కొత్త రాజ్యాంగం తెస్తాం సవరణలు చేస్తాం

Apr 18, 2024 - 19:55
Jun 27, 2024 - 20:50
 0  12
కొత్త రాజ్యాంగం తెస్తాం సవరణలు చేస్తాం

 2/3 మెజారిటీ ఇవ్వండి అంటూ బిజెపి నాయకుల ప్రకటనల అర్థం ఏమిటి ?

రాజ్యాంగం మార్చమని  ప్రజలు అడగలేదు రాజ్యాంగాన్ని పాటించకుండా పాలించిన పాలకులదే ద్రోహం.

పార్టీలు ఏవైనా  ప్రస్తుత పరిస్థితికి బాధ్యత వహించి దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలి.

రాజ్యాంగ మార్పు  వ్యాఖ్యల పట్ల సామాన్యులు బుద్ధి జీవుల ఆందోళన.

-- వడ్డేపల్లి మల్లేశం

  ఒకవైపు కేంద్రంలో  బిజెపి నాయకత్వంలోని ఎన్డీఏ పాలనా కాలంలో  ప్రభుత్వ సంస్థలు ధ్వంసం కావడంతో పాటు,  స్వేచ్ఛ స్వాతంత్ర్యాలు కొరవడి , అప్పుల ఊబిలో చిక్కి, సామాన్యుడికి  రక్షణ లేని దౌర్భాగ్య పరిస్థితులు నెలకొంటే  మరొకవైపు ప్రశ్నించి ప్రతిఘటించిన సామాన్యుల నుండి ప్రతిపక్షాల వరకు  నిర్బంధించి అణచివేయడంతో పాటు  ఉభయ సభల్లో  143 మందిని బహిష్కరించి  బిల్లులను యధాతధంగా ఆమోదించిన కేంద్ర ప్రభుత్వ   మొండి వైఖరి మనకు తెలిసిందే.  మరొకవైపు  గత పది ఏళ్లలో  ఆమోదించిన బిల్లులలో  చర్చ లేకుండా లేదా నామమాత్రపు చర్చ తోనే 30 శాతానికి పైగా బిల్లులు ఆమోదించబడినట్లు గణాంకాలు తెలియజేస్తుంటే  గతంలో సిజెఐ గా పని చేసినటువంటి ఎన్వి రమణ గారు  చర్చ లేకుండా బిల్లులను ఆమోదించడం పార్లమెంటుకు తగదని హెచ్చరిస్తే  ఈ దేశంలో ఎలాంటి పాలన కొనసాగిందో ఇకనైనా మనకు అర్థం కాదా?  ఈ పరిస్థితుల్లో రాబోయే 2024  పార్లమెంటరీ సార్వత్రిక ఎన్నికల సందర్భంగా  బిజెపికి చెందిన వాళ్లు మాత్రమే పదేపదే రాజ్యాంగాన్ని మార్చుతామని ప్రకటించడాన్ని  గమనిస్తే,  400 సీట్లు రావాలని కోరుకుంటే , ఒకవేళ అదే జరిగితే  దేశానికి ఎంత ప్రమాదమో అర్థం చేసుకోవచ్చు.

 మూడవసారి బిజెపి అధికారంలోకి వస్తే బహుశా రాబోయే కాలంలో ఎన్నికలు జరగవేమో?  వ్యక్తిగత ఏజె0డాతోనే  పరిపాలన చేస్తారేమో?  ప్రస్తుత రాజ్యాంగాన్ని బ్రష్టు పట్టిస్తారు!  మను ధర్మ శాస్త్రాన్ని అమలు చేస్తారు! అని సామాన్యుల నుండి మేధావులు పడుతున్న ఆందోళన రాబోయే ప్రమాదాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో రాజ్యాంగ మార్పుపై ఇటీవల ప్రస్తావిస్తున్నటువంటి కొందరి వ్యాఖ్యలను    బుద్ధి జీవులు, మేధావులు, సామాన్య కార్యకర్తలు, ప్రజాస్వామిక వాదులుగా ఖండించడానికి ముందు వరుసలో ఉండాలని  ప్రజా వ్యతిరేక విధానాన్ని తిప్పికొట్టే క్రమంలో ప్రత్యామ్నాయ శక్తులను అధికారంలోకి తీసుకురావడానికి కృషి చేయాలని  విజ్ఞప్తి చేయడమే ఈ వ్యాసం యొక్క ఉద్దేశం.

  విభిన్న సందర్భాల్లో  బిజెపి నాయకుల వ్యాఖ్యలు:-

 ఎన్డీఏ కూటమికి మూడోసారి పెద్ద మెజారిటీతో అధికారాన్ని కట్టబెడితే రాజ్యాంగం మార్చేస్తారంటూ ప్రతిపక్ష పార్టీలకు చెందిన పలువురు నేతలు  ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో    "అలాంటి ప్రస్తావన ఏదీ లేదని  అలాంటి ప్రయత్నం తాము చేయబోమని  ప్రధాని ఒక సందర్భంలో  నమ్మబలికే ప్రయత్నం చేస్తూ  రాజ్యాంగ నిర్మాత అయిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కూడా  దాన్ని మార్చలేరని" 

ప్రకటించడాన్నీ నమ్మడానికి  అవకాశాలు లేవు.  1)   మార్చి 2024 లో  రానున్న లోక్సభ ఎన్నికల సందర్భంగా కర్ణాటక కర్వార్ సభలో mp  అనంతకుమార్ హెగ్డేమాట్లాడుతూ "  ఎన్డీఏ కూటమికి 400కు పైగా సీట్లు ఇస్తే  హిందువులకు అనుకూలంగా రాజ్యాంగాన్ని మార్చేస్తామని,  రాజ్యాంగ పీఠికలో లౌకికవాదం అనే పదాన్ని కూడా తొలగిస్తామని,  హిందువులకు అనుకూలమైన రాజ్యాంగo  రావాలంటే  మోడీ నేతృత్వంలోని బిజెపికి అధిక సీట్లు ఇవ్వాలని  ప్రజలను కోరడాన్ని  మనం ఎలా అర్థం చేసుకోవాలి?  బిజెపి పార్టీ అంతర్గతంగా  రాజ్యాంగ మార్పుకు కుట్ర చేస్తున్నట్టుగానే భావించవలసి ఉంటుంది కదా!  పైగా రాజ్యాంగంలో మొదట్లో లేని లౌకిక వాదాన్ని మధ్యలో రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారని  కాబట్టి దాన్ని తీసివేయాలని కొందరు స్థానిక నాయకులు కూడా చర్చించడాన్నీ గమనిస్తే  భారతదేశంలో  మత ప్రమేయం లేనటువంటి రాజ్యాన్ని తీసుకురావడానికి ఆలోచించిన ఆనాటి  పాలకులు 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా  చేసిన ఆ సవరణ ఎంతో ఉపయోగపడిన విషయాన్ని కూడా  బిజెపి విశ్వసించడం లేదంటే  మత ఆధారిత రాజ్యాన్ని కోరుకోవడమే కదా!

2). 2024 ఏప్రిల్  మొదటి వారంలో నాగపూర్ నుంచి పోటీ చేస్తున్న బిజెపి అభ్యర్థి  శ్రీమతి జ్యోతి మీర్ధా కూడా  రాజ్యాంగ మార్పును ప్రస్తావిస్తూ దేశ ప్రయోజనాల కోసం కొన్ని కఠినమైన నిర్ణయాలను తీసుకోవాల్సి ఉంటుందని,  దీనికోసం రాజ్యాంగంలో సవరణలు మార్చడం

అవసరమని,  ఇది జరగాలంటే  ఉభయ సభలలో బిజెపికి 2/3 వంతు మెజార్టీ కావాలని పేర్కొనడం....  తరచుగా బిజెపి నేతలందరూ  రాజ్యాంగ మార్పుపై వ్యాఖ్యానించడాన్ని  బట్టి చూస్తే  అధికారం తిరిగి కట్టబెడితే ఆ ప్రమాదం ఎంతో దూరంలో లేదని తేలిపోతున్నది .

3).  రాజ్యాంగం పైననే  తమ దృష్టిని మరల్చి  ప్రస్తుతము అంతో ఇంతో సామాన్య పేద వర్గాలకు చట్టబద్ధంగా అందాల్సిన ఫలాలు అందుతుండగా  సంపన్న వర్గాలకు పెట్టుబడిదారులకు మాత్రమే ఉపయోగపడే  రాజ్యాంగాన్ని ఆశిస్తున్న క్రమంలో  బిజెపి నాయకులు మాట్లాడుతున్న మాటలు  రాజ్యాంగంలో మార్పులు జరగవచ్చు అంటూ సంకేతాలు ఇవ్వడం  ఆ పార్టీ యొక్క కుట్రగా  రాబోయే భవిష్యత్తులో విధానంగా  భావించినప్పుడు మాత్రమే ప్రమాదం నుండి దేశాన్ని రక్షించుకునే అవకాశం ఉంటుంది. ఈ క్రమంలో  బిజెపి నేత అరుణ్ గోవిల్  ఇటీవల ఒక సందర్భంలో మాట్లాడుతూ  ఎన్డీఏ సర్కారు మరోసారి అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తారు అంటూ విపక్షాలు చేస్తున్న విమర్శలపై మీడియా అడిగిన ప్రశ్నకు ఆయన స్పందించి  కాలానుగుణంగా రాజ్యాంగంలో మార్పులు జరుగుతాయి,  మార్పు అనేది అభివృద్ధికి సంకేతం,  నాటికి నేటికి పరిస్థితులలో  ఎన్నో మార్పులు వచ్చిన కారణంగా  రాజ్యాంగంలో మార్పులు జరగాలంటే ఒక వ్యక్తి తో సాధ్యం కాదు కనుక  అందరీఆమోదముతో  దాన్ని మార్చుకోవాల్సి ఉంటుంది అని  సూచనప్రాయంగా ప్రకటించడం అంటే. ఈ దేశ రాజ్యాంగాన్ని మార్చడమే బీజేపీ  విధానం అని మనకు అర్థమవుతూనే ఉంది.

4)  బిజెపి నరనరాన జీర్ణించుకున్న ఆలోచన కనకనే రాజ్యాంగ మార్పు అందరి నోటా  వినబడుతున్న సందర్భంలో  ప్రతిపక్షాలు ప్రజలు బుద్ధి జీవులు  ఆందోళన చెందక ఏమవుతారు? అందుకు  బలాన్ని చేకూర్చే విధంగా   అంబేద్కర్ జయంతి ఉత్సవాలలో భాగంగా  14 ఏప్రిల్, 2024న  ప్రస్తుత అయోధ్య ఎంపీ బీజేపీ నేత లాల్లు సింగు  మిల్కీపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన ఒక సభలో మాట్లాడుతూ " 272 సీట్లతో ప్రభుత్వాన్ని మాత్రమే ఏర్పాటు చేయవచ్చు కానీ  సవరణలు చేయడం  కష్టమవుతుంది.  రాజ్యాంగాన్ని మార్చాలన్న లేక కొత్త రాజ్యాంగాన్ని తీసుకురావాలన్న  2/3 మెజారిటీ అవసరం"  అని చేసిన ప్రకటన   బిజెపి నేతలందరి మాటలు విన్న తర్వాత ప్రధానమంత్రి  అలాంటిది ఏమీ లేదని నమ్మబలితే ఎవరు అంగీకరిస్తారు ? అంతేకాదు  ఈ వ్యాఖ్యల పైన  సర్వత్రా విమర్శలు రావడంతో పాటు ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున  ఆందోళన నిరసన వ్యక్తం చేసినప్పుడు  ముఖ్యంగా లల్లు సింగ్ ప్రకటనపై  నిరసన వ్యక్తం చేసిన సందర్భంలో  దిద్దుబాటు చర్యల్లో భాగంగా తాను  త ప్పుడు ఉద్దేశంతో ఈ వ్యాఖ్యలు అనలేదని  సమర్ధించుకునే ప్రయత్నం చేయడా న్ని ఇక ఏమాత్రం కూడా ఉపేక్షించకూడదని మనకర్తమవుతున్నది.

  పదేళ్లుగా ప్రజల ప్రమేయం లేకుండా పేద వర్గాల  ప్రస్తావన లేకుండా సాగిన పరిపాలన,  అసమానతలు అంతరాలు దోపిడీ పీడన,  సంపద కొద్దిమంది చేతుల్లో పోగు పడడంతో సంపన్న వర్గాలకు దోచిపెట్టిన తీరు,  పెట్టుబడిదారుల రుణాలను మాఫీ చేసినటువంటి ప్రభుత్వ విధానం  ఒకవైపు మనందరినీ ఆందోళనకు గురి చేస్తుంటే  ఇక మరోసారి అధికారం ఇస్తే తామేం చేస్తామో ముందుగానే చెబుతుంటే కూడా  మన చెవులకు వినబడకపోతే ఎలా?  అందుకే ఇండియా కూటమి ఈ సందర్భంలో  బిజెపి ప్రభుత్వ ఎత్తుగడలు మోసాలు, కుట్ర భవిష్యత్తు కార్యాచరణను  ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లడం ద్వారా  రాబోయే ప్రమాదాన్ని  అడ్డుకోవడంతోపాటు  సామాన్య, పేద వర్గాల కోసం, భవిష్యత్ తరాల కోసం  ఈ దేశాన్ని మోసపూరిత విధానాలు గల పాలకుల నుండి  రక్షించుకోవలసిన అవసరాన్ని మనం  బాధ్యతగా ఈ ఎన్నికల్లో తీసుకోవలసిన అవసరం ఎంతగానో ఉన్నది.  ప్రస్తుతం మనందరి కర్తవ్యం కూడా అదే.  ఒకవేళ రాజ్యాంగం  మార్చితే  ప్రజలు, ప్రజల హక్కులు, ప్రజాస్వామ్యం,  సామ్యవాదము, లౌక్యవాదము అనే పదాలకు ఈ దేశంలో చోటే మిగలదు జాగ్రత్త !

(ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు అభ్యుదయ రచయితల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ)

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333