మించిన రసాయన పదార్థాలతో  విషతుల్యమవుతున్న  పంట దిగుబడులు

Sep 13, 2024 - 09:06
Sep 25, 2024 - 17:13
 0  1

సేంద్రీయ వ్యవసాయం వైపు దృష్టి సారించవలసిన అనివార్య

పరిస్థితులు  .సాగు రంగాన్ని సంస్కరిస్తే  ప్రజారోగ్యం  పదిలంగా ఉంటుంది.

పెట్టుబడిదారీ ధోరణులకు పాలకులు  మంగళం పాడాలి.

---  వడ్డేపల్లి మల్లేశం

1960 ప్రాంతంలో భారత దేశంలో హరిత విప్లవం ప్రారంభమైన నేపథ్యంలో  పంటల  విస్తీర్ణంతోపాటు దిగుబడ్లు భారీగా పెరిగినప్పటికీ  నీటిపారుదల ప్రాజెక్టులు నూతన వంగడాలు ఆవిష్కరించబడ్డప్పటికీ  అదే సందర్భంలో క్రిమిసంహారక మందులు ఎరువుల వాడకం ప్రారంభం కావడం  ఈ రెండింటితో నేడు  వ్యవసాయ రంగం కుదేలవుతున్న తీరును మనం గమనించవలసిన అవసరం ఉంది.  నాసిరకం వంగడాలు  మార్కెట్లోకి రావడం  ప్రైవేటు వ్యాపారులను ప్రభుత్వాలు పరోక్షంగా ప్రోత్సహించడం వలన  చీడపీడలు రోగాల బారిన పంటలు పడుతుంటే తప్పని పరిస్థితులలో వాటిని నియంత్రించడానికి పురుగుమందులు విచ్చలవిడిగా వాడడం  అనివార్యమవుతున్నది. తద్వారా  పంటల ఉత్పత్తికి ఆరోగ్యానికి తీరని నష్టం కలుగుతున్నది  విషతుల్యమైనటువంటి క్రిమిసంహారక మందులు ఎరువులను రైతులు పంటచేలలో వాడుతున్న సందర్భంలో ప్రాణాలు కోల్పోవడమే కాకుండా ఆహార పదార్థాలు కూడా విషతుల్యమై  ప్రజలు అనేక రోగాల బారిన పడి  మృత్యుకుహరంలో చేరడానికి కూడా కారణమవుతున్న విషయాన్ని మనం గమనించాలి . అందుకే సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించడం ద్వారా  నూతన నాణ్యమైన వంగడాలను  ప్రభుత్వ ఆధ్వర్యంలోనే  రూపొందించడం వలన  కల్తీ  వంగడాలు  ఇతరత్రా అవకాశం లేకుండా చేయడంతో  మెరుగైన ఫలితాలను సాధించడం పెద్ద మొత్తంలో ఉత్పత్తులను పొందడం తద్వారా ప్రజల ఆరోగ్యానికి భరోసాని ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది .
       వ్యవసాయ రంగం పంటల ఉత్పత్తి---  కొన్ని అధ్యయన అంశాలు:-
**********  ఆసియా పసిఫిక్ పెస్టిసైడ్స్ యాక్షన్ నెట్వర్క్ సర్వే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆధ్వర్యంలో జరిగిన అధ్యయనంలో  పంటలకు సోకే తెగుళ్లను  అరికట్టడానికి  ఇతర మార్గాలు ఉన్నప్పటికీ రసాయన మందులపైన  విరివిగా ఆధారపడడం వలన దేశంలో అత్యంత ప్రమాదకరమైన పురుగుమందుల వాడకం ఏటా పెరుగుతూ  ఉత్పత్తులు విషపూరితం కావడంతో పాటు  వీటిని వినియోగించిన రైతులు కూడా మృత్యు బారిన పడిన సందర్భాలను  మనం గమనించవచ్చు.  ఇక జాతీయ నేర గణాంక సంస్థ అధ్యయనం ప్రకారం  పురుగుమందుల వాడకములో అశ్రద్ధ నిర్లక్ష్యం కారణంగా దేశంలో ఏటా సుమారు 7వేలకు పైగా రైతులు  మృత్యువాత పడుతున్నట్లుగా తెలుస్తున్నది  .చీడపీడల నివారణ కోసం పిచికారీ చేస్తున్న విషపూరిత రసానిక పదార్థాల సందర్భంగా రైతులు అజాగ్రత్త వలన క్యాన్సర్ అల్జీమర్స్ లాంటి అనేక రోగాల బారిన పడుతున్నట్లు  పలు అధ్యయనాల ద్వారా తెలుస్తున్నది. దీనివల్ల  ధూమపానము కంటే కూడా అత్యధిక  స్థాయిలో  ప్రమాదము పొంచి ఉన్నదని తాజాగా జరిపిన ఓ పరిశోధనా సర్వేలో వెల్లడించినట్లు నిపుణులు తెలియజేస్తున్నారు.  పంటలపై చీడపీడలను నివారించడానికి పిచికారి చేసే మందు  వాస్తవంగా  పురుగులను చంపేది కేవలం 0.01% అని  అంతకు మించిన స్థాయిలో ఆ విష ప్రభావం రైతుల పైన  చూపుతున్నదని  దశాబ్దాల క్రితమే శాస్త్రవేత్తలు రైతులను హెచ్చరించిన విషయాన్ని కూడా మనం గమనించాలి .
      పంట పొలాల నుండి  ప్రజల శరీరాలలోకి :-
************
హరిత విప్లవము సందర్భంగా  సాగునీటి ప్రాజెక్టులు నాణ్యమైన వంగడాల ఉత్పత్తి తో సహా  ఎరువులు క్రిమిసంహారక మందులను అత్యధికంగా వినియోగించి ఉత్పత్తిని భారీగా పెంచడం ద్వారా ఆనాడు ఉన్నటువంటి దేశ ఆహార అవసరాలను థీ ర్చడానికి కృషి జరిగిన విషయం తెలిసిందే .కానీ ఆ ప్రభావం రోజురోజుకు పెరిగిపోతూ చీడపీడలకు  క్రిమిసంహారక మందులు ఎరువుల వాడకం భారీగా పెరిగిపోవడం  వీటిని ఉత్పత్తి చేసే పరిశ్రమలకు పరోక్షంగా ప్రభుత్వాలు మద్దతు ఇవ్వడం వంటి కారణాల వలన  ఉత్పత్తి అవుతున్న ఆహార పదార్థాలలో ఉండవలసిన పోషకాలు లేకపోగా భూమి కూడా కాలుష్యమై  విషపూరితమవుతున్న సందర్భాన్ని రైతులు శాస్త్రవేత్తలు, పాలకులు, ప్రజలు సీరియస్ గా ఆలోచించవలసిన అవసరం అనివార్యంగా ఏర్పడింది . పురుగుమందులు ఎరువుల ఉత్పత్తిలో ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉండగా  వాటి వినియోగంలో  భారతదేశo నాలుగవ స్థానానికి ఎగబాకడాన్ని గమనించినప్పుడు  ఆందోళన కలగక మానదు.  ఇక భారత దేశంలో పురుగుమందుల వాడకాన్ని  పంజాబ్ హర్యానా  రాష్ట్రాలు అత్యధికంగా వినియోగిస్తుండగా ఆ తర్వాతి స్థానాలలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ  ఆక్రమించడం కూడా ఆందోళనకరమే.  ప్రైవేటు రంగంలో  వంగడాలు  పురుగు మందులు ఎరువులు తయారవుతున్న సందర్భంగా లాభా పేక్షతో నకిలీవి ఉత్పత్తి చేయడంతో
వాటి వినియోగించే సందర్భంలో రైతుల పైన పెను ప్రభావం పడడంతో పాటు పంటచేలు కూడా  సంక్షోభంలోకి నెట్టబడుతున్న విషయాన్ని మనం గమనించాలి . నకిలీ విత్తనాలు  ముఖ్యంగా పత్తి మిరప  వరి వంగడాలు  వినియోగిస్తున్న కారణంగా  రసం పీల్చే , కాయను తొలిచే పురుగులు ఆశ్రయించడంతో  అవగాహన లేకుండానే రైతులు ఇష్టం ఉన్నట్టుగా  పలు రకాల మందుల మిశ్రమాన్ని వినియోగించడంతో  రోగాలు నియంత్రణలోకి రాకపోగా వాటిని వినియోగిస్తున్న సందర్భంలో  నిర్లక్ష్యం  కారణంగా రైతులు మృత్యువాత పడుతున్నట్లుగా గణాంకాలు తెలియజేస్తున్నాయి.  గ్రామీణ ప్రాంతాలలో కూలీల సమస్య తీవ్రం కావడం పంట పొలాలలో కలుపుకు గడ్డు పరిస్థితులు ఏర్పడడం  అందుకు సంబంధించిన మందులు అందుబాటులో ఉండడంతో  వ్యవసాయ శాస్త్రవేత్తలు అధికారుల యొక్క సలహాలు తీసుకోకుండానే  సొంతంగా నిర్ణయం తీసుకొని విషపూరితమైనటువంటి మందులను పిచికారి చేసిన సందర్భంగా  80 శాతం  రైతులు కనీసమైన జాగ్రత్తలు తీసుకొని కారణంగా  రక్షణ కవచం లేకపోవడం  గాలికి  మందు  విస్తారమైన ప్రభావం చూపడంతో  రైతుల శరీరాలపై  ఇతర అవయాల పైన నోట్లోకి ఆ మందు చేరడంతో  అవయవాలను దెబ్బతీయడంతో పాటు అనారోగ్యం బారిన పడుతున్న విషయాన్ని  ఆలస్యంగానైనా గుర్తించకపోతే  రాబోయేది గడ్డు కాలమే. ఈ అంశాలన్నింటినీ ప్రత్యక్షంగా మనం అనుభవిస్తున్నప్పటికీ వాటి పరిణామాలను గుర్తించకపోవడం, అనుకరణకు  అలవాటు పడడం,వినియోగం తప్పదు అనే  నిర్లక్ష్యంతో వ్యవహరించడం వంటి లక్షణాల వలన  దీర్ఘకాలికంగా అనారోగ్యం బారిన పడక తప్పడం లేదు. ఆలస్యంగా గుర్తించే వరకే ప్రాణాలు  కోల్పోవడం బాధాకరమే కదా  !ముఖ్యంగా మహిళా రైతులు  ఈ విషతుల్యమైన  మందును పిచికారి చేసిన సందర్భంలో  మందు ప్రభావానికి గురై  వారిలో సంతానలేమి, గర్భవిచ్చిత్తి ఇతరత్రా అనేక రకాలైనటువంటి సమస్యలు తలెత్తుతున్నట్లు  నిపుణులు హెచ్చరిస్తుoటే  ఆలోచించవలసిన అనివార్యమైన పరిస్థితులు ఏర్పడినాయి .
     రసాయనిక ఎరువులు పురుగుమందుల వాడకం వలన సారవంతమైనటువంటి భూములు సారాన్ని కోల్పోవడమే కాకుండా  నేలలు విషపూరితం కావడం వలన  తిరిగి పంటలు పండించే క్రమంలో ఉత్పత్తిలో అనేక సమస్యలు ఎదురవుతున్నట్లుగా తెలుస్తున్నది . .ఆ రకంగా ఉత్పత్తి అయినటువంటి ఆహారం అన్నము కూరగాయలు పండ్లు పప్పు ధాన్యాలు ఇతరత్రా ఆహార పదార్థాలు కూడా విషం గా మారడంతో  అనివార్యంగా వాటిని స్వీకరించడం వలన లేనిపోని సమస్యలను కొని తెచ్చు కోవడం జరుగుతున్నది.  ఈ పరిస్థితులలో    నేలలు పండించిన పంటలు విషపూరితం కాకుండా ఉండాలంటే పండించే రైతులకు  వీటిని ఆహారంగా తీసుకునే ప్రజలకు అనారోగ్యపరమైన సమస్యలు రాకుండా  కట్టుదిట్టమైనటువంటి నిబంధనలు  అమలు చేయవలసిన బాధ్యత రైతులది. అయితే దీనికి సంబంధించినటువంటి సస్యరక్షణ విధానాలను పాలకులు రూపొందించడంతోపాటు ప్రస్తుతము వినియోగిస్తున్నటువంటి రసానిక పదార్థాలకు ప్రత్యామ్నాయంగా సేంద్రియ పద్ధతిలో వ్యవసాయాన్ని మరింతగా ప్రాచుర్యంలోకి తీసుకురావాల్సిన అవసరం ఎంతగానో ఉన్నది . సేంద్రీయ పద్ధతిలో  హాని కలిగించని రీతిలో  పంటలు పండించడానికి, రైతులకు హాని జరగకుండా ఉండే విధంగా  ప్రత్యామ్నాయ సేంద్రియ ఎరువులను  ఉత్పత్తి చేసే విధానాలపైన ప్రభుత్వాలు దృష్టి సారించడం ద్వారా  రోగాల బారిన పడకుండా కాపాడుకోవడానికి భూమి కాలుష్యం కాకుండా రక్షించుకోవడానికి అవకాశం ఉంటుంది  .వ్యవసాయ శాఖలో పనిచేసే విస్తరణాధికారులు వ్యవసాయ శాస్త్రవేత్తలు అధికారులు ప్రభుత్వాలు ఉమ్మడిగా ఇలాంటి ప్రత్యామ్నాయ  మార్గాల వైపు దృష్టి సారించడం ద్వారా  రైతుల్లో అవగాహన కలిగించి  ఆరోగ్యకరమైన పరిస్థితులను కల్పించడానికి తోడ్పడవలసిన అవసరం ఎంతగానో ఉన్నది . పురుగుమందుల వాడకం సర్వత్ర హానికరమని అందరికీ తెలిసినప్పటికీ పంటల ఉత్పత్తిని గణనీయంగా పెంచే  దురాలోచనతో మాత్రమే ఆలోచిస్తున్నాము తప్ప దాని యొక్క పరిణామాలను పర్యవసానాలను ఆలోచించడం లేదు కదా  !తక్కువ ధరకు నాణ్యమైన వంగడాలు అనే పేరుతో అక్రమంగా తయారు చేసినటువంటి కొన్ని నకిలీ విత్తనాల కంపెనీలు రైతులకు ఆశ చూపి  అమ్మకాలు జరిపి సొమ్ము చేసుకోవడాన్నీ ఎక్కడికక్కడ సంబంధిత అధికారులు కట్టడి చేయడంతో పాటు వాళ్లకు తగిన శిక్షలు అమలు చేయాలి.  పురుగుమందుల వాడకానికి  రసాయనక ఎరువులకు ప్రత్యామ్నాయంగా  పంటలను రక్షించుకోవడంతో పాటు పెద్ద మొత్తంలో దిగుబడికి  తోడ్పడే సేంద్రీయ విధానాన్ని  దేశవ్యాప్తంగా అమలు చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూనుకున్నప్పుడు
  ప్రజల ఆరోగ్యాలు కాపాడబడతాయి  రైతులు  అనారోగ్యం బారిన పడకుండా ఉండే అవకాశం ఉంటుంది, నేలలు కూడా సారవంతంగా  తిరిగి తిరిగి పంటలను పండించడానికి తోడ్పడతాయి. అంతేకాకుండా రైతులకు  పెట్టుబడి వ్యయాన్ని కూడా తగ్గించిన వాళ్ళం అవుతాము.  ఎరువులు క్రిమిసంహారక మందులు  వంగడాల పేరుతో రైతు  చేస్తున్న వ్యయములో సుమారు సగభాగం  వీటికి ఖర్చు చేస్తుంటే  రైతులు పడే వేదన ఆవేదన అప్పుల బాధ వర్ణనాతీతం . ఈ సమస్యలన్నింటికీ పరిష్కారాన్ని వెతికే క్రమంలో పల  ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నాణ్యమైన వంగడాలను తయారు చేయడంతో పాటు  రసాయానిక ఎరువులు పురుగుమందుల ఉత్పత్తిని మొత్తానికి  రద్దు చేసే ప్రత్యామ్నాయ విధానాలను  అమల్లోకి తీసుకురావడం ద్వారా చట్టాలను పటిష్టంగా అమలుపరిచినట్లయితే  వ్యవసాయ రంగంలో ఏర్పడినటువంటి సంక్షోభాన్ని అధిగమించడానికి అవకాశం ఉంటుంది.  ఉత్పత్తి అవుతున్నటువంటి పంటల నుండి విషపూరిత పదార్థాలు  వినియోగదారుల  శరీరాలలోకి వెళ్లి  అనారోగ్యం బా రిన పడి ఆందోళనకు గురి చేస్తున్న సందర్భాలను  నిర్మూలించడం మనందరి కర్తవ్యం. ఆ వైపుగా  వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టాలి .
( ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు  అభ్యుదయ రచయితల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ)   కు

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333