తిరుమలగిరిలో సైబర్ క్రైమ్ పట్ల అవగాహన
తిరుమలగిరి 03 సెప్టెంబర్ 2026 తెలంగాణ వార్త రిపోర్టర్
సూర్యాపేట జిల్లా పోలీస్ ఆధ్వర్యంలో తిరుమలగిరి మండల కేంద్రంలో బుధవారం 'ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక' కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నాగారం సర్కిల్ ఇన్స్పెక్టర్ డి. నాగేశ్వరరావు, తిరుమలగిరి స్థానిక సబ్ - ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ గుత్త వెంకట్ రెడ్డి నేతృత్వంలో ప్రజలకు సైబర్ క్రైమ్, పోలీస్ అక్క, రోడ్డు భద్రతపై విస్తృత అవగాహన కల్పించారు.
సదస్సులో సిఐ నాగేశ్వరరావు మాట్లాడుతూ, సాంకేతికత పెరుగుతున్న కొద్దీ సైబర్ నేరాలు కూడా ఎక్కువవుతున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎవరైనా ఆన్లైన్ ఆర్థిక మోసాలకు గురైతే, వెంటనే మొదటి గంట (గోల్డెన్ అవర్) లోపు 1930 హెల్ప్‌లైన్ నంబర్‌కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని తెలిపారు. మహిళలు, విద్యార్థినుల రక్షణ కోసం 'పోలీస్ అక్క' విభాగం నిరంతరం అందుబాటులో ఉంటుందని, వేధింపులకు గురైతే ధైర్యంగా పోలీసులను ఆశ్రయించవచ్చని భరోసా ఇచ్చారు. అదేవిధంగా, రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించాలని కోరారు. మైనర్లకు వాహనాలు ఇస్తే తల్లిదండ్రులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, ప్రజాప్రతినిధులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.