారని తెలిపారు.మున్సిపాలిటీలో విధులు నిర్వహించి మరణించిన కార్మికుల కుటుంబాలకు ఇవ్వవలసిన పరిహారం ఇవ్వడం లేదన్నారు. నెలనెలా సక్రమంగా వేతనాలు ఇవ్వడం లేదని, ఫిబ్రవరి నెల వేతనం ఇంకా ఎస్టీఓ కార్యాలయంలోనే పెండింగ్లో ఉందని తెలిపారు. అల్లంపూర్ మున్సిపాలిటీలో గత మూడు సంవత్సరాలుగా పీఎఫ్, ఈఎస్ఐ అందడం లేదని, రెండు నెలల  వేతనాలు పెండింగ్లో ఉన్నాయని, కార్మికులకు ఇవ్వవలసిన బట్టలు,సబ్బులు,నూనెలు ఇవ్వడం లేదని తెలిపారు.ఐజ,వడ్డేపల్లి మున్సిపాలిటీలలో చనిపోయిన కార్మికుల కుటుంబాలకు పరిహారాలు ఇంకా ఇవ్వడం లేదన్నారు. పెరుగుతున్న జనాభా అనుగుణంగా అదనపు కార్మికులు నియమించకపోవడం వల్ల, పనివేళలో మార్పులు చేయకపోవడం వల్ల  తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. తక్షణమే పై సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని లేని పక్షంలో దశల వారి ఆందోళనలకు సిద్ధమవుతామని హెచ్చరించారు.
డిమాండ్లు.
1. గద్వాల  మున్సిపాలిటీలో సీనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్న అశోక్ పై శాఖపరమైన చర్యలు తీసుకోవాలి.
2. కారణం లేకుండా తొలగించిన  మున్సిపల్ కార్మికులు కోళ్ల శివ,పాండులను వెంటనే విధులలోకి తీసుకోవాలి.
3. గద్వాల,అల్లంపూర్ మున్సిపాలిటీలలో పనిచేస్తున్న కార్మికులకు వెంటనే పెండింగ్లో ఉన్న బట్టలు సబ్బులు నూనెలు రెయిన్ కోట్లు ఇవ్వాలి.
4. అల్లంపూర్ మున్సిపల్ కార్మికులకు పెండింగ్ లో ఉన్న మూడు సంవత్సరాల పిఎఫ్ వెంటనే వారి ఖాతాలో జమ చేయాలి.
5. జిల్లాలోని మున్సిపాలిటీలలో విధులు నిర్వహించి మరణించిన కార్మికుల కుటుంబాలకు పరిహారాలు వెంటనే అందజేయాలి.
6. అల్లంపూర్ మున్సిపాలిటీలో రెండు నెలలు గద్వాలలో ఒక నెల పెండింగ్ వేతనం వెంటనే ఇవ్వాలి.
7. కార్మికుల పిఎఫ్ సమస్యను పరిష్కరించడానికి ప్రతి మున్సిపాలిటీలో ప్రత్యేక అధికారిని నియమించాలి.
8. ప్రతి నెల 1వ తేదీనే మున్సిపల్ కార్మికుల ఖాతాలో వేతనం చేయాలి.
 ఈ కార్యక్రమంలో తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ (సిఐటియు అనుబంధం) జిల్లా అధ్యక్షుడు సంజీవరాజు, జిల్లా కోశాధికారి మహేందర్,నాయకులు మధు,ప్రభాకర్,వీరేష్,రమేష్,కోళ్ల శివ, పాండు తదితరులు పాల్గొన్నారు.

G.THIMMA GURUDU Jogulamba Gadwal Staff Reporter Jogulamba Gadwal District Telangana State