ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే తోలు తీస్తాం ఎమ్మెల్యే సామెల్

Sep 2, 2026 - 21:08
 0  1
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే తోలు తీస్తాం ఎమ్మెల్యే సామెల్

  బీఆర్‌ఎస్‌ ధర్నాలపై తుంగతుర్తి ఎమ్మెల్యే తీవ్ర విమర్శలు

బియ్యం అక్రమాలపై సమగ్ర విచారణ జరిపిస్తాం: ఎమ్మెల్యే

తిరుమలగిరి 03 సెప్టెంబర్ 2026 తెలంగాణ వార్త రిపోర్టర్

సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలో  తిరుమలగిరి మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ బీఆర్‌ఎస్‌ చేపడుతున్న ధర్నాలపై  తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. బీఆర్‌ఎస్‌ పాలనలో నియోజకవర్గానికి చేసిన అభివృద్ధి ఏమిటో ప్రజలకు వివరించాలని ఆయన డిమాండ్‌ చేశారు. బీఆర్‌ఎస్‌ అంటే ‘‘బొందలగడ్డ పార్టీ’’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

బీఆర్‌ఎస్‌ హయాంలో వైకుంఠధామాలు, స్మశాన వాటికలు తప్ప చెప్పుకోదగ్గ అభివృద్ధి జరగలేదని ఎమ్మెల్యే విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు, ఇసుక అక్రమ రవాణా, రైతుల సమస్యలపై మాట్లాడే నైతిక హక్కు బీఆర్‌ఎస్‌ నేతలకు లేదన్నారు. ప్రతిపక్ష నేతగా కేసీఆర్‌ అసెంబ్లీకి హాజరై ప్రజా సమస్యలపై చర్చించాలని, ప్రభుత్వానికి నిర్మాణాత్మక సలహాలు ఇవ్వాలని సూచించారు.

 

ఇసుక దందాను అడ్డుకున్నాం

 

అడ్డగూడూరు నుంచి లక్ష్మీదేవి కాలువ వరకు నడియేటిలో ఇసుక రవాణా కోసం గతంలో రోడ్డు నిర్మించారని, కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన వెంటనే జేసీబీలతో ఆ రోడ్డును తొలగించామని ఎమ్మెల్యే తెలిపారు. తరతరాలుగా ఏటి నీటిపై ఆధారపడి జీవిస్తున్న ప్రజల హక్కులను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఇసుక అక్రమాలను అడ్డుకున్న మహిళలను గతంలో ఇబ్బందులకు గురిచేశారని ఆరోపించారు.

 

కాంగ్రెస్‌ హయాంలో అభివృద్ధి

 

తుంగతుర్తి ప్రజలు, రైతులు, విద్యార్థులు, మహిళల మద్దతుతో కాంగ్రెస్‌ పార్టీకి 52 వేలకుపైగా ఓట్ల భారీ మెజార్టీ లభించిందని ఎమ్మెల్యే తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలో నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పారు.

 

బిక్కేరు వాగుపై ఆరు చెక్‌డ్యామ్‌లను పూర్తి చేశామని, 15 వేల మెట్రిక్‌ టన్నుల సామర్థ్యం కలిగిన ధాన్యం గోదాములను నిర్మించామని తెలిపారు. తండాల్లో రూ.7 కోట్లకు పైగా వ్యయంతో బీటీ రోడ్ల నిర్మాణ పనులు చేపట్టామని, ఇప్పటివరకు రహదారులు లేని పలు ప్రాంతాలకు కొత్త రోడ్లు మంజూరు చేశామని పేర్కొన్నారు.

 

తొండ గ్రామంలో సుమారు రూ.200 కోట్ల వ్యయంతో 2,600 మంది విద్యార్థులు చదువుకునేలా ఆధునిక విద్యా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. పేద విద్యార్థుల కోసం డిగ్రీ కళాశాలను అందుబాటులోకి తీసుకువచ్చామని, నూతన భవన నిర్మాణానికి త్వరలో భూమిపూజ నిర్వహిస్తామని వెల్లడించారు.

 

ధాన్యం, బియ్యం అక్రమాలపై విచారణ

 

బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో రైస్‌ మిల్లుల పేరుతో ధాన్యం, బియ్యం అక్రమాలకు పాల్పడ్డారని ఎమ్మెల్యే ఆరోపించారు. గత ప్రభుత్వంలోని మాజీ మంత్రులు, నాయకులు కలిసి రాష్ట్రంతో పాటు జిల్లాను దోచుకున్నారని విమర్శించారు. ఈ వ్యవహారాలపై రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావించి, చట్టపరంగా సమగ్ర విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకునేలా చేస్తామని స్పష్టం చేశారు.

 

‘‘రేవంత్‌రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకోం’’

 

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై ప్రతిపక్ష నాయకులు అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. అర్హత లేని వ్యక్తులు సీఎంపై నోటికొచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు. మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే ‘‘తిరుమలగిరి చౌరస్తాలో తోలు తీస్తాం’’ అంటూ తీవ్ర హెచ్చరిక చేశారు. ఈ కార్యక్రమంలో తిరుమలగిరి మండల పార్టీ అధ్యక్షులు సుంకరి జనార్దన్ 9 మండలాల పార్టీ అధ్యక్షులు మరియు పట్టణ పార్టీ అధ్యక్షులు పేరాల వీరేష్ జుమ్మిలాల్ బత్తుల శ్రీనివాస్  తిరుమణి యాదగిరి పాలెపు చంద్రశేఖర్ కందుకూరి లక్ష్మయ్య ఫతేపురం సుధాకర్ వంశీ నరేష్ కాంగ్రెస్ కార్యకర్తలు  తదితరులు పాల్గొన్నారు

జేరిపోతుల రాంకుమార్ తిరుమలగిరి విలేకరి మరియు తుంగతుర్తి నియోజకవర్గం ఇన్చార్జి