బొగ్గు గనుల ప్రైవేటీకరణ ఆపాలని నిరసిస్తూ మోడీ దిష్టిబొమ్మ దగ్ధం.
- కొత్తపల్లి శివకుమార్ సిపిఐ(ఎం.ఎల్)మాస్ లైన్ జిల్లా కార్యదర్శి.
దేశంలో,రాష్ట్రంలో ఉన్న బొగ్గు గనులను ప్రైవేటు సంస్థలకు అమ్మాలని చూస్తున్న మోడీ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని నిరసిస్తూ జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌరస్తా అంబేద్కర్ విగ్రహం దగ్గర సిపిఐ(ఎం.ఎల్) మాస్ లైన్ పార్టీ ఆధ్వర్యంలో ప్రధాన మంత్రి మోడీ దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది. ఈ సందర్భంగా మాస్ లైన్ పార్టీ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి శివకుమార్ మాట్లాడుతూ మోడీ గత పది సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఉండి ప్రభుత్వ సంస్థలు మొత్తం అంబానీ, ఆదానిలకు కట్టబెట్టి నేడు మరోసారి బొగ్గు గనులను ప్రైవేటుపరం చేయాలని ఆలోచన చేసి,అందులో భాగంగానే మన తెలంగాణలోని సింగరేణి బొగ్గు గనులను ప్రైవేటుపరం చేసేందుకు పన్నుతున్న కుట్రలను తిప్పికొట్టాలని అన్నారు. గత పది సంవత్సరాల్లో మోడీ ప్రజలకు ఉపయోగపడే పనులు చేయకుండా దేశాన్ని 150 లక్షల కోట్ల అప్పులు ముంచి కార్పోరేట్ బహుళ జాతి సంస్థలకు లక్షల కోట్లల్లో మాఫీలు చేస్తూ పేదలను రోజురోజుకు బానిసగా మార్చే ప్రయత్నాలు చేస్తున్నారు అన్నారు.మూడోసారి ప్రధానమంత్రి అయ్యాక అధిక లాభాలు ఉన్న సింగరేణి బొగ్గు గనులపై దృష్టి సారించి ఆ గనులను ప్రైవేటు సంస్థలకు అమ్మాలని ప్రయత్నం చేస్తున్నాడని దీన్ని తెలంగాణ ప్రజలందరూ వ్యతిరేకించాలని అన్నారు. అదేవిధంగా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ సమావేశపరిచి గెజిట్ విడుదల చేసి బొగ్గు గనుల వేలాన్ని ఆపాలని కేంద్ర ప్రభుత్వానికి పంపాలని కోరారు. బొగ్గు గనులను కేంద్ర ప్రభుత్వం వేలం వేస్తే ఊరుకొని ప్రసక్తే లేదని దీనికి వ్యతిరేకంగా మా పార్టీ ఉద్యమాలను ఉదృతం చేస్తుందని అన్నారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా ప్రవర్తిస్తే రాష్ట్ర ప్రభుత్వంపై కూడా పోరాటాలు చేస్తామని హెచ్చరించారు.కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం బొగ్గు గనుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అన్ని
రాజకీయ పక్షాలను కలుపుకొని పోరాటాలను ఉదృతం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మాస్ లైన్ జిల్లా నాయకులు కారిగుల వెంకన్న,పిఓడబ్ల్యు జిల్లా కార్యదర్శి కొత్తపల్లి రేణుక, పిడిఎస్యు రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎర్ర అఖిల్ కుమార్, పార్టీ డివిజన్ నాయకులు సయ్యద్, పిడమర్తి లింగయ్య, ఐఎఫ్టియు నాయకులు రాంజీ, పిఓడబ్ల్యూ జిల్లా అధ్యక్షులు చంద్రకళ, ఉపాధ్యక్షులు సురం రేణుక, కోశాధికారి జయమ్మ , పద్మ ,ఐతరాజు పద్మ, పిడిఎస్యు నాయకులు బన్నీ తదితరులు పాల్గొన్నారు.