బీసీలను చైతన్యపరచడమే మన లక్ష్యం

తిరుమలగిరి 09 సెప్టెంబర్ 2025 తెలంగాణవార్త రిపోర్టర్ :
బీసీల చైతన్యమే లక్ష్యంగా మన ఆలోచన సాధన సమితి ఆవిర్భవించిందని ఆ సమితి రాష్ట్ర వ్యవస్థాపకులు కటకం నర్సింగరావు అన్నారు. ఆదివారం తిరుమలగిరి మండల కేంద్రంలోని వంగపల్లి నరసయ్య ఫంక్షన్ హాల్ లో సభ నిర్వాహకులు కందుకూరి ప్రవీణ్ ఏర్పాటుచేసిన తుంగతుర్తి అసెంబ్లీ నియోజకవర్గం బీసీ కార్యనిర్వాహకుల చైతన్య సదస్సు కార్యక్రమానికి మన ఆలోచన సాధన సమితి వ్యవస్థాపకులు కటకం నర్సింగ్ రావు ముఖ్య అతిథులుగా హాజరై ప్రసంగించారు. రాష్ట్రంలో ఉన్న బీసీలను చైతన్య పరచడమే మన ఆలోచన సాధన సమితి లక్ష్యమని రాష్ట్రంలో ఉన్నటువంటి 10 వేల గ్రామాలలో బీసీల జెండాను ఎగరవేసినప్పుడే బీసీలకు రాజ్యాధికారం వస్తుందని అన్నారు. మా వాటా మాకే మన ఓటు మనకే నినాదం గ్రామాల్లో చర్చ జరగాలని అప్పుడే రాజ్యాధికార సాధన సాధ్యమన్నారు. దేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు బీసీలను జెండాలు మోయించుకుంటూ జిందాబాద్ కొట్టించుకుంటున్నారే తప్ప రాజకీయంగా ఎదగనివ్వకుండా కుట్ట చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చట్టసభలకు పెద్ద కులాలు.. బహిరంగ సభలకు బీసీ కులాల ఇంకానా.. ఇకపై చెల్లదని ఆవేదన వ్యక్తం చేస్తూ బీసీలలో చైతన్యం తీసుకురావడం కోసమే గత ఏడాది మన ఆలోచన సాధన సమితి సంఘం ఏర్పాటు చేశామని ఈ క్రమంలో రాష్ట్రంలో అన్ని గ్రామాల్లో బీసీల జెండా ఎగరవేయడం లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. తెలంగాణ ఏర్పడితే బీసీల రాజ్యం వస్తుందని అనుకున్నామని కానీ ఒక వర్గానికి మాత్రమే లబ్ధి జరిగిందన్నారు. బీసీల్లో చైతన్యం లేకపోవడంతోనే ఈ పరిస్థితి ఏర్పడిందని, బీసీలను జాగృతం చేసి వారిని చైతన్య పరచడమే అంతిమ లక్ష్యంగా ఈ సమితి పనిచేస్తుందని స్పష్టం చేశారు. రానున్న రోజుల్లో గల్లి నుంచి ఢిల్లీ దాకా బీసీ ఉద్యమాన్ని విస్తరించి చట్టసభలలో 50 శాతం రిజర్వేషన్లు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కల్పించే దాక ఉద్యమాన్ని కొనసాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సభ అధ్యక్షులు గుణగంటి చంద్రశేఖర్ గౌడ్, గౌరవ అధ్యక్షులు గడ్డం నరసింహ, సామాజిక తెలంగాణ మహాసభ కన్వీనర్ కొత్తగట్టు మల్లయ్య, బహుజన యుద్ధనౌక ఏపూరి సోమన్న, సభ నిర్వాహకులు కందుకూరి ప్రవీణ్, బీసీ నాయకులు గిలకత్తుల రాము గౌడ్, చేను శ్రీనివాస్, గాదరబోయిన లింగయ్య, పులిమామిడి సోమయ్య, బిక్షం,నారగోని అంజయ్య చింతకింది మురళి, ఆకుల బుచ్చిబాబు,కలిమెల నరసయ్య, నిర్మల కృష్ణమూర్తి, నల్ల చక్రపాణి,గట్టు నరసింహారావు, రెహమాన్ అలీ, బిక్కి శ్రీనివాస్, కడారి స్టాలిన్, , తదితరులు పాల్గొన్నారు.