నిండు జీవితానికి పొగ

Dr పరికిపండ్ల అశోక్

May 31, 2024 - 12:54
Jun 1, 2024 - 05:17
 0  18
నిండు జీవితానికి పొగ

(మే31-ప్రపంచ పొగాకు వ్యతిరేక దినం ను పురస్కరించుకొని).

దూమపానం- ప్రాణహననం......  పొగాకు కాదది పగాకు!..

పక్కవానికి పొగ పెట్టకండి!.. ప్రతి సిగరెట్ తో జీవితకాలం 11 నిమిషాలు కుదింపు......    ఒక్క సారి పొగ పిలిస్తే 70 రకాల క్యాన్సర్ కారకాల తో ఊపిరితిత్తుల క్యాన్సరు, గుండె సంబంధ వ్యాధులు వస్తాయి.  పొగ త్రాగే స్త్రీలలో అధిక గర్భస్రావాలు, నెలలు నిండకుండానే శిశువుల జననం, శిశు మరణాల రేటు పెరగడం జరుగుతాయి.

కాల్చే ప్రతి సిగరెట్టు నీ చితిపుడక!.. మానే దమ్ముందా?!..

జర్దా, పాన్, చుట్ట, బీడి, సిగరెట్, గుట్కా సేవించేవారికి శుభవార్త!..  సమస్య తీవ్రత:
-ప్రపంచ వ్యాప్తంగా ప్రతి 42 సెకన్లకు ఒకరు, రోజుకు 2000 మంది, సంవత్సరానికి ఏడు లక్షల మంది, భారత దేశంలోనైతే సంవత్సరానికి ఒక లక్ష మంది శాశ్వతంగా వీటిని సేవించడం మానివేస్తున్నారు- “*చనిపోవడం ద్వారా". ప్రతి మనిషి రోజుకు ఎన్ని సిగరేట్లు తాగితే అన్ని సంవత్సరాల ముందు పరలోకానికి టిక్కెట్టు రిజర్వేషన్ చేసుకున్నట్లే!., పరిస్థితి ఇలాగే కొనసాగితే 2040 వరకు ఒక సంవత్సరానికి కోటిమంది పరలోకానికి చేరుతారు. అంధకారంలో వెలుగులు నింపే కొవ్వొత్తి తాను వెలుగుతూ ఇతరులకు వెలుగునిస్తుంది, కాని పొగ తాగే వాళ్ళు మాత్రం తాము “పొగ” సూరుతూ ఇతరులకు “పొగ” పెడతారు.

పండించే రైతు ముట్టడు, పశువులకు అస్సలే గిట్టదు, క్రిమి దూరినా, కీటకం దరిచేరినా కుప్ప చంపేస్తుంది. చుడితే చుట్ట, పొడితో బీడి, పాలిష్ కొడితే ఫిల్టర్, ఆధునికతను మేలవిస్తే గుట్కా... పీల్చి పీల్చి పిప్పి చేయంచుకోదల్చిన మహాజనులారా ప్రేతకళకు సిద్ధమైతే, చనిపొదాం రండి.. కన్యాశుల్కంలో గిరీషం చెప్పినట్లు పొగ త్రాగనివాడు దున్నపోతె పుడితేనేం!.. పొగాకు ముట్టని పశువు జన్మ మనిషి జన్మకన్నా ఆరోగ్యవంతమైనది... ప్రభుత్వం, కోర్టులు ఎంత చేసినా మనుషుల్లో చిత్తశుద్ధి లేనంతకాలం, చైతన్యం రానంతకాలం పొగ త్రాగడం, గుట్కాలు తినడాన్ని అరికట్టడం సాద్యం కాదన్నది నగ్న సత్యం. మనిషి తలచుకుంటే ఈ వ్యసనాన్ని వదిలించుకోవడం అంత కష్టమేమి కాదు. ఎయిడ్స్ వల్ల మానవాళికి జరిగే నష్టం కంటే, పొగ త్రాగడం- గుట్కాలు తినడం వల్ల జరిగే నష్టం మూడు రెట్లు ఎక్కువని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. మనిషికి వచ్చే జన్మ మాటెలావున్నా ఈ జన్మలోనే పరమరోగిష్టిగా మారుతున్నాడు. పొగాకులోని విషపదార్థాలు మనిషిని తల వెంట్రుకల నుండి కాలిగోళ్ళ వరకు అన్ని అవయవాలపై విపరీత ప్రభావం చూపి, మనిషిని చంపేస్తాయి. నేరుగా పీల్చే పొగలో కంటే, పీల్చి వదిలిన పొగలో కణాలు చాలా చిన్నగా మారతాయి, కాబట్టి ఆ కణాలు ఈ పొగను పీల్చినవారి ఊపరితిత్తులలో లోపలికి చొచ్చుకోపోయి ఎక్కువ హాని కలిగిస్తాయి.

 పాపం పసివాళ్ళు: తమకు ఏ పాపం తెలియకపోయినా, ధూమపానం జోలికే పోకపోయినా, పిల్లలు ఆ ప్రభావానికి లోనవుతున్నారు. పెద్దలు పీల్చే సిగరెట్ల నుంచి వచ్చే పొగబారినపడి వారు ఆనారోగ్యానికి గురువుతున్నారు. దగ్గు, శ్వాసకోశ సంబంధ ఇన్ఫెక్షన్లు, అస్థమా, ఊపిరితిత్తుల పనితీరు దెబ్బతింటుంది, తరుచుగా మధ్య చెవి ఇన్ఫెక్షన్ వస్తుంది. గర్భంతో ఉన్న మహిళలలు ధూమపానం చేస్తే శిశువుల ఆకస్మిక మరణాలు సంభవిస్తాయి, బరువు తక్కువగా పుడతారు.

ఎందుకు?... 

పోగాకులో ఉండే “నికోటిన్” అనే విష పదార్థం ఆరుసెకన్లలలో మెదడుకు చేరి రక్తం ద్వారా కిక్కునిస్తుంది, ఇది హెరాయిన్ కిక్కు స్పీడు కన్నా రెండు రెట్లు ఎక్కువ. ఇలా ప్రతి వ్యక్తి కనీసం సంవత్సరానికి 50-70 వేల కిక్కులు అనుభవిస్తాడు. అందువల్ల ప్రతిసారి మళ్లీ మళ్లీ పొగత్రాగాలని తహతహలాడతాడు. ఒక రకమైన ఉత్తేజం కలిగినటువంటి భ్రాంతి కలుగుతుంది. కాని ఇది మన రోజువారి బేజారు బ్రతుకు నుండి బయటపడటానికి చేసే ప్రయత్నంలో అతినీచ స్థాయిలో చేసే ప్రయత్నం మాత్రమే...
ఉపాధి ఎవరికి: భారతదేశంలో పొగాకు పండించేది 3 కోట్లమందికి, చేటు చేసేది 30 కోట్ల మందికి. నిషేధమెక్కడ: ప్రపంచంలో ఒక్క భూటాన్ మాత్రమే పొగాకును దేశవ్యాప్తంగా నిషేధించింది. కారకాలు:పొగాకులో 4,000 రసాయనాలు, 400 క్యాన్సర్ కారకాలుంటాయి.

నికోటిన్: ఇది సిమ్యూలెంట్ (ఉత్ప్రేరకం), గుండె వేగాన్ని పెంచుతుంది, రక్తపీడనం తగ్గిస్తుంది, హర్మోనుల విడుదల తగ్గిస్తుంది. తారు: రోడ్లమీద వేసేతారు, ఒక దమ్ముకు 70శాతం ఊపిరితిత్తులలో పేరుకుంటుంది. కాన్సర్ కారకం. కార్బనోనాక్సైడ్:రక్తంలో ఆక్సిజన్ బదులు కార్బన్ మోనాక్సైడ్ చేరి వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తుంది.
ఎసిటోన్: రంగులలో వాడే విష పదార్థం. ఇవికాక ఇంకా ఆర్సెనిక్, సైనైడ్, అమ్మోనియం లాంటి అత్యంత విష పదార్థాల వల్ల చనిపోవడం కాయం. 

రోగాలు: 1) ఎక్టివ్ స్మోకర్లకు: (ఎవరైతే పొగత్రాగుతారో వారు) మనిషికి వచ్చే క్యాన్సర్లలో 30 శాతం పొగత్రాగడం వల్ల వస్తాయి. అందులో 85 శాతం ఊపిరితిత్తుల క్యాన్సర్లు, బట్టతల, కళ్ళు, శుక్లాలు, చూపు మందగించడం, చెవి వినికిడి తగ్గింపు, చర్మం మడతలు రావడం, పండ్లు పసుపు రంగు పాచి, కేరిస్, ఎముకలు గుల్లభారడం, పాంద్రత తగ్గం, జీర్ణ వ్యవస్థ అల్సర్లు, గర్భాశయ క్యాన్సర్, నపుంసకత్వం 2)పాసివ్ స్మోకర్లకు: (పక్కవాళ్ళు త్రాగడం వల్ల వచ్చేది), ఊపిరితిత్తుల క్యాన్సర్, హార్ట్ ఎటాక్ 25 శాతం ఎక్కువ పిల్లలో నేర్చుకునే సామర్థ్యం తగ్గిపోయి ఎదుగుదల మందగిస్తుంది.

ఏం చేయలి? నివారణ: మనిషి దృక్పధం, నైజంలో మార్పు తీసుకరావలి. సంగీతం, సాహిత్యం, సేవ, త్యాగం, ప్రేమవంటి అనుభూతులు. మనిషికి ఆరోగ్యకరమైన మైకాన్ని, ఆహ్లాదాన్ని ఇస్తాయి. వీటితో సహవాసం కాకుండా పక్కదారి పడితే పొగాకు, గుట్కా అలవాట్లకు బానిసలయ్యే అవకాశం ఎక్కువగావుంది. ధృడ నిశ్చయం:3-5 నెలలు కష్టపడాలి. స్వతంగా 1శాతం, కౌన్సిలింగ్ 10 శాతం, ట్రీట్మెంటు+కౌన్సిలింగ్ 30 శాతం సక్సెస్ రేటు నిర్ధారింపబడినది.

 చికిత్స: నికోటిన్ రిప్లేస్మెంట్ తెరపీ, చూయింగ్ గమ్లు, బుప్రొపియాన్ ఇవన్నీ చదివిన తర్వాత కూడా పొగాకు వాడకాన్ని మానివేయలేకపోతే ఎల్లపుడూ స్వాగతం! స్మశాన వాటికకూ...

Dr పరికిపండ్ల అశోక్

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333