భవిష్యత్తు స్వప్నాలు పగటి కలలు ఎందుకవుతున్నాయి?
భవిష్యత్తు స్వప్నాలు పగటి కలలు ఎందుకవుతున్నాయి? ప్రగతికి సోపానమైన విద్య ఎందుకు మిద్య అవుతున్నది?
విద్యను గాడిలో పెట్టడంలో పాలకుల మాటలు నీటి మూటలు కాకూడదు.* అది ప్రభుత్వ బడుల్లో చదివే కోట్లాది పేద పిల్లలకు ప్రమాదకరమే కదా!
**************************
--- వడ్డేపల్లి మల్లేశం 9014206412
---31...01...2025*********
విద్య యొక్క మౌలిక లక్ష్యాలను ప్రజలతో పాటు పాలకులు కూడా సమయోచితంగా అవగాహన చేసుకుంటే ఆ రంగానికి ఎంతటి ప్రాధాన్యత ఉన్నదో ప్రభుత్వ పక్షాన ఎంత కృషి చేయవలసి ఉన్నదో అర్థమవుతుంది. భారతదేశంలో నాణ్యమైన ఉచిత విద్య, కొఠారి సూచించిన కామన్ స్కూల్, విద్యకు హెచ్చు బడ్జెట్ ఇప్పటికీ ఊహగానే కొనసాగుతూ ఉంటే పాలకుల చిత్తశుద్ధి ఏపాటిదో మనకు తెలుస్తుంది కదా! కానీ ఈ నిర్లక్ష్యానికి బలి అయ్యేది మాత్రం కోటానుకోట్ల పేద కుటుంబాల నుండి వచ్చిన పిల్లలే, అందుకే బహుశా ప్రభుత్వాలకు ప్రభుత్వ బడులంటే ఆసక్తి ఉండదేమో!" దేశంలోని ప్రజలందరూ నాణ్యమైన ప్రమాణాలతో కూడిన జీవితాన్ని గడపడమే దేశాభివృద్ధికి కొలమానంగా భావించాలి.అలాంటప్పుడు కనీస అవసరాలు అయినటువంటి ఆరోగ్యం విద్య వైద్యముతో పాటు అన్ని హoగులతో ఆనందంగా గౌరవప్రదంగా జీవించగలిగినప్పుడే దేశం ప్రగతిదాయకమని చెప్పడానికి ఆస్కారం ఉంటుంది. మరొకవైపు ఆదాయంలోను సంపదలోనూ అసమానతలు సమసి పోయి, వివక్షత లేని, అంతరాలు కానరాని నిజ జీవితానికి దగ్గరగా సుస్థిరమైన అభివృద్ధి ఏ జాతికైనా అవసరమే. కానీ అలాంటి అవకాశాలకు ప్రజలు నోచుకోవాలంటే ఆ దేశంలో ముఖ్యంగా వైద్యరంగము తో పాటు విద్యారంగం పైన అధిక ప్రాధాన్యత చూపి బాధ్యతాయుతంగా ప్రభుత్వం నిర్వహించినప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. నైపుణ్యము, సృజనాత్మకత, సమయస్ఫూర్తి, సంపద సృష్టి, ఉపాధి అవకాశాల మెరుగుదల వలన సంపదను దేశ ప్రజలందరికీ మరింత ఎక్కువ మొత్తంలో పంచడానికి కూడా అవకాశం ఉంటుంది. " అలాంటి వ్యవస్థను మనం భారతదేశంలో చూడగలమా? అనే సందేహం సర్వత్ర చోటుచేసుకున్నదంటే ఎంత దయనీయ స్థితిలో ఉన్నామో అర్థం చేసుకోవచ్చు. మరొకవైపు విద్యారంగంలో నెలకొన్న పరిస్థితులు ఏమాత్రం ఆశాజనకంగా లేకపోగా విద్యా వ్యవస్థ మొత్తం ప్రైవేటు ఆధిపత్యం లోకి వెళ్లిపోవడం ఒక అంశం అయితే ఇక ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో కొనసాగుతున్నటువంటి విద్య బోధనా అభ్యసన ప్రక్రియలో నాణ్యత లేకపోవడం, తరగతి స్థాయికి ప్రమాణాలు లేక తక్కువ అభ్యసన స్థాయిలు కలిగి ఉండడం, మొక్కుబడి అంశాల బోధనా అభ్యసన ప్రక్రియ తప్ప నైపుణ్యాలకు ప్రాధాన్యత లేకపోవడం, పని అనుభవానికి అసలే చోటు లేకపోవడం, చదివిన చదువు మళ్లీ చదువులు చెప్పడానికి మాత్రమే పనికి రావడం తప్ప ప్రజల బావి జీవిత సవాల్ల ను అధిగమించడానికి ఏ రకంగా ఉపయోగపడే స్థితిలో లేకపోవడం విచారకరం. అంతేకాదు విడ్డూరం.ఈ స్థితి నుండి విద్యా వ్యవస్థను బయటకు తీసుకురావాల్సిన అవసరం ఎంతగానో ఉన్నది ఈ నేపథ్యంలో ఒక్కసారి విద్యారంగ పరిస్థితులను ముచ్చటించుకుందాం.
నిరాశాజనకమైన పరిస్థితులు
******************************
కొటారి సూచించిన కామన్ స్కూల్ విధానం నీటి మీది రాతలే. రాష్ట్ర బడ్జెట్లో 30 శాతం కేంద్ర బడ్జెట్లో 10% అని చేసిన సిఫారస్ 75 ఏళ్ల గణతంత్ర రాజ్యంలో పాలకుల మనసుకు ఎక్కలేదు. మొక్కుబడి ఒకటి రెండు శాతం తోనే కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీ కేరళ వంటి రాష్ట్రాలు మినహాయిస్తే మిగతా అన్ని రాష్ట్రాలలో 5-10 శాతం మాత్రమే నిధులు కేటాయించడంతో నాణ్యత ప్రమాణాలు లేని చదువు పాఠశాలల్లో పేద వర్గాల నుంచి వచ్చే పిల్లలను వెక్కిరిస్తుంటే ఇది అభివృద్ధి ఎలా అవుతుంది? సమాజంలోని అన్ని వర్గాల పిల్లలు అందుబాటులో ఉన్న ఒకే పాఠశాలలో చద వడం ద్వారా విద్యారంగ అభివృద్ధితోపాటు పిల్లల్లో సమ భావన ఉంటుందనే కొఠారి సూచనను కాలరాసిన తర్వాత మొక్కుబడి పాఠాలు బోధిస్తే వచ్చే ప్రయోజనం ఏముంటుంది? అందుకే అభ్యసన స్థాయిలో దిగజారిన స్థితి ని రాశాజనకమే కాదు ప్రపంచ దేశాల కు మన నిరాసక్త తను చాటి చెప్పడమే. ముఖ్యంగా నిధులు, ఉపాధ్యాయ బోధనేతర సిబ్బంది మౌలిక వస్తువులు, మరుగుదొడ్లు వంటి సౌకర్యాలు లేకపోవడంతో ప్రాథమిక విద్య అపహాస్యం అవుతున్నది. ఈ స్థితిలో ప్రమాణాలను ఒక్కసారి పరిశీలిద్దాం. ఇటీవల ప్రభుత్వ పాఠశాలల్లోని పిల్లల సామర్థ్యానికి సంబంధించి అసర్ కమిటీ 2024 నివేదిక నిరాశాజనకమైన పరిస్థితులను ఆవిష్కరిస్తున్నది. దాని ప్రకారంగా దేశవ్యాప్తంగా రెండవ తరగతి పాఠాన్ని చదవగలిగిన మూడవ తరగతి విద్యార్థుల సంఖ్య కేవలం 23.4 శాతమే అంతేకాదు గడచిన 20 ఏళ్లలో ఈ శాతమే ఎక్కువ అని నివేదిక చెబుతుంటే మనం ఎంత దుస్థితిలో ఉన్నామో అర్థం చేసుకోవచ్చు. ఈ పాటి సామర్థ్యంతో సంతోషించడం కాదు 76.6% పిల్లలు తరగతికి సంబంధించిన స్థాయిలో అభ్యసన పటన నైపుణ్యాలను పెంపొందించుకోలేకపోవడం మన వెనుకబాటుకు నిదర్శనం అని గ్రహిస్తే మంచిది.
ఇక ఆంధ్రప్రదేశ్ లోని ప్రభుత్వ పాఠశాలలో ఐదో క్లాస్ విద్యార్థుల్లో 37.5% ఎనిమిదవ తరగతి విద్యార్థులలో 53 శాతం మంది మాత్రమే రెండవ తరగతి పాఠ్యపుస్తకాన్ని చదవగలుగుతున్నారంటే జాలి వేస్తుంది కదూ! అదే తెలంగాణ రాష్ట్రంలో ఐదవ తరగతి విద్యార్థులలో 29.3% ఎనిమిదవ తరగతి విద్యార్థుల్లో 50.8% పిల్లలు మాత్రమే రెండవ తరగతి పాఠ్యపుస్తకాలను చదవగలుగుతున్నారు. ఇక గణితానికి సంబంధించి కనీస తీసివేత జమ భాగహారం విషయంలో కూడా ఆయా తరగతులకు సంబంధించిన పిల్లలు కనీసం గా కూడా చేయలేకపోవడం వలన ఏటా తరగతి పెరుగుతూ పోయిన తర్వాత పదవ తరగతి పరీక్షలో కనీస శాతం కూడా ఉత్తీర్ణులు కాలేరు. కానీ 80-- 90 శాతం కొన్ని పాఠశాలలో ముఖ్యంగా ప్రైవేట్ పాఠశాలల్లో 100% ఉత్తీర్ణత అని ప్రకటిస్తున్నారంటే ఆలోచించదగినదే. వాస్తవంగా మాట్లాడదలచుకున్నప్పుడు సొంత నైపుణ్యంతో పదవ తరగతి పాస్ అవుతున్న వారి సంఖ్య తక్కువే కొన్ని కారణాల వల్లనే ఆ మాత్రం రిజల్ట్ పత్రికలకు ఎక్కుతున్నదని సమాజం భావిస్తున్న వేళ విద్యా అభిమానులు విద్యావేత్తలు సామాజికవేత్తలు ప్రభుత్వాలు విద్యా నైపుణ్యాలు విద్యా లక్ష్యాల పైన లోతుగా అధ్యయనం చేయాల్సిన అవసరo ఉన్నది. అరకొర నైపుణ్యంతో పదవ తరగతి గట్టెక్కి ఆపై ఇంటర్మీడియట్ ఇంజనీరింగ్ డిగ్రీ తరగతుల్లో ఏదో రకంగా ఉత్తీర్ణులైనంత మాత్రాన వారి లోపల ఉద్యోగాలకు ఇతర ఉపాధి అవకాశాలకు సరిపోయిన నైపుణ్యం ఉండదు కదా! ఇది పెద్ద ప్రమాదకరమైన సంధి కాలం అందుకే ఆలోచించాలి మొక్కై వంగనిది మానై వంగునా అన్నట్లు చిన్ననాటి నుండి ప్రమాణాలను అనుసరించగలిగితే ఈ దుస్థితి రాకపోవు కదా అని విద్యావేత్తలు నిపుణులు అంచనా వేస్తున్నారు.
ప్రభుత్వ విద్యారంగాన్ని గాలికి వదిలి ప్రైవేట్ పరం చేయడం, ట్యూషన్ ఫీజులను ఏటా ఇష్టం ఉన్నంత పెంచుకోవచ్చని ప్రభుత్వ కమిషన్ల సిఫారసు చేస్తున్నప్పుడు ఇక ప్రైవేటు పాఠశాలల్లో చదివించే పిల్లల ఫీజులకు అంతు ఎక్కడ ఉంటుంది? ఈ వివక్షత కారణంగా పేదవాళ్లు కూడా తమ పిల్లలను ప్రైవేటు పాఠశాలలో చదివించాలని కాంక్షతో వెళ్లినప్పుడు పోటీ వ్యవస్థ నెలకొంటున్నది. అలా కాని వాళ్ళందరూ కూడా ప్రభుత్వ రంగంలోనే చదివిస్తే నాణ్యతా ప్రమాణాలు లేక వాళ్ల భవిష్యత్తు సన్నగిల్లుతున్నది. కేరళ ఢిల్లీ ప్రభుత్వం మాదిరిగా ప్రతి రాష్ట్ర ప్రభుత్వం కూడా 25% నిధులను బడ్జెట్లో విద్యుత్ కేటాయించాలి, కేంద్ర ప్రభుత్వం 10% కేటాయించి ప్రభుత్వ రంగాన్ని బలోపేతం చేయాలి. దేశవ్యాప్తంగా విద్యావ్యవస్థను ప్రభుత్వమే ఆధీనం చేసుకొని ఓకే యాజమాన్యంలో విద్యా కొనసాగేలా చూసినప్పుడు ఈ వివక్షత అంతరాలు వ్యత్యాసం ఉండదు. కామన్ స్కూల్ ను కచ్చితంగా అమలు చేస్తే ఒకే రకమైన అభివృద్ధిని, విద్యలో నాణ్యత ను సాధించడానికి అవకాశం ఉంటుంది. దేశవ్యాప్తంగా 26 కోట్ల మంది పాఠశాల స్థాయి విద్యార్థులు ఉంటే అందులో 60 శాతం పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లోనే చదువుతున్నప్పుడు మొక్కుబడి ప్రభుత్వ విద్య ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అలాంటప్పుడు తల్లిదండ్రులు తమ పిల్లల గురించి కంటున్న కలలు కళ్ళలు కాక మరేం అవుతాయి? ఇందుకేనా మనం ప్రభుత్వాలను ఎన్నుకునేది? సంపన్న వర్గాలకు ఊడిగం చేయడానికే నా? ప్రభుత్వ విద్యను నిర్లక్ష్యం చేయడానికే నా? విద్యా పరిరక్షణ ఉద్యమం ఊపందుకుంటున్న వేళ పాలకులు ఆలోచించుకొని కళ్ళు తెరవాల్సిన సమయం ఆసన్నమైనది.
( ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు అరసం రాష్ట్ర కమిటీ సభ్యులు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ )