ప్రభుత్వ కుట్ర.. క్షమించదు చరిత్ర బండారు జితేందర్

మేమెంతో మాకంత వాటా’ అన్న కాన్షీరాం నినాదం నీరుగారేలా ఉన్నది ప్రభుత్వం చేపట్టిన కులగణన. రాజ్యాధికారం చేపట్టని కులాలు, జాతులు అంతరించిపోతాయన్న మహనీయుల మాటలు నిజమయ్యేలా ఉన్నది కులగణన నివేదిక. 78 ఏండ్ల భారత స్వయం పాలనలో పార్లమెంటు చూడని కులాలు ఇంకా చాలా ఉండటం బాధాకరం. బీసీలకు రాజకీయాల్లో వాటా దక్కకుండా కుట్ర జరుగుతున్నదనే అనుమానాలకు ప్రస్తుత పరిణామాలు బలం చేకూరుస్తున్నాయి.
మంత్రివర్గంలో ఉత్తమ్ కంటే సీనియర్లు అయిన పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ వంటి బీసీ మంత్రులు ఉన్నప్పటికీ వారిని కాకుండా ఉత్తమ్‌నే నియమించడం వెనక మతలబును అర్థం చేసుకోవచ్చు. అఖిలపక్ష సమావేశాలుగానీ, కులసంఘాల సమావేశాలు గాని నిర్వహించకుండానే కులగనణన పూర్తి అయినట్టు ప్రభుత్వం ప్రకటించింది.
భారతీయులందరూ సమానమేనని, అందరికీ సర్వహక్కులు వర్తిస్తాయని భారత రాజ్యాంగ ప్రవేశిక స్పష్టం చేస్తుం ది. కానీ అందుకు భిన్నంగా కొన్ని వర్గాల్లో మా త్రమే పాలనాధికారం ఉంటున్నది. ఈ నేపథ్యంలో ఇప్పుడు రాజకీయ పార్టీలకు కులగణ న అస్త్రంగా మారింది. అందులో భాగంగానే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కులగణన హామీని కాంగ్రెస్ ఇచ్చింది. ఎన్నికలు ముగిశాయి. ప్రభు త్వ మార్పిడి జరిగింది. కానీ, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో కాంగ్రెస్ విఫలమైంది. రాజకీయాల్లో బీసీలకు వాటా దక్కకుండా ప్రభుత్వమే కుట్రలు చేయడాన్ని చరిత్ర క్షమించదు.
రాజ్యాధికార పోరాటకాంక్షలతో ఉద్యమాలు చేస్తున్న వారు ఇక భవిష్యత్తులో అలాంటి ఉద్యమాలు చేయకుండా ఒక మోసపూరిత ప్రణాళికతో కులగణనకు ఈ రాష్ట్ర ప్రభుత్వం పూనుకున్నది. బీసీల వ్యతిరేకి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని సబ్ కమిటీకి చైర్మన్‌గా నియమించడమే ఇందుకు ఉదాహరణ. బీసీల సామాజిక, రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక పరిస్థితులపై అవగాహన లేని, బీసీలు అంటేనే చిన్న చూపుచూసే ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని కులగణనకు సంబంధించిన సబ్ కమిటీకి చైర్మన్‌గా నియమించడంలోనే ప్రభుత్వ చిత్తశుద్ధి ఏమిటో చెప్తున్నది.
మంత్రివర్గంలో ఉత్తమ్ కంటే సీనియర్లు అయిన పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ వంటి బీసీ మంత్రులు ఉన్నప్పటికీ వారిని కాకుండా ఉత్తమ్‌నే నియమించడం వెనక మతలబును అర్థం చేసుకోవచ్చు. అఖిలపక్ష సమావేశాలుగానీ, కులసంఘాల సమావేశాలు గాని నిర్వహించకుండానే కులగనన పూర్తి అయినట్టు ప్రభుత్వం ప్రకటించింది.
సాధారణంగా రిజర్వేషన్లపై చట్టం చేస్తే రాజకీయ పార్టీలు బీసీలకు టికెట్లు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ, బీసీలకు మెజార్టీ టికెట్లు ఇవ్వాలని ప్రభుత్వంలో ఉన్న వారే డిమాండ్ చేయడం అవివేకం. ఎస్సీ వర్గీకరణ, కులగణన రెండు అంశాలు చాలా కీలకమైనవి. కానీ, మూడు దశాబ్దాల పోరాటం తర్వాత కొలిక్కి వచ్చిన ఎస్సీ వర్గీకరణ ఏకసభ్య కమిషన్ ఇచ్చిన నివేదికను హడావుడిగా అసెంబ్లీలో పెట్టి, దానిపై చర్చ పెట్టి ప్రజాపోరాటాన్ని అవమానించేలా చేసిందీ ప్రభుత్వం.
మెజారిటీ ప్రజల స్థితిగతులపై చర్చించేటప్పుడు విఫులంగా, సమగ్రంగా ఆధారాలతో చర్చించాల్సిన ప్రభుత్వం ఒకే రోజు రెండు అంశాలను చర్చకు పెట్టి మమ అనిపించడం సరికాదు. ఎస్సీ వర్గీకరణ మూడు దశాబ్దాల ప్రజా పోరాటం. అటువంటి దాని గురించి అసెంబ్లీలో రోజుల తరబడి చర్చ జరగాలి. బహిరంగ సభలు, సదస్సులు, సెమినార్లు, చర్చా వేదికలు, ధర్నాలు తదితర సందర్భాల్లో మెజారిటీ జనాభా కలవారు బీసీలని చెప్పింది కూడా రాజకీయ పార్టీలే. కానీ, కులగణన నివేదికలోని లెక్కలు అందుకు విరుద్ధంగా ఉన్నాయి.
స్వాతంత్య్రం వచ్చాక ఎంతోమంది అగ్రవర్ణాల నాయకులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు న్యాయం జరగాలని పోరాడారు. త్యాగాలు కూడా చేశారు. కానీ, ఇప్పుడు అందుకు విరుద్ధంగా జరుగుతున్నది. రాజ్యాధికారానికి దూరంగా ఉన్న కులాలకు, వర్గాలకు, అగ్రవర్ణాలు అండగా నిలబడాల్సిన సందర్భం ఇది. 75 ఏండ్లుగా హక్కుల కోసం అధికారంలో వాటా కోసం పోరాడుతున్న బీసీలు ఇప్పుడు ప్రతిఘటించకపోతే భవిష్యత్తు తరాలు అంధకారంలో పడే ప్రమాదం ఉన్నది.
మేధావులు, విద్యావంతులు, బుద్ధి జీవులు, యువకులు, మహిళలు, రైతులు అందరూ ఏకమై జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేయాల్సిన సందర్భం ఇది. శాస్త్రీయమైన జనగణన ప్రకారం రిజర్వేషన్ల పంపకాలు జరగాలి. రాజకీయాలకు అతీతంగా నాయకులు ఏకం కాకుండా ఇది సాధ్యం కాదు. రాజ్యాంగ సవరణకు డిమాండ్ చేయడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత తీసుకొని కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి మెజారిటీ ప్రజలకు న్యాయం జరిగేలా చూడాలి. లేదంటే బీసీలకు అన్యాయం చేసిన పార్టీగా చరిత్రలో కాంగ్రెస్ మిగిలిపోతుంది.